all

Sunday, December 9, 2012

మానసవీణమధుగీతం-బెటర్‌హాఫ్

 
 
డెరైక్టర్ అంటే...
వైట్ అండ్ వైట్... అట్టహాసం... 555 ప్యాక్...
ఖరీదైన కారు ్ల... ఎక్కే విమానం దిగే విమానం
లోన ఈగల మోత ఉన్నా, బయట పల్లకీ మోతే! అంతా షో బిజినెస్!
కానీ సింగీతం... సూపర్ హిట్ డెరైక్టరయినా, సింప్లిసిటీని వదల్లేదు!
ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి... జీవితం సరళంగా ఉండాలి అంటారాయన.
ఆయన శ్రీమతి కూడా అంతే! సింపుల్‌గా జీవిస్తే సంసారంలో కలతలు కూడా సింప్లిఫై అయిపోతాయని చెబుతున్న ఈ దంపతుల దాంపత్యసారాన్ని తెలుసుకుంటే ప్రతిసంసారం సంతోషమే...
మానసవీణ మధుగీతమే!


సింగీతం దంపతులు వయసు ఎనిమిది పదులకు చేరుకుంటోంది. వారి వివాహ వయసు ఐదు పదులు దాటింది. తెలుగింటి దంపతులైన వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. వీరిని కలిసి దాంపత్యజీవితం విజయవంతం కావాలంటే ఏంచేయాలో తెలపమని కోరితే... పెద్ద హంగామా ఏమీ లేకుండానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు.

సినిమానా...! ప్రభత్వ ఉద్యోగమా...!

‘ఆయ్యోరామ... సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తి ఎందుకే..! ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమున్న అబ్బాయిని పెళ్లిచేసుకొని హాయిగా ఉండక... అంటూ హితవు పలికారు మా వైపు పెద్దలు’ అన్నారు లక్ష్మీకల్యాణి తమ పెళ్లి ముచ్చటను ప్రారంభిస్తూ. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. మధ్యతరగతి జీవనం. ఆ రోజుల్లోనే తండ్రి ఆమెను బీఏ వరకు చదివించారు.

‘అమ్మాయి తరపువారు ఇలా భావించడంలో తప్పులేదు. ప్రభుత్వ ఉద్యోగమంటే జీవితం సేఫ్ అనే భావన ఉంటుంది కదా! నేనేమో పోస్టల్ డిపార్టుమెంటులో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాను’ అని ఒప్పుకున్న సింగీతం స్వస్థలం నెల్లూరు జిల్లా.

... ‘ఆ సమయంలో మా అత్తమామలు- కట్నకానుకలు తీసుకోవడం, ఇవ్వడం మాకు అలవాటు లేదు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చితే చాలు - అన్నారు. ఆ మాటలతో వారి కుటుంబం మీద నాకు ఎనలేనంత గౌరవం ఏర్పడింది’ కొనసాగింపుగా అన్నారు లక్ష్మీ కళ్యాణి.

అందరి అంగీకారంతో 1960లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బాజాబజంత్రీలు మోగాయంటూ అలనాటి ఆనందాలను పంచుకునేందుకు పోటీపడ్డారీ దంపతులు.

ఆమె చెప్పినట్టే జరిగింది!

‘పెళ్లయ్యేనాటికి నెలకు రూ. 200ల జీతం. విజయావాహినీ, జయంతి సంస్థల్లో పనిచేస్తుండేవాణ్ణి. చెన్నైలో చిన్న అద్దెగది. టీ నగర్ బస్టాండు సమీపంలోని ఆ అద్దెగదికి ముందు కొట్టం, దానిలో ఇంటి యజమానుల పశువులూ ఉండేవీ. ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఈవిడను కాపురానికి తీసుకెళ్లాను. నా మనస్సులోని భావనను గ్రహించిందో ఏమో, ‘మీరేం ఫీల్ కాకండి, పశువులు ఇంటి వద్ద ఉంటే శుభం’ అంటూ ఆనందంగా ఆ గదిలో అడుగుపెట్టింది. ఆమె చెప్పినట్లే జరిగింది, ఆ ఇంటి నుండే నేను అంచలంచెలుగా ఎదిగాను’ అన్నారు శ్రీనివాసరావు. శ్రీవారు ఉన్నచోటే అద్దాలమేడగా భావించే శ్రీమతి చెంత ఉంటే, నింగికి నిచ్చెనలు వేయచ్చు అనే భావన వారి మాటల్లో స్పష్టమైంది.

స్క్రిప్టుల్లోనూ ఒకే నిర్ణయం...

వృత్తిపరమైన పనుల్లో భార్య జోక్యం చేసుకోవడం చాలామంది భర్తలకు నచ్చదు. ‘నీకేం పని ఇక్కడ’ అని కసురుకుంటారు కూడా. ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ... భార్యకు వృత్తిపరమైన పనుల్లోనూ అవకాశాన్ని కల్పిస్తే ఆ భర్త ఎన్నో విజయాలను చవిచూడవచ్చు అని చెప్పారు సింగీతం. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ రిలీజై, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ స్టోరీ డిస్కషన్ జరుగుతున్న రోజులవి. ‘పురాణాలు, చరిత్ర అధ్యయనం కోసం కన్నెమెరా, యూనివర్సిటీ లైబ్రరీలకు కలిసి వెళ్లేవారం. ఆ రోజుల్లో ఆటోలు లేవు, కారులో వెళ్లే స్థోమత లేదు. అందుకే సిటీ బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. లైబ్రరీల్లో గుర్తించిన విషయాలను ఇద్దరం చర్చించుకుని, ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత స్క్రిప్టు సిద్ధం చేసేవారం’ అని చెబుతున్న కళ్యాణి గొంతులో భర్తకు సమవుజ్జీగా నిలబడిన జ్ఞాపకాల తరంగాలు దొంతర్లుగా వినిపించాయి.

శ్రీమతి చేతుల్లో ‘సిరి’సేఫ్...

ఈ రోజుల్లో అయితే ‘నీ డబ్బు, నా డబ్బు’ అంటూ ఎవరి ఖర్చులు వారు చూసుకుంటున్నారు. ఎవరి బ్యాంకు బ్యాలెన్స్‌లు వారు చూసుకునే తత్వం వచ్చేసింది. ఈ పద్ధతి దాంపత్య జీవనానికి గొడ్డలిపెట్టుగా మారుతోంది అంటారు ఈ దంపతులు. ‘పెళ్లైన మొదట్లో సంపాదించిన రు.200ల నుండి ఈరోజు వరకు నేను ఆర్జించే మొత్తాన్నంతా కల్యాణి చేతులోనే పెట్టడం అలవాటు నాకు. నేను డబ్బిచ్చినా, చెక్కిచ్చినా ముందు దేవుడి వద్ద పెడుతుంది, ఆ తరువాతే బీరువాలోకి చేరుతుంది’ అని శ్రీనివాసరావు చెబుతుంటే ‘ఈయన పాకెట్‌మనీ కావాలన్నా నన్నే అడుగుతారు’ అన్నారు లక్ష్మీకల్యాణి గుంభనగా నవ్వేస్తూ.

కష్టమైనా... సుఖమైనా...

కష్టసుఖాల్లో ఒకరికి ఒకరం ఉన్నామనే భరోసానే దాంపత్యజీవితాన్ని ఆనందం మయం చేస్తుంది. అవి ఈ దంపతుల జీవితంలో నిండుగా ఉన్నాయి కాబట్టే వారి కాపురం మెండుగా నిలబడింది. మచ్చుకు ఒకటి - ‘విజయావారి ఉమాచండీగౌరీశంకరుల కథ, జయంతి పిక్చర్స్ భాగ్యచక్రం రెండూ ఫెయిలయ్యాయి. నిర్మాతలు నష్టపోయారు. దీంతో జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. నేను ఆధారపడే రెండు సంస్థలు ఒకేసారి చేతులెత్తేయడంతో కుటుంబ పోషణ కష్టమైంది’ అని శ్రీనివాసరావు చెబుతుంటే.. ‘ఒడిలో చిన్న పిల్ల. దాని అవసరాలకైనా సంపాదించాలని దగ్గరలోని ఒక స్కూల్లో పాపను చేర్పించి అక్కడే టీచర్‌గా చేరాను. స్కూలు నుండి ఇంటికి వచ్చిన తరువాత స్క్రిప్టుల రూపకల్పనలో సహకరించేదానిని. ’ అని భార్య గుర్తు చేసుకుంటుంటే ... ‘బొమ్మలు గీయడంలో ప్రవేశం ఉండటంతో పండుగలు, కొత్తసంవత్సరం గ్రీటింగు కార్డులను తయారుచేసి, అంగళ్లకు తీసుకెళ్లి అమ్మేవాడిని. నిర్మాతల దగ్గర స్క్రిప్టులు ఫెయిర్ చేసి కొంత సంపాదించేవాడిని. అలా ఇంటిని చక్కదిద్దుకునేవాళ్లం’ అని చెప్పారు శ్రీనివాసరావు.

భావాలలోనూ సర్దుబాటు

‘ఈవిడకు భక్తి ఎక్కువ. ఆమె తృప్తి కోసం దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టిన నేనూ భక్తునిగా మారిపోయాను.’ అని శ్రీమతి తనలో తెచ్చిన మార్పులను చెబుతుంటే... కల్యాణి అందుకున్నారు -‘ప్రతి చిన్నదానికి టెన్షన్ పడేదాన్ని. కోపం కూడా త్వరగా వచ్చేసేది. ఆ ప్రతాపాన్ని వంటగిన్నెలపై చూపించేదాన్ని. ఈయన సాహచర్యంలో కోపాన్ని అదుపుచేసుకోగలిగాను. అయితే టెన్షన్ మాత్రం ఇప్పటికీ వదల్లేదు. టెన్షన్ పడే సందర్భాలలో ఈయన జోక్‌లు వేసి, నవ్విస్తారు. ఈయనలో మరో గొప్ప విషయం ఏంటంటే వంట ఎలా ఉన్నా తినేస్తారు. కనీసం ఉప్పు లేకున్నా ఇదేమని అడగరు’ అంటూ తమ కాపురంలోని అసలు కిటుకు చెప్పేశానా అన్నట్టు పెద్దగా నవ్వేశారు. ఆమె నవ్వులకు శ్రీనివాసరావు నవ్వులు జతకలిశాయి.

ఇద్దరు ఆడపిల్లల పెంపకంలో ఒకే తరహా నియమావళిని అవలంబించామని తెలిపిన ఈ దంపతులు వారి వివాహ విషయంలోనూ అదే సూత్రాన్ని పాటించామని చెప్పారు. ఎంతో సుదీర్ఘజీవితాన్ని, ఒడిదొడుకులను దాటుకొచ్చిన వీరి దాంపత్య విశేషాలు తెలుసుకున్నాక స్నేహపరిమళాలు వీరి వైవాహిక జీవితాన్ని సుసంపన్నం చేశాయని అనిపించింది.
 

No comments: