all

Tuesday, May 14, 2013

"అక్షయ తృతీయ"




''అక్షయ తృతీయ" పేరుకు తగ్గట్టు అక్షయమైన విశిష్టతలకు నెలవు. ఈరోజుకి ప్రత్యేకతలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో...ఎన్నెన్నో... ప్రతి పండుగకు ఏదో ఒక రకమైన విశిష్టత, గొప్పతనం ఆపాదించి చెప్తున్నాయి శాస్త్రాలు, పురాణాలు. భగవత్సంబంధమైన ఏదో ఒక కథనం ఆ పండుగకు సంబంధించి ఒక సందర్భం చెప్తుంటాయి. అటువంటి సందర్భం ఈ అక్షయ తృతీయ పర్వదినానికి కూడా ఉంది. అయితే ఈ పర్వదినానికి సంబంధించి సందర్భాలు గాని, విశిష్టతలు గాని ఒకటి కాదు అనేకం. ఒక రకంగా చెప్పాలంటే విశిష్టతల సమాహారం అని చెప్పొచ్చు.
అక్షయ తృతీయ అనగానే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం పూజలు చేయడం, తమ ఇంట సిరిసంపదలకు కొదవలేకుండా ఉండాలని తమ శక్తి కొద్దీ తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం కొనడం, ఇలాంటి సంప్రదాయా లను పాటించడం చూస్తుంటాం. అక్షయ తృతీయ స్త్రీలకు ఒక ముఖ్యమైన పండుగ. కాని అక్షయ తృతీయ ప్రత్యేకత అదొక్కటే కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత ఆసక్తితో ఎదురుచూసే 'చందనోత్సవం'... సింహాద్రప్పన్న నిజరూప దర్శనం దొరికేది ఈ అక్షయ తృతీయ ఒక్కరోజే.



శ్రీమన్నారాయణుని దశావతారాలలో ఆరవదయిన పరశురాముని జననం జరిగింది ఈనాడే! ఈరోజే శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయపాత్రను ప్రసాదించాడు. బదరీనాథ్‌లో బదరీనారాయణుడి ఆలయాన్ని ఈ అక్షయ తృతీయనాడే తెరుస్తారు. కృతయుగ ఆరంభం కూడా ఈనాడే అని పురాణాలు చెప్తున్నాయి. కొనడమే కాదు ఇవ్వడం కూడా ముఖ్యమే.
అక్షయ తృతీయ నాడు తమ శక్తి కొద్దీ చిన్నమెత్తు బంగారం అయినా కొనడానికి తహతహలాడుతుంటారు స్త్రీలు. అయితే అలా కొనడమే కాదు. ఆరోజు తమ శక్తి కొద్దీ బంగారాన్ని గాని, ధనాన్ని గాని, ఫలాలను గాని, వస్త్రాలను గాని, భూమిని గాని, పాదరక్షలు, నవధాన్యాలు, ఆహారధాన్యాలు ఇలా ఏదైనా కూడా దానమివ్వ డానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాయి పురాణాలు. ఈ అక్షయ తృతీయనాడు మనం ఏదిదానం చేస్తే దానిని అక్షయంగా పొందగలుగుతామని చెప్తు న్నాయి శాస్త్రాలు. ఈ రోజున మహాలక్షీదేవిని దర్శిం చుకొని ఆలయంలో కొన్ని నాణాలను గనుక వదలిపెడితే అక్షయంగా సంపద పెరుగుతుందట.
వారం-వర్జ్యాలకు అతీతమైన రోజు
ఏ శుభకార్యం చేసుకోవాలన్నా మనం వారం, వర్జ్యం, దుర్ముహుర్తం ఇవన్నీ చూసిగానీ చెయ్యం. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూడవలసిన అవసరం లేకుండానే శుభకార్యాలు చేసుకోవచ్చట. ఈరోజున చేసే పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు, దానాలు అక్షయమైన ఫలితాన్నందిస్తాయి. కనీసం ఈరోజు ఒక్కసారి భగవంతుని స్మరిస్తే అక్షయమైన పుణ్యఫలాలు అందుతాయని చెప్తున్నాయి శాస్త్రాలు. సింహాద్రప్పడిని నిజరూపంలో చూడగలిగే ఒకే ఒక్కరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని ప్రతినిత్యం మనం చందనపూతతోనే చూడగలం. కాని అక్షయ తృతీయ రోజు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే చందనం పూత లేకుండా నిజరూపంలో చూడగలుగుతాం. ఈరోజు కోసం అశేష భక్తజనం ఎదురుచూస్తూ ఉంటారు. సూర్యభగవానుని ప్రచండ తేజానికి కూడా జంకకుండా, మలమల మాడ్చే మండుటెండలో సైతం కాళ్లు పీక్కుపోతున్నా గంటల తరబడి ఓపిగ్గా వేచిచూస్తారు స్వామి నిజరూపదర్శనం కోసం. కొన్ని గంటలు మాత్రమే దొరికే ఈ భాగ్యం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు సింహాచలం చేరుకుంటారు.
పురాణ కథనం
ఈ తృతీయ నాడు చేసిన దానాలు ఎంతో ఫలితాన్ని స్తాయని విని గంగలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాదులు నిర్వహించి, ఒక వైశ్యుడు యవలు, గోధుమలు, చణకాలు మొదలైన వాటిని, నీళ్లతో నిండిన కుండలను యధాశక్తిగా దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అందువల్ల మరుజన్మలో కుశావతీ నగరంలో క్షత్రియునిగా పుట్టి అక్షయమైన సంపదలు కలిగి ఎన్నో యజ్ఞాలు, దానధర్మాలు చేశాడు.
అక్షయ తృతీయగా వైశాఖమాసంలో వచ్చే ఈరోజు వైదిక కాలమానం ఖగోళ శాస్త్ర, జ్యోతిష్య శాస్త్రాలననుసరించి సూర్యచంద్రులు శక్తివంతమైన స్థానాల్లో ఉండి ప్రకాశంతంగా వెలిగిపోతుంటారని సూర్యుడిని జీవానికి, చంద్రుడిని మేధస్సుకు అధిదేవతగా భావించే హిందూ సంప్రదాయంలో ప్రకృతి రమణీయతతో పాటు సూర్యుని తీక్షణమైన ఉష్ణప్రభావం కుటుంబీకులకు తగలకుండా క్షేమంగా సూర్యుని నమస్కరించే విధానమే అక్షయ తృతీయ.
కృత, త్రేత, ద్వాపర యుగాలు ఈ అక్షయతృతీయ నుండి ప్రారంభమయ్యాయని విష్ణుపురాణ కథనం. ఉదయమే అభ్యంగన స్నానం చేసి యవలు, గోధుమలు, పెసలు, శనగలు మొదలైన వాటిని దానం చేస్తారు. పెరుగు, అన్నమును కూడా కొందరు దానం చేస్తారు. అలా చేస్తే శాశ్వతంగా కైలాసంలో స్థానం లభిస్తుందని భవిష్యపురాణం, దేవీపురాణం తెలియజేసింది. పితృదేవతలకు పిండరహితమైన శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం అంటే చాలామంది చెడుగా అనుకుని తిట్టుగా కూడా వినియోగిస్తారు. శ్రద్ధగా చేసేది శ్రాద్ధం పితృదేవతల పట్ల భక్తి, శ్రద్ధలతో నిర్వహించేది. ఈ వ్రతం చేసినవారు ఉప్పును తినకుండా ఉండి చక్కెర కలిపిన పేలాల పిండిని తీసుకుంటారు. ఈరోజున చేసే జపాలు, హోమాలు, పితృ తర్పణాదులు, అక్షయమౌతాయని స్మృతి గ్రంథాలు పేర్కొన్నాయి. ఇది పరమ మహిమాన్వితమైన తిథి. ఈరోజున గంగాస్నానం విశేష ఫలం. ఈరోజున కొద్దిపాటిగానైనా జపం చేసినా, హోమ తర్పణాదులు ఏవి చేసినా విశేష ఫలితాన్నిస్తాయి.
చలువ కలిగించే పదార్థాలు పానకం, వడపప్పు వంటివి విష్ణువునకు నివేదించడం, మామిడిపళ్లు, విసనకర్ర విష్ణుప్రీతిగా యోగ్యవిప్రునకు దానం చేయడం చాలా మంచిది.

No comments: