అదర్‌సైడ్
‘జైహింద్’ అంటాం.
హిందూస్థాన్ అని మాత్రం ఒప్పుకోం! పోరాడి ఫ్రీడమ్ సంపాదించుకున్నాం. ఐనా, వాళ్లనే ఇమిటేట్ చేస్తుంటాం! ఆడామగా సమానం అంటుంటాం. 33 పర్సెంట్ మాత్రమే అడుగుతాం! తెలుగుపలుకు తియ్యనిదంటాం. మాట్లాడ్డానికి చేదుముఖం పెడతాం! కోట శ్రీనివాసరావును కదిలిస్తే...ఇదిగో ఇలాగే... కుండ బద్దలౌతుంది. నోటి దురుసు అనండి, ముక్కుసూటి అనండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డమే... ఇంతవరకు ఆయనకు తోడుగా ఉన్నది,నీడగా వచ్చిందీ! డెబ్బై ఏళ్లకు దగ్గరిదగ్గరిగా ఉన్న ఈ ఆర్టిస్టు ముఖానికి రంగేసుకున్నారు కానీ, ఏనాడూ మనసుకు ముసుగేసుకోలేదు! ఇప్పుడూ అంతే! నిక్కచ్చిగా మాట్లాడిన ఆయన ప్రతి మాటా ఈవారం మన అదర్ సైడ్! మీ చిన్నప్పటి విశేషాలేమైనా చెబుతారా? కోట : నేను పుట్టి, పెరిగింది కంకిపాడులో. మా అమ్మానాన్నలకు మేం మొత్తం పదమూడు మంది సంతానం. మా నాన్నగారు డాక్టర్. మామూలుగా పల్లెటూళ్లల్లో డాక్టర్‌గారి పిల్లలను, కరణంగారబ్బాయిలను, ప్రెసిడెంటుగారి పిల్లలను టీచర్లు కొట్టరు.. తిట్టరు. ఆ విధంగా మమ్మల్ని చూసీ చూడనట్టు వదిలేసేవాళ్లు. అలా మా అన్నయ్యను ఎక్కువగా గారాబం చేయడంవల్ల ఆయన చదువు ఇంటర్మీడియట్‌తో ఆగిపోయింది. నేను కూడా అలా తయారైపోతానేమోనని నన్ను మా అక్కయ్యవాళ్లింటికి పంపించారు. మా బావగారు కేఆర్‌కే శర్మగారని గవర్నమెంట్ డాక్టర్. వాళ్ల దగ్గర ఐదారేళ్లు, ఆ తర్వాత మా ఇంట్లో ఉండి చదువుకున్నాను. నాన్నగారు నన్ను డాక్టర్ చేయాలనుకునేవారు. మీ నాన్నగారు డాక్టర్ చేయాలనుకుంటే మీరేమో యాక్టరయ్యారు...? కోట : యూనివర్శిటీలో నాకు ఫస్ట్‌క్లాస్ రెండు మార్కుల్లో తగ్గింది. దాంతో నాకు మెడిసిన్‌లో సీటు రాలేదు. ఒకే ఒక్క కాలేజీలో మాత్రం డొనేషన్ కడితే చేర్చుకుంటామన్నారు. కానీ మా నాన్నగారు డొనేషన్ కట్టనన్నారు. ఆయన మెరిట్‌లో పాస్ అయ్యారు. చెన్నపట్నం యూనివర్శిటీలో ఆయన స్టేట్ ఫస్ట్. నాన్నగారు అంత బ్రిలియంట్. ఫస్ట్‌క్లాస్‌కి రెండే రెండు మార్కులు తగ్గినా అది ఫస్ట్ క్లాస్ కింద రాదు. ఎక్కడా సీటు రాకపోవడంతో బి.ఎస్‌సీ.లో చేరాను. అంతకుముందే నాటకాలంటే ఇష్టం. కాలేజీలో చేరిన తర్వాత ఇష్టం పెరిగిపోయింది. మరి నాటకాల్లో నటిస్తుంటే మీ ఇంట్లో ఏమీ అనేవారు కాదా? కోట : కొట్టేవాళ్లు. మా స్కూల్ వార్షికోత్సవ వేడుక కోసం పినిశెట్టి శ్రీరామూర్తి అని రవిరాజా పినిశెట్టి తండ్రి రాసిన ‘ఆడది’ నాటకంలో శతభిషం అనే వంటవాడి వేషం వేశాను. శతభిషం అనే వేషంతో నాటకాల్లో నా కెరీర్ ఆరంభమైంది. నా నక్షత్రం కూడా శతభిషమే కావడం విశేషం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏం చేశారు? కోట : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయినయ్యాను. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన తర్వాత నాటకాల మీద విపరీతంగా పిచ్చి ఏర్పడిపోయింది. వారంలో ఓ నాటిక కానీ నాటకం కానీ ఆడాల్సిందే. అప్పటికి పెళ్లి కూడా అయ్యింది. మాతో పాటు మా మామగారు కూడా ఉండేవారు. ‘ఏదో బ్యాంక్‌లో ఆఫీసర్ అవుతారనుకుంటే ఈ నాటకాలేంటండి బాబు’ అనేవారాయన. నాటకాల కోసం ప్రమోషన్ వదిలేసుకున్నాను. ఆ తర్వాత ఉద్యోగం కూడా వదిలేసుకుని, ఇలా సెటిలయ్యా. సో.. రెండు మార్కులు తగ్గడం మంచిదే అనుకుంటున్నారా? కోట : ఆ భగవంతుడు మనకిక్కడ (సినిమా రంగం) నూకలు రాసిపెట్టాడని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. దేవుడి దయతో పాటు ఇంకోటి కూడా ఉండాలి. అదేంటంటే భార్యాబిడ్డల దంత సిరి బాగుంటే మగాడికి అన్నీ బాగా జరుగుతాయనేది నా నమ్మకం. అందుకనే ముందు జన్మనిచ్చిన తల్లీతండ్రి, ఆ తర్వాత భార్యాబిడ్డలపై మమకారంతో ఉండాలి. ‘కార్యేషు దాసి.. కరణేషు మంత్రి... భోజ్యేషు మాతా.. శయనేషు రంభ.. క్షమయా ధరిత్రి...’ అంటారు. ఎదుగుతున్నకొద్దీ మన సంస్కృతీ సంప్రదాయాలంటే నాకు విపరీతమైన గౌరవం ఏర్పడింది. మన సంస్కృతిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాల విలువ నేటి తరానికి తెలుస్తుందంటారా? కోట :మన ఇండియన్స్ అమెరికన్లను ఇమిటేట్ చేస్తారు. వాళ్లనుంచి మనం ‘వేలంటైన్స్ డే’ అనేదాన్ని ఇమిటేట్ చేస్తున్నాం. కానీ తండ్రికి తద్దినం పెట్టమంటేనే పెట్టడంలేదు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాదనుకుని వేరే దేన్నో ఫాలో అవ్వడమెందుకు? మీరూ మేం వేరు అంటూ ఇంగ్లిష్‌వాళ్లతో పోరాడి మనం స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. అలాంటప్పుడు వాళ్లని ఇమిటేట్ చేయాలనుకోవడం ఎందుకు? ఆడవాళ్ల వస్త్రధారణలో కూడా చాలా మార్పొచ్చింది. అత్యాచారాలు జరగడానికి అదీ ఓ కారణమంటున్నారు. దీని గురించి మీరేమంటారు? కోట : మొన్న ఎవరో ఓ వ్యక్తి ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిదన్నాడు. అతను చెడ్డవాడో, మంచివాడో మనకనవసరం. కానీ అతను చెప్పిన మాటలకు భావం నన్నడిగితే చెప్పేవాడ్ని. అసలు భావం అర్థం చేసుకోకుండా అతన్ని నానా దుర్భాషలాడారు. ఆడది అంటే అట్రాక్ట్ చేసేది. అందువల్లే మన పురాణాల్లో విశ్వామిత్రుడు సైతం రంభ కనిపించగానే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టాడు. ఎక్కడ అట్రాక్ట్ అయిపోతానేమోనని భయం. అట్రాక్ట్ చేయడం, అట్రాక్ట్ అవ్వడం అనేది ఆడ, మగ లక్షణాలు. ఆడపిల్లలకు అట్రాక్ట్ చేసే గుణం నేచర్‌లోనే ఉంది కాబట్టి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు ఒద్దికగా ఉంటే... ఎదుటివ్యక్తిలో ధైర్యం తగ్గుతుంది. అలా తిట్టే బదులు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇన్ని సమస్యలు రావు. అసలు ఆడవాళ్ల వేషధారణ అనే కాదు.. మగవాళ్లు కూడా చెవులకు పోగులు పెట్టుకోవడం, పోనీటైల్ వేసుకోవడం, అక్కడక్కడా చిరుగులున్న ప్యాంట్లు వేసుకుని హైటెక్ అనడం కామన్ అయ్యింది. ఇదేం హైటెక్ అండి. ఆడవాళ్లకి సమాన హక్కులనే విషయంపై మీ అభిప్రాయం? కోట : మగవాళ్లు, ఆడవాళ్లు సమానం అని అంటున్నారు. అలాంటప్పుడు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఎందుకడుగుతున్నారు. 50 శాతం అని మీరెందుకడగరు? ఎప్పుడైతే మీరు 33 శాతం అడిగారో అప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్లే. ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లు శారీరకంగా చాలా బలవంతులు. అది సృష్టి. అంతమాత్రాన ఆడవాళ్లు తక్కువనడానికి లేదు. అసలు ఆడవాళ్ల గొప్పతనం గురించి వాళ్లే అర్థం చేసుకోవడంలేదు. మన హిందూ సంప్రదాయంలో స్త్రీకిఇచ్చిన గౌరవం చాలా గొప్పది. పురాణాలను తీసుకుంటే హోమ్ మినిస్టర్ ‘ఆదిశక్తి’, ఫైనాన్స్ మినిస్టర్ ‘లక్ష్మి’, ఫుడ్ మినిస్టర్ ‘అన్నపూర్ణ’, ఎడ్యుకేషన్ మినిస్టర్ ‘సరస్వతి’... వీళ్లంతా ఆడవాళ్లే కదా. సో.. అన్ని ముఖ్యశాఖలూ ఇచ్చినది స్త్రీలకే. అంత గొప్పదనం సొంతం చేసుకుని, ఆ విలువ తెలుసుకోలేక వేస్ట్‌మాటలు మాట్లాడుకుని, పిచ్చిపనులు చేసుకోవడమెందుకు? స్త్రీలను రాజకీయాల్లోకి వద్దన్నారా? మిలటరీలో అడుగుపెట్టొద్దన్నారా? ఎందులోకి వద్దన్నారు? ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది? మన మాతృభాషను మాట్లాడానికి కూడా చాలామంది నామోషీగా భావిస్తున్నారు. మన భాషను కాపాడుకోవడానికి మనమేం చేయాలి? కోట : ఏమీ చేయలేం. ఎందుకంటే నవమాసాలు మోసి, బిడ్డను కన్నతల్లే ‘అమ్మా’ అని పిలిపించుకోవడానికి ఇష్టపడటంలేదు. ‘మమ్మీ’ అనిపించుకుంటోంది. జన్మనిచ్చిన తల్లే తెలుగులో పిలిపించుకోకపోతే ఇక మాతృభాషను ఎలా కాపాడుకోగలం. మన బతుకుతెరువు కోసం పరభాష మాట్లాడటం తప్పు కాదు. కానీ పరభాషే మన భాష అవ్వడం దౌర్భాగ్యం. స్కూల్స్‌లో కూడా ఇంగ్లిష్‌నే