చిట్టి కథ
మంజరి అనే అమ్మాయి ఒకరోజు తోటకు వెళ్లింది. అక్కడ చెట్టు మీద ఉన్న చిలుకను చూసి ముచ్చటపడి అది తనకు కావాలని అడిగింది. పనివాళ్లు ఆ చిలుకను ఒక పంజరంలో బంధించి తెచ్చి మంజరికి ఇచ్చారు.
మంజరి ఆ చిలుకను ఇంటికి తెచ్చుకుని ఎంతో ప్రేమగా దాంతో కబుర్లు చెపుతూ, రకరకాల ఫలాలు తినిపిస్తూ ఎప్పుడూ చిలుకతోనే కాలక్షేపం చేస్తూండేది. కానీ చిలుకకు ఈ పంజరంలో జీవితం ఏమీ నచ్చలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తే, తోటలో హాయిగా స్వేచ్ఛగా చెట్లమీద ఎగురుతుండే చిలుకలు, కాకులు, పిచ్చుకలు కనిపించేవి. వాటిని చూస్తే దానికి దిగులు అనిపించింది. ఒకరోజు చిలుక మంజరితో ‘‘నన్ను వదిలెయ్యి. స్వేచ్ఛ లేకుండా ఈ పంజరంలో నేను ఉండలేను’’ అంది. మంజరి ‘‘నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. నీకు రకరకాల ఖరీదైన ఫలాలు తినిపిస్తున్నాను. మంచి మంచి కబుర్లు చెపుతున్నాను కదా!’’ అంది. మంజరి ధోరణి చిలుకకు నచ్చలేదు. ఒకనాడు చిలుక అక్కడే ఎగురుతున్న దోమను పిలిచి ‘‘దోమా! దోమా! నాకోసాయం చేస్తావా?’’ అని అడిగింది. దోమ ఆశ్చర్యంగా ‘‘అబ్బో, నాకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నావు. నీకు నా సాయం కావాలా? సరే అడుగు చేస్తాను’’ అంది. ‘‘నువ్వు వెళ్లి ఆ అమ్మాయిని కుట్టు’’ అంది చిలుక. దోమ వెళ్లి మంజరిని కుట్టింది. దాంతో మంజరికి జ్వరం వచ్చింది. వైద్యుడు వచ్చి పరీక్షించి, ‘‘ఇది విషజ్వరం. పదిరోజులు మంచం దిగకూడదు. ఈ అమ్మాయి దగ్గరికి ఎవరూ వెళ్లకూడదు’’ అని చెప్పాడు. మంజరి మంచం దిగలేదు. ఎవరైనా ఎప్పుడో ఒకసారి వచ్చి రొట్టె తినిపించి మందు మింగించి, చిలుకక పండ్లు వేసి వెళ్లేవారు. పది రోజుల తర్వాత జ్వరం తగ్గి మంజరి చిలుక దగ్గరికి రాగా ‘‘ఇన్ని రోజులు మంచంలో వుంటే ఎలా వుంది?’’ అని వ్యంగ్యంగా అడిగింది చిలుక. ‘‘ఏమీ బాగా లేదు. స్వేచ్ఛ పోయింది’’ అంది మంజరి. ‘‘నేనూ అంతేకదా’’ అంది చిలుక. తెలివి తెచ్చుకున్న మంజరి చిలుకను వదిలేసింది. |
No comments:
Post a Comment