all

Sunday, December 9, 2012

మానసికంగా చెక్కు చెదరకుండా ఉండడమే అసలైన వివేకం..

పని హడావిడిలో వున్నా కూడా మానసికంగా చెక్కు చెదరకుండా ఉండడమే అసలైన వివేకం. ఒక చిన్న జెన్ కథ ఈ సత్యాన్ని వివరిస్తుంది.
ఒక జెన్ గురువుగారు తన శిష్యుడితో కలిసి ఒక చిన్న నది దాటుతున్నారు.
"గురువుగారు నదిని దాటే మార్గమేది?" అని శిషుడు అడిగాడు.
గురువు గారు చెప్పారు "కాలికి తడి అంటకుండా దాటాలి!"
ఆశ్చర్యపోయిన శిష్యుడు వెంటనే తన గురువు గారి కాళ్ళకేసి చూసాడు.
"గురువుగారూ, మరి మీ కాళ్ళు తడిగా వున్నాయే" అని అడిగాడు.
గురువుగారు చెప్పారు "నేను తడిగా లేను. తడి ఉపరితలం మీద మాత్రమె వుంది. లోపల్లోపల నేను పొడిగా వున్నాను. ఆ నీరు నన్ను తాకలేదు!"
ప్రతి వారికీ అన్ని రకాల అనుభవాలు జరుగుతూనే వున్నా లోపల మాత్రం చెక్కు చెదరకుండా వుండాలి!

ఆకాశమంత పొన్ను కర్ర!-kids story

 
 
ఒకసారి ఒక జమిందారు తన సలహాదారులిద్దరితో అలా ఊళ్లోకి వెళ్లాడు. సాయంత్రం కావడంతో పొలాల గట్టున ఒక చెట్టుకింద నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో ఆ ఇద్దరిలో ఒకడు కన్నీరు పెట్టుకున్నాడు. దేనికి ఏడుస్తున్నావని అడిగాడు జమిందారు.
‘‘అయ్యా, ఈ పొలాలన్నీ ఒకప్పుడు మా తాతగారివే. అప్పట్లో మా తాతగారు ఎంతో పంట పండించేవారు. అందుకు ఆయన దగ్గర ఉన్న బంగారు పొన్నుకర్ర మాయాజాలం పనిచేసేది’’ అని వివరించారు.

‘‘అవునా? మరి ఆ అద్భుతమైన పొన్నుకర్ర ఇప్పుడెక్కడ ఉంది?’’ అని జమిందారు అడిగాడు.
‘‘ఏం చెప్పమంటారు... ఓసారి ఆయన ఏదో కోపంలో ఉండి మేఘాల్ని ఆ కర్రతో కొట్టాడు. అవి కోపగించుకుని ఆ రాత్రి భారీవర్షం కురిపించాయి.

ఆ వర్షంలో అది కాస్తా ఎటో కొట్టుకు పోయింది. ఆ పొన్నుకర్ర పోయాక, మా ముత్తాత అంత పొలం తనకెందుకని అడిగినవాళ్లకు అడిగినంత దానం చేసేయడంతో మా తరం వచ్చేసరికి కుంటపొలం కూడా లేకుండా పోయింది’’ అన్నాడు రెండోవాడు. అంతా విన్న జమిందారు వారి చమత్కారానికి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుని వారికి తన పొలం కొంత ఇస్తానని హామీ ఇచ్చాడు.

మిస్టర్ ‘తలాష్’ఖాన్(ఇన్నర్‌వ్యూ)-ఆమిర్‌ఖాన్

 
 
 
ఈ రెండింటిలో ఇప్పుడు ఏది జరుగుతుంది? ఇన్‌స్పెక్టర్ సూర్జన్ సింగ్ షెకావత్ నేరస్థుడిని పట్టుకోవడమా? షెకావత్ పాత్రధారి ఆమిర్‌ఖాన్‌ను ప్రేక్షకులు పట్టుకోవడమా? రెండూ జరుగుతాయి, ఒకటి రీల్లో, ఇంకొకటి హాల్లో! రెండు చేజింగులూ బాగుంటాయనేది ఆమిర్‌ఖాన్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఒక రఫ్ గెస్. భిన్నత్వానికి మారుపేరైన ఆమిర్‌ఖాన్ ఇందులో ఏ విధమైన వైవిధ్యతను కనబరిచాడో చూడాలనుకోవడం అహేతుక కుతూహలం కాకపోవచ్చు. రీమా కగ్తీ దర్శకత్వంలో ఆమిర్ సహనిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన తలాష్ (గాలింపు) విడుదలై చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ మీద ప్రత్యేక కథనం.


ఒకరోజు మహాదర్శకుడు బాలచందర్ ఒక చిత్రమైన అవస్థలో చిక్కుకున్నారు: ఆమిర్‌ఖాన్‌కు ఫోన్ చేయాలి. కానీ అంతకుముందు పరిచయం లేదు. కాబట్టి చేసి ఏమని సంబోధించాలి? సర్ అనాలా? ఆమిర్‌జీ అనాలా? వయసు తెచ్చిన పెద్దరికం వల్ల ఏకవచనం సరిపోతుందా?

‘తారే జమీన్ పర్’ చూశాక, ఆమిర్‌ను అభినందించకుండా ఉండలేనిదేదో ఆయన్ని కుదిపేసింది. ఒక కవితాత్మక వాక్యం చదివినప్పుడు కవి హృదయంలో నర్తించడం లాంటిదది! నీ రక్తంలో పుట్టింది నా రక్తంలో ఇంకిపోయిందని తెలియజెప్పాలనే ప్రశంసోద్వేగం అది!

ఫోన్ రింగయింది. ఆమిర్ ‘‘హలో,’’ అన్నాడు. ‘‘నా పేరు కె.బాలచందర్, నేనో చిన్న దర్శకుడిని,’’ అని పరిచయం చేసు కోగానే, ‘‘స..ర్.., నేను మీ అభిమానిని,’’ ఆనందంగా పలికాడు ఆమిర్. తర్వాత మాటల ప్రవాహం! ఇరువురు కళాకారుల దూరవాణి సంగమం!

ఇదంతా ‘గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డు’ను అమీర్‌ఖాన్‌కు బహూకరిస్తున్న ఫంక్షన్లో బాలచందర్ చెప్పినప్పుడు ఆమిర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందులో ఏ ప్రతికూలోద్దేశమూ లేదు, ఇది నిక్కమైన ప్రశంస; అని అర్థమైన ఒక కళాకారుడు కరిగి కన్నీరైన సందర్భం!

ఇంతాచేస్తే అది దర్శకుడిగా ఆమిర్‌ఖాన్ తొలి ప్రయత్నం. ఒక స్టార్ హీరో అయ్యుండీ డిస్లెక్సియాలాంటి సున్నితమైన సమస్యతో కూడిన ఎడ్యుకేటివ్ సినిమాను తలకెత్తుకోవడం మామూలు విషయం కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు చూడాల్సిన, చూస్తున్న దృక్కోణాన్ని ఇది చర్చకు పెట్టింది. నల్లబల్ల మీద రాసిన అక్షరాలు రెక్కలొచ్చి ఎగురుతాయని ఇప్పుడు ఉపాధ్యాయుల్ని నమ్మించడం సులభం!

‘తారే జమీన్ పర్’(2007)తో విమర్శకులను మెప్పించడమేకాదు, వ్యాపారపరంగానూ విజయం సాధించాడు ఆమిర్. దానికి నిర్మాత కూడా అయిన ఆమిర్ 12 కోట్లు ఖర్చుచేసి, 88 కోట్లు రాబట్టాడు. మరి సినిమా అంటే బాక్సాఫీస్ అని కూడా!

నిర్మాతగానూ అంతే!

ఏ తపనతో ఆమిర్ దర్శకుడయ్యాడో అదే కారణంతో నిర్మాతయ్యాడు. ఒక మంచి సినిమాకు తాను మాధ్యమం కావాలి! అశుతోష్ గొవారికర్ ఒక పీరియడ్ సబ్జెక్టుతో తన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కథ విన్నాడు. నచ్చింది. మళ్లీ చెప్పించుకున్నాడు, ఇంకా నచ్చింది. మళ్లీ విన్నాడు, ఇంకా బాగా నచ్చింది. తీరా చూస్తే దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత లేడు.

‘బాజి’ దర్శకుడిగా అశుతోష్ పనితనం ఆమిర్‌కు తెలుసు. కానీ నిర్మాతగా మారడమంటే? అదీ పదేళ్ల కింద 25 కోట్లు పెట్టాల్సిందైతే? జె.పి.వాశ్వానీని ఆధ్యాత్మిక గురువుగా తలిచే ఆమిర్‌కు ఏ అంతర్వాణి ప్రబోధం వినిపించిందో! రిస్కు తీసుకున్నాడు. ‘ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్’ నెలకొల్పాడు. ‘లగాన్’(2001)ను ప్రపంచానికి కానుకగా అందించాడు. కాదా మరి! తన ‘100 బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ వరల్డ్ సినిమా’లో ఎంపైర్ మ్యాగజైన్ దీనికి స్థానం కల్పించింది. మదర్ ఇండియా(1957), సలామ్ బాంబే(1988) తర్వాత ‘విదేశీ ఉత్తమ చిత్రం’ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన మూడో హిందీ చిత్రంగా కాసులతోపాటుగా కీర్తినీ మూటగట్టుకుంది. అంతెందుకు! ఇప్పుడు భారతీయ సినిమా(హిందీ వరకు) అంటే ‘షోలే’ లేదా లగాన్.

‘‘నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా సినిమాలుండాలి. ఓ 200 ఏళ్ల తర్వాత ఎవరైనా లగాన్ చూస్తూ, ‘ఈయనెవరు యార్’ అనుకోవాలి,’’ అనేది ఆమిర్ ఆశ, ఆశయం.

ఏది చేసినా హృదయంతోనే...

‘ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ల జీవితాన్ని ఖర్చు చేసే’ ఆమిర్ తన కెరీర్‌ని చాలా త్వరగా తనదైన క్రమంలోకి తెచ్చు కున్నాడు. ‘ఖయామత్ సే ఖయా మత్ తక్’(1988) అతడి మొదటి హిట్ సినిమా. తర్వాత రెండేళ్ల పాటు విజయం అనేది లేదు. మంచి సినిమా అనిపించు కున్నప్పటికీ ‘రాఖ్’ ఫ్లాప్ అయింది. ‘లవ్ లవ్ లవ్’ ప్రేక్షకులను చేరలేదు. ‘అవ్వాల్ నంబర్’ వెనకబడిపోయింది. ‘తుమ్ మేరే హో’ చతికిలపడింది. అప్పుడే పరుగు మొదలుపెట్టిన నటుడికి ఇది బాధాకరమైన దశ!

అప్పుడు మహేష్‌భట్ ‘అర్థ్’, ‘సారాంశ్’, ‘నామ్’ లాంటి సినిమాలతో దర్శకుడిగా ఊపుమీదున్నాడు. భట్ చేతిలో పడితే తన స్టార్ తిరుగుతుందేమో! భట్‌లాంటి దర్శకుడు ఉత్తినే తనతో సినిమా చేస్తున్నానని ప్రకటించినా ఒక ఊరట లభిస్తుందేమో! అంతటి మానసిక వ్యథలో ఉన్నప్పుడు నిజంగానే మహేష్‌భట్ నుంచి ఆఫర్ వచ్చింది. ఊహించని అదృష్టం! కానీ స్క్రిప్టు ఆమిర్‌కు నచ్చలేదు. ఊగిసలాడాడు. తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డాడు. కానీ హృదయం ఒప్పుకోనిదాన్ని ఎలా చేయాలి? ఒక నిర్ణయానికి వచ్చాడు. నో!

తాను మనస్ఫూర్తిగా భాగస్వామి కాగలిగిన సినిమాలను మాత్రమే చేస్తూవచ్చాడు. ప్రేక్షకులు కూడా అతడి ప్రత్యేకతను గుర్తిస్తూ వచ్చారు.

దిల్ (1990), దిల్ హై కీ మాన్తా నహీ (1991), జో జీతా వోహీ సికందర్ (1992), హమ్ హై రాహీ ప్యార్ కే (1993), రంగీలా (1995), గులామ్ (1998), సర్ఫరోష్ (1999), దిల్ చాహతా హై (2001), రంగ్ దే బసంతి (2006), గజిని (2008); ఇలా కమల్‌హాసన్ అంత విభిన్నంగా ఆలోచించగలిగిన ఏకైక నటుడు ఆమిర్‌ఖాన్ మాత్రమే! ఒక క్యారెక్టర్‌కు రూపునివ్వడంలో... అది కోరమీసమా? పిల్లిగడ్డమా? గుండా? పొట్టిజుట్టా? ఏదైనా సరే, తన వైవిధ్యాన్ని చూపిస్తాడు.

వ్యాపారం తెలిసిన కళాకారుడు

ఏది చేసినా ఆమిర్ ఒక పద్ధతిగా చేస్తాడు. ఆ సినిమాతో ఒక ఉద్వేగపూరిత సంబంధాన్ని నెలకొల్పుకుంటాడు. ‘ఇదిగో ఈ మూడు నెలల డేట్స్ ఇస్తాను; ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి; తర్వాత నాకు సంబంధం లేదు;’ తరహాలో తాను పనిచేయలేనంటాడు. తాను నిర్మాతైతే పంపిణీదారు లాభపడాలి; తాను నటుడైతే నిర్మాత బాగుపడాలి; ఇదీ తన దృక్పథం. అందుకే సినిమాలను వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తాడు.

ఉదాహరణకు ఒక గుజరాతీ సినిమా ఆ రాష్ట్రంలో 7 కోట్లు వసూలు చేయగలదు. ఎంత పెద్ద హిందీ సినిమా అయినా అక్కడ 3 కోట్లకు మించి రావు. అంటే వాళ్లు సినిమాలు చూడరా? చూస్తారు. వాళ్లకు వినోదం వద్దా? కావాలి. అయినా ఎందుకు మార్కెట్ లేదు? ‘3 ఇడియట్స్’లో నటిస్తున్నప్పుడు ఆమిర్ ఆలోచన ఇది! అందుకే గుజరాత్‌తోపాటుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్; ఇలా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న నగరాల్లో మారువేషాల్లో తిరిగాడు. రోడ్డు పక్కనున్న వాళ్లతో కలిసి తిన్నాడు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల్ని పలకరించాడు, ఆలయాలకు వెళ్లి భక్తులతో మాట్లాడాడు; ఇదంతా కూడా ఒక రియాలిటీ షోలాగా చేశాడు. ‘ఈరోజు ఆమిర్ ఎక్కడ తప్పిపోయాడు?’ అనేది టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యింది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ టాపిక్ అయ్యింది. 385 కోట్లతో బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ‘3 ఇడియట్స్’(2009) రికార్డుల్ని తిరగరాసింది.

‘‘సినిమా చూడబోయేముందు ఆ సినిమాకు మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించాలి, ప్రేక్షకులను దానికి సంసిద్ధం చేయాలి. దానికోసం తొమ్మండుగురితో కూడిన నా మార్కెటింగ్ టీమ్‌తో బ్రెయిన్ స్టార్మ్ చేస్తా,’’ అని చెబుతాడు ఆమిర్. అలా గని తనకు సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు. ‘‘నా సినిమా చూసే ప్రేక్షకుడు తాను ఖర్చు చేసే యాభయ్యో వందో రూపాయలకు ప్రతి పైసా వసూల్ చేసుకోవాలి; వినోదంతోపాటు వినోదానికి మించినదేదో కూడా అందుకోవాలి,’’ అంటాడు.
ఆమిర్ ‘పీప్లీ లైవ్’(2010) నిర్మించడానికి కూడా కారణం ఇదే. వినోదానికి మించినదేదో ప్రేక్షకుడికి ఇవ్వాలి! అదీ కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ. అదీ తాను నటించ కుండా. మీడియా, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ మీద వేసిన ఈ సెటైర్ బాగా పేలింది. రైతు భారతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. మరి ఏ అనుభవమూ లేని కొత్త దర్శకురాలు అనూషా రిజ్వీకి అవకాశం ఎలా ఇచ్చాడు? తాను చేయగలదని ఎలా తెలియాలి? ఐదారు సీన్లు షూట్ చేసి చూపించమన్నాడు. ఎస్! ఈమెలో విషయం ఉంది. అందరూ కొత్త నటులు కావడంతో పూర్తి స్క్రిప్టును రిహార్సల్ చేయించాడు. ఒక నాటకంలాగా వాళ్లు సినిమాను ‘ఆడి’ చూపించారు. ఇంత పక్కాగా ఉంటాడు కాబట్టేనేమో, ఆమిర్‌ఖాన్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనే కొత్త అర్థం స్థిరపడింది.

మిస్టర్ పర్ఫెక్ట్

నిజానికి, ‘వడ్డించిన వెండిపళ్లెం’గా ఆమిర్ జీవితాన్ని పరిగణించి, ఈ గొప్పతనాన్నంతటినీ ఒక్క మాటలో తలకిందులు చేయొచ్చు. ఎందుకంటే తండ్రి తాహిర్ హుస్సేన్ నిర్మాత. పెదనాన్న నాసిర్ హుస్సేన్ నిర్మాత, దర్శకుడు. కాబట్టి అవకాశం పొందడమే ఒక వరంగా అతడి జీవితం ఎప్పుడూ లేదు. చాలామంది సినిమావాళ్లకు ఇంత యోగం ఉండకపోవచ్చు. అలాగని ఆ యోగం ఉన్న ప్రతివాళ్లూ ఇంత సెలక్టివ్‌గా లేరు. యోగం ఉండటంవల్ల కంటే ఆ యోగానికి తగిన మానసికస్థితి ఉండటం వల్ల కూడా ఆమిర్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాగలిగాడు.

అలాగే సినిమాకు మించినదేదో జీవితంలో ఉందని కూడా ఆమిర్ గుర్తించాడు. అందుకే ‘నర్మదా బచావో ఆందోళన్’కు మద్దతు పలికి యాక్టర్- యాక్టివిస్ట్ అయ్యాడు, అన్నా హజారే బృందంతో కలిసి జన్ లోక్‌పాల్‌కు మద్దతు పలికాడు, ‘సత్యమేవ జయతే’ టీవీ షోతో బాధితుల దుఃఖాన్ని తెలుసుకున్నాడు. ఆమిర్ అన్నీ చేస్తాడు. ఏదిచేసినా లెక్కప్రకారంగా, పద్ధతిగా, ప్రామాణికంగా చేయాలనుకుంటాడు, పర్ఫెక్ట్‌గా ఉండాల నుకుంటాడు. అలాగని పర్ఫెక్షన్ అనేది ఉండబోదని ఆమిర్‌కు తెలియదనుకోలేం. ఆ వంకన దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించకుండా వదిలేయకూడదని కూడా అతడికి తెలిసేవుంటుంది.
-ఆర్.ఆర్.


ఆమిర్ పెంపుడుకుక్క పేరు షారుక్
ఆమిర్ జన్మదినం 14 మార్చి (1965).
చిన్నప్పుడు బొద్దు చెంపలుండటంతో వాళ్లమ్మ కృష్ణ అని పిలిచేదట.
‘యాదోంకీ బారాత్’ (1973)లో బాలనటుడు.
‘మంజిల్ మంజిల్’, ‘జబర్‌దస్త్’ సినిమాలకు పెదనాన్న నాసిర్ హుస్సేన్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు.
హీరోగా తొలి చిత్రం ‘హోలీ’(1984).
షారుక్‌ఖాన్‌కి ఎంతో పేరు తెచ్చిన కి..కి..కిరణ్ పాత్ర(‘డర్’)ను ఆమిర్ చేయాల్సింది; కానీ యశ్‌చోప్రాతో అభిప్రాయభేదాలు రావడం వల్ల అది జరగలేదు.
ముందు కథ నచ్చలేదని నిరాకరించినా మహేష్‌భట్ దర్శకత్వంలో దిల్ హై కీ మాన్తా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే లాంటి చిత్రాల్లో నటించాడు.
శోభన్‌బాబు తరహాలో ఆదివారాలు షూటింగులకు వెళ్లడు.
కమల్‌హాసన్ పని విధానాన్ని ఇష్టపడతాడు.
పదిహేడేళ్లుగా అవార్డు ఫంక్షన్లకు పెద్దగా వెళ్లడం లేదు. వాటికి ఏ విశ్వసనీయతా లేదన్న స్వీయ అవగాహనతో.
ఆమిర్‌ఖాన్ పెంపుడుకుక్క పేరు షారుక్.
లాన్ టెన్నిస్‌లో ప్రావీణ్యముంది. రాష్ట్రస్థాయిలో మహారాష్ట్రకు ఆడాడు.
నటుడు కాకపోయుంటే ఫిలిం స్కూలు పెట్టుకునేవాడినంటాడు.
భారత ప్రభుత్వం అమీర్‌ను ‘పద్మశ్రీ’(2003), ‘పద్మభూషణ్’(2010) పురస్కారాలతో గౌరవించింది.
దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపంమీద అవగాహన కల్పించడానికి యునిసెఫ్ భారత ప్రతినిధిగా నియమితుడయ్యాడు(2011).

మిస్టర్ కాంప్లికేషన్

చిన్ననాటి నేస్తం, బెంగాలీ అమ్మాయి రీనాదత్తాను ఆమిర్ 1986లో పెళ్లాడాడు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి జునైద్ ఖాన్, అమ్మాయి ఐరా ఖాన్. బస్సు, లోకల్ ట్రెయిన్‌లోనే పిల్లల్ని స్కూలుకు పంపారట! ‘‘జీవిత వాస్తవికత వాళ్లకు తెలియాలి కదా!’’ అంటాడు ఆమిర్.

అయితే పదిహేనేళ్ల కాపురం తర్వాత 2002లో రీనాతో విడిపోయాడు. ‘‘కొన్ని నిర్ణయాలు మన చేతిలో ఉండనంతగా వశం తప్పుతాయి. మా బంధం విషయంలోనూ అదే జరిగింది,’’ అంటాడు. పిల్లల కస్టడీని కోర్టు రీనాకు అప్పగించింది.
2003లో బ్రిటిష్ జర్నలిస్టు జెస్సికా హైన్స్‌తో అమీర్‌కు ఒక బాబు(జాన్) ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే, ఆమిర్ దాన్ని ఖండించాడు.

లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయమైన కిరణ్‌రావును 2005లో పెళ్లిచేసుకున్నాడు. (దోబీఘాట్ చిత్రంతో కిరణ్ దర్శకురాలైంది.) 2011లో వారికి పిల్లాడు కలిగాడు. అజాద్‌రావ్ ఖాన్. ఆమిర్ పూర్వీకుడైన స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మీదుగా కిరణ్ ఈ పేరు పెట్టిందట. రీనా, కిరణ్ ఇద్దరూ హిందువులు కావడం కాకతాళీయమే! తాజాగా ఆమిర్ కొడుకు జునైద్ ‘3 ఇడియట్స్’ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దగ్గర ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాడు. ఇందులో నటిస్తున్నది ఇంకెవరో కాదు, నాన్నే!

ఆమిరేవ జయతే

పదమూడు వారాల ‘సత్యమేవ జయతే’ టీవీ షోతో ఆమిర్ చరిత్ర సృష్టించాడు. దూరదర్శన్, స్టార్ ప్లస్, స్టార్ వరల్డ్‌లో హిందీతో పాటుగా బంగ్లా, మరాఠీ, తమిళం, తెలుగు; ఇలా ఎనిమిది భాషల్లో ఏకకాలంలో ప్రసారమైంది. ఆమిర్‌ఖాన్‌కు మాత్రమే దక్కిన, దక్కగలిగే గౌరవం ఇది. రామాయణ్, మహాభారత్ తర్వాత అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన ఈ కార్యక్రమాన్ని 8.4 కోట్ల మంది చూశారని అంచనా. ఆదివారం ఉదయం పదకొండు గంటలు కొత్త ప్రైమ్‌టైమ్ అయింది. దీనికోసం ఎపిసోడ్‌కు 3 కోట్లు పారితోషికం తీసుకున్నాడు ఆమిర్. భారత టెలివిజన్ చరిత్రలో ఒక యాంకర్‌కు ఇంత సొమ్ము ఇవ్వడం ఇదే ప్రథమం. 10 సెకన్ల యాడ్‌కు 10 లక్షలు వసూలుచేయడం కూడా రికార్డే!

అయితే, వినోద ప్రధానమైనదాన్లోనో, రియాలిటీ షోలోనో కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమంతో ఆమిర్ టీవీలోకి ప్రవేశించడం గమనార్హం. వరకట్నం, గృహహింస, అంగవైకల్యం, ఆడశిశు భ్రూణహత్యలు, అంటరానితనం, నీటి కొరత, రసాయనిక కాలుష్యం; ఇవీ ఇందులో హైలైట్ చేసిన అంశాలు. కార్యక్రమానికి కొనసాగింపుగా మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిరోధించాలని ప్రధానిని కలిశాడు. వైద్యరంగంలోని అనైతికతనూ, అవినీతినీ ఎత్తిచూపినందుకు డాక్టర్ల నుంచి వచ్చిన నిరసను తోసిపుచ్చాడు. వాళ్లకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. వ్యక్తిగత నైతికత దృష్ట్యా తాను నటించిన వాణిజ్య ప్రకటనలు ఈ ధారావాహిక వచ్చినంతకాలం ఎక్కడా ప్రసారం కాకుండా చూసుకున్నాడు. కొత్త ప్రకటనలపై సంతకం చేయలేదు.

‘నేను కాదు, ప్రేక్షకులు మారారు’

‘ఒక బాధ్యతగల భారతీయ పౌరుడిగా నేను ఈ పేద ఆదివాసీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను. డ్యామ్ ఎత్తు పెంపుచేసినట్లయితే వీళ్లు భూమి, ఇళ్లు కోల్పోతారు.’’ (2006: ‘నర్మదా బచావో ఆందోళన్’కు మద్దతుగా)

‘‘నిజానికి నేను మారడం కన్నా, ప్రేక్షకులు మారారు. పాత పచ్చళ్లను ఇంకా రుచిచూడటానికి సిద్ధంగా లేరు. తాజాగా, వాస్తవికంగా కనబడేవి కోరుకుంటున్నారు. వాటిని గుర్తిస్తున్నారు, అభినందించగలుగుతున్నారు.’’

(2007: బాలీవుడ్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారన్న ప్రశంసకు)

‘‘అది నాకంత ప్రాధాన్యమైన విషయం కాదు. నన్ను చూడాలనుకునేవాళ్లు నా సినిమాలు చూస్తారు.’’
(2007: ‘మేడమ్ టుస్సాడ్స్’లో తన మైనపు ప్రతిమకు నిరాకరిస్తూ)

‘‘ఎప్పుడైనా ఓ సామాజిక ఉద్యమం జరుగుతున్నప్పుడు జనం అందులోకి వచ్చినట్టు కనబడదు. వ్యాపారస్తులు, వైద్యులు, గృహిణులు; అందరూ దూరంగా ఉంటారు. ఒక్క సినిమా పరిశ్రమవాళ్లే కాదు, అత్యధిక శాతం ‘చోడో యార్, మనం ఎందుకు వాళ్లతో పెట్టుకోవడం?’ అనుకుంటారు. కానీ ఈ ఉద్యమం అందరినీ బయటికి రప్పించగలిగింది. అవినీతి ప్రతి ఒక్కరిమీదా ప్రభావం చూపిస్తుంది.’’ (2011: అన్నాహజారే సారథ్యంలోని జన్ లోక్‌పాల్ బిల్ ఉద్యమానికి మద్దతుగా)

లేడిపిల్ల తెలివి"_" చిట్టి కథ

 
 
ఒక అందమైన లేడిపిల్ల తన తల్లితో మేతకు బయల్దేరింది. ఆకులూ అలములూ తింటూ గెంతుతూ ఆడుకుంటూ దారి తప్పిపోయింది. ఎంత వెతికినా తల్లి కనిపించలేదు. దాంతో భయం భయంగా నడవసాగింది. ఇంతలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టు అనిపించడంతో ఆగి చూసింది. ఒక నక్క తన వెనుకే వస్తోంది. అది ఏ క్షణంలోనైనా తనమీద దూకి చంపేలా ఉంది. ఏడుపు ముంచు కొచ్చింది లేడిపిల్లకి. అంతలోనే ‘తెలివిగా ప్రవర్తించి ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు’ అన్న తల్లి మాటలు గుర్తొచ్చాయి.

వెంటనే దానికో ఆలోచన వచ్చింది. తను నడుస్తున్న దారి పక్కనే ఉన్న తమలపాకుల్ని గబగబా నమిలింది. నాలుక బాగా ఎర్రబారిన తర్వాత గిలగిలా కొట్టుకుంటూ నేలమీద పడిపోయింది. తన పని ఇంత సులువవుతుందని అనుకోని నక్క, వెంటనే లేడిపిల్లని చేరి నోటితో పట్టుకోబోయింది.
అంతలో లేడిపిల్ల ‘‘నక్కబావా! ఆగు. తొందరపడి నాలా నీవూ నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’’ అంది. దాంతో నక్క ఒక అడుగు వెనక్కి వేసి ‘‘ఏం జరిగింది?’’ అని అడిగింది. దానికి లేడిపిల్ల కన్నీరు కారుస్తూ, ‘‘నేను ఏవో విషపు ఆకులు తిన్నాను. నా శరీరం విషపూరితం అయింది. నన్ను తింటే నీవూ చనిపోతావు. నాకు కడుపులో నొప్పి మొదలైంది. నోరంట రక్తం కూడా వస్తోంది చూడు’’ అంటూ తన ఎర్రని నోటిని చూపించి, తర్వాత కళ్లు తేలేసింది. అది చూసిన నక్క ‘బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు. ఈ లేడిపిల్ల మాంసానికో దండం’ అనుకుని వెళ్లిపోయింది. లేడిపిల్ల నవ్వుకుంటూ అక్కడ్నుంచి తుర్రుమంది.
నీతి: ఉపాయంతో ఎంతటి అపాయాన్నయినా తప్పించుకోవచ్చు.

ఆర్థిక నిపుణులు ఏం చెప్తారు?--భద్రం బి కేర్‌ఫుల్


 
 
ఆరోగ్యం బాగుండాలంటే డాక్టరు చెప్పిన మాట వినాలి. మన ఆర్థిక ఆరోగ్యం బాగుండాలంటే ఆర్థిక నిపుణుల మాట వినాలి. అయితే ఆ నిపుణుల్ని వెతికి పట్టుకోవడం... డాక్టర్లను కనిపెట్టినంత సులువు కాదు. కాబట్టి మీకోసం అలాంటి వారు తరచుగా చెప్పే కొన్ని సూత్రాలు..

బడ్జెట్: జేబు భద్రంగా ఉండాలంటే బడ్జెట్ వేసుకోవాల్సిందే. ప్రతి నెల ప్రారంభంలో ఆ నెల కట్టాల్సిన బిల్లులు, చేయాల్సిన పొదుపులు వివరంగా రాయండి. దాన్ని దాచి.. ఆ నెల చివర్లో అనూహ్యంగా వచ్చి చేరిన ఖర్చులు రాయండి. కొంత కాలం తర్వాత అనూహ్య ఖర్చులు తగ్గిపోతాయి.

రిస్క్: నష్టభయం లేని పొదుపు విధానాల (ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ స్కీమ్‌లు) వల్ల సంపన్నులైనవారు ఎవరూ లేరు. రిస్క్‌తో కూడిన పొదుపులు చేస్తేనే మనం సంపన్నులం కాగలం. అయితే రిస్క్‌తో కూడినవన్నీ దీర్ఘ కాలంలో మాత్రమే లాభాలనిస్తాయి. ఈ విషయంలో కనీస పరిశోధన అవసరం.

సేవింగ్స్ అకౌంట్స్: మీ శాలరీ అకౌంట్ కాకుండా మరో సేవింగ్స్ అకౌంట్ ఆరంభించండి. పొదుపులు, ఇన్వెస్ట్‌మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని జీతం వచ్చిన తక్షణం ఈ అకౌంట్‌కు మళ్లించండి. ఖర్చులన్నీ శాలరీ అకౌంట్ ద్వారా, పొదుపులన్నీ సేవింగ్స్ అకౌంట్ ద్వారా జరిగితే మీకు సర్దుబాటు అలవాటవుతుంది. అనవసర ఖర్చు తగ్గుతుంది.
క్రెడిట్ కార్డు: ఏడాది వ్యవధిలో మీ క్రెడిట్ కార్డు వల్ల వచ్చిన అదనపు ఖర్చులు (వార్షిక రుసుము, కొనుగోళ్ల సమయంలో పడిన అదనపు చార్జీలు, వడ్డీలు, జరిమానాలు) లెక్కించండి. మీకు లాభమా నష్టమా తెలుస్తుంది. దాన్ని బట్టి క్రెడిట్ కార్డును సమర్థంగా వాడుకోవడం ఎలాగో తెలుస్తుంది. ఎక్కువ నష్టం జరుగుతోందనుకుంటే రద్దు చేసుకోవచ్చు. 65 శాతం మంది నష్టపోతున్న వారేనన్నది అంచనా.

షాపింగ్: నిత్యావసరాలు కాకుండా ఇతర వస్తువులు కొనేముందు.. ఇది కొనకపోతే నేనేమైనా ఇబ్బంది పడతానా అని ఒక్కసారి ఆలోచించండి. కొంతకాలం తర్వాత మార్పు మీకే తెలుస్తుంది. అంతేకాదు, ప్రతి వస్తువూ బ్రాండ్‌దే కొనక్కర్లేదు.

పెళ్లి కూడా గుడ్డిదేనా!

 
బెల్జియంకి చెందిన జాన్ (64), ఇండియాకు చెందిన మోనిక (48)ల పెళ్లై ఇరవై ఏళ్లయింది. పిల్లల్లేరన్న చింత తప్ప మరే గొడవా లేదా దంపతులకు. అయితే ఇటీవలే జాన్‌కి మోనిక గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలిసి కంగుతిన్నాడు. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. జాన్ వాదన విన్న బెల్జియమ్ కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేసింది. ఇంతకీ జాన్‌కి తెలిసిన నిజమేంటంటే మోనిక స్త్రీ కాదు... పురుషుడని! మోనిక(?) జన్మతః పురుషుడు. ముప్ఫయ్యేళ్లు వచ్చాక లింగమార్పిడి చేయించుకుని స్త్రీగా మారాడు. ఇండియాలో ఉంటే పెళ్లవడం కష్టమవుతుందని బెల్జియమ్ వెళ్లి, జాన్‌ని పెళ్లాడాడు. ఇరవయ్యేళ్లు కాపురం చేశాక కానీ సదరు జాన్‌కి అసలు ‘విషయం’ తెలియలేదు మరి!

సంచలనానికి కూడా ఒక కట్టుబాటు ఉండేది!--నటి పూర్ణిమ

 
ఆ రోజుల్లో..!
కౌమారప్రాయంలో చిగురు తొడిగే ప్రేమ.. పెళ్లిపల్లకీ ఎక్కే వైనాన్ని హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన ‘ముద్ద మందారం’లో నటించేనాటికి పూర్ణిమది పద్నాలుగేళ్ల ముగ్ధ ప్రాయం. 1981లో విడుదలైన ఆ చిత్రం తర్వాత పూర్ణిమ నటిగా స్థిరపడ్డారు. ఏడేళ్ల తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పి సంసార జీవితంలో తలమునకలయ్యారు. టీనేజ్ సినిమాల హీరోయిన్‌గా మూడు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పూర్ణిమ, ఇప్పటికీ, అప్పటికీ ప్రేమకథల వాసిలో చాలా తేడా ఉందని అంటున్నారు.

అప్పుడు ముద్ద మందారం, నాలుగు స్తంభాలాట ఓ ట్రెండ్. దానికి మాతరం నాంది పలికింది. పదిహేనేళ్ల వయస్సులో నటించడాన్ని పక్కన పెడితే, ఆ వయస్సులో ప్రేమ, సాన్నిహిత్యం వంటి దృక్పథాలు సంచలనాలు. సినిమాల్లో కొత్త పుంతలు తొక్కిన ఈ ఆలోచనా ధోరణి మా జనరేషన్‌తోనే మొదలైందేమో. మా ముందు తరం వారికి ఆ సినిమాలు కొత్త కెరటాల్లా అనిపించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలను మాత్రం ఆ విధంగా చూడలేం. అప్పట్లో భావాలు కొత్తవైనా వాటిని చెప్పే విధానం మాత్రం పద్ధతిగా ఉండేది. టీనేజ్ లవ్ ప్రధానాంశమైనా అది కథ చుట్టూ అల్లుకుని ఉండేది. ఆ రోజుల్లో సంచలనమనిపించే విషయాన్ని కూడా కొన్ని కట్టుబాట్లు, నిబంధనల పరిధిలో చూపేవారు. దాంతో అది ఎబ్బెట్టుగా అనిపించేది కాదు. కానీ ఇప్పటి పద్ధతి వేరు. కట్టు, బొట్టు, ఆలోచనలు మారుతున్న మాట నిజమే. ఈ తరం కోరికలు భిన్నంగా ఉన్న మాట వాస్తవమే. కానీ సినిమాల చిత్రీకరణలో విపరీత ధోరణుల వల్ల సంచలనాత్మకమన్న సంగతి అటుంచితే విపరీతాలకు ఆస్కారం కలిగే ప్రమాదం ఉందనిపిస్తోంది.

ఇప్పుడు కథ కంచికి

టీనేజ్‌లో ఉన్న అమ్మాయి.. అబ్బాయి.. వారి మధ్య ప్రేమ.. అదీ ముద్దమందారం కథ.. ఆ ప్రేమలో ఎన్నో పరిణామాలు.. హృదయాన్ని కదిలించే సంఘటనలు.. వీటన్నిటినీ కథనమనే సూత్రంతో అల్లి మందారమాలను తయారు చేశారు మహనీయుడు జంధ్యాల గారు. అప్పట్లో కథ సినిమాకు ప్రాణంగా ఉండేది. దాన్ని చెప్పే తీరు కూడా అంతే హృద్యంగా ఉండేది. కథలో పాత్రలకు అనుగుణంగా నటుల ఎంపిక సాగేది. నవ యవ్వనంలో అడుగిడుతున్న ఓ అమాయకపు అమ్మాయి ప్రధాన పాత్రగా ముద్ద మందారం చిత్రాన్ని జంధ్యాల తీయాలనుకున్నారు. అందుకోసం ఓ అమ్మాయిని ఎంపిక చేయడానికి జంధ్యాల సాగించిన అన్వేషణ నా దగ్గర ఆగింది. నటుల ఎంపిక కోసం అంత పెద్ద కసరత్తు సాగేది. కథపై పాత్రధారులందరికీ అవగాహన ఉండేది. ఇప్పుడు కథ ఎక్కడ? దాని చుట్టూ కథనం అల్లిక ఎక్కడ? హృదయాన్ని స్పృశించే సెంటిమెంట్ ఎక్కడ?

తెర చాటుకు నటన

‘నటనే పది కాలాలు బతుకుతుంది’ అనేవారు జంధ్యాల. అందుకే ఆయన నటులకు కాకుండా వారిలో నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అదే మాకు నేర్పారు. పాత్రోచితంగా నటించే వరకు ఓపిగ్గా నేర్పేవారు. అయితే ఇప్పటి కథ వేరు. ఇప్పటి బిజీ టైంలో నటన, పాత్ర పోషణ రాన్రానూ వెనక్కు పోతున్నాయి. ఎలా నటించామన్నది కాకుండా ఎంత సంపాదించామన్నది ముఖ్యమైంది. నటనను ఓ గౌరవప్రదమైన వృత్తిగా అప్పట్లో భావిస్తే ఇప్పుడు ఆర్జనకు దగ్గరి తోవగా తలపోస్తున్నారు. దర్శకులు సినీ నిర్మాణాన్ని ఓ తపనలా భావించేవారు. రెమ్యునరేషన్ ఎంతన్న దాని మీద ధ్యాస పెట్టేవాళ్లం కాదు. 1981లో ముద్ద మందారానికి నా రెమ్యునరేషన్ రెండున్నర వేలంటే నమ్ముతారా?

ఆటబొమ్మలు కారు

రానురానూ హీరోయిన్లు ఆడిపాడే బొమ్మలైపోతున్నారు. గ్లామర్‌తో నెట్టుకొస్తున్నారు. రెండు మూడు పాటలకు పరిమితమైపోతున్నారు. ధరించే దుస్తులూ అందుకు తగ్గట్టే ఉంటున్నాయి. గతంలో హీరోయిన్‌కు కథలో తగిన ప్రాధాన్యం ఉండేది. అందుకే తక్కువ సినిమాల్లో నటించిన తారలు కూడా గుర్తుండిపోయారు. ఇప్పటి హీరోయిన్లు సైతం గ్లామరస్‌గా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల భామలు తళుక్కున మెరిసి మురిపిస్తున్నారు. జయప్రద, జయసుధ రోజులు కావివి. దిగుమతి చేసుకున్న తారలతో తెలుగు సినిమా నడుస్తోంది. రెమ్యునరేషన్ కూడా అంచనాలకందని స్థాయికి చేరింది. ఒక సినిమా హిట్టయితే రేంజి ఎక్కడికో వెళ్లిపోతోంది. ఉత్తరాది అమ్మాయిలవైపు ప్రేక్షకులూ మొగ్గు చూపుతున్నారు. డబ్బే ఇప్పటి సినిమాకు సర్వం. వేగం, మార్పు ఈ తరం పర్యాయ పదాలయ్యాయి. సినిమాలో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి.ఇది ఇప్పటి ట్రెండ్ అని సరిపెట్టుకోవాలేమో.సంభాషణ: సత్యారావు పట్నాయక్

మాటతోనే ప్రపంచాన్ని జయించవచ్చు

 
 
కబంధుని సూచనమేరకు రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళి, ఆమె ఆతిథ్యం స్వీకరించి, ఆమెకు పుణ్యలోకాలు ప్రసాదించి, అలా నడచుకుంటూ కిష్కింధకు చేరుకున్నారు. అక్కడ వాలికి భయపడి ఋష్యమూక పర్వతంమీద తలదాచుకున్న సుగ్రీవుడు దూరాన్నుండే రామలక్ష్మణులను చూచాడు. వాలి పంపున వస్తున్న శత్రువులనుకుని భయపడిపోయాడు. వెంటనే ఆ సంగతి తన మంత్రియైన హనుమంతునికి చెప్పాడు. హనుమంతుడు సుగ్రీవుని భయపడవద్దని ధైర్యం చెప్పాడు. వారెవరో చూసి వస్తానని బయలుదేరాడు. వానర రూపాన్ని విడిచిపెట్టి, భిక్షుకరూపాన్ని ధరించాడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరాడు. ఇద్దరికీ నమస్కరించాడు. ‘మీరెవరు? రాజర్షులలాగా, దేవతలలాగా కనబడుతున్నారు. నియమవంతులైన మునీశ్వరులలాగ కనబడుతున్నారు.

మిమ్మల్ని చూసి, ఇక్కడి ఆటవికులకూ, మృగాలకూ కూడా భయం కలుగుతోంది. నారచీరలు కట్టారు. కాని విల్లమ్ములు ధరించారు. ఇక్కడ సుగ్రీవుడనే వానరప్రభువు ఉన్నాడు. అతడెంతో ధర్మాత్ముడు. మహావీరుడు. కాని అంతకంటె బలవంతుడైన అతని అన్న వాలి అధర్మంగా తరిమిగొట్టడంతో ఋష్యమూక పర్వతంపై తలదాచుకుని దిగులుగా ఉన్నాడు. అతడు పంపగా నేను వచ్చాను. మా రాజు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. నేను వారి మంత్రిని. నా పేరు హనుమంతుడు. చాలా విషయాలు అడిగాను, చెప్పాను. మరి మీరు మాట్లాడరేం?’ అని అడిగి మౌనం వహించాడు ఆంజనేయుడు.

రామునికి హనుమంతునికీ ఇదే మొదటి సమాగమం. ఇంతవరకూ హనుమంతుని ప్రస్తావన లేదు. బంగారు జింకను కోరుకున్న సీత తన భర్తకు దూరమై దూరంగా లంకలో బంధింపబడింది. సీత రామునికోసం ఎదురు చూస్తోంది. రాముడు సీతకోసం వెదుకుతున్నాడు. వారిద్దరినీ కలిపేందుకు హనుమ రంగ ప్రవేశం చేసాడు. రామాయణంలో గురువుకు ప్రతిరూపమే హనుమంతుడు. అందుకనే తనను తాను రాముని దాసునిగా ప్రకటించుకున్నా లోకమంతా హనుమంతునికి గుడి కట్టి భక్తిశ్రద్ధలతో పూజిస్తోంది. గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ అనుకునే సంస్కృతి మనది. హనుమంతుని మాటలు విన్న రాముడు లక్ష్మణునితో అంటున్నాడు. ‘తమ్ముడూ! ఈ హనుమ సామాన్యుడు కాడు. వేదాలన్నీ చదువుకున్నాడు. అందుకే సుస్వరంగా మాట్లాడుతున్నాడు. వ్యాకరణశాస్త్రాన్ని బాగా అభ్యసించాడు.

అందుకే ఎంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా వీని నోటినుండి వెలువడలేదు. ముఖంలో హావభావాలు స్పష్టంగా ఉన్నాయి. పెద్దగా మాట్లాడటంలేదు. చిన్నగానూ మాట్లాడటం లేదు. వేగంగా కాని, నెమ్మదిగా కాని మాట్లాడకుండా చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా అందంగా చెప్పాడు. ఇంత మాట నేర్పరిని చూస్తే కత్తినెత్తిన శత్రువు కూడా మెత్తబడిపోతాడు. ఇలాంటివాడు ఎవరికి దూతగా ఉంటాడో అటువంటి ప్రభువులకు ఎలాంటి కార్యమైనా సునాయాసంగా నెరవేరుతుంది’ అని హనుమంతుని వ్యక్తిత్వాన్ని కేవలం అతని మాటను బట్టి అంచనా వేసి చెప్పాడు రాముడు. మాటనుబట్టే మనసు తెలుస్తుంది. మాటనుబట్టే సామర్ధ్యం బయటపడుతుంది. మాటతోనే ప్రపంచాన్ని జయించవచ్చు అనడానికి ఈ సన్నివేశమే నిదర్శనం.

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి, సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి.


అందమె ఆనందం

గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలపాలి. ఇది బాడీలోషన్‌లా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. కొన్నిరోజులు ఇలా చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

డాక్టర్‌ని అడగండి - ఆయుర్వేదం

 
నా వయసు 47. శరీరంలో చాలా చోట్ల పులిపిర్లు మొలిచాయి. ఇవి తగ్గటానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు.
- రామోజీ, కాళహస్తి


ఆయుర్వేద పరిభాషలో వీటిని ‘చర్మకీల’ అంటారు. కలబందఆకుని కావలసిన పరిమాణంలో ముక్కలుగా కోసి పులిపిరులపై ఉంచి కట్టుకట్టాలి లేదా చింతాకు రసం, కొంచెం సైంధవలవణం కలిపి ముద్దగా నూరి లేపనంగా వాడుకోవచ్చు. ఇలా చేస్తే 5 రోజులలో అవి రాలిపోయి నున్నటి చర్మం వస్తుందని శాస్త్రోక్తం. శారిబాద్యాసవ ద్రావకం 4 చెంచాలు తీసుకుని సమానంగా నీళ్లు కలిపి రోజూ రెండుపూటలా ఒక నెలరోజులు తాగాలి.

నా వయసు 22. గత ఆరు నెలలుగా నా శిరోజాలు రాలిపోతున్నాయి. అందువల్ల జుత్తు పల్చబడిపోతోంది. మంచి మందులు, సలహాలు సూచించ ప్రార్థన.
- మంజుల, చేవెళ్ల


విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజధాతువులతో కూడిన పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడం మొదలైనవి జుత్తు రాలిపోవటానికి ముఖ్య కారణాలు. కారణాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు నెలలపాటు ఈ సలహాలు పాటించండి. ఫలితం కనపడుతుంది.

ఆకుకూరలు, మునగ, క్యారట్, బీట్‌రూట్, చేపలు, మాంసరసం, కోడిగుడ్లు తీసుకోండి. ముడిబియ్యం మంచిది. తాజా బొప్పాయి, అరటి, సీతాఫలాల వంటి పళ్లు, జీడిపప్పు, బాదం వంటి శుష్కఫలాలు సేవించాలి. ఆరేడుగంటలపాటు రాత్రి నిద్రపోవాలి. రోజూ కనీసం ఐదులీటర్ల నీరు తాగాలి. వ్యాయామం, ప్రాణాయామం తప్పనిసరిగా ఆచరించండి. రోజూ ఒక లీటరు ఆవుపాలు తాగండి. షాంపూలకు బదులు కుంకుడుకాయ, షీకాకాయ పొడులతోటే స్నానం చేయండి. మీకు ఎలర్జీ కలిగించే మందులను వాడవద్దు. నీలిభృంగాది తైలాన్ని రోజూ తలనూనెగా వాడండి. కొంతకాలం తర్వాత స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడుకోవచ్చు. పునర్నవాది మండూర మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. భృంగరాజాసవ ద్రావకం నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. గురివింద గింజల చూర్ణాన్ని ముద్దగా చేసి తలపై రాసుకుని, ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే జుత్తు రాలటం త్వరగా తగ్గుతుంది.

మానసవీణమధుగీతం-బెటర్‌హాఫ్

 
 
డెరైక్టర్ అంటే...
వైట్ అండ్ వైట్... అట్టహాసం... 555 ప్యాక్...
ఖరీదైన కారు ్ల... ఎక్కే విమానం దిగే విమానం
లోన ఈగల మోత ఉన్నా, బయట పల్లకీ మోతే! అంతా షో బిజినెస్!
కానీ సింగీతం... సూపర్ హిట్ డెరైక్టరయినా, సింప్లిసిటీని వదల్లేదు!
ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి... జీవితం సరళంగా ఉండాలి అంటారాయన.
ఆయన శ్రీమతి కూడా అంతే! సింపుల్‌గా జీవిస్తే సంసారంలో కలతలు కూడా సింప్లిఫై అయిపోతాయని చెబుతున్న ఈ దంపతుల దాంపత్యసారాన్ని తెలుసుకుంటే ప్రతిసంసారం సంతోషమే...
మానసవీణ మధుగీతమే!


సింగీతం దంపతులు వయసు ఎనిమిది పదులకు చేరుకుంటోంది. వారి వివాహ వయసు ఐదు పదులు దాటింది. తెలుగింటి దంపతులైన వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. వీరిని కలిసి దాంపత్యజీవితం విజయవంతం కావాలంటే ఏంచేయాలో తెలపమని కోరితే... పెద్ద హంగామా ఏమీ లేకుండానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు.

సినిమానా...! ప్రభత్వ ఉద్యోగమా...!

‘ఆయ్యోరామ... సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తి ఎందుకే..! ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమున్న అబ్బాయిని పెళ్లిచేసుకొని హాయిగా ఉండక... అంటూ హితవు పలికారు మా వైపు పెద్దలు’ అన్నారు లక్ష్మీకల్యాణి తమ పెళ్లి ముచ్చటను ప్రారంభిస్తూ. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. మధ్యతరగతి జీవనం. ఆ రోజుల్లోనే తండ్రి ఆమెను బీఏ వరకు చదివించారు.

‘అమ్మాయి తరపువారు ఇలా భావించడంలో తప్పులేదు. ప్రభుత్వ ఉద్యోగమంటే జీవితం సేఫ్ అనే భావన ఉంటుంది కదా! నేనేమో పోస్టల్ డిపార్టుమెంటులో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాను’ అని ఒప్పుకున్న సింగీతం స్వస్థలం నెల్లూరు జిల్లా.

... ‘ఆ సమయంలో మా అత్తమామలు- కట్నకానుకలు తీసుకోవడం, ఇవ్వడం మాకు అలవాటు లేదు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చితే చాలు - అన్నారు. ఆ మాటలతో వారి కుటుంబం మీద నాకు ఎనలేనంత గౌరవం ఏర్పడింది’ కొనసాగింపుగా అన్నారు లక్ష్మీ కళ్యాణి.

అందరి అంగీకారంతో 1960లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బాజాబజంత్రీలు మోగాయంటూ అలనాటి ఆనందాలను పంచుకునేందుకు పోటీపడ్డారీ దంపతులు.

ఆమె చెప్పినట్టే జరిగింది!

‘పెళ్లయ్యేనాటికి నెలకు రూ. 200ల జీతం. విజయావాహినీ, జయంతి సంస్థల్లో పనిచేస్తుండేవాణ్ణి. చెన్నైలో చిన్న అద్దెగది. టీ నగర్ బస్టాండు సమీపంలోని ఆ అద్దెగదికి ముందు కొట్టం, దానిలో ఇంటి యజమానుల పశువులూ ఉండేవీ. ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఈవిడను కాపురానికి తీసుకెళ్లాను. నా మనస్సులోని భావనను గ్రహించిందో ఏమో, ‘మీరేం ఫీల్ కాకండి, పశువులు ఇంటి వద్ద ఉంటే శుభం’ అంటూ ఆనందంగా ఆ గదిలో అడుగుపెట్టింది. ఆమె చెప్పినట్లే జరిగింది, ఆ ఇంటి నుండే నేను అంచలంచెలుగా ఎదిగాను’ అన్నారు శ్రీనివాసరావు. శ్రీవారు ఉన్నచోటే అద్దాలమేడగా భావించే శ్రీమతి చెంత ఉంటే, నింగికి నిచ్చెనలు వేయచ్చు అనే భావన వారి మాటల్లో స్పష్టమైంది.

స్క్రిప్టుల్లోనూ ఒకే నిర్ణయం...

వృత్తిపరమైన పనుల్లో భార్య జోక్యం చేసుకోవడం చాలామంది భర్తలకు నచ్చదు. ‘నీకేం పని ఇక్కడ’ అని కసురుకుంటారు కూడా. ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ... భార్యకు వృత్తిపరమైన పనుల్లోనూ అవకాశాన్ని కల్పిస్తే ఆ భర్త ఎన్నో విజయాలను చవిచూడవచ్చు అని చెప్పారు సింగీతం. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ రిలీజై, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ స్టోరీ డిస్కషన్ జరుగుతున్న రోజులవి. ‘పురాణాలు, చరిత్ర అధ్యయనం కోసం కన్నెమెరా, యూనివర్సిటీ లైబ్రరీలకు కలిసి వెళ్లేవారం. ఆ రోజుల్లో ఆటోలు లేవు, కారులో వెళ్లే స్థోమత లేదు. అందుకే సిటీ బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. లైబ్రరీల్లో గుర్తించిన విషయాలను ఇద్దరం చర్చించుకుని, ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత స్క్రిప్టు సిద్ధం చేసేవారం’ అని చెబుతున్న కళ్యాణి గొంతులో భర్తకు సమవుజ్జీగా నిలబడిన జ్ఞాపకాల తరంగాలు దొంతర్లుగా వినిపించాయి.

శ్రీమతి చేతుల్లో ‘సిరి’సేఫ్...

ఈ రోజుల్లో అయితే ‘నీ డబ్బు, నా డబ్బు’ అంటూ ఎవరి ఖర్చులు వారు చూసుకుంటున్నారు. ఎవరి బ్యాంకు బ్యాలెన్స్‌లు వారు చూసుకునే తత్వం వచ్చేసింది. ఈ పద్ధతి దాంపత్య జీవనానికి గొడ్డలిపెట్టుగా మారుతోంది అంటారు ఈ దంపతులు. ‘పెళ్లైన మొదట్లో సంపాదించిన రు.200ల నుండి ఈరోజు వరకు నేను ఆర్జించే మొత్తాన్నంతా కల్యాణి చేతులోనే పెట్టడం అలవాటు నాకు. నేను డబ్బిచ్చినా, చెక్కిచ్చినా ముందు దేవుడి వద్ద పెడుతుంది, ఆ తరువాతే బీరువాలోకి చేరుతుంది’ అని శ్రీనివాసరావు చెబుతుంటే ‘ఈయన పాకెట్‌మనీ కావాలన్నా నన్నే అడుగుతారు’ అన్నారు లక్ష్మీకల్యాణి గుంభనగా నవ్వేస్తూ.

కష్టమైనా... సుఖమైనా...

కష్టసుఖాల్లో ఒకరికి ఒకరం ఉన్నామనే భరోసానే దాంపత్యజీవితాన్ని ఆనందం మయం చేస్తుంది. అవి ఈ దంపతుల జీవితంలో నిండుగా ఉన్నాయి కాబట్టే వారి కాపురం మెండుగా నిలబడింది. మచ్చుకు ఒకటి - ‘విజయావారి ఉమాచండీగౌరీశంకరుల కథ, జయంతి పిక్చర్స్ భాగ్యచక్రం రెండూ ఫెయిలయ్యాయి. నిర్మాతలు నష్టపోయారు. దీంతో జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. నేను ఆధారపడే రెండు సంస్థలు ఒకేసారి చేతులెత్తేయడంతో కుటుంబ పోషణ కష్టమైంది’ అని శ్రీనివాసరావు చెబుతుంటే.. ‘ఒడిలో చిన్న పిల్ల. దాని అవసరాలకైనా సంపాదించాలని దగ్గరలోని ఒక స్కూల్లో పాపను చేర్పించి అక్కడే టీచర్‌గా చేరాను. స్కూలు నుండి ఇంటికి వచ్చిన తరువాత స్క్రిప్టుల రూపకల్పనలో సహకరించేదానిని. ’ అని భార్య గుర్తు చేసుకుంటుంటే ... ‘బొమ్మలు గీయడంలో ప్రవేశం ఉండటంతో పండుగలు, కొత్తసంవత్సరం గ్రీటింగు కార్డులను తయారుచేసి, అంగళ్లకు తీసుకెళ్లి అమ్మేవాడిని. నిర్మాతల దగ్గర స్క్రిప్టులు ఫెయిర్ చేసి కొంత సంపాదించేవాడిని. అలా ఇంటిని చక్కదిద్దుకునేవాళ్లం’ అని చెప్పారు శ్రీనివాసరావు.

భావాలలోనూ సర్దుబాటు

‘ఈవిడకు భక్తి ఎక్కువ. ఆమె తృప్తి కోసం దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టిన నేనూ భక్తునిగా మారిపోయాను.’ అని శ్రీమతి తనలో తెచ్చిన మార్పులను చెబుతుంటే... కల్యాణి అందుకున్నారు -‘ప్రతి చిన్నదానికి టెన్షన్ పడేదాన్ని. కోపం కూడా త్వరగా వచ్చేసేది. ఆ ప్రతాపాన్ని వంటగిన్నెలపై చూపించేదాన్ని. ఈయన సాహచర్యంలో కోపాన్ని అదుపుచేసుకోగలిగాను. అయితే టెన్షన్ మాత్రం ఇప్పటికీ వదల్లేదు. టెన్షన్ పడే సందర్భాలలో ఈయన జోక్‌లు వేసి, నవ్విస్తారు. ఈయనలో మరో గొప్ప విషయం ఏంటంటే వంట ఎలా ఉన్నా తినేస్తారు. కనీసం ఉప్పు లేకున్నా ఇదేమని అడగరు’ అంటూ తమ కాపురంలోని అసలు కిటుకు చెప్పేశానా అన్నట్టు పెద్దగా నవ్వేశారు. ఆమె నవ్వులకు శ్రీనివాసరావు నవ్వులు జతకలిశాయి.

ఇద్దరు ఆడపిల్లల పెంపకంలో ఒకే తరహా నియమావళిని అవలంబించామని తెలిపిన ఈ దంపతులు వారి వివాహ విషయంలోనూ అదే సూత్రాన్ని పాటించామని చెప్పారు. ఎంతో సుదీర్ఘజీవితాన్ని, ఒడిదొడుకులను దాటుకొచ్చిన వీరి దాంపత్య విశేషాలు తెలుసుకున్నాక స్నేహపరిమళాలు వీరి వైవాహిక జీవితాన్ని సుసంపన్నం చేశాయని అనిపించింది.
 

ఆరోగ్యం కోసం...

 

మనలో చాలా మందిమి ఆరోగ్యవంతమైన శరీరాలతోనే జన్మిస్తాం. కానీ తెలియక అనేక తప్పులు చేసేస్తాం. శరీరం గురించి పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటాం. మన ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పనిచేసేందకు సమయం సరిపడకపోతే నిద్రా సమయాన్ని పనిచేయడానికి వినియోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయంలో ఇలా చేస్తూ ఉంటారు. కనీసం ఎనిమిది గంటలు నిద్రిస్తే ఆరోగ్యానికి మంచిదని పరిశోధనల్లో వెల్లడయ్యింది.
నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతిలో ఉంటుంది. శరీరం లోపలి అవయవాల పని చురుకుదనం తగ్గుతుంది. మెదడు నిద్రావస్థలో ఉంటుంది. గుండె కొట్టుకునే రేటు కూడా నిమిషానికి 72 నుండి 55కి పడిపోతుంది. గాఢ నిద్ర అనంతరం మేల్కొనగానే మనసు, శరీరం చాలా తాజాగా ఉంటాయనేది మనకు అనుభవంలోని విషయమే. నిద్రలేమితో బాధపడేవారికి నిద్ర గొప్పదనం తెలుస్తుంది. నిద్రలోపించినపుడు మనిషికి సులువుగా కోపం వస్తూ ఉంటుంది. శరీరంలో ఆమ్లాల పరిమాణం పెరిగి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
కొంతమంది మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తారు. ఈ కాస్త నిద్ర వారి మెదడులో చురుకుదనాన్ని పెంచుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. అనుదినం 6 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. అంతకు మించిన నిద్ర చాలా ప్రమాదం. ఇది బద్దకాన్ని పెంచుతుంది.
మంచి ఆహారం
మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని కాదు. రుచికరమైనదని కూడా కాదు. మంచి ఆహారం అంటే శరీరానికి మేలు చేసేది. దీనిలో పౌష్టికత బాగా ఉండాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు తగిన నిష్పత్తిలో ఉండాలి. 8 నుండి 10 గ్లాసుల నీరు కూడా తాగాలి.
వయసును బట్టి, ఆడమగా తేడాను బట్టి, చేసే శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి.
ఎవరికి వారు తాము ఎలాంటి సమతులాహారం తీసుకోవాలో తెలుసుకుని భుజిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాల బారిన పడకుండా మన శరీరం కాపాడుతుంది.
ఎక్కువ తినడం వల్ల కూడా శరీరం అనేక విధాలుగా నలిగిపోతుంది. స్థూలకాయం, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎదురవుతాయి.
వ్యాయామం
వ్యాయామం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాయామం అంటే శారీరక, మానసిక వ్యాయామం. 'ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు' ఉండాలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచి ఎటు కావాలంటే అటు వంగేటట్లు చేస్తుంది
క్రమం తప్పని వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. జిమ్‌, ఎరోబిక్స్‌, చురుగ్గా నడవడం, ఈత, షటిల్‌ లేదా ఇంకేవైనా శరీరానికి వ్యాయామాన్నందించే ఆటలు ఆడాలి.
పద్ధతులు పాటించాలి
శరీరాన్ని కాపాడుకునే కొన్ని పద్ధతులను చిన్నతనం నుండే పెద్దలు అలవాటు చేస్తుంటారు. ఇవన్నీ ఆరోగ్యానికి మెట్లు అని గుర్తుంచుకోవాలి. నిద్రపోవడానికి-లేవడానికి సరైన సమయాలు, ఉదయం నిద్రలేవగానే ముఖం, కాళ్లు కడుక్కోవడం బయటినుండి ఇంట్లోకి వచ్చినపుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం, భోజనం ముందు, తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవడం, రోజూ స్నానం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది.
అనేక శారీరక సమస్యలకు కారణం శరీరాన్ని మనం అజాగ్రత్తతో వదిలివేయడమే. శరీరంలో తరచు ఏదైనా రోగం ప్రవేశించి వేధిస్తూ ఉంటే వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలి.
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జవసత్వాలు తగ్గుతాయి. అటువంటిప్పుడు శరీరం గురించి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే శరీరాన్ని మాయిశ్చర్‌ చేయాలి. ఎండలో వెళ్లేటప్పుడు చలువ కళ్ళజోళ్ళు , గొడుగు ఉపయోగించడం మంచిది.
శరీర, ముఖ వర్చస్సు తగ్గకుండా కూడా వ్యాయామాలు చేయాలి. పాదరక్షలు సౌకర్యంగా, తేలికగా ఉండేలా ఎంచుకోవాలి.
సంతోషం సగంబలం
మనిషి ఆందోళన చెందకూడదు. ఆందోళన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఏదైనా సమస్య ఎదురయితే సామాన్యంగా ఆందోళనకు గురి అవుతారు. ఇది సహజమైన ప్రతిచర్య. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలి. సమస్యకు పరిష్కారం వెదుక్కోవాలిగానీ చింతిస్తూ కూర్చోకూడదు.
ఆందోళన మనిషిని అనారోగ్యం పాలు చేస్తుంది. మరిన్ని తప్పులు చేయిస్తుంది. ఇది శరీరంలో హార్మోనులను విడుదల చేయిస్తుంది. తమ శక్తికి మించిన సమస్య అయితే కుటుంబ సభ్యులు, లేదా మిత్రుల సహకారం తీసుకోవడం మంచిది.
చిరునవ్వుతో ఉండడం శరీరానికి ఎంతో అవసరం. చేసే చిన్న చిన్న తప్పులకు విచారించక వాటిని పాఠాలుగా తీసుకుని నవ్వుకోవడం నేర్చుకోవాలి.
ఇతరులకు సహాయం చేయడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. చేతనయినంత ఇతరులకు సహకరించడం, ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువులను, స్నేహితులను ఆప్యాయంగా పలకరించడం, కొత్త వారితో మర్యాదగా మసలడం, ఎదుటివారికి విలువ నిచ్చి మనసుతో మాట్లాడడం వంటివి మీ వ్యక్తిత్వానికి వన్నె తెస్తాయి.
- సి.వి.సర్వేశ్వరశర్మ
ఫోన్‌ నెం: 9866843982

రొయ్యల పచ్చడి

 

కావలసిన పదార్థాలు
రొయ్యలు - అరకిలో
వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి)
కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు
లవంగాల పొడి - అర చెంచా
నూనె - అరకిలో
నిమ్మకాయ - ఒకటి
తయారు చేసే విధానం
రొయ్యలు వాసన పోవాలంటే ముందుగా రెండు నిమిషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి వడగట్టి బట్టమీద వేసి ఆరనివ్వాలి. మూకుడులో నూనెపోసి కాగిన తరువాత రొయ్యలను వేయించాలి. రొయ్యలు త్వరగా వేగిపోతాయి. మరీ ఎక్కువ సేపు ఉంచితే గట్టిపడతాయి. వేగిన రొయ్యలను గిన్నెలోకి తీసుకోవాలి. రొయ్యలపచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అన్ని పచ్చళ్ళ మాదిరిగానే ఒక కప్పు నూనెలో కారం, ఉప్పు, మసాలాపొడి, రొయ్యలు కలిపి, నిమ్మకాయ పిండితే పచ్చడి రెడీ అయినట్టే. నీసులేనిదే ముద్ద దిగని మాంసం ప్రియులకు ఇలాంటి పచ్చడి ఇంట్లో ఉంటే జిహ్వచాపల్యం తీరుతుంది.

మాంసం పచ్చడి

 

కావలసిన పదార్థాలు
బోన్‌లెస్‌ మాంసం - 1కిలో
వెల్లుల్లి, అల్లం పేస్టు - 1 గరిటెడు,
కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు
లవంగాల పొడి - అర చెంచా
నూనె - అరకిలో, నిమ్మకాయ - ఒకటి
తయారు చేసే విధానం
మాంసం చిన్న ముక్కలుగా కొయ్యాలి. ముక్కలు కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె కాగిన తరువాత ముక్కల్ని వేయించాలి. మాంసం ముక్క ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. ముక్క ఉడికిందీ లేనిదీ చూసుకుని, నూనెలోంచి ముక్కల్ని గిన్నెలోకి తీసుకోవాలి. మూకుడులో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి, స్టౌ తక్కువ మంటమీద ఉంచి అల్లం వెల్లుల్లి ముద్ద, లవంగాల పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. స్టౌ ఆర్పివేసి, వేయించిన మాంసం ముక్కలు వేసి అన్ని ముక్కలకు మసాలా కారం పట్టేలా కలపాలి. ఇష్టమైతే చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండుకోవాలి.

చేపల పచ్చడి

 

కావలసిన పదార్థాలు
చేపముక్కలు - అరకిలో, వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి), కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు, జిలకర, మెంతులు వేయించిన పొడి - ఒక చెంచా
లవంగాలు - 2, యాలకులు - 1, దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
(మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి), నూనె - అరకిలో, నిమ్మకాయ - ఒకటి
తయారు చేసే విధానం
చేపముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వండి. మూకుడులో నూనె పోసి కాగిన తరువాత ఈ ముక్కల్ని వేయించాలి. మరీ వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగి పోతాయి. ముక్క ఉడికితే సరిపోతుంది. మూకుడులో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి అందులో కారం, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, మసాలా పొడులు వేసుకోవాలి. చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండి సీసాలోకి తీసుకోవాలి.

చికెన్‌ పచ్చడి

 

కావలసిన పదార్థాలు
బోన్‌లెస్‌ చికెన్‌ - అరకిలో
వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి)
కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు
లవంగాలు - 2
యాలకులు: - 1
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
(మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి)
నూనె - అరకిలో
నిమ్మకాయ - ఒకటి
తయారు చేసే విధానం
చికెన్‌ ముక్కలు కడిగి ఒక బట్టమీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె పోసి చికెన్‌ ముక్కలు వేయించాలి. చికెన్‌ ముక్క నూనెలో ఉడికిందీ లేనిదీ చూసుకొని (మరీ గట్టిపడకుండా) చిల్లుల గరిటెతో గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసివేయాలి. ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్‌ ముక్కలను కూడా ఇందులో వేయాలి. గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయ రసం పిండాలి. ఇది బాటిల్‌లోకి తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది.

వ్యక్తిగా ప్రతివారినీ గౌరవించు. కానీ పూజింపకు.


భారత్‌లో ఎఫ్‌డిఐల బేరం 120 కోట్ల ముడుపులు

 

  • వాల్‌మార్ట్‌ ఖాతాల్లో భాగోతం
  • అమెరికా సెనేట్‌కు సంస్థ నివేదిక
భారతదేశ చిల్లర వాణిజ్యంలోకి అడుగుపెట్టే అవకాశం సంపాదించడానికి వాల్‌మార్ట్‌ సంస్థ 125 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిన ఉదంతం బట్టబయలైంది. ఈ తతంగం నిజానికి 2008 నుంచే జరుగుతున్నది. అమెరికా సెనేట్‌కు వాల్‌మార్ట్‌ అందించిన లాబీయింగ్‌ నివేదికలోనే 2.5 కోట్ల డాలర్లు (సుమారు 125 కోట్ల రూపాయలు) ఖర్చు చేసినట్టు తెలియజేసింది. వ్యాపారాభివృద్ధి కోసం ఇలాంటి వ్యవహారాలు నడపడం అమెరికాలో నేరం కాదు!
భారతదేశంలో వ్యాపార పెట్టుబడుల అవకాశాల మెరుగుదల కోసం జరిపిన చర్యలతో సహా వివిధ లాబీయింగు కార్యకలాపాల్లో ఈ మొత్తం ఖర్చు చేసినట్టు వాల్‌మార్ట్‌ పేర్కొన్నది. 2012లో సెప్టెంబరుతో ముగిసిన చివరి త్రైమాసికంలో వివిధ రకాల వ్యవహారాలకు పది కోట్ల రూపాయల వరకూ ఖర్చుపెట్టినట్లు కూడా నివేదించింది. ఇవన్నీ అవినీతి ముడుపులకు ముసుగుల వంటి మాటలేనని చెప్పనవసరం లేదు. ఈ త్రైమాసికంలో వాల్‌మార్ట్‌ సంస్థ అమెరికా సెనేట్‌, ప్రతినిధుల సభ, ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యుఎస్‌టిఆర్‌), విదేశాంగ శాఖలతో లాబీయింగ్‌ జరిపినట్లు తాజా త్రైమాసిక నివేదిక వెల్లడించింది. వ్యాపార పెట్టుబది అవకాశాల మెరుగుదల కోసం కంపెనీలు వివిధ శాఖలు, ఏజెన్సీలతో లాబీయింగ్‌ చేయడానికి అమెరికాలో అనుమతిస్తారు. అయితే ఈ నిమిత్తం చేసిన ఖర్చుల వివరాలను ప్రతి త్రైమాసికానికి అమెరికా సెనేట్‌కు ఆ కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. వాల్‌మార్ట్‌ విషయానికొస్తే, 2009లో కొన్ని నెలలపాటు మినహాయిస్తే 2008 నుంచి నిరంతరం ఈ సంస్థ లాబీయింగ్‌ నడుపుతూనే ఉంది.
ప్రతిపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా మల్టీ బ్రాండ్‌ చిల్లర వర్తకంలోకి విదేశీ కంపెనీల పెట్టుబడులకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల తీర్మానం ఇటీవల వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న వాల్‌మార్ట్‌ సంస్థకు మార్గం సుగమమైంది. భారత
రిటైల్‌ మార్కెట్‌ ప్రస్తుత విలువ 50 వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని, ఇది 2020 నాటికి లక్ష కోట్ల డాలర్లను అధిగమిస్తుందని అంచనా. ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ ఎటి కెర్నీ నివేదిక ప్రకారం, 2020 నాటికి మొత్తం మార్కెట్‌లో వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్‌ 25 శాతానికి చేరుకుంటుంది. అంతర్జాతీయ రిటైల్‌ సంస్థలకు భారత్‌ అత్యంత అనువైన గమ్యస్థానంగా ఉంటుందని కూడా ఈ నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో రిటైల్‌ మార్కెట్‌ వృద్ధి 15-20 శాతం ఉంటుందనీ ఈ నివేదిక తెలిపింది.

సాయికిరణ్

రజనీయే అన్నారు... నాది ఆర్టిస్ట్ ముఖమని
'అనగనగా ఆకాశం ఉంది .. ఆకాశంలో మేఘం ఉంది' పాట గుర్తుంటే చాలు ... మీరింకా ఆ హీరోని మర్చిపోలేదన్నమాటే. గాయకుడు వి.రామకృష్ణ కుమారుడిగా, బుల్లితెర, వెండితెరల హీరోగా అందరికీ తెలిసిన నటుడతను. 'నువ్వేకావాలి'తో చిత్రరంగ ప్రవేశం చేసి 'ప్రేమించు', 'సత్తా', 'డార్లింగ్ డార్లింగ్', 'వెంగమాంబ', 'శిరిడి శాయి' వంటి పలు చిత్రాల్లో నటించారు. అలాగే 'ఆటో భారతి', 'సుందరకాండ', 'అపరంజి' లాంటి బుల్లితెర సీరియల్స్‌లోనూ కనిపిస్తున్న ఆ యువ నటుడు సాయికిరణ్ హ్యాపీడేసే ఇవి.

అంజలీదేవిగారి ఇంటికి సత్యసాయిబాబాగారు వచ్చినప్పుడు, ఆయన చేతుల మీదుగా నా నామకరణం జరిగిందట. అమ్మానాన్నలు ఇద్దరూ గాయకులే కాబట్టి తరచూ ప్రోగ్రాంల్లో పాల్గొనడానికి ఊర్లు తిరుగుతూ ఉండడంతో, ఏడేళ్ల వరకూ అమ్మమ్మ వాళ్లింట్లో హైద్రాబాద్‌లోనే పెరిగాను. అమ్మమ్మ వాళ్లు అప్పట్లో ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవారు. ఆ ఇంటి పక్కనుండే ఫారెస్టు ఆఫీసరు ఒకాయన వికారాబాద్ అడవుల్లో గాయపడ్డ నెమళ్లనీ, జింకలను తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ ఇవ్వడం నాకు బాగా జ్ఞాపకం. బహుశా అదే ఆ తర్వాత నేను జంతు ప్రేమికుడిగా మారడానికి దోహద పడిందేమో! సంక్రాంతి పండగ సందర్భంలో ఎగరేసే గాలిపటాల 'మాంజా' కోసుకుని ఎన్నో గద్దలు నేల రాలిపోతుండేవి.

అలా పడిపోయిన గద్దలపై ఒక టర్కీ టవల్ కప్పి, జాగ్రత్తగా కుక్కపిల్లని చంకలో పెట్టుకున్నట్టు పొదువుకొని, ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి. అలా నేను కుక్కలు, ఉడుములు, పాములు, తాబేళ్లు, పావురాలు, లవ్ బర్డ్స్, గబ్బిలాలు, గద్దలు, చేపలు, ఊసరవెల్లులు, చిలకలు లాంటి ఎన్నో జంతువుల బాగోగులు చూసుకున్నాను. వీటికోసం ప్రత్యేకంగా పంజరాలను తయారుచేయించడం ... దెబ్బతిన్న వాటి ఆరోగ్యం కుదుట పడగానే యథావిధిగా వాటిని ప్రకృతిలోకి వదిలేయడం ఒక హాబీగా ఉండేది.

ఇంట్లోంచి పారిపోయాను
8వ తరగతిలో ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ తెలిసినప్పుడు జరిగిన సంఘటన ఇది. లెక్కల్లో 90 శాతం తెచ్చుకోకపోతే తన్నులు తప్పవని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అయినా నాకు నూటికి 5 మార్కులే వచ్చాయి. ఇంటికి వెళితే తన్నులు ఎలాగూ తప్పవని రిక్షా రాకముందే సిటీ బస్సులో మద్రాసు సెంట్రల్‌కి వెళ్లి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (స్లీపర్‌లో) ఎక్కి దర్జాగా కూర్చున్నాను. రైలు గూడూరు దాటాక టి.సి. వచ్చి టికెట్ అడిగాడు. 'మా అమ్మానాన్నలు కూడా ఇదే రైల్లో ఉన్నారు. వాళ్లు ఏ బోగీలో ఉన్నారో తెలీదు. టికెట్ వాళ్ల దగ్గరే ఉంది' అని అబద్ధం ఆడేశాను. నా భుజానున్న స్కూల్ బ్యాగ్, చేతిలో లంచ్ బాక్స్ చూడగానే టి.సి.కి అనుమానం వచ్చి మెల్లగా కూపీ లాగాడు.

'నీవు రామకృష్ణగారి అబ్బాయివా? నేను మీ నాన్నగారి ఫ్యాన్‌ను తెలుసా' అనడంతో అసలు విషయం కక్కేసి ... అమ్మమ్మ వాళ్లింటికి హైద్రాబాద్ వెళ్తున్నానని చెప్పేశాను. రామకృష్ణగారి అబ్బాయిని కావడంతో టికెట్ విషయం మర్చిపోయి, 'అయ్యో ఒక్కడివీ ఎలా వెళ్తావు' అని బాధపడిపోయి, హైద్రాబాద్‌లో దిగగానే తనకు తెలిసిన మనిషికి నన్ను అప్పగిచ్చి మా అమ్మమ్మ వాళ్లింట్లో దిగబెట్టమన్నాడు. నేను సేఫ్‌గా అమ్మమ్మ వాళ్లింటికి చేరుకున్నాగానీ ... చెన్నైలో మా అమ్మానాన్నలు మాత్రం నిద్రాహారాలు మాని పోలీసుస్టేషన్ల వెంట తిరిగి, వాళ్లకు లంచాలిస్తూ, నా ఆచూకీ కోసం నానా హైరానా పడ్డారట. అమ్మమ్మ ఇంటినుండి వార్త అందిన తర్వాతగానీ వాళ్లు కుదుట పడలేదట. అంత తెగింపు నాకెలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే కానీ ఆ దెబ్బతో అమ్మానాన్నలు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. చదువు, చదువు అని వెంటపడ్డం మానేశారు.

ఆ మాటతో హీరోనైపోయా!
మా చిన్న నాన్నమ్మ పి. సుశీలగారి అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి నాన్న వెంట నేనూ రజనీకాంత్‌గారి వద్దకు వెళ్లాను. అప్పుడాయన 'ఉలైపాళి' అనే తమిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. శుభలేఖ తీసుకుంటూ పక్కనే ఉన్న నన్ను చూసి 'ఎవరీ అబ్బాయి? ఆర్టిస్ట్ ముఖం. యాక్టర్‌ని చేయండి' అన్నారు. ఆ మాటతో నా చుట్టూ కెమెరా జూమ్‌తో రెడీగా ఉన్నట్టు, లైట్స్ ఒక్కసారిగా వెలిగినట్టు, ఎక్కడో యాక్షన్ అనే పిలుపు వినిపించినట్టు ఫీలయిపోయా. బయటకి రాగానే 'చూశారా, అందరి కళ్లకు రజనీకాంత్‌గారు యాక్టర్లా కనిపిస్తే ఆయన కళ్లకి నేను యాక్టర్లా కనిపించాను. చదువు మానేసి హీరోనైపోతా' అన్నాను నాన్నతో. ఆయన ముందు డిగ్రీ పూర్తి చేయమని కచ్చితంగా చెప్పేశారు. అదేంటో ఇంటర్మీడియట్ టైంలో గడిచిన ఒక్క సంఘటనా మెదడులో నిక్షిప్తం కాలేదు. ఆ రెండేళ్లూ ఎలా తుడిచి పెట్టుకుపోయాయో ఇప్పటికీ అర్థం కావట్లేదు. డిగ్రీలో ఈ కోర్స్, ఆ కోర్స్ అనీ చివరికీ దేనిమీదా ఇన్‌ట్రెస్ట్ లేక ఆ సంవత్సరం అంతా వృధా. చివరికి హైద్రాబాద్‌లో 'హోటల్ మేనేజ్‌మెంట్' చేస్తానని ఒప్పించి అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేశాను.

వాడికోసమే కరాటే నేర్చుకున్నాను
మొదట్లో మా కాలేజీ బేగంపేటలో ఉండేది. అందరూ సరదాకోసం ర్యాగింగ్ చేస్తే అమిత్ అనేవాడు మాత్రం వాడి అవసరానికి ర్యాగింగ్ చేసేవాడు. 'జేబులో ఎన్ని పైసలున్నయో తియ్' అంటూ దాదాగిరి చేసేవాడు. తిరగబడదామంటే నాకు శక్తి సరిపోయేది కాదు. వాడి పుణ్యమా అని సిటీబస్‌కు కూడా డబ్బులు లేక బేగంపేట నుండి జూబ్లీహిల్స్‌కి (అమ్మమ్మవాళ్లు అక్కడ ఉండేవాళ్లు) నడిచి వెళ్లేవాడ్ని. కాళ్లు నొప్పెట్టినప్పుడల్లా వాడిమీద కసి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగేది. వాణ్ని తన్నాలంటే నేను దృఢంగా అవ్వాలి అనుకుని, ఉదయం 5 గంటలకే నిద్రలేచి కరాటే క్లాసులకు వెళ్లేవాణ్ణి. సీన్ కట్ చేస్తే ....

సెకండియర్‌కి వచ్చేసరికి పుష్టిగా ఇద్దరు మనుషుల్ని ఒకేసారి కొట్టే బలం, ధైర్యం వచ్చేసింది నాకు. ఒక ఫైన్ ఈవినింగ్ వాడింటికి వెళ్లి బయటకి పిలిచి నన్ను నడిపించిన దృశ్యాలు నెమరేసుకుంటూ చితకబాదుతుంటే లోపల్నుంచి వాళ్ల నాన్న పరిగెత్తుకొచ్చి 'ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడ'ని అరిచాడు. వాడు చేసిన నిర్వాకం చెప్పగానే, కామ్‌గా ఇంట్లోకి వెళ్లిపోయి, 2 రోజుల పాటు వాడిని ఇంట్లోకి రానివ్వలేదట. ఆ తర్వాత నన్ను తన్నించడానికి మనుషుల్ని పెట్టాడని తెలిసింది. అప్పటికే మా కాలేజీ బేగంపేట నుండి కొంపల్లికి మారడంతో నాకోసం రెండ్రోజులు తిరిగి 'నీవిచ్చిన డబ్బులు రెండ్రోజులతో సరి' అని వాడికి చెప్పి వెళ్లిపోయారట. కొసమెరుపు ఏంటంటే ఆ టైంలో నేను కాలేజీకి వెళ్లలేదు.

అమ్మమ్మే నా బెస్ట్ ఫ్రెండ్
మా కాలేజీ పక్కనే ఒక డిగ్రీ కాలేజీ ఉండేది. ఈ రెండు కాలేజీలకు మ««ధ్యలో 'ఇగూ'్ల అనే రెస్టారెంట్. ఖాళీ దొరికితే టీ తాగడానికి అందులోకి వెళ్లేవాళ్లం. అప్పుడే నా కంట్లో పడిందొక నార్త్ ఇండియన్ (మిలట్రీ వాళ్ల) అమ్మాయి. బోయిన్‌పల్లి నుండి వచ్చేది తను. కేవలం ఆ అమ్మాయిని చూడ్డానికే ఇగ్లూకి వెళ్లేవాణ్ణి. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని అమ్మమ్మతో వెళ్లి చెప్పా ఒకసారి. 'వద్దురా, ఉత్తరాది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా ఉంటారు కానీ, పిల్లలు పుట్టగానే అమ్మమ్మల్లా అయిపోతార'ంది. నా మనసు మాత్రం ఊరుకునేది కాదు. అప్పట్లో నేను కాలేజీలో నేర్చిన ఫ్రెంచ్ లాంగ్వేజీని అప్పుడప్పుడు ఇంట్లోనే ట్యూషన్‌గా చెప్పేవాణ్ణి. ఒకరోజు నా క్లాసు వినడానికి తనూ వచ్చింది. అమ్మమ్మకి చూపించి 'చూడు ఎంత అందంగా ఉందో' అన్నాను, అప్పటికైనా మనసు మార్చుకుంటుందేమోనని. 'వయసులో గాడిద పిల్ల కూడా ముద్దుగానే ఉంటుందిరా' అని క్లాసు పీకింది.
మళ్లీ సీన్ కట్ చేస్తే -13 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయి నా ఫేస్‌బుక్‌లో కనిపించింది, అమ్మమ్మ మాటని నిజం చేస్తూ. ఈ విషయం అమ్మకి చెబితే 'అందుకేరా, పెద్దల మాట వినాలి' అని మరోసారి క్లాసు పీకడానికి రెడీ అయ్యింది.

డిగ్రీ అవగానే ఉషాకిరణ్ మూవీస్ పిలుపు - 'శివలీలలు' సీరియల్ కోసం మేకప్ టెస్ట్ చేస్తామంటూ. ముందు మన్మథుడి పాత్రకు పిలిచి, తర్వాత శివుడి మేకప్ వేశారు. చివరికి విష్ణుమూర్తి వేషానికి సెలక్టు చేశారు. అలా శివలీలలతో బుల్లితెరంగేట్రం చేశాను. 'నువ్వేకావాలి' చిత్రం కోసం విజయభాస్కర్‌గారు రెండో హీరో కోసం వెతుకుతుంటే కృష్ణవంశీగారు 'రామకృష్ణగారి అబ్బాయిని ట్రై చేయమ'ని సలహా ఇచ్చారట. అలా మరోసారి ఉషాకిరణ్ మూవీస్‌తోనే సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పట్నించీ జీవితాన్ని నాకు నచ్చినట్టే గడిపాను కాబట్టి రోజులన్నీ నాకు హ్యాపీడేసే. అంతేకాదు, రాబోయి రోజులు కూడా కచ్చితంగా హ్యాపీడేస్ అనే నమ్మకం నాది.

'కిడ్నాప్' నుండి తప్పించుకున్నాను
హైద్రాబాద్‌లో చదివింది 2వ తరగతి వరకే గాని టీచర్లని మూడు చెరువుల నీళ్లు తాగించేవాణ్ణి. చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. హోంవర్కు చేయడమంటే యమ బద్ధకం. పూర్వ జన్మలో డాక్టర్నేమో ... నా రాత అర్థం చేసుకోలేక టీచర్ల బుర్ర గిర్రున తిరిగిపోయేది. అయితే చిత్రలేఖనంలో అందె వేసిన చెయ్యి నాది. పొద్దస్తమానం బొమ్మలు గీస్తూ గడిపేవాణ్ణి. టీచర్ కొట్టబోయినప్పుడల్లా 'మాడమ్ మీ శారీ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు' లాంటి మాటల్ని చెప్పేసి తప్పించుకునే వాణ్ణి. పొగడ్తకంటే తీయనిదేముంది? చుట్టంచూపుగా వచ్చే అమ్మానాన్నల్ని పరాయి వాళ్లలా చూస్తుండడంతో ఇక లాభం లేదని బలవంతంగా చెన్నై తీసుకెళ్లిపోయారు. అమ్మమ్మ నుండి నన్ను విడదీశారని వాళ్లిద్దరిపై మొదట్లో కోపంగా ఉండేది.

స్కూల్‌లో నన్ను దించటానికి, మళ్లీ తీసుకురావడానికి ఒక రిక్షా ఉండేది. ఒకరోజు స్కూల్ వదిలేసి అరగంటైనా రిక్షా రాలేదు. అప్పటికే పిల్లలంతా వెళ్లిపోయారు. ఒక్కడ్నే గేటు బయట అరుగు మీద కూర్చుని రిక్షా కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలో నాకు ఎదురుగా ఒక పొడవాటి కారు ఆగింది. అందులోంచి ఒకడు దిగి, 'ఏం పేరు నీది? చాలా బొద్దుగా ఉన్నావు' అంటూ ప్రేమగా మాట కలిపాడు. బెరుకుగానే సమాధానం చెప్పాను. 'అరే నువ్వు సింగర్ రామకృష్ణ అబ్బాయివా? మీ నాన్న నేను మంచి మిత్రులం తెలుసా?' అంటూ మామిడి ముక్కలు కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంతలో మా రిక్షా అతడు వచ్చాడు. 'నీవు వెళ్లిపో, నేను బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే. వీళ్ల నాన్న నేను ఫ్రెండ్స్' అన్నాడు వాడు. నేను కూడా సరే అనడంతో మా రిక్షా వెనక్కి తిరిగింది.

తర్వాత వాడు జేబులోంచి 'స్ప్రే' తీసి 'ఇది చూడు. ఎంత మంచి వాసన వేస్తుందో' అంటూ నా చేతిలో పెట్టబోయాడు. అంతకు ముందురోజే స్ప్రే కొట్టి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా తిరుగుతోందని, జాగ్రత్తగా ఉండమని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి 'వద్దు' అంటూ భయంగా వెనకడుగు వేశాను. ఇంతలో మా రిక్షా అతను వెనక్కి వచ్చి 'బాబు ఇల్లు ఎక్కడో మీకు తెలుసా?' అని అడిగాడు అతన్ని. 'తెలుసు తెలుసు. నీ వెళ్లు' అంటాడేగానీ అడ్రుసు చెప్పట్లేదు. మా రిక్షా అతడికి డౌటొచ్చి కేకలేయడంతో పలాయనం చిత్తగించాడు వాడు. లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాన్నో?!

మిక్స్చ్‌ర్ పొట్లం


పోయిన చోటే వెతుక్కున్నా!


"లంచం తీసుకుంటుండగా పట్టుబడి, ఉద్యోగం పోగొట్టుకున్నానన్నావు కదరా! మళ్లీ అదే ఉద్యోగం ఎలా సంపాదించావు?'' ఆశ్చర్యంగా అడిగాడు శేషాద్రి. "పై ఆఫీసరుకి లంచం ఇచ్చి'' ఠపీమని చెప్పాడు సింహాద్రి.

ఇన్నాళ్ళకొచ్చింది మరి!
"పదేళ్ల వాడికి ఎల్.కే.జీలో సీటెలా ఇమ్మంటావయ్యా? కుదరదు'' చెప్పాడు ప్రిన్స్‌పాల్. "అడ్మిషను తీసుకోడానికి క్యూలో నిల్చున్నప్పుడు వాడికి ఐదేళ్లే నండి .. '' చెప్పేడు గుర్నాథం.

సోమరి సోంబేరి
అర్ధరాత్రి దొంగలొచ్చిన అలికిడికి మెలకువ వచ్చింది సోంబేరయ్యకి. విలువైన సామాన్లను గోనె సంచెలో వేసుకుంటున్న దొంగల కేసి అర నిమిషం తేరిపార చూసి, "ఇదిగో, మీరు ఏం పట్టుకెళ్తున్నారో లిస్టు రాసి టేబుల్‌మీద పెట్టి మరీ వెళ్లండి. లేదంటే రేపు స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు పోలీసోళ్లకి సమాధానం చెప్పలేక చావాలి'' అని, అటు తిరిగి గుర్రుపెట్టాడు.

అది మాత్రం సాధ్యపడదు
"మా వారికి పిచ్చి కుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి డాక్టర్'' కంగారుగా ఫోన్ చేసింది సుశీల. "గాభరా పడకండి, నేను వచ్చేలోపు మంచం పైన పడుకోబెట్టండి'' చెప్పాడు డాక్టర్. "ఛీ ఛీ, పిచ్చికుక్కని మంచంపైన ఎలా పడుకోబెట్టమంటారండి .. మీకేమైనా పిచ్చా?'' ఠపీమని అనేసి, నాలుక కరుచుకుంది సుశీల.

'విజయం వచ్చేవరకూ తప్పదండి!
"ఏమయ్యా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటావా? నేరం అని తెలీదూ?'' అడిగాడు జడ్జి. "ప్రతి మగవాడి 'విజయం' వెనకా ఒక స్త్రీ ఉంటుందంటారు కదండి. ఒకటీ, రెండులతో విజయం రాలేదండి'' నిజాయితీగా సమాధానమిచ్చాడు ముద్దాయి మన్మథరావు.
బొమ్మలు: ఎన్.రాజశేఖర్‌రెడ్డి

మటన్‌తో మరిన్ని


దాల్చ
కావలసిన పదార్థాలు: సొరకాయ - అరకేజీ, (లేత) మటన్ - అరకేజీ, శనగపప్పు - 1 కప్పు, టమోటా తరుగు - 2 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -6, ఉప్పు - రుచికి తగినంత, కారం, పసుపు - అర టీ స్పూను చొప్పున, నూనె - 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం:శనగపప్పులో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించి, మెదిపి పక్కనుంచాలి. మటన్‌లో తగినంత నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి. సొరకాయ క్యూబ్స్‌గా తరిగిపెట్టుకోవాలి. లోతైన కడాయిలో ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సొరకాయ ముక్కలు, టమోటా తరుగు, ఉప్పు, పసుపు, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు వేగించాలి. ఉడికించిన మటన్, గ్లాసు నీరు కలిపి ఐదు నిమిషాల తర్వాత పప్పు మిశ్రమం, కరివేపాకు వేసి కొద్దిగా చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. పలావు అన్నంతో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది.

లివర్ ఫ్రై
కావలసిన పదార్థాలు: లివర్ (ముక్కలు) - అరకేజీ, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, దనియాల పొడి - 1 టేబుల్ స్పూను, (ఇష్టమైతే) మిరియాల పొడి - అర టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, టమోటా - 1, అల్ల వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క, లవంగాలు - 3, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:నూనెలో దాల్చినచెక్క, లవంగాలు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి వేసి వేగించాలి. తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు కలపాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, దనియాలపొడి, కరివేపాకు, పసుపు వేసి, రెండు నిమిషాల తర్వాత లివర్ ముక్కలు వేసి, పావు కప్పు నీరు పోసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత (నీరు ఆవిరయ్యాక) కొత్తిమీర చల్లి దించేయాలి (ఎక్కువ సేపు ఉడికిస్తే ముక్కలు గట్టి పడిపోతాయి). పరాటాలతో పాటు, అన్నంతో నంజుకోడానికి కూడా బాగుండే ఫ్రై.

తలకాయ కూర
కావలసిన పదార్థాలు: తలకాయ మాంసం - పావుకేజీ, ఉల్లిపాయలు - 3 (ఒకటి పేస్టు చేయాలి, రెండు తరగాలి), టమోటాలు (తరుగు) - 2, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, గరం మసాల పొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: తలకాయ మాంసంలో పసుపు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో తగినంత నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేగాక ఉల్లి పేస్టు, టమోటా తరుగు వేసి మరో రెండు నిమిషాలు వేగించి, గరం మసాల పొడి కలపాలి. ఇప్పుడు ఉడికించిన మాంసం (కుక్కర్లో మిగిలిన నీరుతో పాటు) కలిపి చిక్కబడేవరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర అన్నంలోకి, పరాటాలలోకి కూడా బాగుంటుంది.

పీరియడ్స్ లో పొట్ట నొప్పిని పోగొట్టే అద్భుతమైన చిట్కాలు...!

అడవాళ్లను ముఖ్యంగా వేధించే సమస్య పిరియడ్‌ ప్రాబ్లమ్‌... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా అవస్థపడతారు.. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి.
కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది.ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగావుంది అని గ్రహించాలి. వెంటనే తగు చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.
మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే...కొన్ని చిట్కాలు చూడండి.
ఈ అంశంపై విదేశాల్లో సైతం పరిశొధనలు జరిగాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో నెలసరి నొప్పిని తట్టుకోవడానికి, బాధ నుంచి ఉపశ మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే పొందవచ్చు అన్న విషయం స్పష్టమైంది. నొప్పిని ఎదుర్కోవడానికి మహిళలు ఉపయోగిస్తున్న చిట్కాలు వారికి త్వరగా ఉపశమనం కలిగిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం...


హెర్బల్‌ టీ: టీ పోడితో కాకుండా ఆకులతో చేసిన టీ తాగితే నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.



వేడి నీళ్ల స్నానం: వేడి నీళ్లతో స్నానం చేయడంవల్ల వెన్ను నొప్పి, ఒంటి నొప్పులను ఎదుర్కొనవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవ్వటానికి ఏదైన మంచి చిత్రం చూడటం లేదా ఏదైనా చిక్సిత తీసుకుంటేనొప్పి నుంచి కొంత రిలాక్స్‌నెస్‌ పొందవచ్చు.



మసాజ్‌: వెన్ను మర్దన వల్ల వెన్ను, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతుంది.



వేడి నీళ్ల కాపడం: వేడి నీళ్లు ఒక సంచిలో పోసి దానితో వెన్ను, కడుపు చుట్టూ పెట్టడంవల్ల నొప్పి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది.


చాక్లెట్‌: చాక్లెట్‌ బార్‌ తినడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.



వ్యాయామం: కొన్ని యోగా భంగిమలు కమలాసనం, సీతాకోకచిలుక ఆసనం వంటివి పీరియడ్‌వల్ల కలిగేనొప్పిని, అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.

కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...!

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు.


గుండె ఆరోగ్యానికి: గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి ఇందులోని పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. రక్తపోటును నివారించే సామర్థ్యంకూడా దీనికి ఉందట. ఆల్కహాల్ లేదా ఇతర మత్తుపదార్ధాల ప్రభావం నుండి బయటపడాలంటే ఖర్జూరాలు మంచి ఔషధం. గింజతీసివేసి ఈ రసం ప్రతిరోజూ రెండు పూటలా తాగితే గుండె జబ్బులు రాకుండా కూడా చేస్తుంది.



మలబద్దకం: మలబద్దకాన్ని నివారించడానికి ఖర్జూరం ఒక దివ్వఔషదం. మలబధ్దకంతో బాధపడే వారు ఈ కర్జూరం పండ్లును రాత్రంతా నానబెట్టి, ఆ నీటితోఉదయం పరగడున తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కర్ఝూరంలో ప్రోటీనులు, ఫైబర్ మరియు అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కర్జూరం నుండి మలబద్దకం సమస్య అధిగమించేందుకు బాగా సహాయపడుతుంది.



రేచీకటి: కర్జూరంలో అధికంగా విటమిన్ ఎ తో పాటు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి కర్జూరం నుండి ఎ విటమిన్ తీసుకోవడం చాలా అవసరం.



గర్భిణీకి: గర్భిణీలకు ఫోలిక్‌యాసిడ్‌ చాలా అవసరం. అది ఇందులో మెండుగా ఉంది. కాబట్టి గర్భణీ స్త్రీలు కర్జూరం ను తరచూ తీసుకొంటుండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఖర్జూరాలు తింటే ఐరన్‌ బాగా దొరుకుతుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరాల్లో 7.3 మిగ్రా ఐరన్‌ ఉంది. ఇంకా హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు కూడా కర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కర్జూరం పండులో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, మరియు సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఈ కనిజలవణాలు, గర్భంలోని పిండి పెరుగుదలకు చాలా అవసరం.


బోలు ఎముకల వ్యాధి నిరోధానికి: ఈ రోజుల్లో అనేక మంది కీళ్ళ నొప్పితో మరియు బోలు ఎముకల వ్యాధి బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం స్థాయిలు అతితక్కువగా ఉండటం చేత ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి కర్జూరంలో క్యాల్షియం అధిక శాతంలో కలిగి ఉండటం చేత వీటిని తరచూ తినడం వల్ల కీళ్ళ నొప్పి చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూర పండు తరచుగా ఎక్కువగా తినాలి.



పెద్ద ప్రేగు రుగ్మతలు: జీర్ణశక్తిని మెరుగుపర్చేశక్తి ఖర్జూరాల్లోని ఫైబర్‌కు వుందనేది వైద్య పరిశోధనల్లో తేలింది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.



దంత క్షయం: చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. చాలా మంది దంత క్షయంతో బాధ పడుతుంటారు. కర్జూరం తినడం వల్ల దంత క్షయాన్ని మరియు డెంటల్ ప్లాక్ నిరోధించవచ్చు. ఈ పండులో ఫ్లోరిన్ అధికంగా ఉండటం వల్ల, మినరల్స్ పుష్కలంగా ఉండటం చేత ఆరోగ్యకరమైన దంత నిర్వాహనకు చాలా అవసరం.

పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. ఇవి రెండూ ఒకే జాతికి చెందినా ఖర్జూరంలో కండ ఎక్కువగా ఉంటుంది. సామాన్యంగా దొరికే పండులోనూ అదే రుచి ఉంటుంది. కాకుంటే, ఖరీదు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు మరింత మృదువుగా, అప్పుడే చెట్టునుండి తెంపినట్లుగా, కమ్మగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కావడంతో ఖర్జూరాలు అందరూ ఇష్టపడతారు.
నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం.

ఈ చలికాలంలో మీ కురులను కాపాడే 5 హెయిర్ ప్యాక్స్

చలికాలంలో చాలా మందికి ఏదో ఒకటి ఇష్టంగా ఫీలవుతారు. చల్లని ఉష్ణోగ్రత లేదా చలికాలంలో వచ్చే వెచ్చని సూర్య కిరణాలంటే చాలా మంది ఇష్టం. అయితే ఇష్టం లేనివి కూడా ఉన్నాయి. చలిగాలికి చర్మం, పగుళ్ళు, జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు.
homemade hair packs winter

ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. జుట్ట రాలడానికి, చిట్లడాన్ని నివారించడంతో పాటు జుట్టు మెరుస్తూ, దట్టంగా పెరగాలంటే అందుకు శీతాకాలంలో ఇంట్లోనే కొన్ని హెయిర్ ప్యాక్స్ ను ప్రయత్నించవచ్చు. మనకు ఇష్టం లేనివి కెమికల్ హెయిర్ ప్యాక్స్ మార్కెట్లో బోలెడెన్ని దొరుకుతున్నాయి. వాటిని ఉపయగించడం కంటే ఇంట్లో తయారు చేసుకొని హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం చాలా సులభం మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు...
పొడి మరియు చిట్లిన(చిక్కుబడిన) జుట్టు: బాగా పొడిబారిన జుట్టుకోసం బనానా హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. బనానాలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి తలలో చర్మానికి మొదళ్ళకు పట్టే విధంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు సున్నితంగా, మంచి షైనింగ్ తో మొరుస్తుంటాయి.
డ్యామేజ్డ్ హెయిర్: జుట్టు మధ్యలోని తెగిపోవడం ఈ సీజన్ లో సహజం. అందుకోసం రెండు గుడ్లను పగులగొట్టి అందలోని పచ్చ సొన మరియు ఒక ఎగ్ వైట్ కలిపి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మరో గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని తలకు పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
స్టాటిక్ హెయిర్: స్టాటిక్ హెయిర్ కోసం చాలా సింపుల్ మార్గం ఉంది. ఈ సీజన్ లో జుట్టు పోషణకు మెంతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే వ్యత్యాసం మీకే తెలుస్తుంది.
నిర్జీవమైన కురుల కోసం: ఒక కప్పులో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో వెనిగర్, తెనె రెండూ సమపాళ్ళలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడవం వల్ల కురులకు అధిక శక్తినందిస్తుంది. కురుల పెరుగుదలకు ఉపయోగపడే శక్తినిస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను వెంటవెంటనే ఉపయోగించకూడదు. వెనిగర్ ఎక్కువ సేపు తలలో ఇంకడం వల్ల కురులకు చెడు ప్రభావం కలిగిస్తుంది.
హెయిర్ బ్రేకేజ్: ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాలా తేనె, రెండు చెంచాలా క్యాస్ట్రో ఆయిల్. ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల ఈ వింటర్ సీజన్ లో హెయిర్ బ్రేకేజ్ కాకుండా అరికడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి వింటర్ లో కురులను సంరక్షించుకోండి..

సహజమైన పుదినా మసాజ్ ఆయిల్ ని తయారు చెయ్యడం ఎలా?

మర్దనా లేక మసాజ్ ద్వారా శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఎంతో శక్తిని, ఉత్తేజాన్నితిరిగి మన శరీరం పొందుతుంది. అటువంటి శక్తి ఉన్న మర్దనాకి వాడే నూనె ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మన అవసరాలకి తగినట్టుగా కొన్ని సుగంధతైలాలని చేర్చడం ద్వారా వాటిలో ఉండే ఔషద గుణాలని మనం పొందవచ్చు. అంతే కాకుండా, మనం ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవడం వల్ల మర్దనా కి వాడే పదార్ధాలు తాజాగా, పరిశుభ్రంగా ఉంటాయి.
how make natural mint massage oil

ఈ వ్యాసంలో మీరు పుదినా లేదా పుదినా రకానికి చెందినా మూళిక (Mentha piperita) యొక్క మర్దనా నూనె ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుంటారు. పుదినా నూనెకి ఏకాగ్రతని, జీర్ణవ్యవస్థని పెంపొందించే గుణం ఉంది. కండరాల నొప్పులు, పాదాల నొప్పులు, తల నొప్పి, అజీర్ణం మరియు అపానవాయు సమస్యలు, కడుపు నొప్పి, వికారం, సైనసైటస్, ప్రయాణంలో కదలిక వలిగే అస్వస్థత లు మరియు మాములు జలుబుకు పుదినాలో ఉండే శీతలీకరణ గుణం మరియు ఉత్తేజ పరిచే గుణం వల్ల ఏంతో ఉపశమనం కలుగుతుంది.
తయారు చేసే పద్దతి:
1. పది టేబుల్ స్పూన్ల ద్రాక్ష విత్తనాల నూనె ని ఒక గిన్నెలో కి తీసుకోండి. ద్రాక్ష విత్తనాల నూనె సులభంగా మనకి అందుబాటులో ఉండటమే కాకుండా ఎటువంటి వాసనా కలిగి ఉండకపోవడం ఈ నూనెని మనం ఎంచుకోవడానికి కారణం.
2. నాలుగు చుక్కలు రోజ్ మేరీ నూనె, మూడు చుక్కలు యూకొలిప్టస్ నూనె, రెండు చుక్కలు పుదినా నూనె కలపడానికి ముఖ్యమైన నూనెలు. యూకొలిప్టస్ మరియు పుదినా నుండి వచ్చే సువాసనలకి జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడం మరియు సాధారణ జలుబు ద్వారా కలిగే ముక్కు దిబ్బడకి ఉపశమనం కలిగించే గుణాలు ఉన్నాయి. ఉదయం పూట మర్ధనాకి ఈ మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది. చర్మంలోని నిగారింపు పెంచడానికి, మనస్సుని ఉత్తేజపరచడానికి, కండరాల మర్ధనాకి ఏంతో సహాయపడుతుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షించే గుణం పుదినాకి ఉంది.
3. ద్రాక్ష విత్తనాల నూనె కి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తయారైన పుదినా మర్దనా నూనె ని ఒక ముదురు రంగు గాజు సీసాలో పోయండి. నూనె త్వరగా ఆక్సీకరణ చెందకుండా ఉండేందుకు ముదురు రంగు గాజు సీసా ఉపయోగపడుతుంది.
4. అవసరమైన చోట మర్దనా కి ఈ నూనెని వాడండి.
5. పిల్లల నుంచి దూరంగా ఈ నూనె ని భద్రపరచండి. వెలుతురు లేని ప్రదేశంలో, చల్లగా ఉండే చోట ఈ నూనె ని భద్రపరచండి.
6. మీరు ఈ నూనెని నాలుగైదు సార్లు ఉపయోగించవచ్చు. వృధా చెయ్యకుండా మీరు దీనిని మొదటిసారే ఎంతైనా మర్ధనాకి వాడుకోవచ్చు.
7. విశ్రాంతి పొందడానికి మర్దనా ని ఏంతో మంది కోరుకుంటారు. అంతే కాదు మర్దనా ద్వారా ఆనందం కూడా పొందుతారు. ఎంతో సులభమైన పద్దతిలో తయారుచేసుకోబడిన ఈ నూనె ని మర్ధనాకి ఉపయోగించి ఆనందంతో పాటు ఆరోగ్యం కుడా పొందండి.

ఆంధ్రా స్టైల్ స్పైసీ ఖీమా ఫ్రై - సండే స్పెషల్

ఖీమా ఫ్రై, డ్రై సైడ్ డిష్. వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా తయారు చేస్తారు. కాబట్టి ఆంధ్రా స్టైల్లో ఖీమా ఫ్రై ఎలా తయారు చేస్తారో ఇక్కడ ఇస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రాస్టైల్ వంటలకు కొంచెం ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కారంగా ఉంటాయి. ఎక్కువ మసాలాలు దట్టించడంతో ఆ స్పైసీ రుచులు అద్భుతమైన టేస్ట్ తో, ఘుభాళిస్తుంటాయి. ఈ ఖీమా ఫ్రై ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మెంతి ఆకులను చేర్చడంతో మరో అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ ఖీమా ఫ్రైను ఎలా తయారు చేయాలో చూద్దాం....
andhra style kheema fry sunday special

కావల్సిన పదార్థాలు:
మృదువైన గొర్రె మాంసం లేదా ఖీమా: 500gms
పసుపు: 1tsp
కరివేపాకు ఆకులు: 10
ఉల్లిపాయ: 1(chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి: 4 (chopped)
టమోటో: 1 (chopped)
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: 1/2tsp
మెంతులు కొన్ని లేదా మెంతి ఆకులు: 1cup (without stems)
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2sprigs (chopped)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఖీమాను శుభ్రం చేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక కప్పు నీళ్ళు వేసి కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి తక్కువ మంట మీద రెండు మూడు నిముషాలు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో ఐదు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు టమోటో ముక్కలను, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి బాగా కలుపుతూ ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఈ వేపుడు అంతా బాగా వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న ఖీమాను పోయాలి.
5. వేపుడులో నీరంతా ఇమిరి పోయి, పొడిపొడిగా తయారయ్యేంత వరకూ వేయించాలి.
6. ఇప్పుడు అందులోనే మెంతి ఆకులు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మరో పది నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆంధ్రా స్టైల్ ఖీమా ఫ్రై రెడీ దీనికి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. దీన్ని రోటీ లేదా సాంబార్ రైస్ సైడ్ డిష్ గా తినవచ్చు.

స్పైసీ చికెన్ తంగ్డి కబాబ్

చికెన్ మాసాంహార రుచిల్లో చాలా పాపులర్. చికెన్ తో చేసే ఏ వంటైనా సరే నోరూరించాల్సిందే. గ్రేవీ, కర్రీ, ఫ్రై, కబాబ్స్ ఇలా... కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లో చేయడం తక్కువే. తంగ్డి చికెన్ కబాబ్ చూడటానికి జ్యూసీగా ప్లేట్ మీల్ లా ఉంటుంది. దీన్ని చూడగానే ఎవ్వరికైనా సరే నోట్లో నీరూరాల్సింది. ఫ్యామిలీ మెంబర్స్ ను, ఫ్రెండ్స్ ను టెంప్ట్ చేసే ఈ చికెన్ తంగ్డి కాబాబ్ మైక్రోవేవ్ తో పాటు వచ్చిన బుక్ లో రెసిపీ చూసి చేసిన ఈ చికెన్ కబాబ్ చాలా బాగా కుదిరింది. మారినేషన్ తయారు చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం...
delicious tangri chicken kebab

కావలసిన పదార్థాలు:
చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌(తొడలు): 8
అల్లంతురుము: 4tsp
వెల్లుల్లితురుము: 6tsp
పండుమిర్చిపేస్ట్: 2tsp
కారం: 2tsp
కొత్తిమీర తురుము: 4tsp
మిరియాలపొడి: 1tsp
గరంమసాలాపొడి: 2tsp
పసుపు: 1/2tsp
నీళ్లు లేకుండా పొడివస్త్రంలో వడకట్టిన పెరుగు: 4tsp
మొక్కజొన్నపిండి: 4tsp
శెనగపిండి: 100grms
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. చికెన్‌ తొడలకు పదునైన కత్తితో గాట్లు పెట్టుకోవాలి.
2. తరవాత అల్లం, వెల్లుల్లి పట్టించాలి.
3. ఓ చిన్న పాత్రలో మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని డ్రమ్‌ స్టిక్స్‌ కు దట్టంగా పట్టించి ఓ గంటసేపు అలా ఉంచాలి.
4. తర్వాత ఒక పాన్ లో నూనె పోసి, కాగాక చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ ను బాగా వేయించి తీయాలి.
5. చివరగా ఉల్లిముక్కలు, నిమ్మముక్కలతో గార్నిష్ చేస్ సర్వ్ చేయాలి అంతే...

పిల్లలకు ఇష్టమైన ఆనియన్ చిల్లీ దోసె

మీ పిల్లలు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మారాం చేస్తున్నారా?అయితే ‘మమ్మీస్ క్లబ్ లో జాయిన్ అయిపోండి'. బ్రేక్ ఫాస్ట్ అనేది పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే రోజంగా హుషారుగా ఉండాలంటే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. కాబట్టి వారు బ్రేక్ ఫాస్ట్ తినకుండా తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవారిదే. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినడానికి మంచి బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారా..?చిల్లీ దోసె పిల్లలకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ముఖ్యంగా ఇందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేయడం వల్ల దీన్ని చిల్లీ దోసె అంటాం. ఈ బ్రేక్ ఫాస్ట్ ను పిల్లలకు ఇష్టమైన చట్నీతో అందించండి...
chilli dosa recipe kids

దోసె పిండి: 2 cups(100 grams)
ఉల్లిపాయ: 1(chopped)
క్యాప్సికమ్: 1 (chopped finely)
టమోటో: 1 (chopped finely)
పచ్చిమిర్చి: 2 (chopped finely)
కొత్తిమీర తరుగు: 2 sprigs (chopped)
సోయా సాస్: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా తయారు చేసుకొన్న దోసె పిండిలో లేదా మిగిలిన దోసె పిండిలో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత దోసె పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో చేతి నిండుగా ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిముషాలు వేయించాలి.
3. అందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి.
4. దాని తర్వాత కట్ చేసిని టమోటో ముక్కలను, సోయా సాస్ ను కూడా వేసి ఒక నిముషం తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో కలిపి పెట్టుకొన్న దోసె పిండిని దోసెలా పాన్ మొత్తం పోయాలి.
5. దోసె పిండి మీద మరికొంత ఆయిల్ వేయడం వల్ల కరకరలాడుతూ దోసె బ్రౌన్ కలర్ లో కాలుతుంది. మీడియం మంట మీదు మూడు నాలుగు నిముషాలు ఫ్రైచేసి తర్వాత తీసేయాలి. దీన్ని ఏదైనా చట్నీతో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా అందించడం వల్ల చాలా ఇష్టంగా తింటారు.