ప్రోత్సహిస్తున్నారు? కోట : ప్రస్తుతం చదువనేది చాలా ఖరీదైపోయింది. స్కూల్స్‌కి వెళ్లి ‘ఏంటండి.. ఫీజులు ఇంత ఎక్కువగా ఉన్నాయి’ అనడిగితే, ‘అవర్ టీచర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్’ అంటారు. వెల్ ట్రైన్డ్ అంటే.. అమెరికాలోనో ఎక్కడో పీజీ చేసి ఉంటాడా టీచర్. ఇక్కడికొచ్చి కేజీ పిల్లలకు పాఠాలు చెబుతాడు. ఆ పీజీ టీచర్ చెప్పేది కేజీ పిల్లాడికి ఏం అర్థం అవుతుంది? అసలిప్పుడు ‘ఉప్పు కప్పురంబు...’ పద్యం చెబుతున్నారా? ‘రైమ్స్’ చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా మావాడు బాగా రైమ్స్ చెబుతున్నాడని చెప్పి మురిసిపోతున్నారు. అంతేకానీ ఉప్పు కప్పురంబు తెలియడంలేదని బాధపడటంలేదు. చిన్నప్పుడు నేర్పించాల్సివన్నీ వదిలేస్తున్నారు. పీజీ టీచర్ ఏది చెబితే అదే నెత్తికెక్కించుకుంటున్నారు. ఇప్పుడంతా కంప్యూటర్‌మయం అయిపోయింది. స్పీడు యుగం అయ్యింది. అసలు సిస్టమ్ అంతా రివర్స్‌లోనే ఉంది. ఉదాహరణకు.. ఒకప్పుడు రోలు వాడేవాళ్లు. ఇప్పుడు గ్రైండర్లు. రోటిని ఎడం చేత్తో తిప్పుతూ సునాయాసంగా పిండి రుబ్బేసేవాళ్లు. రోట్లో పొత్రం తిరుగుతుంది. కానీ గ్రైండర్ అంటే.. పొత్రం చుట్టూ రోలు తిరుగుతుంది. భగవంతుడి సృష్టించినదానికి వ్యతిరేకంగా వెళుతున్నాం. ఓ అపార్ట్‌మెంట్‌లో 150 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి ఉదయం మిక్సీలు, గ్రైండర్లు భయ్‌మని మోగుతుంటాయి. కరెంట్ లోడ్ సరిపోవడం లేదంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ని తిట్టుకుంటారు. 25 ఇళ్లల్లో అన్ని మిక్సీలు, గ్రైండర్లు మోగుతుంటే లోడ్ ఎట్టా సరిపోద్ది? మీరిలా ఓపెన్‌గా మాట్లాడటంవల్ల ‘కోటకి నోటి దురుసుతనం’ అని సినిమా పరిశ్రమలో అంటుంటారు. ఈ విధంగా మాట్లాడటంవల్ల వివాదాలువస్తాయి కదా? కోట : విమర్శలు చాలా వచ్చాయి. ఇప్పుడొచ్చినా రానివ్వండి. అసలు విమర్శించేది ఎవరో తెలుసా? నేను చెప్పేది నిజం అని ఒప్పుకోలేక బతుకుతున్నవాళ్లు విమర్శిస్తారు. అయినా నన్నేం చేయగలుగుతారు? నేను ఎవడి సొమ్మూ తినడంలేదు. టీవీల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్లందర్నీ ఏం చేయగలిగారు? నేను మాట్లాడుతున్నది తప్పయితే... కొందరు రాజ్యసభ మెంబర్లు, పార్లమెంట్ మెంబర్లు వాళ్ల అమ్మల్ని, అక్కల్ని తప్ప మిగతావన్నీ తిట్టుకుంటున్నారు. అంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఒకవేళ గవర్నర్ ప్రసంగం నచ్చకపోతే బాయ్‌కాట్ చేయాలి. పిల్లలు విసురుకున్నట్లు కాగితపు బాణాలు విసరడం ఏంటి? పైగా విసిరినది ఎవరు? చదువుకున్న వ్యక్తే కదా. నలుగురికి మంచి అనిపించేది చెబుతాను. ఇష్టం ఉన్నవాళ్లు తీసుకుంటారు. లేకపోతే లేదు. మీ ముక్కుసూటితనం సినిమా పరిశ్రమలో మీకు ప్లస్ అయ్యిందా? మైనస్సా? కోట : నెగటివ్ అయితే జరగలేదు. ఒకవేళ నెగటివ్ జరిగి ఉంటే నా ప్రొఫెషన్ దెబ్బతినాలిగా. అలా జరగలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన నాలుగేళ్లు సినిమాల సంఖ్య తగ్గింది. ఆ సమయంలో ఏడాదికి పది సినిమాలు మాత్రమే చేయగలిగాను. ఎమ్మెల్యే అయ్యాడు కదా. చిన్న చిన్న పాత్రలిస్తే చేయడేమోనని కొంతమంది అడగడానికి జంకారు. ఆ విధంగా సంఖ్య తగ్గింది. బీజేపీలో నాలుగేళ్ల పాటు ఉండి.. ఆ తర్వాత రాజకీయాలకు ఎందుకు పూర్తిగా దూరమయ్యారు? కోట : నేను చేసినప్పుడు ఉన్నవి ‘పాలిటిక్స్’. ఇప్పుడు ‘పాలిట్రిక్స్’ మాత్రమే ఉన్నాయి. ఆ ట్రిక్స్ నాకు తెలియవు. అందుకే దూరంగా ఉంటున్నాను. మొహానికి రంగేసుకుని కష్టపడి సంపాదించుకుంటున్నాను. హీరోని, కమెడియన్‌ని, విలన్‌ని కాదు. అన్ని రకాలూ చేస్తున్నాను. టక్కున ఎవరైనా పిలిచి, ‘కోటా సినిమాలు మానేయవయ్యా’ అన్నా నో ప్రాబ్లమ్. బతకగలను. కాకపోతే ఇప్పుడు రెండు కార్లు వాడితే అప్పుడు ఒక కారు వాడతానేమో! రాజకీయాల్లో ఉన్నప్పుడు మినహా బిజీగా సినిమాలు చేశానన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? కోట : నేనా భగవంతుడ్ని ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే. భగవంతుడా... నాకు నాలుగు మెతుకులు ఇప్పించు. ఆ నాలుగు మెతుకుల్లో నలుగురికీ నాకు చేతనైనంత సాయం చేస్తానని. చిన్నా పెద్దా తేడా లేకుండా సహాయం చేస్తాను. కానీ ప్రెస్‌మీట్స్ పెట్టను. నా వయసు ఈ జూలైకి 70. ఇప్పటికీ అవకాశాలు నా గుమ్మం దగ్గరకే వస్తున్నాయి. నైన్ టు సిక్స్ మాత్రమే చేయగలను అని చెప్పినా.. ‘ఓకె... మీరు చేస్తే చాలు’ అనిపించుకోగలుగుతున్నానంటే నాలో కల్మషం లేనట్లేగా. పరభాషా నటులను తీసుకురావడం పట్ల కూడా మీరు అడపా దడపా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు... కోట: తెలుగువారిని ప్రోత్సహించాలని నేను మొత్తుకుంటుంటే కొంతమంది నవ్వుకుంటున్నారు. పిచ్చి అని కూడా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. మనవాళ్లను మనం గుర్తించకపోతే ఎలా? పరభాష నుంచి దమ్మున్న నటులను తీసుకొస్తే ఎందుకు తిడతాను? మీకు దమ్ముంటే నసీరుద్దీన్ షాని, నానా పటేకర్‌ని తీసుకు రండి. నేను అమితాబ్‌బచ్చన్‌తో ‘సర్కార్’ సినిమాలో కలిసి నటించాను. చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. ఆయన్ను తీసుకొచ్చి చేయించమనండి. ఎందుకు కాదంటాను? ముంబయ్‌లో రోజుకి మూడు నాలుగు వేలు తీసుకుని టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేసేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి లక్షలకు లక్షలు ఇస్తున్నారు. అది అవసరమా? సరే.. ప్రకాష్‌రాజ్‌లాంటివాళ్లంటే ఓకే. అతను ఆర్టిస్టు. నాకింకా కోపం తెప్పించే విషయం ఏంటంటే... రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, యమధర్మరాజు... ఇలాంటి పాత్రలకు మన తెలుగువారి మైండ్‌లో ఒక ‘రూపం’ ిఫిక్స్ అయిపోయింది. రామారావుగారు, రంగారావుగారు, సత్యనారాయణగారు, గుమ్మడిగారిలాంటివాళ్లు ఈ పాత్రలు చేయాలి. కానీ తెలుగువారు ఎవ్వరూ లేనట్టుగా మొన్నీమధ్య ఓ సినిమాలో ఒక ముంబై యాక్టర్‌కి యముడి పాత్ర ఇచ్చారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అయినా అసలు తెలుగువాళ్లని ప్రోత్సహించమంటే తప్పేంటండి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. తెలుగు సినిమాల్లో నూటికి నూరు శాతం తెలుగు నటీనటులు, కళాకారులు ఉంటేనే రాయితీ ఇస్తాం, నంది అవార్డులు కూడా అప్పుడే లభ్యం అవుతాయని ఓ జీవో పాస్ చేయమని ప్రభుత్వాన్ని కోరాలనుకుంటున్నాను. తెలుగువాళ్లకి అవకాశం ఇచ్చినందువల్ల సినిమాలు చెడిపోతాయేమోననే ఫీలింగ్ ఉందంటారా? కోట : పోనీ అలాంటి ఫీలింగే ఉందనుకుందాం. తెలుగువాళ్లకి మెయిన్ కేరక్టర్లు ఇచ్చిన సినిమాలు చెడిపోయాయని, అందుకే బయటికి వాళ్లను తీసుకుంటున్నాం అని చెప్పమనండి. నాలాంటివాళ్లకి తప్ప మిగతావాళ్లకి మెయిన్ కేరక్టర్లు ఎవరిచ్చారు? నేను ‘మా’ అసోసియేషన్ వారికి ప్రతి మీటింగులోనూ తెలుగువాళ్లను ప్రోత్సహించమనండంటూ మొరపెట్టుకుంటుంటాను. ‘మా’ అసోసియేషన్ ఉన్నది అందుకే కదా. అడగండని అంటుంటాను. అడగరు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికలకు నామినేషన్స్ మొదలయ్యాయి. నన్ను నామినేషన్ వెయ్యమంటే నేను వెయ్యలేదు. ఎందుకెయ్యాలని ఫీలింగ్? ప్రభుత్వమే దిగి వచ్చి, కోర్టులో జడ్జిమెంటు తెలుగులో ఉండాలని, పాఠశాలల్లో తెలుగు కంపల్సరీ అని ఇలా నిర్ణయాలు తీసుకుంటోంది. మరి మనకేం మాయరోగం. అరవయ్యేళ్లు దాటినవాళ్లకి పెన్షన్ ఇస్తున్నామంటున్నారు. కానీ వేషాల్లేక అవస్థలు పడుతున్న కుర్రాళ్ల సంగతేంటి? మన తెలుగువాళ్లకి నెలకి ఓ ఇరవై రోజులు పని ఉండేలా చెయ్యి తండ్రీ అని ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు ఏడుకొండలవాడికి మొరపెట్టుకున్నాను. మరి... మీరు కూడా పరభాషల్లో నటిస్తున్నారుగా? కోట : కరెక్ట్‌గా అడిగారు. ఇక్కడ మీకో చిన్న ఉదాహరణ చెప్పాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా భాషల్లో పాటలు పాడతాడు. ఏ భాషలో పాడితే అది ఆయన మాతృభాషలా ఉంటుంది. అలాగే నేను కూడా. నన్ను ఏ భాషలో తీసుకుంటే ఆ భాష నాది అన్నట్లుగా ఒదిగిపోతాను. అలాంటి వాళ్లని తీసుకురమ్మంటున్నాను. అంతే తప్ప పరభాషల మీద నాకెలాంటి ఆగ్రహం లేదు. మీ అబ్బాయి ప్రసాద్ ఉండి ఉంటే.. నటుడిగా మంచి భవిష్యత్తు ఉండేదేమో? కోట : అవును. తను ఉండి ఉంటే నాకింకా బాగుండి ఉండేది. రాత్రి ఏడున్నర అవుతుందంటే ‘ఎక్కడున్నారు’ అంటూ ఫోన్ చేసి, ఇంటికి తీసుకువచ్చేసేవాడు. డ్రింక్ చేస్తానేమోనని భయపడేవాడు. ఉదయం షూటింగ్స్ ఉంటే తనే నిద్రలేపేవాడు. నా ఆరోగ్యం గురించి పట్టించుకునేవాడు. తను మంచి బ్యాడ్‌మింటన్ ప్లేయర్. పుల్లెల గోపిచంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. తన కొడుకులిద్దర్నీ కూడా అక్కడే చేర్చాడు. అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టించుకున్నాడు. కానీ అనుభవించలేకపోయాడు. మేం మిగిలిపోయాం. తినలేం.. తినకుండా ఉండలేం. ‘గాయం-2’లో ప్రసాద్ చనిపోయే సీన్‌ని తీయొద్దని, చూడలేనని అన్నారట. మరి... నిజంగా అది జరిగినప్పుడు ఎలా తట్టుకోగలిగారు? కోట: ప్రసాద్‌కి అది ఫస్‌టిసినిమా. ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. ప్రసాద్ చనిపోయే నాలుగురోజుల ముందు ఆ సీన్ ప్లాన్ చేశారు. ‘నేను చెయ్యలేనండి. ఏమీ అనుకోవద్దు’ అన్నాను. జగపతిబాబు అర్థం చేసుకుని, డూప్‌తో చేయించాడు. ఆ సీన్‌లో యాక్ట్ చేసి ఉంటే దిష్టి పోయేదేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది (చెమర్చిన కళ్లతో). చనిపోయే రోజు పన్నెండున్నర గంటల ప్రాంతంలో నాతో మాట్లాడాడు. ఫ్యామిలీ అంతా కారులో , తను బైక్ మీద వెళుతున్నాడు. కారు 80 స్పీడులో, బైక్ 100లో వెళుతోంది. ఆ రోడ్డులో 100 స్పీడ్ అంటే ఈజీయే. వాడి తప్పేం లేదు. అలా రాసిపెట్టి ఉంది. భగవంతుడు ఓ పక్క అంత పెద్ద శిక్ష వేసి, మరోపక్క దాన్ని ఓర్చుకునే స్థైర్యం కూడా ఇచ్చాడు. మా అబ్బాయి చనిపోయిన రోజున మా పెద్దక్క పుట్టెడు దుఃఖంతో వచ్చింది. తనకి 86 ఏళ్లు. గుమ్మం దగ్గర అలా నిలబడిపోయింది. ‘గుండె పగిలి చచ్చిపోయి ఉంటావనుకున్నాను రా’ అంటూ ఏడ్చింది. తట్టుకోలేకపోయాను. ప్రసాద్‌కి ఎంతమంది పిల్లలు... ఆయన భార్యా పిల్లలు మీతోపాటే ఉంటారా? కోట : వాడికి ఇద్దరు కొడుకులు. ఇప్పుడు వాళ్లిద్దరూ (రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో) పుల్లెల గోపీచంద్ దగ్గర్నుంచే వస్తున్నారు. మా కోడలు చాలామంచి అమ్మాయి. వెల్ ఎడ్యుకేటెడ్. వాడి లేని లోటు తప్ప ఆ అమ్మాయి మాతో బాగా కలిసిపోయింది. మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ.. ‘మీరు మంచి కొడుకుని మాత్రమే కాదు, మేం మంచి మిత్రుడ్ని కోల్పోయాం’ అన్నారు. అందరితో అంత బాగుండేవాడు. ఫైనల్‌గా ఒక్కటి చెబుతాను.. ‘చిల్డ్రన్ ఆర్ బార్న్ టు అజ్... నాట్ బిలాంగ్స్ టు అజ్’ అనేది తెలుసుకున్నాను (గద్గద స్వరంతో... తడి నిండిన కళ్లతో). -సంభాషణ: డి.జి. భవాని కోట్లమందిని రంజింపచేస్తున్న కళాకారులకు ప్రైవసీ అవసరం కాబట్టి, వాళ్లంతా ఒకేచోట ఉంటే గౌరవంగా ఉంటుందనే సద్దుదేశంతో ప్రభుత్వం ఫిలింనగర్ సొసైటీ ఇచ్చింది. ఇరవయ్యేళ్లుగా సొసైటీ వ్యవహరిస్తున్న తీరుని చూసి, అంతా కరప్టడే అని, ఉన్న కమిటీని డిసాల్వ్ చేసి, ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్‌ని నియమించింది. కమిటీలో ఉన్నవాళ్లెవరూ అంటే.. సినిమా ఇండస్ట్రీలో పెద్దపెద్దవాళ్లు, మాజీ ఎంపీలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు. ఇంతమంది గొప్పవాళ్లున్న సొసైటీలో అవకతవకలు జరిగాయంటే ఎంత సిగ్గు చేటు! ఎవరి తప్పో తెలియదు కానీ ఎనభై శాతం మంది బయటివారికి ఎనిమిది శాతం మంది సినిమావారికి స్థలం కేటాయించారు. మరోవైపు చిత్రపురి కాలనీ గురించి చెప్పాలంటే.. అక్కడి పరిస్థితీ అగమ్యగోచరమే. భవిష్యత్తులో ప్రభుత్వం స్థలం ఇవ్వదు, ఇళ్లు ఇవ్వదు. మరి... నేటి తరానికి సినిమాల్లో అవకాశాలైనా ఇవ్వకపోతే వాళ్లెలా బతుకుతారు? ఇది అడిగితే తప్పా? మనం సెటిలయ్యాం కదా... తర్వాత తరానికి దారి చూపించాలిగా... ******* అప్పట్లో వస్తు మార్పిడి ఎక్కువగా ఉండేది. మా నాన్నగారి దగ్గర వైద్యం చేయించుకుని కూరగాయలు, కందులు, మినుములు... ఒక్క ఉప్పు, నూనె తప్ప రైతులు అన్నీ ఇచ్చేవాళ్లు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లయితే రూపాయి, రెండ్రూపాయలు ఇచ్చేవాళ్లు. అప్పట్లో మా నాన్నగారు ఒక నెల ఆంధ్రా బ్యాంకులో పాతిక రూపాయలు డిపాజిట్ చేశారు. పెద్ద డిపాజిటర్ వచ్చాడనే ఆనందంతో ఆ బ్యాంక్ మేనేజర్ మా నాన్నగారికి దండ వేసి, దండం పెట్టారట. ఆయనకేంట్రా లక్షాధికారి అనేవాళ్లు. ఇప్పుడు లక్ష అంటే నథింగ్. మినిమమ్ కోటి అయినా ఉండాలి. |
No comments:
Post a Comment