all

Tuesday, May 14, 2013

మగాడిని ఆకర్షిస్తున్నదేమిటి?

 (దక్షిణం)





స్త్రీ ఈ లోకంలో లేకపోయుంటే కరెన్సీ నోటుకు విలువే ఉండదన్నాడు ఓ తత్వవేత్త. లక్షల తరాలు మారినా స్త్రీ మగాడిని ఆకర్షిస్తూనే ఉంది. సర్వస్వతంత్రుడుగా, కొండొకచో తాను ఎక్కువని ఫీలయ్యే మగాడు మళ్లీ స్త్రీ చుట్టూతానే తిరుగుతున్నాడు. మరి ఆమెలో అంత ఆకర్షణ శక్తి ఏంటి? చాలామంది శృంగారం అనుకుంటారు. కాదు. అసలు కారణాలు... ఆమె సొగసు, సిగ్గు, సుకుమారం. ఇవే ఆమెలో మగాడిని అత్యంతగా ఆకట్టుకునేవి. టామ్‌బాయ్‌లా ఉండే యువతులను మగాళ్లు పెద్దగా ఇష్టపడరు. స్త్రీ ప్రతి చర్యలో, నడకలో, మాటలో అన్నింటికన్నా ముఖ్యంగా దేహంలో కోమలత్వం ఉండాలి. అది అబ్బాయిలకు అయస్కాంతం. ఇటీవలే ఓ అంతర్జాతీయ సర్వేలో స్త్రీలు నానాటికీ సుకుమారంగా అవుతున్నారని తేలింది. అందుకే నేటితరంలో ఆకర్షణ శక్తి పెరిగింది. అదేసమయంలో శృతిమించిన సౌకుమార్యాన్ని మగవాళ్లు ఓవరాక్షన్‌గా ఫీలయ్యే అవకాశాలూ ఎక్కువే. రెండోది సిగ్గు. అది మగువకు ఆభరణం. సిగ్గు పడని ఆడపిల్లలను అబ్బాయిలే కాదు ఎవరూ ఇష్టపడరు.

అసలు మన సినిమాకు అయితే ఇదే ప్రధాన సబ్జెక్టు. ‘నాకు సిగ్గు’, ‘అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబూ’ వంటి డైలాగులు ఎన్నిసార్లు వినిఉంటాం. వధువుకి పెళ్లి చూపుల్లో ప్రారంభమైన సిగ్గు... మూడు నిద్రలయ్యేదాకా ఉంటుందట. పడక గది సిగ్గు వేరు, ఇతరులు పొగిడినపుడు పడే సిగ్గు వేరు, పెళ్లి అలంకరణ సిగ్గు వేరు. అది ఏదైనా మగాడికిష్టమే. ఇక పురాణాలు తవ్వితే ఇదో పెద్ద సబ్జెక్టు. ఇక సొగసు గురించి మాట్లాడుకోవడం కంటే చూస్తేనే బావుంటుంది. బాపు సినిమాలు చూస్తే స్త్రీలో సొగసంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. వాటిని చూసి ప్రతి మగాడూ నా పెళ్లాం కూడా ఓ బాపు బొమ్మ అయితే బాగుండు అనుకుంటాడు. ఆ మల్లెపూలు, ఆ వయ్యారాలు, ఆ గిల్లికజ్జాలు, ఆ మూతివిరుపులు... ఇవి చాలవా అండీ ఈ కలియుగం మొత్తం స్త్రీ వెంట తిరగడానికి.. ఇవన్నీ తెలుసుకోవాల్సింది స్త్రీలే.

ఇది 65వ కళ !

భార్య దగ్గర మార్కులు కొట్టేయడం ఓ కళ. అది అందరికీ అంత సులువుగా వంటబట్టదు. అలాగని నేర్చుకోవడం కష్టమైనది కూడా కాదు. కానీ, నేర్చుకోకపోతే మాత్రం చాలా నష్టపోతాం. మగువకు నగలంటే ఎంత ఇష్టమో... మగడి మెచ్చుకోలు కూడా అంతే ఆనందం. అలా అని పొద్దున లేచినప్పటి నుంచి ఆమెను పొగడాల్సిన అవసరం లేదు కానీ మీకు నిజంగా నచ్చిన కూర వండినపుడు, అది చాలా బాగున్నపుడు కచ్చితంగా మెచ్చుకోండి. అది కూడా ఒకటికి రెండు సార్లు చెబితే ఆమెకు మరింత ఆనందం. ఇది ఆమె ఆనందానికే కాదు మీకూ మంచిదే. మళ్లీ మళ్లీ అలాంటి అభినందనల కోసం మరిన్ని కొత్తవంటలు చేసే అవకాశమూ లేకపోలేదు.

ఒక్క కూరలే కాదండీ ఆమె అందంగా అలంకరించుకున్నపుడు అభినందించండి. ఆమె టేస్ట్‌ను మెచ్చుకోండి. ఇది బంధాలను మరింత దృఢతరం చేస్తుంది. మీ పట్ల ఆమెకు ప్రేమను రెట్టింపు చేస్తుంది. అలాగే ఆమె తెలివైన పనులు చేసినపుడు అభినందించండి. మీరు ఆ సందర్భాలు గుర్తుపెట్టుకుని ఆమె ఎదుట ఆమె బంధువులతో గాని, ఆమె స్నేహితులతో కానీ ఎప్పుడైనా ఓ సారి మెచ్చుకోండి. ఈ కళ కనుక మీరు నేర్చుకుంటే... మీరు డిస్టింక్షన్‌లో పాసవుతారు. తెలివైన విద్యార్థి తప్పు చేసినా మాస్టారు కొట్టడు, అడుగుతాడు. ఇక్కడా అలాంటి ఫలితాలే ఉంటాయండీ... డెప్త్ అర్థమైందనుకుంటా!
ప్రకాష్ చిమ్మల

No comments: