all

Monday, January 28, 2013

ఈవిడలాగే గొంతు మార్చి మాట్లాడేవాణ్ణి(బెటర్ హాఫ్)

 
 
మిమిక్రీతో ఉన్న చోటే నవ్వుల పువ్వులు విరబూయిస్తారు శివారెడ్డి. ఆ నవ్వులతో తనూ జతకలుపుతారు ఆయన శ్రీమతి స్వాతి. నాలుగేళ్ల క్రితం ప్రపంచ నవ్వుల దినోత్సం రోజునే ఒక్కటైన ఈ దంపతులు తమ వైవాహిక జీవితం నవ్వుల నావలా సాగిపోతుందని ఆనందంగా తెలియజేశారు. వారిద్దరూ పంచుకున్న ఆ విశేషాలే ఇవాల్టి బెటర్ హాఫ్.

ఆమె బి.టెక్ చదివింది. ఈయన జీవితాన్ని చదివారు. అదే తమ జీవితాన్ని బెటర్‌గా మార్చిందన్నారు శివారెడ్డి, స్వాతి దంపతులు. హైదరాబాద్ మణికొండలో ఉంటున్న వీరిని కలిసినప్పుడు నాలుగేళ్ల తమ దాంపత్యంలోని నవ్వుల సరాగాలను ఆనందంగా పంచుకున్నారు.

పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఆమోదం తెలిపానని, తమ పెళ్లినాటి ముచ్చట్లను వివరించడానికి సాధారణంగానే శివారెడ్డి ఉత్సాహం చూపారు. ‘‘నా ఫ్రెండ్ వాళ్ల కుటుంబం సిద్దిపేటలోని వీళ్లింట్లో అద్దెకు ఉండేవారు. అక్కడ వీళ్లింట్లో నా గురించి చె ప్పారు. సినిమా ఆర్టిస్టా! అని వీళ్లింట్లో వాళ్లు భయపడ్డారట. కాని మంచి అబ్బాయి అని తెలిసినవాళ్లు చెప్పడంతో ఒక రోజు ఈవిడ నాన్న, బాబాయి, తాతయ్య నా కోసం వచ్చారు సంబంధం మాట్లాడటానికి. హోటల్‌లో భోజనం చేశాం. తినేటప్పుడు మొదటి ముద్ద కళ్లకు అద్దుకొని తినడం అలవాటు నాకు. అన్నాన్ని, పెద్దలను గౌరవించే పద్ధతి వారికి ఇంకా నచ్చిందని చెప్పారు. అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్పి వెళ్లారు. వాళ్లు చెప్పినట్టే వెళ్లాను. అమ్మాయిని చూశాను. నచ్చలేదు. (?!?!) (స్వాతి నవ్వుతూనే ఉన్నారు) మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, అదే మాట చెప్పాను. వాళ్లు ఆశ్చర్యపోయి మంచి అమ్మాయి మరోసారి చూసిరా అన్నారు. సరే, అని మళ్లీ వెళ్లాను. ఈవిడ తల వంచుకుని కూర్చుని ఉంది. పైగా వణుకుతోంది. నేనేమో జోవియల్. 

బెటర్ హాఫ్ తరువాయి

ఈమె చూస్తే ఇలా ఉంది. నాకు సూటవుదులే! అనుకుంటూనే కూర్చున్నాను. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని, ‘హాయ్, హలో అండీ’ అని మొదలెట్టాను. ఈవిడ అప్పుడు తలెత్తింది. ఆ మాటల్లోనూ, పద్ధతిలోనూ చూస్తున్నాకొద్దీ బాగా నచ్చేసింది. ఇంత మంచి అమ్మాయిని వద్దనుకున్నానేంటి? అని నన్ను నేను తిట్టుకున్నాను..’’ ఇంకా చెప్పబోతున్న శ్రీవారి మాటలకు స్వాతి బ్రేక్ వేస్తూ ‘‘ఈయనకు సావిత్రి, సౌందర్య... అంటే చాలా ఇష్టం. హీరోయిన్‌ని ఊహించుకొని వస్తే నేనెలా నచ్చుతాను? పైగా నేను ముందే, సినిమా స్టార్ ఎక్కడ? నేనెక్కడ? అనుకున్నాను. ఈయన పెళ్లిచూపులకు వస్తున్నాడంటే... నమ్మలేకపోయాను. ఎలాగూ వస్తున్నారు కాబట్టి ఓ ఫొటో దిగాలి అనుకున్నాను. అలాంటిది ఈయనకి నచ్చడం, ఓకే చెప్పడం, పెళ్లయిపోవడం.. ఇప్పటికీ అన్నీ కలగా అనిపిస్తుంటాయి’’ అంటూ ఇంకా తేరుకోని ఆశ్చర్యంతో పెళ్లినాటి ముచ్చట్లను సంబరంగా వివరించారు స్వాతి. పెళ్లికి ముందునుంచీ శివారెడ్డి మిమిక్రీ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం అన్నారామె. 

గొంతుమారిస్తే నవ్వులే..!

స్టేజీ మీద, సినిమాల్లోనే కాదు ఇంట్లోనూ తన శ్రీవారు తెగ నవ్విస్తారు అని మురిసిపోయారు స్వాతి. ‘‘పెళ్లి అనుకున్నప్పటినుంచే నన్ను తెగ ఆటపట్టించేవారు. ఫోన్ చేసి నా ఫ్రెండ్స్‌లా గొంతుమార్చి అమ్మాయిలాగ మాట్లాడేవారు. ఇప్పటికీ మా పుట్టింటివారు (అమ్మ,నాన్న,తమ్ముడు) ఫోన్ చేస్తే నా వాయిస్ అనుకరించి మాట్లాడుతుంటారు. నేనే అనుకొని వాళ్లూ తెగ మాట్లాడేస్తుంటారు. మా ఫ్రెండ్స్ నాకోసం ఫోన్ చేస్తే, నాలాగ మాట్లాడేస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి వారు తెగ భయపడిపోతుంటారు. ‘అమ్మో! నీకు ఫోన్ చేద్దామన్నా భయంగా ఉందే, నువ్వే ఫోన్ చేయి తల్లీ’ అంటుంటారు’’ అని స్వాతి శ్రీవారి అల్లరి పనులను గబగబా చెప్పుకుపోతుంటే శివారెడ్డి అందుకున్నారు ‘‘అప్పుడప్పుడు మా అమ్మనూ అనుకరించి, ఈమెను పిలుస్తుంటాను. అప్పుడు ఈవిడ ‘హా, అత్తయ్యా వస్తున్నా.. ’అంటూ పరుగులు తీస్తుంటుంది. ఈవిడకు మాటకు ముందు, మాట తర్వాత ‘హా’ అనడం అలవాటు’’ అని శ్రీవారు చెబుతుంటే మరిన్ని నవ్వులను తన పెదవులపై పూయించారు స్వాతి. 

భావాలు భిన్నమైనా ఒకటే టేస్ట్...

శ్రీవారు ఆలోచనలే కాదు పనులూ చాలా వేగంగా ఉంటాయని చెప్పిన శ్రీమతి ఆ వేగాన్ని తను అందుకోలేకపోతున్నానని కించిత్తు ఆవేదను వ్యక్తం చేశారు. శివారెడ్డి మాత్రం ఆ నిదానమే తనను సేఫ్‌గా ఉంచుతుందని ముచ్చటపడ్డారు. కట్టుబొట్టు విషయంలోనూ శ్రీవారి సూచనలే పాటిస్తానని చెప్పిన శ్రీమతి ‘‘ఈయన టేస్ట్ సూపర్బ్’’ అంటూ బోలెడు కితాబులిచ్చేశారు. 

‘‘మెట్టినింట్లో అడుగుపెట్టిన తను కొన్ని రోజుల్లోనే అత్తగారి దగ్గర కూతురి ప్రేమను పొందానని చెప్పిన స్వాతి మాటలకు అదెలా సాధ్యమైందని అడిగితే- ‘‘మా అత్తగారికి నచ్చేలా ఉంటాను. సినిమాలకు, షాపింగ్‌లకు అత్తగారితో సహా కలిసే వెళ్తాం. మా అత్తగారికి నా వయసు మనమరాలు ఉన్నారు. నన్ను కోడలుగా కాకుండా మనవరాలుగా చూసుకుంటారు’’ అంటూ మెట్టినింట తను అల్లుకుపోయిన విధానాన్ని అందంగా వివరించారు స్వాతి. అంతేకాదు శ్రీవారిని తన పుట్టినింటి వారు కొడుకులా భావిస్తారని’’ స్వాతి వివరిస్తుంటే శివారెడ్డి అందుకున్నారు. ‘‘ఏ రాత్రి వెళ్లినా అప్పుడే వచ్చిన కొత్తళ్ళుడిలా చూసుకుంటారు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు కూడా వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు. వీలు దొరికితే అంతా కలిసి అంత్యాక్షరీలు, గేమ్స్ ఆడుకుంటుం టాం’’ అంటూ అత్తగారింట్లో తనకు ఏ విధంగా మర్యాదలు జరుగుతాయో పూసగుచ్చినట్టు వివరించారాయన. 

చీరకు పాప్యులారిటీ...

శ్రీవారు ఉంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉంటుందో తెలిపిన శ్రీమతి ఆయన అల్లరి పనులు తనను మరీ మరీ నవ్విస్తాయని చెప్పారు. ‘‘ఇంట్లో నా చీరకట్టుకొని ఏడిపించేవారు. ‘వద్దు, ప్లీజ్ తీసేయండి’ అన్నా వినేవారు కాదు. దూకుడులో లేడీ గెటప్ చాన్స్ వచ్చింది. సినిమా షూటింగ్‌కి క్యాస్టూమ్స్ వాళ్లే ఇచ్చారు. టీవీ షోలో ఓ ప్రోగ్రామ్‌కి నా చీరనే తీసుకెళ్లారు. ఈయన చీరకట్టుతో ఆ షో పెద్ద హిట్ అయింది. నేను ఇప్పుడు ఆ చీర కట్టుకుంటే అందరూ గుర్తుపట్టేస్తారు. అంత పాప్యులారిటీ వచ్చింది ఆ చీరకు. మా వారు కట్టుకున్న చీర అని దాన్ని గుర్తుగా దాచుకున్నాను’’ అని స్వాతి మురిపెంగా చెబుతుంటే శివారెడ్డి ఆనందంగా వింటూండిపోయారు.

చిన్న చిన్న తగాదాలు చిటికెలో మాయం...

‘‘స్విచ్ ఎక్కడ ఉంటుంది, వైర్ ఉన్న దగ్గరే లేదా ఆ దారిలోనే ఉంటుంది. కాని అది కూడా ఈవిడకు చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంటుంది’’ అని శివారెడ్డి కంప్లైయింట్ చేస్తుంటే.. ‘‘చిన్నప్పటి నుంచి అమ్మనాన్న, తమ్ముడు గైడ్ చేసేవారు. అలాగే అలవాటైంది. అందుకే అంటాను ఈయన వేగానికి అందుకోలేకపోతున్నాను అని...’’ తను పెరిగిన వాతావరణాన్ని తెలియజేశారు స్వాతి. 

అభిమానించి, అర్ధం చేసుకుంటూ ప్రేమగా చూసుకునే శ్రీమతి తనకు విలువైన బహుమతిగా శ్రీవారు చెబుతుంటే ఆనందంగా వింటుండిపోయారు శ్రీమతి. ‘‘షూటింగ్స్ అని, ప్రోగ్రామ్స్ అని ... ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలియదు. అదే మరొక అమ్మాయి అయితే అలిగి పెద్ద రాద్ధాంతం చేసేది. కాని తన పనలు తను చూసుకుంటూ నా కోసం ప్రేమగా ఎదురుచూస్తుంటుంది. పైగా ఎప్పుడూ నవ్వుతుంటుంది. ఆ నవ్వే నాకు మరింతగా నచ్చుతుంది’’ అంటూ శ్రీమతిలో తనకు అమితంగా నచ్చే అంశాలను తెలియజేశారు శివారెడ్డి.

శివారెడ్డికి నవ్వించడం ఇష్టం. స్వాతికి నవ్వుతూ ఉండటం ఇష్టం. ఆ నవ్వులే వారి దాంపత్యాన్ని కులాసాగా మారుస్తున్నాయని వీరితో మాట్లాడిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

No comments: