all

Tuesday, May 14, 2013

తల్లి మనసు

 

చిట్టి కథ
రాజమ్మకు లేకలేక కలిగిన సంతానం రంగడు. కొడుకును అల్లారుముద్దుగా, అపురూపంగా పెంచింది రాజమ్మ. కాలు కింద పెడితే అరిగిపోతాడేమోనన్నట్టు అరచేతుల్లో పెట్టుకుని పెంచింది.

రంగడు పెద్దవాడయ్యాడు. పెళ్ళయ్యిం ది. నలుగురు పిల్ల్లలు పుట్టారు. రాజమ్మ వృద్ధురాలైపోయింది.

భార్యాపిల్లలకు అడిగినవన్నీ సమకూర్చే రంగడికి తల్లి మాత్రం భారం అనిపించసాగింది. తల్లికి తిండి పెట్టాలంటే కూడా అదో అదనపు ఖర్చని భావించేవాడు.

ఒకనాడు తల్లితో ‘‘నిన్ను పోషించడానికి నావల్ల కావడం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో’’ అన్నాడు రంగడు.

‘‘ఈ వయసులో నన్ను ఎక్కడికి పొమ్మంటావు? ఎలా బతకమంటావు!’’ అని కన్నీటి పర్యంతం అయింది రాజమ్మ.

‘‘ఎక్కడికి పోతావో ఫో! బిచ్చం ఎత్తుకుని బతుకు’’ అంటూ కఠినంగా మాట్లాడి తల్లిని ఇంట్లో నుండి గెంటేశాడు రంగడు.

పొరుగునే ఉన్న కేశవుడు ఇదంతా గమనించి గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి రంగడిని, రాజమ్మను రచ్చబండ వద్దకు పిలిపించాడు.

తల్లికి తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేసినందుకు రంగడిని ఇరవై కొరడాదెబ్బలు కొట్టాలని ఆదేశించాడు గ్రామాధికారి. ‘‘అయ్యా! నా బిడ్డను కొట్టవద్దు. వాడసలే అల్లారుముద్దుగా పెరిగాడు. బంగారుకొండ తట్టుకోలేడు. కావాలంటే ఆ కొరడా దెబ్బలు నన్ను కొట్టండి’’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించసాగింది రాజమ్మ.
‘‘మూర్ఖుడా! తల్లి మనసంటే ఏమిటో ఇప్పటికైనా అర్థం అయిందా?’’ అన్నాడు గ్రామాధికారి.
‘‘అమ్మా! నన్ను మన్నించు!’’ అంటే తల్లి పాదాలను కన్నీళ్ళతో అభిషేకించాడు రంగడు. తల్లి మనసు ఉప్పొంగిపోయింది.
 

No comments: