all

Sunday, December 9, 2012

సంచలనానికి కూడా ఒక కట్టుబాటు ఉండేది!--నటి పూర్ణిమ

 
ఆ రోజుల్లో..!
కౌమారప్రాయంలో చిగురు తొడిగే ప్రేమ.. పెళ్లిపల్లకీ ఎక్కే వైనాన్ని హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన ‘ముద్ద మందారం’లో నటించేనాటికి పూర్ణిమది పద్నాలుగేళ్ల ముగ్ధ ప్రాయం. 1981లో విడుదలైన ఆ చిత్రం తర్వాత పూర్ణిమ నటిగా స్థిరపడ్డారు. ఏడేళ్ల తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పి సంసార జీవితంలో తలమునకలయ్యారు. టీనేజ్ సినిమాల హీరోయిన్‌గా మూడు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పూర్ణిమ, ఇప్పటికీ, అప్పటికీ ప్రేమకథల వాసిలో చాలా తేడా ఉందని అంటున్నారు.

అప్పుడు ముద్ద మందారం, నాలుగు స్తంభాలాట ఓ ట్రెండ్. దానికి మాతరం నాంది పలికింది. పదిహేనేళ్ల వయస్సులో నటించడాన్ని పక్కన పెడితే, ఆ వయస్సులో ప్రేమ, సాన్నిహిత్యం వంటి దృక్పథాలు సంచలనాలు. సినిమాల్లో కొత్త పుంతలు తొక్కిన ఈ ఆలోచనా ధోరణి మా జనరేషన్‌తోనే మొదలైందేమో. మా ముందు తరం వారికి ఆ సినిమాలు కొత్త కెరటాల్లా అనిపించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలను మాత్రం ఆ విధంగా చూడలేం. అప్పట్లో భావాలు కొత్తవైనా వాటిని చెప్పే విధానం మాత్రం పద్ధతిగా ఉండేది. టీనేజ్ లవ్ ప్రధానాంశమైనా అది కథ చుట్టూ అల్లుకుని ఉండేది. ఆ రోజుల్లో సంచలనమనిపించే విషయాన్ని కూడా కొన్ని కట్టుబాట్లు, నిబంధనల పరిధిలో చూపేవారు. దాంతో అది ఎబ్బెట్టుగా అనిపించేది కాదు. కానీ ఇప్పటి పద్ధతి వేరు. కట్టు, బొట్టు, ఆలోచనలు మారుతున్న మాట నిజమే. ఈ తరం కోరికలు భిన్నంగా ఉన్న మాట వాస్తవమే. కానీ సినిమాల చిత్రీకరణలో విపరీత ధోరణుల వల్ల సంచలనాత్మకమన్న సంగతి అటుంచితే విపరీతాలకు ఆస్కారం కలిగే ప్రమాదం ఉందనిపిస్తోంది.

ఇప్పుడు కథ కంచికి

టీనేజ్‌లో ఉన్న అమ్మాయి.. అబ్బాయి.. వారి మధ్య ప్రేమ.. అదీ ముద్దమందారం కథ.. ఆ ప్రేమలో ఎన్నో పరిణామాలు.. హృదయాన్ని కదిలించే సంఘటనలు.. వీటన్నిటినీ కథనమనే సూత్రంతో అల్లి మందారమాలను తయారు చేశారు మహనీయుడు జంధ్యాల గారు. అప్పట్లో కథ సినిమాకు ప్రాణంగా ఉండేది. దాన్ని చెప్పే తీరు కూడా అంతే హృద్యంగా ఉండేది. కథలో పాత్రలకు అనుగుణంగా నటుల ఎంపిక సాగేది. నవ యవ్వనంలో అడుగిడుతున్న ఓ అమాయకపు అమ్మాయి ప్రధాన పాత్రగా ముద్ద మందారం చిత్రాన్ని జంధ్యాల తీయాలనుకున్నారు. అందుకోసం ఓ అమ్మాయిని ఎంపిక చేయడానికి జంధ్యాల సాగించిన అన్వేషణ నా దగ్గర ఆగింది. నటుల ఎంపిక కోసం అంత పెద్ద కసరత్తు సాగేది. కథపై పాత్రధారులందరికీ అవగాహన ఉండేది. ఇప్పుడు కథ ఎక్కడ? దాని చుట్టూ కథనం అల్లిక ఎక్కడ? హృదయాన్ని స్పృశించే సెంటిమెంట్ ఎక్కడ?

తెర చాటుకు నటన

‘నటనే పది కాలాలు బతుకుతుంది’ అనేవారు జంధ్యాల. అందుకే ఆయన నటులకు కాకుండా వారిలో నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అదే మాకు నేర్పారు. పాత్రోచితంగా నటించే వరకు ఓపిగ్గా నేర్పేవారు. అయితే ఇప్పటి కథ వేరు. ఇప్పటి బిజీ టైంలో నటన, పాత్ర పోషణ రాన్రానూ వెనక్కు పోతున్నాయి. ఎలా నటించామన్నది కాకుండా ఎంత సంపాదించామన్నది ముఖ్యమైంది. నటనను ఓ గౌరవప్రదమైన వృత్తిగా అప్పట్లో భావిస్తే ఇప్పుడు ఆర్జనకు దగ్గరి తోవగా తలపోస్తున్నారు. దర్శకులు సినీ నిర్మాణాన్ని ఓ తపనలా భావించేవారు. రెమ్యునరేషన్ ఎంతన్న దాని మీద ధ్యాస పెట్టేవాళ్లం కాదు. 1981లో ముద్ద మందారానికి నా రెమ్యునరేషన్ రెండున్నర వేలంటే నమ్ముతారా?

ఆటబొమ్మలు కారు

రానురానూ హీరోయిన్లు ఆడిపాడే బొమ్మలైపోతున్నారు. గ్లామర్‌తో నెట్టుకొస్తున్నారు. రెండు మూడు పాటలకు పరిమితమైపోతున్నారు. ధరించే దుస్తులూ అందుకు తగ్గట్టే ఉంటున్నాయి. గతంలో హీరోయిన్‌కు కథలో తగిన ప్రాధాన్యం ఉండేది. అందుకే తక్కువ సినిమాల్లో నటించిన తారలు కూడా గుర్తుండిపోయారు. ఇప్పటి హీరోయిన్లు సైతం గ్లామరస్‌గా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల భామలు తళుక్కున మెరిసి మురిపిస్తున్నారు. జయప్రద, జయసుధ రోజులు కావివి. దిగుమతి చేసుకున్న తారలతో తెలుగు సినిమా నడుస్తోంది. రెమ్యునరేషన్ కూడా అంచనాలకందని స్థాయికి చేరింది. ఒక సినిమా హిట్టయితే రేంజి ఎక్కడికో వెళ్లిపోతోంది. ఉత్తరాది అమ్మాయిలవైపు ప్రేక్షకులూ మొగ్గు చూపుతున్నారు. డబ్బే ఇప్పటి సినిమాకు సర్వం. వేగం, మార్పు ఈ తరం పర్యాయ పదాలయ్యాయి. సినిమాలో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి.ఇది ఇప్పటి ట్రెండ్ అని సరిపెట్టుకోవాలేమో.సంభాషణ: సత్యారావు పట్నాయక్

No comments: