ఈ రెండింటిలో ఇప్పుడు ఏది జరుగుతుంది? ఇన్‌స్పెక్టర్ సూర్జన్ సింగ్ షెకావత్ నేరస్థుడిని పట్టుకోవడమా? షెకావత్ పాత్రధారి ఆమిర్‌ఖాన్‌ను ప్రేక్షకులు పట్టుకోవడమా? రెండూ జరుగుతాయి, ఒకటి రీల్లో, ఇంకొకటి హాల్లో! రెండు చేజింగులూ బాగుంటాయనేది ఆమిర్‌ఖాన్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఒక రఫ్ గెస్. భిన్నత్వానికి మారుపేరైన ఆమిర్‌ఖాన్ ఇందులో ఏ విధమైన వైవిధ్యతను కనబరిచాడో చూడాలనుకోవడం అహేతుక కుతూహలం కాకపోవచ్చు. రీమా కగ్తీ దర్శకత్వంలో ఆమిర్ సహనిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన తలాష్ (గాలింపు) విడుదలై చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ మీద ప్రత్యేక కథనం.
ఒకరోజు మహాదర్శకుడు బాలచందర్ ఒక చిత్రమైన అవస్థలో చిక్కుకున్నారు: ఆమిర్‌ఖాన్‌కు ఫోన్ చేయాలి. కానీ అంతకుముందు పరిచయం లేదు. కాబట్టి చేసి ఏమని సంబోధించాలి? సర్ అనాలా? ఆమిర్‌జీ అనాలా? వయసు తెచ్చిన పెద్దరికం వల్ల ఏకవచనం సరిపోతుందా?
‘తారే జమీన్ పర్’ చూశాక, ఆమిర్‌ను అభినందించకుండా ఉండలేనిదేదో ఆయన్ని కుదిపేసింది. ఒక కవితాత్మక వాక్యం చదివినప్పుడు కవి హృదయంలో నర్తించడం లాంటిదది! నీ రక్తంలో పుట్టింది నా రక్తంలో ఇంకిపోయిందని తెలియజెప్పాలనే ప్రశంసోద్వేగం అది!
ఫోన్ రింగయింది. ఆమిర్ ‘‘హలో,’’ అన్నాడు. ‘‘నా పేరు కె.బాలచందర్, నేనో చిన్న దర్శకుడిని,’’ అని పరిచయం చేసు కోగానే, ‘‘స..ర్.., నేను మీ అభిమానిని,’’ ఆనందంగా పలికాడు ఆమిర్. తర్వాత మాటల ప్రవాహం! ఇరువురు కళాకారుల దూరవాణి సంగమం!
ఇదంతా ‘గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డు’ను అమీర్‌ఖాన్‌కు బహూకరిస్తున్న ఫంక్షన్లో బాలచందర్ చెప్పినప్పుడు ఆమిర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందులో ఏ ప్రతికూలోద్దేశమూ లేదు, ఇది నిక్కమైన ప్రశంస; అని అర్థమైన ఒక కళాకారుడు కరిగి కన్నీరైన సందర్భం!
ఇంతాచేస్తే అది దర్శకుడిగా ఆమిర్‌ఖాన్ తొలి ప్రయత్నం. ఒక స్టార్ హీరో అయ్యుండీ డిస్లెక్సియాలాంటి సున్నితమైన సమస్యతో కూడిన ఎడ్యుకేటివ్ సినిమాను తలకెత్తుకోవడం మామూలు విషయం కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు చూడాల్సిన, చూస్తున్న దృక్కోణాన్ని ఇది చర్చకు పెట్టింది. నల్లబల్ల మీద రాసిన అక్షరాలు రెక్కలొచ్చి ఎగురుతాయని ఇప్పుడు ఉపాధ్యాయుల్ని నమ్మించడం సులభం!
‘తారే జమీన్ పర్’(2007)తో విమర్శకులను మెప్పించడమేకాదు, వ్యాపారపరంగానూ విజయం సాధించాడు ఆమిర్. దానికి నిర్మాత కూడా అయిన ఆమిర్ 12 కోట్లు ఖర్చుచేసి, 88 కోట్లు రాబట్టాడు. మరి సినిమా అంటే బాక్సాఫీస్ అని కూడా!
నిర్మాతగానూ అంతే! ఏ తపనతో ఆమిర్ దర్శకుడయ్యాడో అదే కారణంతో నిర్మాతయ్యాడు. ఒక మంచి సినిమాకు తాను మాధ్యమం కావాలి! అశుతోష్ గొవారికర్ ఒక పీరియడ్ సబ్జెక్టుతో తన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కథ విన్నాడు. నచ్చింది. మళ్లీ చెప్పించుకున్నాడు, ఇంకా నచ్చింది. మళ్లీ విన్నాడు, ఇంకా బాగా నచ్చింది. తీరా చూస్తే దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత లేడు.
‘బాజి’ దర్శకుడిగా అశుతోష్ పనితనం ఆమిర్‌కు తెలుసు. కానీ నిర్మాతగా మారడమంటే? అదీ పదేళ్ల కింద 25 కోట్లు పెట్టాల్సిందైతే? జె.పి.వాశ్వానీని ఆధ్యాత్మిక గురువుగా తలిచే ఆమిర్‌కు ఏ అంతర్వాణి ప్రబోధం వినిపించిందో! రిస్కు తీసుకున్నాడు. ‘ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్’ నెలకొల్పాడు. ‘లగాన్’(2001)ను ప్రపంచానికి కానుకగా అందించాడు. కాదా మరి! తన ‘100 బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ వరల్డ్ సినిమా’లో ఎంపైర్ మ్యాగజైన్ దీనికి స్థానం కల్పించింది. మదర్ ఇండియా(1957), సలామ్ బాంబే(1988) తర్వాత ‘విదేశీ ఉత్తమ చిత్రం’ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన మూడో హిందీ చిత్రంగా కాసులతోపాటుగా కీర్తినీ మూటగట్టుకుంది. అంతెందుకు! ఇప్పుడు భారతీయ సినిమా(హిందీ వరకు) అంటే ‘షోలే’ లేదా లగాన్.
‘‘నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా సినిమాలుండాలి. ఓ 200 ఏళ్ల తర్వాత ఎవరైనా లగాన్ చూస్తూ, ‘ఈయనెవరు యార్’ అనుకోవాలి,’’ అనేది ఆమిర్ ఆశ, ఆశయం.
ఏది చేసినా హృదయంతోనే... ‘ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ల జీవితాన్ని ఖర్చు చేసే’ ఆమిర్ తన కెరీర్‌ని చాలా త్వరగా తనదైన క్రమంలోకి తెచ్చు కున్నాడు. ‘ఖయామత్ సే ఖయా మత్ తక్’(1988) అతడి మొదటి హిట్ సినిమా. తర్వాత రెండేళ్ల పాటు విజయం అనేది లేదు. మంచి సినిమా అనిపించు కున్నప్పటికీ ‘రాఖ్’ ఫ్లాప్ అయింది. ‘లవ్ లవ్ లవ్’ ప్రేక్షకులను చేరలేదు. ‘అవ్వాల్ నంబర్’ వెనకబడిపోయింది. ‘తుమ్ మేరే హో’ చతికిలపడింది. అప్పుడే పరుగు మొదలుపెట్టిన నటుడికి ఇది బాధాకరమైన దశ!
అప్పుడు మహేష్‌భట్ ‘అర్థ్’, ‘సారాంశ్’, ‘నామ్’ లాంటి సినిమాలతో దర్శకుడిగా ఊపుమీదున్నాడు. భట్ చేతిలో పడితే తన స్టార్ తిరుగుతుందేమో! భట్‌లాంటి దర్శకుడు ఉత్తినే తనతో సినిమా చేస్తున్నానని ప్రకటించినా ఒక ఊరట లభిస్తుందేమో! అంతటి మానసిక వ్యథలో ఉన్నప్పుడు నిజంగానే మహేష్‌భట్ నుంచి ఆఫర్ వచ్చింది. ఊహించని అదృష్టం! కానీ స్క్రిప్టు ఆమిర్‌కు నచ్చలేదు. ఊగిసలాడాడు. తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డాడు. కానీ హృదయం ఒప్పుకోనిదాన్ని ఎలా చేయాలి? ఒక నిర్ణయానికి వచ్చాడు. నో!
తాను మనస్ఫూర్తిగా భాగస్వామి కాగలిగిన సినిమాలను మాత్రమే చేస్తూవచ్చాడు. ప్రేక్షకులు కూడా అతడి ప్రత్యేకతను గుర్తిస్తూ వచ్చారు.
దిల్ (1990), దిల్ హై కీ మాన్తా నహీ (1991), జో జీతా వోహీ సికందర్ (1992), హమ్ హై రాహీ ప్యార్ కే (1993), రంగీలా (1995), గులామ్ (1998), సర్ఫరోష్ (1999), దిల్ చాహతా హై (2001), రంగ్ దే బసంతి (2006), గజిని (2008); ఇలా కమల్‌హాసన్ అంత విభిన్నంగా ఆలోచించగలిగిన ఏకైక నటుడు ఆమిర్‌ఖాన్ మాత్రమే! ఒక క్యారెక్టర్‌కు రూపునివ్వడంలో... అది కోరమీసమా? పిల్లిగడ్డమా? గుండా? పొట్టిజుట్టా? ఏదైనా సరే, తన వైవిధ్యాన్ని చూపిస్తాడు.
వ్యాపారం తెలిసిన కళాకారుడు ఏది చేసినా ఆమిర్ ఒక పద్ధతిగా చేస్తాడు. ఆ సినిమాతో ఒక ఉద్వేగపూరిత సంబంధాన్ని నెలకొల్పుకుంటాడు. ‘ఇదిగో ఈ మూడు నెలల డేట్స్ ఇస్తాను; ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి; తర్వాత నాకు సంబంధం లేదు;’ తరహాలో తాను పనిచేయలేనంటాడు. తాను నిర్మాతైతే పంపిణీదారు లాభపడాలి; తాను నటుడైతే నిర్మాత బాగుపడాలి; ఇదీ తన దృక్పథం. అందుకే సినిమాలను వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తాడు.
ఉదాహరణకు ఒక గుజరాతీ సినిమా ఆ రాష్ట్రంలో 7 కోట్లు వసూలు చేయగలదు. ఎంత పెద్ద హిందీ సినిమా అయినా అక్కడ 3 కోట్లకు మించి రావు. అంటే వాళ్లు సినిమాలు చూడరా? చూస్తారు. వాళ్లకు వినోదం వద్దా? కావాలి. అయినా ఎందుకు మార్కెట్ లేదు? ‘3 ఇడియట్స్’లో నటిస్తున్నప్పుడు ఆమిర్ ఆలోచన ఇది! అందుకే గుజరాత్‌తోపాటుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్; ఇలా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న నగరాల్లో మారువేషాల్లో తిరిగాడు. రోడ్డు పక్కనున్న వాళ్లతో కలిసి తిన్నాడు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల్ని పలకరించాడు, ఆలయాలకు వెళ్లి భక్తులతో మాట్లాడాడు; ఇదంతా కూడా ఒక రియాలిటీ షోలాగా చేశాడు. ‘ఈరోజు ఆమిర్ ఎక్కడ తప్పిపోయాడు?’ అనేది టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యింది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ టాపిక్ అయ్యింది. 385 కోట్లతో బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ‘3 ఇడియట్స్’(2009) రికార్డుల్ని తిరగరాసింది.
‘‘సినిమా చూడబోయేముందు ఆ సినిమాకు మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించాలి, ప్రేక్షకులను దానికి సంసిద్ధం చేయాలి. దానికోసం తొమ్మండుగురితో కూడిన నా మార్కెటింగ్ టీమ్‌తో బ్రెయిన్ స్టార్మ్ చేస్తా,’’ అని చెబుతాడు ఆమిర్. అలా గని తనకు సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు. ‘‘నా సినిమా చూసే ప్రేక్షకుడు తాను ఖర్చు చేసే యాభయ్యో వందో రూపాయలకు ప్రతి పైసా వసూల్ చేసుకోవాలి; వినోదంతోపాటు వినోదానికి మించినదేదో కూడా అందుకోవాలి,’’ అంటాడు.
ఆమిర్ ‘పీప్లీ లైవ్’(2010) నిర్మించడానికి కూడా కారణం ఇదే. వినోదానికి మించినదేదో ప్రేక్షకుడికి ఇవ్వాలి! అదీ కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ. అదీ తాను నటించ కుండా. మీడియా, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ మీద వేసిన ఈ సెటైర్ బాగా పేలింది. రైతు భారతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. మరి ఏ అనుభవమూ లేని కొత్త దర్శకురాలు అనూషా రిజ్వీకి అవకాశం ఎలా ఇచ్చాడు? తాను చేయగలదని ఎలా తెలియాలి? ఐదారు సీన్లు షూట్ చేసి చూపించమన్నాడు. ఎస్! ఈమెలో విషయం ఉంది. అందరూ కొత్త నటులు కావడంతో పూర్తి స్క్రిప్టును రిహార్సల్ చేయించాడు. ఒక నాటకంలాగా వాళ్లు సినిమాను ‘ఆడి’ చూపించారు. ఇంత పక్కాగా ఉంటాడు కాబట్టేనేమో, ఆమిర్‌ఖాన్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనే కొత్త అర్థం స్థిరపడింది.
మిస్టర్ పర్ఫెక్ట్ నిజానికి, ‘వడ్డించిన వెండిపళ్లెం’గా ఆమిర్ జీవితాన్ని పరిగణించి, ఈ గొప్పతనాన్నంతటినీ ఒక్క మాటలో తలకిందులు చేయొచ్చు. ఎందుకంటే తండ్రి తాహిర్ హుస్సేన్ నిర్మాత. పెదనాన్న నాసిర్ హుస్సేన్ నిర్మాత, దర్శకుడు. కాబట్టి అవకాశం పొందడమే ఒక వరంగా అతడి జీవితం ఎప్పుడూ లేదు. చాలామంది సినిమావాళ్లకు ఇంత యోగం ఉండకపోవచ్చు. అలాగని ఆ యోగం ఉన్న ప్రతివాళ్లూ ఇంత సెలక్టివ్‌గా లేరు. యోగం ఉండటంవల్ల కంటే ఆ యోగానికి తగిన మానసికస్థితి ఉండటం వల్ల కూడా ఆమిర్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాగలిగాడు.
అలాగే సినిమాకు మించినదేదో జీవితంలో ఉందని కూడా ఆమిర్ గుర్తించాడు. అందుకే ‘నర్మదా బచావో ఆందోళన్’కు మద్దతు పలికి యాక్టర్- యాక్టివిస్ట్ అయ్యాడు, అన్నా హజారే బృందంతో కలిసి జన్ లోక్‌పాల్‌కు మద్దతు పలికాడు, ‘సత్యమేవ జయతే’ టీవీ షోతో బాధితుల దుఃఖాన్ని తెలుసుకున్నాడు. ఆమిర్ అన్నీ చేస్తాడు. ఏదిచేసినా లెక్కప్రకారంగా, పద్ధతిగా, ప్రామాణికంగా చేయాలనుకుంటాడు, పర్ఫెక్ట్‌గా ఉండాల నుకుంటాడు. అలాగని పర్ఫెక్షన్ అనేది ఉండబోదని ఆమిర్‌కు తెలియదనుకోలేం. ఆ వంకన దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించకుండా వదిలేయకూడదని కూడా అతడికి తెలిసేవుంటుంది.
-ఆర్.ఆర్.
ఆమిర్ పెంపుడుకుక్క పేరు షారుక్ఆమిర్ జన్మదినం 14 మార్చి (1965).
చిన్నప్పుడు బొద్దు చెంపలుండటంతో వాళ్లమ్మ కృష్ణ అని పిలిచేదట.
‘యాదోంకీ బారాత్’ (1973)లో బాలనటుడు.
‘మంజిల్ మంజిల్’, ‘జబర్‌దస్త్’ సినిమాలకు పెదనాన్న నాసిర్ హుస్సేన్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు.
హీరోగా తొలి చిత్రం ‘హోలీ’(1984).
షారుక్‌ఖాన్‌కి ఎంతో పేరు తెచ్చిన కి..కి..కిరణ్ పాత్ర(‘డర్’)ను ఆమిర్ చేయాల్సింది; కానీ యశ్‌చోప్రాతో అభిప్రాయభేదాలు రావడం వల్ల అది జరగలేదు.
ముందు కథ నచ్చలేదని నిరాకరించినా మహేష్‌భట్ దర్శకత్వంలో దిల్ హై కీ మాన్తా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే లాంటి చిత్రాల్లో నటించాడు.
శోభన్‌బాబు తరహాలో ఆదివారాలు షూటింగులకు వెళ్లడు.
కమల్‌హాసన్ పని విధానాన్ని ఇష్టపడతాడు.
పదిహేడేళ్లుగా అవార్డు ఫంక్షన్లకు పెద్దగా వెళ్లడం లేదు. వాటికి ఏ విశ్వసనీయతా లేదన్న స్వీయ అవగాహనతో.
ఆమిర్‌ఖాన్ పెంపుడుకుక్క పేరు షారుక్.
లాన్ టెన్నిస్‌లో ప్రావీణ్యముంది. రాష్ట్రస్థాయిలో మహారాష్ట్రకు ఆడాడు.
నటుడు కాకపోయుంటే ఫిలిం స్కూలు పెట్టుకునేవాడినంటాడు.
భారత ప్రభుత్వం అమీర్‌ను ‘పద్మశ్రీ’(2003), ‘పద్మభూషణ్’(2010) పురస్కారాలతో గౌరవించింది.
దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపంమీద అవగాహన కల్పించడానికి యునిసెఫ్ భారత ప్రతినిధిగా నియమితుడయ్యాడు(2011).
మిస్టర్ కాంప్లికేషన్ చిన్ననాటి నేస్తం, బెంగాలీ అమ్మాయి రీనాదత్తాను ఆమిర్ 1986లో పెళ్లాడాడు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి జునైద్ ఖాన్, అమ్మాయి ఐరా ఖాన్. బస్సు, లోకల్ ట్రెయిన్‌లోనే పిల్లల్ని స్కూలుకు పంపారట! ‘‘జీవిత వాస్తవికత వాళ్లకు తెలియాలి కదా!’’ అంటాడు ఆమిర్.
అయితే పదిహేనేళ్ల కాపురం తర్వాత 2002లో రీనాతో విడిపోయాడు. ‘‘కొన్ని నిర్ణయాలు మన చేతిలో ఉండనంతగా వశం తప్పుతాయి. మా బంధం విషయంలోనూ అదే జరిగింది,’’ అంటాడు. పిల్లల కస్టడీని కోర్టు రీనాకు అప్పగించింది.
2003లో బ్రిటిష్ జర్నలిస్టు జెస్సికా హైన్స్‌తో అమీర్‌కు ఒక బాబు(జాన్) ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే, ఆమిర్ దాన్ని ఖండించాడు.
లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయమైన కిరణ్‌రావును 2005లో పెళ్లిచేసుకున్నాడు. (దోబీఘాట్ చిత్రంతో కిరణ్ దర్శకురాలైంది.) 2011లో వారికి పిల్లాడు కలిగాడు. అజాద్‌రావ్ ఖాన్. ఆమిర్ పూర్వీకుడైన స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మీదుగా కిరణ్ ఈ పేరు పెట్టిందట. రీనా, కిరణ్ ఇద్దరూ హిందువులు కావడం కాకతాళీయమే! తాజాగా ఆమిర్ కొడుకు జునైద్ ‘3 ఇడియట్స్’ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దగ్గర ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాడు. ఇందులో నటిస్తున్నది ఇంకెవరో కాదు, నాన్నే!
ఆమిరేవ జయతే పదమూడు వారాల ‘సత్యమేవ జయతే’ టీవీ షోతో ఆమిర్ చరిత్ర సృష్టించాడు. దూరదర్శన్, స్టార్ ప్లస్, స్టార్ వరల్డ్‌లో హిందీతో పాటుగా బంగ్లా, మరాఠీ, తమిళం, తెలుగు; ఇలా ఎనిమిది భాషల్లో ఏకకాలంలో ప్రసారమైంది. ఆమిర్‌ఖాన్‌కు మాత్రమే దక్కిన, దక్కగలిగే గౌరవం ఇది. రామాయణ్, మహాభారత్ తర్వాత అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన ఈ కార్యక్రమాన్ని 8.4 కోట్ల మంది చూశారని అంచనా. ఆదివారం ఉదయం పదకొండు గంటలు కొత్త ప్రైమ్‌టైమ్ అయింది. దీనికోసం ఎపిసోడ్‌కు 3 కోట్లు పారితోషికం తీసుకున్నాడు ఆమిర్. భారత టెలివిజన్ చరిత్రలో ఒక యాంకర్‌కు ఇంత సొమ్ము ఇవ్వడం ఇదే ప్రథమం. 10 సెకన్ల యాడ్‌కు 10 లక్షలు వసూలుచేయడం కూడా రికార్డే!
అయితే, వినోద ప్రధానమైనదాన్లోనో, రియాలిటీ షోలోనో కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమంతో ఆమిర్ టీవీలోకి ప్రవేశించడం గమనార్హం. వరకట్నం, గృహహింస, అంగవైకల్యం, ఆడశిశు భ్రూణహత్యలు, అంటరానితనం, నీటి కొరత, రసాయనిక కాలుష్యం; ఇవీ ఇందులో హైలైట్ చేసిన అంశాలు. కార్యక్రమానికి కొనసాగింపుగా మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిరోధించాలని ప్రధానిని కలిశాడు. వైద్యరంగంలోని అనైతికతనూ, అవినీతినీ ఎత్తిచూపినందుకు డాక్టర్ల నుంచి వచ్చిన నిరసను తోసిపుచ్చాడు. వాళ్లకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. వ్యక్తిగత నైతికత దృష్ట్యా తాను నటించిన వాణిజ్య ప్రకటనలు ఈ ధారావాహిక వచ్చినంతకాలం ఎక్కడా ప్రసారం కాకుండా చూసుకున్నాడు. కొత్త ప్రకటనలపై సంతకం చేయలేదు.
‘నేను కాదు, ప్రేక్షకులు మారారు’ ‘ఒక బాధ్యతగల భారతీయ పౌరుడిగా నేను ఈ పేద ఆదివాసీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను. డ్యామ్ ఎత్తు పెంపుచేసినట్లయితే వీళ్లు భూమి, ఇళ్లు కోల్పోతారు.’’ (2006: ‘నర్మదా బచావో ఆందోళన్’కు మద్దతుగా)
‘‘నిజానికి నేను మారడం కన్నా, ప్రేక్షకులు మారారు. పాత పచ్చళ్లను ఇంకా రుచిచూడటానికి సిద్ధంగా లేరు. తాజాగా, వాస్తవికంగా కనబడేవి కోరుకుంటున్నారు. వాటిని గుర్తిస్తున్నారు, అభినందించగలుగుతున్నారు.’’
(2007: బాలీవుడ్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారన్న ప్రశంసకు)
‘‘అది నాకంత ప్రాధాన్యమైన విషయం కాదు. నన్ను చూడాలనుకునేవాళ్లు నా సినిమాలు చూస్తారు.’’
(2007: ‘మేడమ్ టుస్సాడ్స్’లో తన మైనపు ప్రతిమకు నిరాకరిస్తూ)
‘‘ఎప్పుడైనా ఓ సామాజిక ఉద్యమం జరుగుతున్నప్పుడు జనం అందులోకి వచ్చినట్టు కనబడదు. వ్యాపారస్తులు, వైద్యులు, గృహిణులు; అందరూ దూరంగా ఉంటారు. ఒక్క సినిమా పరిశ్రమవాళ్లే కాదు, అత్యధిక శాతం ‘చోడో యార్, మనం ఎందుకు వాళ్లతో పెట్టుకోవడం?’ అనుకుంటారు. కానీ ఈ ఉద్యమం అందరినీ బయటికి రప్పించగలిగింది. అవినీతి ప్రతి ఒక్కరిమీదా ప్రభావం చూపిస్తుంది.’’ (2011: అన్నాహజారే సారథ్యంలోని జన్ లోక్‌పాల్ బిల్ ఉద్యమానికి మద్దతుగా)
No comments:
Post a Comment