చిట్టి కథ
కనకయ్యకు దుబారా చేయడం బాగా అలవాటు. ఖర్చులు అదుపులో ఉంచుకోకుండా ఎడాపెడా ఖర్చులు చేస్తుండడంతో అతని వద్ద ధనం మిగలకుండా పోయేది.కనిపించిన ప్రతి వస్తువూ కొనడం, కొన్నాళ్ళు దాన్ని ఉపయోగించుకుని తర్వాత ఎక్కడో పారేయడం, అవసరానికి మించి వంటకాలు చేయించి దండగ చేయడం అతనికి అలవాటుగా తయారైంది.
ఏ వస్తువైనా కనబడకపోతే ఓపిగ్గా వెతుక్కునే బదులు మళ్ళీ వెంటనే కొత్తది తెప్పించుకునేవాడు. ఎన్ని దుస్తులు ఉన్నా మళ్లీ ఏదో పండగ అనీ, అదనీ ఇదనీ కొత్తబట్టలు కొంటూనే ఉండేవాడు. ఇల్లంతా దండగమారి సామాన్లతో సంతలా తయారైంది. అయినా అతను పట్టించుకునేవాడు కాదు. అయితే తోటివారంతా ధనం కూడబెట్టుకుంటూ ధనవంతులు అవుతుండగా తాను అలా ఎందుకు చేయలేకపోతున్నాడో కనకయ్యకు అర్థమయ్యేది కాదు. ఒకసారి ఊరి చివర ఆలయం వద్ద ఒక స్వామీజీ వేంచేసి ఉన్నాడని, ఆయనకు అందరూ తమ కష్టాలు చెప్పుకుని పరిష్కారం పొందుతున్నారని తెలిసి కనకయ్య అక్కడికి వెళ్లాడు. కనకయ్య తన సమస్య మొత్తం స్వామీజీకి చెప్పాడు. స్వామీజీ అంతా ఓపికగా విని ‘‘నాయనా! నీ సమస్యకు పరిష్కారం చెప్పాలంటే నాకు నీవు రెండు బంగారు కంకణాలు, నాలుగు వెండి కడియాలు, అయిదు ఉంగరాలు ఇవ్వాలి’’ అని చెప్పాడు. అది విన్న కనకయ్య ఆశ్చర్యపోయి ‘‘అయ్యా! తమరు సన్యాసి కదా! ఇవన్నీ తమరికి ఎందుకు?’’ అని అడిగాడు. అందుకు స్వామీజీ నవ్వి ‘‘చక్కగా ఆలోచించావు నాయనా! ప్రతి విషయంలోనూ ఇలాగే విచక్షణగా ఆలోచించి ఖర్చు చేస్తే ధనం కూడబెట్టగలవు’’ అని చెప్పాడు. దాంతో కనకయ్యకు అసలు విషయం అర్థమైంది. |
No comments:
Post a Comment