ఒక ఊరిలో మంగమ్మ, ఎల్లయ్య అనే దంపతులు వుండేవాళ్లు. ఇద్దరూ సోమరులు. ఆశపోతులు. ఈ విషయంలో భర్త కంటే మంగమ్మ నాలుగాకులు ఎక్కువే చదివింది. ఓ రోజు మంగమ్మ భర్తను పిలిచి ‘‘కట్టెలు లేవు. అడవికెళ్ళి తీసుకురా!’’ అని చెప్పింది.
సరేనని చెప్పి గొడ్డలి తీసుకుని అడవికి బయల్దేరిన ఎల్లయ్య ఒక చింతచెట్టును నరకబోయాడు. ఇంతలో ఒక విచిత్రమైన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ‘‘నన్ను చింత రాజు అంటారు. నేను ఈ చెట్టును ఆశ్రయించుకుని వుంటున్నాను. నువ్వు ఈ చెట్టును నరకకుండా వుంటే నేను నీకు కోరుకున్నది ఇస్తాను’’ అన్నాడు.
ఎల్లయ్య సంతోషించి ‘‘నాకు మంచి ఇల్లు ఇవ్వు’’ అని అడిగాడు.
‘‘అలాగే ఇచ్చాను వెళ్లు’’ అన్నాడు చింతరాజు. ఎల్లయ్య ఇంటికి వచ్చేటప్పటికి పూరింటి స్థానంలో బ్రహ్మాండమైన భవంతి కనిపించింది. మంగమ్మ అసలు విషయం తెలుసుకుని ‘‘ నువ్వు మళ్లీ వెళ్లి నాకు బోలెడు నగలు, డబ్బు కావాలని అడుగు’’ అని భర్తతో చెప్పింది. ఎల్లయ్య మళ్లీ అడవికి వెళ్లి చెట్టు నరకబోయాడు. చింతరాజు మళ్లీ ప్రత్యక్షమై ‘‘ఏమి కావాలి?’’ అని అడిగాడు. నా భార్యకు బోలెడు డబ్బు, నగలు కావాలట’’ అని అడిగాడు.
‘‘అలాగే ఇచ్చాను పో!’’ అన్నాడు చింత రాజు. ఎల్లయ్య వచ్చి చూడగా నట్టింట్లో ధనం, బంగారు రాశులు కనిపించాయి. ఈసారి మంగమ్మ ‘‘మనకు బోలెడన్ని పాడిపశువులు కావాలని అడుగు’’ అంది. ఎల్లయ్య మళ్లీ వెళ్లి అడగ్గా చింతరాజు ‘‘అలాగే ఇచ్చాను వెళ్లు’’ అన్నాడు. ఎల్లయ్య ఇంటికొచ్చి చూసేసరికి ఇంటిముందు బోలెడన్ని ఆవులు, గేదెలు వున్నాయి.
కానీ మంగమ్మ ‘‘మనకు ఇంత సంపద ఉంది కదా! దొంగలు దోచుకు పోకుండా కాపలా వుండటానికి ఒక రాక్షసుడు కావాలని అడుగు’’ అని చెప్పింది. ఎల్లయ్య అడవికి వెళ్లి అడగ్గా చింతరాజు ‘‘ఇచ్చాను పో’’ అన్నాడు. ఎల్లయ్య తిరిగి వచ్చేప్పటికి రాక్షసుణ్ణి చూసి పాడిపశువులు, పనిమనుషులు అంతా పారిపోగా ఆకలిగొన్న రాక్షసుడు మంగమ్మను తినేశాడు. అది చూసి ఎల్లయ్య గుండెలు బాదుకుంటూ రోదించాడు.
No comments:
Post a Comment