మాతృత్వం ఒక అద్భుతమైన అనుభవమే అయినప్పటికీ... బిడ్డ కడుపున పడిన నాటి నుంచి కాబోయే తల్లి ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతుంటుంది. ఆ ఒత్తిళ్లు తన ఆరోగ్యం పరంగానూ, తన కడుపులోని బిడ్డ ఆరోగ్యపరంగానూ ఆమెపై పనిచేస్తుంటాయి. ఇకపై తాను కాబోయే తల్లిని అనుకున్న నాటి నుంచే ఆమె బాధ్యతలన్నీ రెట్టింపు అవుతాయి. తల్లీ బిడ్డా... ఈ ఇద్దరి కోసం తల్లే తినాలి. ఈ ఇద్దరి క్షేమం కోసం తల్లే మందులు వాడాలి. ఈ ఇద్దరి భవిష్యత్తు కోసం తల్లే అప్రమత్తంగా ఉండాలి. అందుకే మాతృమూర్తికి లోకం అత్యంత ఉన్నత స్థానం ఇస్తుంది. ఆ అద్భుతమైన అనుభవాన్ని అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా మలచుకోవాలంటే కాబోయే తల్లి చేయాల్సిన కార్యకలాపాలపై అవగాహన కోసమే... ఈ ప్రత్యేక కథనం. కాబోయే తల్లి బిడ్డను ప్లాన్ చేసుకున్న నాటినుంచే వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు... బిడ్డ పుట్టక ముందు నుంచి మొదలుపెట్టి బిడ్డ కడుపులో ఉన్నప్పుడూ... బిడ్డ పుట్టాక ... ఇలా దాదాపు ఒక రెండు నుంచి రెండున్నరఏళ్ల దీర్ఘకాలంపాటు ఈ అప్రమత్తత సాగుతుందని గుర్తుంచుకోవాలి.
తల్లి వైద్య పరిస్థితిని గుర్తించడం...గర్భధారణకు ప్లాన్ చేసుకోవడానికి ముందుగా ఒకసారి కాబోయే తల్లిదండ్రులు డాక్టర్‌ను సంప్రదించాలి. అంతకు మునుపే తాము ఏవైనా మందులు వాడుతున్నామా అన్న విషయాలను డాక్టర్‌కు చెప్పాలి. కాబోయే తల్లి ఏదైనా జబ్బు కోసం మందులను వాడుతుంటే అవి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఉదాహరణకు గుండెజబ్బుల కోసం వాడే కొన్ని మందులు గర్భధారణ సమయంలో కాబోయే మాతృమూర్తికి సరిపడినా వాటివల్ల బిడ్డకు హాని జరగవచ్చు.
అలాగని బిడ్డకు ప్రమాదకరమనే నిర్ణయాన్ని తామే తీసుకుని తమంతట తామే మందులు మానేస్తే అది కాబోయే తల్లికి మరింత హాని చేకూర్చవచ్చు. ఇక థైరాయిడ్, హైబీపీ, డయాబెటిస్, ఆర్థరైటిస్, ఫిట్స్ వంటి జబ్బులకోసం వాడే మందులను గర్భవతిగా ఉన్న సమయంలో వారికి (అంటే తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ) పూర్తిగా సురక్షితమైనవే వాడాలి. అవి సురక్షితమైనవని తెలియాలంటే వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. ఎందుకంటే గర్భం రాకముందు పై జబ్బుల కోసం వాడే మందులను గర్భం వచ్చాక తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ పై మందులు వాడుతూనే గర్భం కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు... కాబోయే తల్లికి గర్భం వచ్చిందన్న విషయమే రెండోమాసం వరకు (మొదటి నెల గడిచేవరకు) తెలియకపోవచ్చు. అందుకే ప్రీ-మెడికల్ హిస్టరీని డాక్టర్‌కు తప్పనిసరిగా చెప్పాలి.
