all

Sunday, December 9, 2012

లేడిపిల్ల తెలివి"_" చిట్టి కథ

 
 
ఒక అందమైన లేడిపిల్ల తన తల్లితో మేతకు బయల్దేరింది. ఆకులూ అలములూ తింటూ గెంతుతూ ఆడుకుంటూ దారి తప్పిపోయింది. ఎంత వెతికినా తల్లి కనిపించలేదు. దాంతో భయం భయంగా నడవసాగింది. ఇంతలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టు అనిపించడంతో ఆగి చూసింది. ఒక నక్క తన వెనుకే వస్తోంది. అది ఏ క్షణంలోనైనా తనమీద దూకి చంపేలా ఉంది. ఏడుపు ముంచు కొచ్చింది లేడిపిల్లకి. అంతలోనే ‘తెలివిగా ప్రవర్తించి ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు’ అన్న తల్లి మాటలు గుర్తొచ్చాయి.

వెంటనే దానికో ఆలోచన వచ్చింది. తను నడుస్తున్న దారి పక్కనే ఉన్న తమలపాకుల్ని గబగబా నమిలింది. నాలుక బాగా ఎర్రబారిన తర్వాత గిలగిలా కొట్టుకుంటూ నేలమీద పడిపోయింది. తన పని ఇంత సులువవుతుందని అనుకోని నక్క, వెంటనే లేడిపిల్లని చేరి నోటితో పట్టుకోబోయింది.
అంతలో లేడిపిల్ల ‘‘నక్కబావా! ఆగు. తొందరపడి నాలా నీవూ నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’’ అంది. దాంతో నక్క ఒక అడుగు వెనక్కి వేసి ‘‘ఏం జరిగింది?’’ అని అడిగింది. దానికి లేడిపిల్ల కన్నీరు కారుస్తూ, ‘‘నేను ఏవో విషపు ఆకులు తిన్నాను. నా శరీరం విషపూరితం అయింది. నన్ను తింటే నీవూ చనిపోతావు. నాకు కడుపులో నొప్పి మొదలైంది. నోరంట రక్తం కూడా వస్తోంది చూడు’’ అంటూ తన ఎర్రని నోటిని చూపించి, తర్వాత కళ్లు తేలేసింది. అది చూసిన నక్క ‘బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు. ఈ లేడిపిల్ల మాంసానికో దండం’ అనుకుని వెళ్లిపోయింది. లేడిపిల్ల నవ్వుకుంటూ అక్కడ్నుంచి తుర్రుమంది.
నీతి: ఉపాయంతో ఎంతటి అపాయాన్నయినా తప్పించుకోవచ్చు.

No comments: