all

Sunday, December 9, 2012

డాక్టర్‌ని అడగండి - ఆయుర్వేదం

 
నా వయసు 47. శరీరంలో చాలా చోట్ల పులిపిర్లు మొలిచాయి. ఇవి తగ్గటానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు.
- రామోజీ, కాళహస్తి


ఆయుర్వేద పరిభాషలో వీటిని ‘చర్మకీల’ అంటారు. కలబందఆకుని కావలసిన పరిమాణంలో ముక్కలుగా కోసి పులిపిరులపై ఉంచి కట్టుకట్టాలి లేదా చింతాకు రసం, కొంచెం సైంధవలవణం కలిపి ముద్దగా నూరి లేపనంగా వాడుకోవచ్చు. ఇలా చేస్తే 5 రోజులలో అవి రాలిపోయి నున్నటి చర్మం వస్తుందని శాస్త్రోక్తం. శారిబాద్యాసవ ద్రావకం 4 చెంచాలు తీసుకుని సమానంగా నీళ్లు కలిపి రోజూ రెండుపూటలా ఒక నెలరోజులు తాగాలి.

నా వయసు 22. గత ఆరు నెలలుగా నా శిరోజాలు రాలిపోతున్నాయి. అందువల్ల జుత్తు పల్చబడిపోతోంది. మంచి మందులు, సలహాలు సూచించ ప్రార్థన.
- మంజుల, చేవెళ్ల


విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజధాతువులతో కూడిన పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడం మొదలైనవి జుత్తు రాలిపోవటానికి ముఖ్య కారణాలు. కారణాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు నెలలపాటు ఈ సలహాలు పాటించండి. ఫలితం కనపడుతుంది.

ఆకుకూరలు, మునగ, క్యారట్, బీట్‌రూట్, చేపలు, మాంసరసం, కోడిగుడ్లు తీసుకోండి. ముడిబియ్యం మంచిది. తాజా బొప్పాయి, అరటి, సీతాఫలాల వంటి పళ్లు, జీడిపప్పు, బాదం వంటి శుష్కఫలాలు సేవించాలి. ఆరేడుగంటలపాటు రాత్రి నిద్రపోవాలి. రోజూ కనీసం ఐదులీటర్ల నీరు తాగాలి. వ్యాయామం, ప్రాణాయామం తప్పనిసరిగా ఆచరించండి. రోజూ ఒక లీటరు ఆవుపాలు తాగండి. షాంపూలకు బదులు కుంకుడుకాయ, షీకాకాయ పొడులతోటే స్నానం చేయండి. మీకు ఎలర్జీ కలిగించే మందులను వాడవద్దు. నీలిభృంగాది తైలాన్ని రోజూ తలనూనెగా వాడండి. కొంతకాలం తర్వాత స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడుకోవచ్చు. పునర్నవాది మండూర మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. భృంగరాజాసవ ద్రావకం నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. గురివింద గింజల చూర్ణాన్ని ముద్దగా చేసి తలపై రాసుకుని, ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే జుత్తు రాలటం త్వరగా తగ్గుతుంది.

No comments: