all

Tuesday, May 14, 2013

పిల్లల మనోభావాల వెనుక...


 
NewsListandDetailsపిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పాఠశాలకు పంపించడం, తిండి, బట్ట ఇవ్వడంతో తల్లిదండ్రుల బాధ్యత తీరదు. పిల్లలకి క్రమశిక్షణ, సత్ప్రవర్తన నిజాయితీ అయిన జీవితం అలవడాలంటే, తల్లిదండ్రులు క్షణక్షణం తాము ఏమి మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోవాలి. ఈ రోజులలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదని ప్రతిచోటా వినవస్తుంది. ఇందుకు గల కారణం ఏమిటని ఆలోచిస్తే తల్లిదండ్రులలోనే లోటు ఉన్నదని తేలుతుంది.






- తల్లిదండ్రులు వాళ్ల పెద్దల యెడల ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని పిల్లలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నాయనమ్మను, తాతయ్యను నిర్దాక్షిణ్యంగా దూషించి, ఇంట్లోంచి నెట్టివేస్తే తల్లిదండ్రులకు తమ పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉంటోందని ధ్యాస ఉండాలి.

- అవసరం కొద్దీ, ఇబ్బంది ఇరకాటం కలిగే సందర్భాల నుండి బయటపడి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు అబద్ధాలు చెపితే వారి పిల్లలు కొంత గమనించి అదే అనుకరించుతారని గ్రహించాలి.

- పిల్లలను తల్లిదండ్రులు ఆప్యాయంగా మాట్లాడాలి. మనసారా దగ్గరకు తీసుకోవాలి ప్రేమతో పలకరించాలి. పిల్లలను అక్కున చేర్చుకోవాలి. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను పొందాలి.

- రోజుకు ఒకసారి కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకునే అలవాటు చేసుకోవాలి. ఆ రోజు జరిగిన సంఘటనలు, ఆలోచనలు మనసులోని భావనలను పంచుకోవాలి.

- పిల్లల ఆసక్తి, శక్తి దృష్టిలో పెట్టుకుని చదివించాలి. కాని తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకుని వారి ఆసక్తిని పిల్లలమీద రుద్ది వాళ్లే నిర్ణయాలు తీసుకోవడం మంచి విధానం కాదు.

- పిల్లలతో ఎక్కువకాలం గడపాలి. వారంలో ఒకసారైనా స్నేహితులను, బంధువులను కలిసి ఆత్మీయతను పంచుకోవాలి.

- ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన పిల్లలలో కలిగించాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పట్ల పిల్లల్లో మంచిగా అవగాహన కలిగించాలి.

- పిల్లలకు మంచిగా బతకడానికి అవసరమైన సంస్కారం, వ్యక్తిత్వం, మంచి ఆలోచనలు, మానవత్వపు విలువలు, మాట్లాడే విధానం నేర్పాలి. కలిసిమెలిసి జీవించడం, పెద్దవాళ్లను గౌరవించడం, తోటివారిని ప్రేమించడం తెలపాలి.

- దైవచింతన, శాస్త్రాధ్యయనం పెద్దలు చేస్తే పిల్లలకు సునాయాసంగా అలవడుతుందని తల్లిదండ్రులు గ్రహిస్తే పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి తేలికమార్గం వారికి లభిస్తుంది.

- పిల్లలు మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి కలిగి ఉండే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధచూపాలి.

- సంకల్పబలం, సాధనాశక్తి, నిత్యకృషి, దృఢనిశ్చయం వంటి గుణాల పిల్లల్లో మానసిక శక్తిని పెంచుతాయి. పెద్దల పట్ల గౌరవం, వారి మాటపై విశ్వాసం, సక్రమ ప్రవర్తన పిల్లల శక్తిని మరింత ద్విగుణీకృతం చేస్తుంది.

- పిల్లలకు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య గారాబాలు, అమ్మానాన్న చిరుకోపాలు అన్న, అక్క, తమ్ముడు, చెల్లెళ్లతో హాయిగా కాలం గడిపే వాతావరణం కల్పించాలి. పెద్దవాళ్ల విషయంలో ఆప్యాయంగా పలుకరించే మనుషులు అందరూ కలిసి కూర్చుని నిష్కల్మషంగా, నిష్కర్షగా చర్చించుకునే అవకాశం పిల్లలకు కల్పించాలి.

- పిల్లలకు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉంటే పిల్లలలోని తప్పులను నూరుసార్లు సరిదిద్దగలం. కటువైన మాటలతో వారిని సరిదిద్దలేము. సాంప్రదాయబద్ధంగా కుటుంబంలో ఉన్న మానవ సంబంధాల పట్ల పిల్లలకు చక్కని అవకాశాన్ని కల్పించండి.

- తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల గౌరవ మర్యాదలతోను, నిజాయితీ, ఉదార స్వభావంతోనూ వ్యవహరించాలి.

- పిల్లలకు సన్మార్గాన్ని బోధించే సమయంలో ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ చక్కని గైడ్‌లా వ్యవహరించాలి. సహజంగానే తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శపూర్వకమైన వ్యక్తిగా కన్పించాలి. పిల్లల పెంపకంలో కూడా ఒక మంచి రోల్‌మోడల్‌గా కన్పించాలి.

- నేర్చుకోవటం పట్ల మీరు మీ పిల్లవాడికి ఒక పాజిటివ్‌ వైఖరిని అందివ్వండి. కొత్త విషయాలను కనుగొనడం, కొత్త నైపుణ్యాలను ప్రదర్శించడం, కొత్తకొత్త ఆలోచనలు చేయడం నేర్పించండి. నేర్చుకోవడం అంటే ఒక సరదా అయిన అనుభవంగా మలచండి.

- తల్లిదండ్రుల మధ్య అనురాగం, ఆత్మీయత, ఒకరిపట్ల ఒకరికి గౌరవం పుష్కలంగా ఉండటం గమనించే పిల్లలు సహజంగానే ప్రేమైక భావనలను ఏర్పరుచుకుంటారు. అన్యోన్యతను చూడలేని దంపతులు ఉత్తమ పేరెంట్‌ కాలేరు.

- పిల్లల్ని అతిగా విమర్శించకండి. వారి అత్యున్నత భావాలను దెబ్బతీయకండి. పిల్లలకు మీ సమక్షంలో భద్రతా భావనల్ని కల్పించండి. వారి ఎదురుగా మీరు కీచులాడుకోకండి.

No comments: