పుట్టిన బిడ్డ కలకాలం ఆరోగ్యంగా ఉండాలి. కాబోయే ప్రతి తల్లి తపన ఇదే. భవిష్యత్తులో ఏదైనా కారణాల వల్ల ఆ బిడ్డలో ఏదైనా అవయవం దెబ్బతింటే? అలాంటప్పుడు ఒకే ఒక కణంతో తన బిడ్డ తాలూకు దెబ్బతిన్న ఏ అవయవాన్నైనా మళ్లీ సృష్టించడం సాధ్యమని తెలిస్తే...? ఆ అమ్మ కణాన్ని ఎంతో జాగ్రత్తగా దాస్తుంది. ఎంత జాగ్రత్తగానంటే ఒడిలోని బిడ్డ అంతటి పదిలంగా! ఆ కణం మరెక్కడో లేదు.
తన బిడ్డకు ఆహారాన్ని అందించే తన బొడ్డుతాడులోనే! ఆ కణాలనే మూలకణాలంటారు. ఆ మూలకణాన్ని దాచి ఉంచితే చాలు... మున్ముందు బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయగలగడం సాధ్యం. అందుకే దాన్ని దాచుకోవడం ఎంతో అవసరం. కేవలం ఒక్క ప్రసవ సమయంలో మాత్రమే సాధ్యమయ్యే బొడ్డుతాడు సేకరణపై కాబోయే తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం.
అనగనగా ఒక తాడు. నిజానికి అది ఒక మ్యాజిక్ తాడు. మీకు తెలుసా? ఆ తాడుతో భవిష్యత్తులో బిడ్డకు వచ్చే ఏ రోగాన్నైనా కట్టిపడేయడం చాలా సులభం. అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అది తల్లి నుంచి బిడ్డకు ఆహారం అందించే బొడ్డుతాడు!
బొడ్డుతాడుకు అంత ప్రాధాన్యతా...?
అవును. తల్లి నుంచి బిడ్డకు ఆహారాన్ని అందించేందుకు బొడ్డుతాడు ఉపయోగపడుతుందన్నది తెలిసిన విషయమే. నిన్నమొన్నటి వరకూ బిడ్డ పుట్టగానే తల్లినుంచి బిడ్డను వేరు చేసేందుకు ఆ బొడ్డుతాడును కోసి పారేసేవారు. కానీ... ఆ బొడ్డుతాడులో కొన్ని కణాలుంటాయి. ఆ కణాలు కేవలం బొడ్డుతాడులోని రక్తంలోనే ఉంటాయి. వాటినే ‘హెమటోపాయినిక్ సెల్స్’ అంటారు. తెలుగులో చెప్పాలంటే ‘మూల కణాలు’. తల్లిలోని బొడ్డుతాడుతోపాటు గర్భాశయంలోని ద్రవంలో ఈ కణాలు ఉన్నప్పటికీ 98శాతం బొడ్డుతాడులోని రక్తంలోనే ఉంటాయి.
మూలకణాలకు ఆ పేరెందుకు..?
మూలకణాలకు ఆ పేరెందుకు వచ్చిందో తెలుసుకునే ముందు మన శరీరంలోని ఒక అవయవం గురించి తెలుసుకుందాం. ఏదైనా ప్రమాదం వల్ల దెబ్బతిన్నా లేదా తెగిపోయినా మళ్లీ దాని మునుపటి రూపానికి వచ్చే శక్తి శరీరంలోని ఏ అవయవానికీ లేదు... ఒక్క కాలేయానికి తప్ప. ఎందుకంటే కాలేయంలోని కొంతభాగాన్ని తొలగించినా మునుపటిలా పెరగగలదు. అదేలాంటి శక్తి మిగతా అవయవాలకూ ఉంటే ఎంత బాగుండేది! ఇది ఊహ. కానీ... నేరుగా ఇది సాధ్యం కాకపోయినా... పరోక్షంగా ఇలా జరిగేందుకు ఆస్కారం ఇచ్చేవే మూలకణాలు. ఈ మూలకణమే ఆయా అవయవాల్లోకి ప్రవేశపెడితే... చర్మ కణంగా, ఎముకకణంగా, కండరంలా, మూలుగ కణంలా... ఇలా ఏ కణంగానైనా మారగలుగుతుంది. అందుకే వీటిని ‘మూల’ కణాలని పిలిచారు.
ఏం చేస్తాయి? ఎలా ఉపయోగపడతాయి?
మన శరీరంలోని ఏదైనా అవయవం చెడిపోతే దాన్ని మార్చితే తప్ప రోగి బతకని పరిస్థితి ఏర్పడిందనుకోండి. కాని చాలాసార్లు అవి దొరికేందుకు అవకాశం ఉండదు. ఉదాహరణకు మూత్రపిండాలు చెడిపోయిన వారి విషయాన్ని పరిశీలిద్దాం. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకుంటే తప్ప రోగి బతకరు. కానీ అలా చేయించుకోవడం ఎంతో ఖర్చుతో కూడినపని. ఒకేసారి ఎలాగోలా మూత్రపిండాల మార్పిడి చేయించుకుందాం అనుకుంటే... అవి కావలసిన రోగులకు అవసరమైనన్ని మూత్రపిండాలిచ్చే దాతలు ఉండకపోవచ్చు. ఫలితంగా ప్రాణం కాపాడుకోవడానికి ఎంతటి అనుచిత చర్యలకైనా పాల్పడేవారూ, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కిడ్నీలతో వ్యాపారం చేసేవారు పెచ్చుమీరిపోయారు. ఒకవేళ కిడ్నీ చెడిపోతే కేవలం ఈ కణాలను ఉపయోగించి మళ్లీ మునుపటిలా కిడ్నీని మార్చగలిగితే! ఇక ఇలాంటి అనైతిక అనర్థాలకు తావే ఉండదు కదా! ఇదే పరిస్థితి ఏ అవయవానికైనా వర్తిస్తుంది. అందుకు ఆస్కారం ఇచ్చేదే మూలకణం. కాబట్టి దాన్ని నిలువచేసుకుని కాపాడుకోవడం ఇప్పుడు మనందరి విధి.
అవగాహన ఏదీ...?
బ్యాంకులో డబ్బుదాచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకున్నట్లుగా... ఈ మూలకణాలనూ సంబంధిత బ్యాంకులో దాచుకుని భవిష్యత్తులో ఏదైనా అవయవం దెబ్బతిన్నప్పుడో లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడో వాడుకోవచ్చు. కానీ ఇప్పటికీ దీనిగురించి సాధారణ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇంతటి విలువైన బొడ్డుతాడును చాలామంది మునపటిలాగే పారేస్తున్నారు.
ఇకనైనా జాగ్రత్తపడదాం...
బొడ్డుతాడు నుంచి సేకరించిన ఈ మూలకణాలను జాగ్రత్తగా దాచుకుంటే మున్ముందు అవయవాలు దెబ్బతిన్నప్పుడు మాత్రమే కాదు... ఒకవేళ రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చినా లేదా ఇప్పటి వరకూ చికిత్స సాధ్యం కాదని భావిస్తూ ఉన్న జన్యుసంబంధమైన వ్యాధులు వచ్చినా ఈ మూలకణాలతో సులువుగా చికిత్స చేయవచ్చు. అందుకే మీ మొదటిబిడ్డ సమయంలో వీటిని సేకరించలేదా? ఇప్పుడు మీరు రెండో బిడ్డకు ప్లాన్ చేసుకునే దశలో ఉన్నారా? నష్టపోయిందేమీ లేదు... ఇప్పుడు మీ రెండోబిడ్డనుంచి సేకరించిన కణాలే... మీ రెండోబిడ్డతో పాటు, మొదటిబిడ్డకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని సేకరించి బ్యాంకులో దాచుకుని మీ బిడ్డలకు రక్షణ కల్పించుకోవచ్చు.
సేకరణ ఎలా..? దాచిపెట్టడం ఎలా...?
ప్రసవం జరగగానే బొడ్డుతాడు నుంచి రక్తాన్ని సేకరించి వాటిని (ఆ శాంపుల్స్) మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లిక్విడ్ నైట్రోజన్ బ్యాంకులో భద్రపరుస్తారు. దేశంలోని పెద్ద ప్రధాన నగరాల్లోలాగే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఈ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అందుకే మీకు ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకున్నచోట ఉన్న డాక్టర్‌ను కోరితే (నేరుగా బ్యాంకువారినే కోరవచ్చు) వారు... ఈ మూలకణ బ్యాంకు వారికి సమాచారం పంపుతారు. అప్పుడు బ్యాంకు నుంచి వచ్చిన ప్రతినిధులు బొడ్డుతాడునూ, బొడ్డుతాడు నుంచి రక్తాన్నీ సేకరించి తీసుకుని వెళ్లి బ్యాంకులో భద్రపరుస్తారు. ఒకవేళ దగ్గర్లోని ఏ ఊరిలో ప్రసవం జరిగినా... ఆరేడు గంటలలోపు హైదరాబాద్‌కు శాంపుల్‌ను చేర్చగలిగితే చాలా మంచిది. ప్రసవం జరిగిన ఆరేడు గంటల లోపు శాంపుల్‌ను తప్పనిసరిగా లిక్విడ్ నైట్రోజన్‌లో భద్రపరచాల్సిందే. ఒకవేళ అలా చేర్చలేకపోతే ప్రతి మూడు గంటలకు శాంపుల్‌లోని 18 శాతం శాశ్వతంగా దెబ్బతినిపోతూ ఉంటుంది. కాబట్టి బొడ్డుతాడు నుంచి సేకరించిన రక్తం శాంపుల్‌ను ఆరేడు గంటల లోపు తప్పనిసరిగా బ్యాంకుకు చేర్చాల్సిందే.
ఎంత ఖర్చవుతుంది...?
అది ఆయా బ్యాంకు వారిచ్చే సేవలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న ట్రాన్-స్ సెల్ బయలాజిక్స్ సంస్థ బొడ్డుతాడు నుంచి సేకరించిన రక్తం వరకే తమ బ్యాంకులో 21 ఏళ్ల పాటు నిల్వ ఉంచడానికి రూ. 75,000 వసూలు చేస్తుంది. అలాగే రక్తంతో పాటు, బొడ్డు తాడునూ 21 ఏళ్లపాటు నిల్వచేయాలంటే రూ. 90,000 ఖర్చవుతాయి. ఇక బొడ్డుతాడు, రక్తం నిల్వతో పాటు కోటి మూలకణాలను ప్రాసెస్ చేయడానికి రూ. లక్షా ఇరవై ఐదు వేలు ఖర్చవుతాయి.
ఇవి మనం బ్యాంకులో ఉంచినందుకు చెల్లించాల్సిన మొత్తం. ఇక మరి మన అవసరానికి కణాలను బ్యాంకు నుంచి తిరిగి తీసుకోవాలంటే...? ఒక కిలో బరువున్న ఏదైనా అవయవాన్ని మళ్లీ మునపటిలా చేయాలంటే పదిలక్షల మూలకణాలు అవసరం. ఈ పదిలక్షల మూలకణాల తయారీ వారి పరిశోధన కేంద్రంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా తయారుచేసి ఇచ్చినందుకుగాను ప్రతి మిలియన్ కణాలకు ప్రస్తుతం రెండువేలు వసూలు చేస్తున్నారు.
అంత ఖర్చును భరించలేనివారైతే...?
మీకు మూలకణాలను నిల్వ చేసుకోవచ్చనే అంశంపై అవగాహన ఉన్నా... ప్రస్తుతం నిల్వ చేసుకునేందుకు రూ. 75,000 ఖర్చును భరించలేనివారైతే? అప్పుడు కూడా బ్యాంకులో మీ బొడ్డుతాడు నూ, అందులోంచి తీసిన రక్తాన్నీ నిల్వ చేసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనల మేరకు ఆ నిల్వ చేయడం జరుగుతుంటుంది.
బ్యాంకుతో ఇతరులకూ ప్రయోజనమా?
అవును. అయితే జన్యుపరంగా చూస్తే ఆయా కుటుంబ సభ్యులకు వెంటనే ఉపయోగపడే మూలకణాలు ఇతరులకూ సూట్ అవుతాయా అన్నది తెలుసుకోవాలంటే ‘హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్’ అనే ఒక పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో 60 శాతం మ్యాచ్ అయితే ఆ మూల కణాలు... మ్యాచ్ అయిన వారికీ పనికి వస్తాయి. అలా ఇతరులకూ ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రతివారూ మూలకణాలను గురించి తెలుసుకుని, వాటిని దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏయే వ్యాధులకు ఉపయోగం...?
ప్రస్తుతం పలురకాల క్యాన్సర్ల (ల్యుకేమియా) చికిత్సకు ఈ మూలకణాలు ఉపయోపడుతున్నాయి. వాటితో పాటు భవిష్యత్తులో గుండె కణజాల రిపేర్లకు, వెన్నుపూసకు అయ్యే గాయాలకు, పార్కిన్‌సన్ వ్యాధి చికిత్సకూ ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు... మల్టిపుల్ మైలోమా, డయాబెటిస్, బీటా థలసేమియా, మేజర్ ఆస్టియోపోరోసిస్, అనేకరకాల జన్యుసంబంధమైన వ్యాధు ల చికిత్సకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు... హెచ్‌ఐవీ చికిత్సకు సైతం ఉపయోగపడతాయి.
దీనితో పాటు మనలో ఏదైనా అవయవం దెబ్బతింటే వాటిని పూర్తిగా మునపటిలా చేసే ప్రక్రియలో సహాయపడగల శక్తి ఈ మూలకణాలకే ఉందని తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిశోధనలు సత్ఫలితాలిస్తే... భవిష్యత్తులో అవయవం కోల్పోవడం వల్ల అవకరం వచ్చినవారే ఉండరంటే అది అతిశయోక్తి కాబోదు.
No comments:
Post a Comment