|
ప్రకృతి ప్రసాదించిన అనేకరుచుల్లో పులుపు ఒకటి. ముఖ్యంగా ఆంధ్రుల అభిమానం పెంచుకున్న గోంగూర కన్నా ఈ చింతచిగురులో ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి అంటారు మన పెద్దలు. మరి ఈ చింతచిగురుతో ఎన్ని వెరైటీలు చేయవచ్చో ఈ వారం రుచిలో మీకోసం... చింతచిగురు పప్పు కావలసినవి కందిపప్పు-150గ్రా చింతచిగురు-50గ్రా నూనె-10గ్రా వెల్లుల్లి-4రెబ్బలు ఆవాలు-పావు చెంచా, జీరా-పావు చెంచా పసుపు-పావు చెంచా కరివేపాకు-రెండు రెమ్మలు కొత్తిమీర-కొంచెం ఇంగువ-చిటికెడు పచ్చిమిర్చి-సన్నగా పొడుగ్గా కోసినవి ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం ముందుగా కందిపప్పు కుక్కర్లోగాని, విడిగా గాని మెత్తగా ఉడకనివ్వాలి. చింతచిగురు పుల్లలు లేకుండా ఏరుకొని, రెండు అరచేతుల్లోకి తీసుకుని సున్నితంగా రుద్దాలి. ఆకుకొంచెం నలిగి పొడిపొడిగా వస్తుంది. అలాంటిది 50గ్రాముల దాకా చూసి శుభ్రం చేసి ఉంచుకోవాలి. కందిపప్పు పూర్తిగా ఉడికిన తరువాత నలిపిన ఉంచిన చింతచిగురు, పసుపు కోసి ఉంచుకున్న మిర్చి ముక్కలు వేసి మెత్తగా ఉడికేవరకూ సన్ననిమంటమీద ఉడకనివ్వాలి. స్టవ్‌మీద బాండీ ఉంచి నూనెపోసి బాగా కాగాక ఆవాలు, జీర, వెల్లుల్లి, ఇంగువలతో తాలింపు వేసి, కరివేపాకు కూడా వేసి, చింతచిగురు పప్పులో తాలింపు వేయాలి. దీనిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యివేసుకుని తింటే ఆహా ఏమిరుచి అంటూనే ఉంటారు. చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.
చింతచిగురుతో మాంసం కావలసినవి మటన్-అరకిలో (రెండు అంగుళాల ముక్కలుగా కోయాలి) కొబ్బరిచిప్ప-ఒకటి, కొత్తిమీర తురుము-రెండు టేబుల్ స్పూన్లు, ధనియాలపొడి-ఒక టేబుల్ స్పూన్, అల్లం, వెల్లుల్లి-ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర-ఒక టీస్పూన్, ఆవాలు-అర టేబుల్ స్పూన్, గరంమసాలా-ఒక టేబుల్‌స్పూన్, నూనె-100మి.లీ, ఉల్లిపాయలు-పావుకిలో, కారం-రెండు టీస్పూన్లు, ఉప్పు-సరిపడా, చింతచిగురు-కప్పు, పసుపు-చిటికెడు
తయారుచేసే విధానం కొబ్బరి తురమాలి. పాన్‌లో నూనెవేసి ఆవాలు, తరువాత గరంమసాలా వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. తరువాత పసుపు, అల్లంవెల్లుల్లి వేసి మరికాసేపు వేయించాలి. తరువాత కొబ్బరితురుము, మటన్‌ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు లీటరు నీళ్లుపోయాలి. తరువాత ఉప్పు, ధనియాలపొడి, కారం వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ఉడికిన తరువాత చింతచిగురు వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించి దించాలి.
కొబ్బరి పచ్చడి కావలసినవి చింతచిగురు-రెండు కప్పులు కొబ్బరితురుము-కప్పు, పచ్చిమిర్చి-2 ఉప్పు-రుచికి సరిపడా పోపుకోసం ఆవాలు-అరటీస్పూన్, ఇంగువ-చిటికెడు కరివేపాకు-రెండు రెబ్బలు మినపప్పు-అర టీస్పూన్, ఎండుమిర్చి-2 నూనె-అర టీ స్పూన్
తయారుచేసే విధానం పచ్చిమిర్చి, చింతచిగురు కొబ్బరితురుము ఉప్పు అన్నింటినీ మిక్సీజార్‌లో వేయాలి. కొద్దిగా నీటిని చిలకరించి గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. పాత్రలో నూనె వేడయ్యాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి. మినపప్పు వేసి లేత ఎరుపురంగు వచ్చే వరకు వేయించాలి. కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఒకదాని తరువాత ఒకటి వేసి అరనిమిషం పాటు వేయించి దింపేయాలి. ఈ పోపు మిశ్రమాన్ని వెంటనే పచ్చడిలో వేసి కలపాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.
పొడికూర కావలసినవి చింతచిగురు-100గ్రా ఉల్లిపాయలు-రెండు పెద్దవి సన్నగా కోసినవి పచ్చిమిర్చి-4చిన్నచిన్న ముక్కలు కోసినవి ఉప్పు-తగినంత పసుపు-చిటికెడు ఆవాలు-పావుచెంచా జీర-పావు చెంచా నూనె-50గ్రా కారం-పావు చెంచా
తయారుచేసే విధానం ముందుగా చింతచిగురు పుల్లలు లేకుండా శుభ్రంగా చేసు కోవాలి. రెండు అరచేతుల మధ్యగా చిగురు తీసుకొని సున్నితంగా రుద్దాలి. దాంతో చిగురు కొంచెం నలిగి పొడిపొడిగా రాలుతుంది. దీన్ని ఒక పళ్లెంలో తీసుకుని ఉంచుకోవాలి. స్టవ్‌మీద బాండీ ఉంచి మొత్తం నూనె పోసి, బాగా కాగాక, ఆవాలు, జీర,పసుపు వేసి ఉల్లిముక్కలు వేసి ముక్కలు ఎర్రగా వేగాక, చింతచిగురు పొడివేసి, కొంచెం నీళ్లు చల్లాలి. చిగురు మగ్గాక పచ్చిమిర్చి ఉప్పువేసి కలియబెట్టాలి. చిగురు పూర్తిగా వేగి ఉల్లిపాయముక్కలు కూడా కూరలోవేగాక, కారం పొడి చల్లి దించేయాలి. వేడివేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది.
ఒరుగు చింతిచిగురు అనుకున్నప్పుడల్లా దొరకదు కనుక చింత ఒరుగు తయారీ ఎంతైన అవసరమే. ముందుగా చింతచిగురు, పుల్లలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక చాటగాని, చాపగాని తీసుకొని దానిలో శుభ్రం చేసుకున్న చింత చిగురు వేసి మెత్తటి ఉప్పు దానిమీద వేసి చేత్తో బాగా కలిపి ఆరబెట్టుకోవాలి. చిగురు బాగా ఆరాక గాలి చొరవని డబ్బాలోగాని, సీసాలో గాని ఎత్తి నిల్వచేసుకోవచ్చు. వొరుగు సీసాల్లో అయితే ఎప్పటికప్పుడు పురుగులు అవి కనిపించగానే ఎర్రటి ఎండలో పెట్టి చల్లారాక మళ్లీ సీసాలోగాని, డబ్బాల్లోగాని ఎత్తుకోవాలి. చిగురు రాని రోజుల్లో ఈ చింత ఒరుగుతో, చింతకూర పప్పు, పొడికూర, పచ్చడి చేసుకోవచ్చు. కూర ఎండి ఉంటుంది కనుక, పప్పులో కొంచెం ఎక్కువగా వేయాలి. పచ్చడికయితే ముందుగా కొంచెం నీళ్లలో నానబెట్టి ఆపైన చట్నీ తయారుచేసుకోవాలి. నాన్ వెజిటేరియన్ వంటకాల్లోకి దీని ఉపయోగం ఎక్కువ.
|
|
|
No comments:
Post a Comment