all

Sunday, December 9, 2012

మాటతోనే ప్రపంచాన్ని జయించవచ్చు

 
 
కబంధుని సూచనమేరకు రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళి, ఆమె ఆతిథ్యం స్వీకరించి, ఆమెకు పుణ్యలోకాలు ప్రసాదించి, అలా నడచుకుంటూ కిష్కింధకు చేరుకున్నారు. అక్కడ వాలికి భయపడి ఋష్యమూక పర్వతంమీద తలదాచుకున్న సుగ్రీవుడు దూరాన్నుండే రామలక్ష్మణులను చూచాడు. వాలి పంపున వస్తున్న శత్రువులనుకుని భయపడిపోయాడు. వెంటనే ఆ సంగతి తన మంత్రియైన హనుమంతునికి చెప్పాడు. హనుమంతుడు సుగ్రీవుని భయపడవద్దని ధైర్యం చెప్పాడు. వారెవరో చూసి వస్తానని బయలుదేరాడు. వానర రూపాన్ని విడిచిపెట్టి, భిక్షుకరూపాన్ని ధరించాడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరాడు. ఇద్దరికీ నమస్కరించాడు. ‘మీరెవరు? రాజర్షులలాగా, దేవతలలాగా కనబడుతున్నారు. నియమవంతులైన మునీశ్వరులలాగ కనబడుతున్నారు.

మిమ్మల్ని చూసి, ఇక్కడి ఆటవికులకూ, మృగాలకూ కూడా భయం కలుగుతోంది. నారచీరలు కట్టారు. కాని విల్లమ్ములు ధరించారు. ఇక్కడ సుగ్రీవుడనే వానరప్రభువు ఉన్నాడు. అతడెంతో ధర్మాత్ముడు. మహావీరుడు. కాని అంతకంటె బలవంతుడైన అతని అన్న వాలి అధర్మంగా తరిమిగొట్టడంతో ఋష్యమూక పర్వతంపై తలదాచుకుని దిగులుగా ఉన్నాడు. అతడు పంపగా నేను వచ్చాను. మా రాజు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. నేను వారి మంత్రిని. నా పేరు హనుమంతుడు. చాలా విషయాలు అడిగాను, చెప్పాను. మరి మీరు మాట్లాడరేం?’ అని అడిగి మౌనం వహించాడు ఆంజనేయుడు.

రామునికి హనుమంతునికీ ఇదే మొదటి సమాగమం. ఇంతవరకూ హనుమంతుని ప్రస్తావన లేదు. బంగారు జింకను కోరుకున్న సీత తన భర్తకు దూరమై దూరంగా లంకలో బంధింపబడింది. సీత రామునికోసం ఎదురు చూస్తోంది. రాముడు సీతకోసం వెదుకుతున్నాడు. వారిద్దరినీ కలిపేందుకు హనుమ రంగ ప్రవేశం చేసాడు. రామాయణంలో గురువుకు ప్రతిరూపమే హనుమంతుడు. అందుకనే తనను తాను రాముని దాసునిగా ప్రకటించుకున్నా లోకమంతా హనుమంతునికి గుడి కట్టి భక్తిశ్రద్ధలతో పూజిస్తోంది. గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ అనుకునే సంస్కృతి మనది. హనుమంతుని మాటలు విన్న రాముడు లక్ష్మణునితో అంటున్నాడు. ‘తమ్ముడూ! ఈ హనుమ సామాన్యుడు కాడు. వేదాలన్నీ చదువుకున్నాడు. అందుకే సుస్వరంగా మాట్లాడుతున్నాడు. వ్యాకరణశాస్త్రాన్ని బాగా అభ్యసించాడు.

అందుకే ఎంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా వీని నోటినుండి వెలువడలేదు. ముఖంలో హావభావాలు స్పష్టంగా ఉన్నాయి. పెద్దగా మాట్లాడటంలేదు. చిన్నగానూ మాట్లాడటం లేదు. వేగంగా కాని, నెమ్మదిగా కాని మాట్లాడకుండా చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా అందంగా చెప్పాడు. ఇంత మాట నేర్పరిని చూస్తే కత్తినెత్తిన శత్రువు కూడా మెత్తబడిపోతాడు. ఇలాంటివాడు ఎవరికి దూతగా ఉంటాడో అటువంటి ప్రభువులకు ఎలాంటి కార్యమైనా సునాయాసంగా నెరవేరుతుంది’ అని హనుమంతుని వ్యక్తిత్వాన్ని కేవలం అతని మాటను బట్టి అంచనా వేసి చెప్పాడు రాముడు. మాటనుబట్టే మనసు తెలుస్తుంది. మాటనుబట్టే సామర్ధ్యం బయటపడుతుంది. మాటతోనే ప్రపంచాన్ని జయించవచ్చు అనడానికి ఈ సన్నివేశమే నిదర్శనం.

No comments: