all

Sunday, December 9, 2012

భారత్‌లో ఎఫ్‌డిఐల బేరం 120 కోట్ల ముడుపులు

 

  • వాల్‌మార్ట్‌ ఖాతాల్లో భాగోతం
  • అమెరికా సెనేట్‌కు సంస్థ నివేదిక
భారతదేశ చిల్లర వాణిజ్యంలోకి అడుగుపెట్టే అవకాశం సంపాదించడానికి వాల్‌మార్ట్‌ సంస్థ 125 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిన ఉదంతం బట్టబయలైంది. ఈ తతంగం నిజానికి 2008 నుంచే జరుగుతున్నది. అమెరికా సెనేట్‌కు వాల్‌మార్ట్‌ అందించిన లాబీయింగ్‌ నివేదికలోనే 2.5 కోట్ల డాలర్లు (సుమారు 125 కోట్ల రూపాయలు) ఖర్చు చేసినట్టు తెలియజేసింది. వ్యాపారాభివృద్ధి కోసం ఇలాంటి వ్యవహారాలు నడపడం అమెరికాలో నేరం కాదు!
భారతదేశంలో వ్యాపార పెట్టుబడుల అవకాశాల మెరుగుదల కోసం జరిపిన చర్యలతో సహా వివిధ లాబీయింగు కార్యకలాపాల్లో ఈ మొత్తం ఖర్చు చేసినట్టు వాల్‌మార్ట్‌ పేర్కొన్నది. 2012లో సెప్టెంబరుతో ముగిసిన చివరి త్రైమాసికంలో వివిధ రకాల వ్యవహారాలకు పది కోట్ల రూపాయల వరకూ ఖర్చుపెట్టినట్లు కూడా నివేదించింది. ఇవన్నీ అవినీతి ముడుపులకు ముసుగుల వంటి మాటలేనని చెప్పనవసరం లేదు. ఈ త్రైమాసికంలో వాల్‌మార్ట్‌ సంస్థ అమెరికా సెనేట్‌, ప్రతినిధుల సభ, ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యుఎస్‌టిఆర్‌), విదేశాంగ శాఖలతో లాబీయింగ్‌ జరిపినట్లు తాజా త్రైమాసిక నివేదిక వెల్లడించింది. వ్యాపార పెట్టుబది అవకాశాల మెరుగుదల కోసం కంపెనీలు వివిధ శాఖలు, ఏజెన్సీలతో లాబీయింగ్‌ చేయడానికి అమెరికాలో అనుమతిస్తారు. అయితే ఈ నిమిత్తం చేసిన ఖర్చుల వివరాలను ప్రతి త్రైమాసికానికి అమెరికా సెనేట్‌కు ఆ కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. వాల్‌మార్ట్‌ విషయానికొస్తే, 2009లో కొన్ని నెలలపాటు మినహాయిస్తే 2008 నుంచి నిరంతరం ఈ సంస్థ లాబీయింగ్‌ నడుపుతూనే ఉంది.
ప్రతిపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా మల్టీ బ్రాండ్‌ చిల్లర వర్తకంలోకి విదేశీ కంపెనీల పెట్టుబడులకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల తీర్మానం ఇటీవల వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న వాల్‌మార్ట్‌ సంస్థకు మార్గం సుగమమైంది. భారత
రిటైల్‌ మార్కెట్‌ ప్రస్తుత విలువ 50 వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని, ఇది 2020 నాటికి లక్ష కోట్ల డాలర్లను అధిగమిస్తుందని అంచనా. ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ ఎటి కెర్నీ నివేదిక ప్రకారం, 2020 నాటికి మొత్తం మార్కెట్‌లో వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్‌ 25 శాతానికి చేరుకుంటుంది. అంతర్జాతీయ రిటైల్‌ సంస్థలకు భారత్‌ అత్యంత అనువైన గమ్యస్థానంగా ఉంటుందని కూడా ఈ నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో రిటైల్‌ మార్కెట్‌ వృద్ధి 15-20 శాతం ఉంటుందనీ ఈ నివేదిక తెలిపింది.

No comments: