సరిపురంలో ఉంటూన్న విశ్వనాధం తను చేసే ఉపాధ్యాయవృత్తిని దైవంగా భావించేవాడు. విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ, క్రమశిక్షణను నేర్పేవాడు. అందువల్ల విశ్వనాధం అంటే పిల్లలకూ, తల్లిదండ్రులకూ ఎంతో గౌరవాదరాలు ఉండేవి. విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు. భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ, ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాబంగా పెంచి పెద్దచేసింది.
చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి, పట్నం వెళ్ళి పైచదువులు చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. అక్కడొక అమ్మాయిని చూసి ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్ళి చేసుకున్నాడు. ఇది విశ్వనాధానికి తీరని ఆవేదన కలిగించింది. ‘‘మనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎంత పనిచేశాడు చూశావా మన చైతన్య? మనతో చెబితే వాడి కోర్కెను కాదంటామా?'' అంటూ భార్యతో వాపోయూడాయన.
‘‘చెప్పి ఉంటే బావుండేది. అయినా చెప్పలేదు. ఏం చేద్దాం. మన ప్రాప్తం అంత. వాడు బావుంటే చాలు. కాలం మారిపోయింది, పోనిద్దురూ,'' అని భర్తను ఓదార్చింది విశాలాక్షి. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాధం భార్యతో కలిసి తీర్థయూత్రకు బయలుదేరి వెళ్ళి, కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు. ఆయన ఒకనాడు దైవదర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చుని ఉండగా, ఒక పదేళ్ళ కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు.
‘‘ఏం నాయనా, చదువుకోవలసిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నా వేమిటి? నీ తల్లిదండ్రులు ఏం చేస్తూంటారు?'' అని అడిగాడు విశ్వనాధం. ‘‘ఆర్నెల్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మానాన్న చనిపోయూరు. నిరుపేదలం. నేనూ, మా అవిటి తాతయ్యూ బిచ్చమెత్తుకుంటేనే, ఆకలికింత తినగలిగేది,'' అన్నాడు కుర్రాడు దీనంగా. విశ్వనాధం కుర్రాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, ‘‘నీ పేరేంటి, బాబూ,'' అని అడిగాడు. ‘‘మల్లేశం,'' అన్నాడు కుర్రాడు. ‘‘నేను చదివిస్తే చదువుతావా?'' అని అడిగాడు విశ్వనాధం.
‘‘చదు ుకుంటాను. మరి, మా తాతయ్య సంగతేమిటి?'' అన్నాడు మల్లేశం. ‘‘అతడికి మూడు పూటలా తిండి పెట్టే బాధ్యత నాది. నువ్వు చదువుకుంటావా మల్లేశం?'' అన్నాడు విశ్వనాధం. మల్లేశం సంతోషంగా తల ఊపాడు. ఆ తరవాత విశ్వనాధం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది. మల్లేశం వాళ్ళతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు.
కాలం వేగంగా గడిచిపోయింది. మరో పదేళ్ళలో మల్లేశం బాగా చదివి చేతికి అంది వచ్చాడు. మల్లేశం తాత కన్నుమూశాడు. వృద్ధుడై పోయిన విశ్వనాధం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమశ్వాస విడిచాడు. విశాలాక్షి, మల్లేశంతో పాటు ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. విశ్వనాధం ఏకైక కుమారుడు చైతన్య, ఉద్యోగరీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండడంతో, తండ్రి మరణించినప్పుడు కూడా రాలేక పోయూడు. మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాధం అంత్యక్రియలు జరిగిపోయూయి.
చైతన్య రెండు వారాల తరవాత సిరిపురం వచ్చాడు. తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేర రాసివెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు. ఆ విషయంగా తల్లిని నిలదీయూలని ఆవేశంగా ఇంటిని సమీపించిన చైతన్యకు లోపలి నుంచి ఏవో మాటలు వినిపించడంతో వాకిట్లోనే ఆగి పోయూడు.
‘‘గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను. ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటి పాపలా కాపాడుకోవడం నా బాధ్యత. గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం, మీ కుమారుడికే అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి,'' అంటున్నాడు మల్లేశం. ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికివచ్చి మల్లేశం చేతులు పట్టుకుని, ‘‘నువ్వు సోదర సమానుడివి. కన్నంత మాత్రాన కొడుకు కాడు; పెంచుకున్న వాడు కూడా కన్న బిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు! తండ్రిగారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో.
పట్నం రావడానికి అమ్మ సుముఖత చూపడం లేదు గనక, ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి,'' అన్నాడు. విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్ళకుండా, మల్లేశం వద్దే ఉంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపింది. మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, కన్నబిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకూ పాత్రుడయ్యూడు.
|