అమరేంద్రపురి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఇంద్రదత్త మహారాజుకు వేట అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ సమీపంలోని అరణ్యానికి వెళ్లి జంతువులను వేటాడి వస్తుండేవాడు.
రాజుగారి ఈ మోజు కారణంగా అడవిలోని జంతువులన్నీ బలైపోసాగాయి.
అయితే మహారాజుకు ఈ విషయం చెప్పేందుకు మంత్రి, సేనాధిపతితో సహా ప్రజలందరికీ భయమే! ఒకసారి అడవికి వేటకు వెళ్లిన ఇంద్రదత్తుడి గుర్రం బెదిరిపోయి వేగంగా పరుగెడుతూ పడిపోయింది. దాంతో అదుపు తప్పిన మహారాజు కిందపడిపోయాడు. అతని తలకు బలమైన గాయం తగిలింది. అదే అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్న ఒక మునీశ్వరుడు అటుగా వెళుతూ గాయపడి స్పృహ తప్పి పడివున్న రాజును చూసి శిష్యుల సాయంతో ఆయనను తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు.
ఆకుపసరుతో ఆయన తలకు కట్టుకట్టి, మూలికల రసం తాగించడంతో మహరాజు తేరుకుని స్పృహలోకి వచ్చాడు.
తనను కాపాడింది ఒక మునీశ్వరుడు అని తెలుసుకున్న రాజు ఆయనకు నమస్కరించి ‘‘మునీశ్వరా! ఈ రోజు మీ దయవల్ల నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను. నాకు ప్రాణదానం చేసిన మీరు నా వెంట రాజ్యానికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి, నేను ఇచ్చే కానుకలను పుచ్చుకోవలసిందిగా అర్థిస్తున్నాను’’ అని వినయంగా పలికాడు.
మునీశ్వరుడు ‘మహారాజా! నీవు రాజువు అనే ప్రత్యేకమైన కారణంతో నేను నిన్ను కాపాడలేదు. నీ బాణం దెబ్బకు గాయపడిఉన్న ఆ జింకను కూడా నీ వలెనే కాపాడి చికిత్స చేశాను. నా దృష్టిలో ప్రాణులన్నీ సమానమే’ అన్నాడు.
మునీశ్వరుడి మాటలతో ఇంద్రదత్త మహారాజుకు జ్ఞానోదయం అయింది. ఆనాటినుండి వేట మానుకుని అడవిలోని జంతువులను సంరక్షించసాగాడు.
నీతి: జీవహింస మహాపాపం. సృష్టిలో ప్రాణులన్నీ సమానమే.
No comments:
Post a Comment