పరీక్షలెందుకు... ఏయే పరీక్షలు అవసరం తనకు అత్యంత ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలని కాబోయే ప్రతి తల్లీ కోరుకుంటుంది. అయితే కొంతమంది విషయంలో బిడ్డలో జన్యుపరంగా (జెనెటిక్ డిజార్డర్స్) లేదా పుట్టుకతోనే (కంజెనిటల్ డిసీజెస్) కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా ప్రతి 1000 ప్రసవాల్లోనూ 25 నుంచి 60 మంది శిశువులు మృతిచెందుతున్నారు కూడా. ఇలా ఒక సమూహంలో ఇంత ఎక్కువగా శిశు మరణాలు ఉన్నప్పుడు అక్కడి సామాజిక నేపథ్యం, సంస్కృతిలోని అపాయకరమైన అంశాలను పరిశీలించి వాటిని నివారించుకోవాలి. ఉదాహరణకు రక్తసంబంధం ఉన్న బంధువుల మధ్యే వివాహాలు జరుగుతూ, బిడ్డ రూపు దాల్చే ప్రక్రియలో కొన్ని అవకరాలు రావడం, ఫలితంగా శారీరక వైకల్యాలు ఏర్పడటం, కొందరిలో మానసికమైన ఎదుగుదల లోపించి, బుద్ధిమాంద్యం వంటివి కనిపించడం వంటి హానికరమైన ఫలితాలు ఉండవచ్చు. ఇక 35 ఏళ్ల తర్వాత గర్భధారణ జరిగినప్పుడు కూడా ఎన్నోలోపాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే సమయానుకూలంగా జాగ్రత్తలు, పరీక్షలు, మందులు అవసరం.
స్క్రీనింగ్ పరీక్షలు... గర్భధారణ సమయంలో తల్లి తప్పనిసరిగా కొన్నిరకాల స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అది బిడ్డ ఆరోగ్యం గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగ పడుతుంది. కొన్నిరకాల లోపాల గురించి ముందుగానే తెలుసుకుంటే కడుపులోని పిండానికే చికిత్స చేసి చాలా రకాల వైకల్యాలను నివారించవచ్చు. కొన్ని పరీక్షల ద్వారా పుట్టిన వెంటనే చేయాల్సిన చికిత్సలను తెలుసుకుని, బిడ్డ పుట్టే సమయానికి ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటే అది బిడ్డ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసుకోవాలి.
స్క్రీనింగ్ పరీక్షలు ఎందుకు: కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించాక అవి ఏ మాత్రం ఉపయోగపడని పరీక్షగా కాబోయే తల్లికీ, వారి బంధువులకూ అనిపించవచ్చు. ఉదాహరణకు క్రోమోజోముల లోపాలను తెలుసుకోవడం కోసం చేసే కొన్నిరకాల పరీక్షలతో తల ఎముక పూర్తిగా ఎదగని అనెన్సెఫాలీ అనే కండిషన్ బయటపడవచ్చు. ఇది చాలా కొద్దిమందిలో మాత్రమే కనిపించే అరుదైన కండిషన్. ఒకవేళ బిడ్డకు ఈ కండిషన్ ఉన్నట్లు తెలిస్తే వీలైనంత త్వరగా గర్భస్రావం నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్ణీత గడువు దాటాక విషయం తెలిసినా, కొన్ని చట్టబద్ధమైన చిక్కుల వల్ల గర్భస్రావానికి అవకాశం లేకపోతే అది పెద్దప్రాణానికే గండంగా పరిణమించవచ్చు. దీనికి ఎలాంటి వైద్యచికిత్స అందుబాటులో లేదు.
కొన్ని క్రోమోజోమల్ సమస్యలు ఉన్నప్పుడు పిండం 12 వారాల తర్వాత ఎదిగే అవకాశం చాలా తక్కువ. ఏదైనా కారణం వల్ల 12 వారాల తర్వాత కూడా ఎదిగితే... ఆ బిడ్డ జన్యుపరమైన లోపాలతో పుడుతుంది కాబట్టి బుద్ధిమాంద్యం వస్తుంది. అందుకే డౌన్స్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా శారీరక వైకల్యాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
డౌన్స్ సిండ్రోమ్ తెలుసుకోవడానికి పరీక్షలుద కంబైన్‌డ్ టెస్ట్: కడుపులోని బిడ్డ విడుదల చేసే ప్రోటీన్ల వివరాలను తల్లికి చేసే రక్తపరీక్ష ద్వారా తెలుసుకుంటారు. దానితోపాటు బిడ్డకు న్యూకల్ ట్రాన్స్‌ల్యూయెన్సీ (ఎన్.టీ.) స్కాన్ తీస్తారు. ఈ రెండు పరీక్షలను నిర్వహిస్తారు కాబట్టి దీన్ని కంబైన్‌డ్ టెస్ట్ అంటారు. ఇది ప్రెగ్నెన్సీలోని 11 నుంచి 14వ వారంలోనే చేయాలి.
క్వాడ్రపుల్ పరీక్ష: బిడ్డ విడుదల చేసే నాలుగు ప్రోటీన్లను పరీక్షిస్తారు. అవి... 1.అల్ఫా ఫీటో ప్రోటీన్ 2.హెచ్‌సీజీ, 3. ఈస్ట్రడయల్ 4. ఇన్హిబిన్. ఈ నాలుగు ప్రోటీన్ల నిష్పత్తిని బట్టి బిడ్డకు రిస్క్ ఉన్నదీ లేనిదీ తెలుసుకుంటారు. ఇదిసరిగ్గా ప్రెగ్నెన్సీలోని 15 నుంచి 20వ వారం మధ్యనే చేయాలి. అల్ఫా ప్రోటీన్‌పాళ్లను బట్టి స్పైనల్ లేదా ఎదుగుదల సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ముందే పసిగట్టవచ్చు. అయితే స్పైనల్ లోపాలు ఏవైనా ఉంటే వాటిని స్కాన్ ద్వారానే నిర్ధారణ చేయడానికి వీలవుతుంది.
పైన పేర్కొన్న పరీక్షల్లో ఏదైనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన బిడ్డకు అవకరం ఉంటుందని చెప్పలేము. అయితే ఇలా పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రం 12వ వారంలో అయితే సీవీఎస్ పరీక్షనూ, 16వ వారంలో అయితే ఆమ్నియోసెంటెసిస్ పరీక్షను చేయించి దాన్ని బట్టి మొదట వచ్చింది నిజమైన పాజిటివా లేక తప్పుడు పాజిటివ్ ఫలితమా అన్నది తెలుసుకుని, దాని ప్రకారం అనంతర చర్యలకు ఉపక్రమించాలి.
జెనెటిక్ సోనోగ్రామ్: బిడ్డలో ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు, క్రోమోజోమల్ సమస్యలు ఉంటే తెలుసుకోడానికి జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్ష ఉపయోగపడుతుంది. దీనితో బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్ల్లు-చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, కడుపులోని అవయవాలను తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.
మొదటి బిడ్డకు సమస్య ఉంటే... దురదృష్టవశాత్తూ ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్ సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్, జన్యుపరమైన లోపాలు ఉంటే అది రెండో గర్భధారణ సమయంలో ముందస్తు ప్లానింగ్‌కు ఉపయోగపడుతుంది. తొలిచూలు బిడ్డకు చేసే రక్తపరీక్షలతో అతడికి/ఆమెకు వచ్చిన సమస్య ఏమిటన్నది నిర్ధారణ చేస్తే... దాన్నిబట్టి రెండోసారి గర్భధారణ సమయంలో తల్లిదండ్రులకు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పరీక్షలను నిర్ధారణ చేయవచ్చు. ఆ పరీక్షలను కూడా రెండో గర్భధారణ సమయంలో మొదటి ఐదునెలల్లోపే చేస్తే రెండోబిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని ముందే తెలుసుకోవచ్చు.
గర్భదశలో పిండానికే చికిత్స
అవయవాల్లో లోపాలున్నట్లు తేలితే, కడుపులో పిండదశలో ఉన్నప్పుడే బిడ్డకు చేయాల్సిన చికిత్స లేదా బిడ్డ పుట్టగానే చేయాల్సిన చికిత్సలను నిర్ణయించి వాటిని అందించవచ్చు. కంజెనిటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా లాంటి సమస్యలు ఉంటే పుట్టిన వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి శస్త్రచికిత్స చేయాలి. అంటే ఇలాంటి సమస్యలున్నవారు అత్యాధునికమైన శస్త్రచికిత్సకు అవకాశాలున్న చాలా పెద్దసెంటర్లలో ప్రసవం ప్లాన్ చేసుకుని, ఆ వెంటనే బిడ్డ చికిత్సనూ ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. కొన్నిసార్లు కొన్ని రకాల సమస్యలకు బిడ్డకు తల్లికడుపులోనే చికిత్స చేయడం ఇప్పుడున్న వైద్య విజ్ఞాన పురోగతితో సాధ్యమే. గర్భవతుల్లో మార్చాల్సిన మందులుబీపీ కోసం వాడుతున్నవి
ఏసీఈ ఇన్హిబిటార్స్ (బీపీ అండ్ మూత్రపిండాల సమస్య కోసం వాడేవి)
కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం వాడుతున్నవి
చక్కెరను అదుపు చేయడానికి వాడే కొన్ని రకాలు
గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తాన్ని పలుచబార్చేందుకు వాడే కొన్ని రకాలు (ఈ మందులకు బదులు ఇంజెక్షన్లను వాడాలి)
వ్యాధినిరోధకశక్తిని తగ్గించేందుకు వాడే ఇమ్యునోసప్రెసెంట్స్
ఆర్థరైటిస్ జబ్బును తగ్గించడానికి ఉపయోగించేవి
ఫిట్స్ కోసం వాడుతున్నవి. (ఒకవేళ గర్భవతికి తగినవి కాకపోతే వాటిని మార్చాల్సి ఉంటుంది)
వ్యాక్సినేషన్ విషయంలో... గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ఆ తర్వాత ఇవ్వవలసిన వ్యాక్సిన్లు కొన్ని ఉంటాయి. ఏయే సమయాల్లో ఎలాంటి వ్యాక్సిన్లు అవసరమో డాక్టర్‌ను అడగాలి.
చెప్పాల్సిన ఇతర సంగతులు ప్రెగ్నెన్సీ రాకముందే డాక్టర్‌ను కలిసినప్పుడు తమ జబ్బు విషయం కాకుండా చెప్పాల్సిన ఇతర అంశాలేమిటంటే...
ఇది తొలిచూలా? లేక ఎన్నోసారి గర్భధారణ.
గతంలో ఏవైనా అబార్షన్లు జరిగాయా?
గతంలో నెలలు నిండకముందే ప్రసవం జరిగిందా?
మొదటిసారి ప్రసవం తర్వాత బిడ్డలో ఏవైనా జన్యులోపాలు గుర్తించారా?
వంటి అంశాలను చెబితే, తదుపరి గర్భధారణ, ప్రసవం మరింత తేలిగ్గా అయ్యేందుకు అవసరమైన అదనపు జాగ్రత్తలు, పరీక్షలు, మందులను డాక్టర్లు సూచిస్తారు.
ఈ వాతావరణాలకు దూరం ప్లీజ్... కాబోయే తల్లి స్వచ్ఛమైన వాతావరణంలో ఉండటం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల (ప్రధానంగా వృత్తిగతమైనవి) ఈ కింద పేర్కొన్న వాతావరణాల్లో ఉంటే ఆరోగ్యకరమైన బిడ్డకోసం వాటి నుంచి దూరంగా ఉండటం మంచిది. అవి...
కృత్రిమంగా తయారుచేసే రసాయనాలు లోహాల కంపెనీలు ఎరువుల కర్మాగారం లేదా నిల్వ ఉంచే ప్రదేశాలు క్రిమిసంహార కాలను నిల్వ ఉంచే ప్రదేశాలు లేదా అవి తయారు చేసే చోట్లు ఎలుకలు, పిల్లుల విసర్జించే చోట్ల పనిచేస్తుండేవారిలో... వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు కొంతమేర ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
బరువు విషయంలో జాగ్రత్త కాబోయే తల్లి తన బరువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్థూలకాయులైన మహిళలు గర్భధారణకోసం ప్లాన్ చేసుకున్నప్పుడు తమ బరువును బట్టి డాక్టర్ సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని షార్ట్‌కట్ ప్రక్రియలను అవలంబించకూడదు.
ముందు నుంచే మాత్రలు...తాను తల్లి కావాలనుకున్న నాటికి కనీసం ఒక నెల ముందు నుంచైనా ఫోలిక్ యాసిడ్ లాంటి కొన్ని టాబ్లెట్లూ తీసుకోవాలి. మన దేశంలోని రుతుస్రావం కనిపించే యుక్తవయస్కులైన యువతుల్లో దాదాపు 85 శాతం మందిలో రక్తహీనత ఉంటుంది. దీనివల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అందుకే గర్భవతిని కావాలనుకున్న మహిళ రక్తహీనత లేకుండా చూసుకునేందుకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, మాంసాహారంలో లివర్, అటుకులు, బెల్లం, నట్స్ వంటివి తీసుకోవాలి. ఇవి తీసుకున్నప్పటికీ ఐరన్ సరిగా సమకూరకపోతే తప్పనిసరిగా ఐరన్ టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్స్ తీసుకోవాలి.