మనకు ఇటీవల ఒళ్లు కాలిపోయేంత జ్వరం వచ్చిందనుకోండి. ‘అబ్బ... ఇంత తీవ్రంగా ఉందంటే వైరల్ జ్వరమే అయ్యుంటుంది’ అనే మాటలు వినిపించడం పరిపాటి. ఏదైనా జబ్బు తర్వాత బాగా ఖాయిలా పడితే... వైరల్ జ్వరం కాబట్టే ఇలా జరిగిందంటూ అనుకోవడం కూడా మామూలే. అసలు వైరల్ జ్వరాలంటే ఏమిటి? వాటికి అంతటి తీవ్రత ఎందుకు? వైరల్ జ్వరాలకు మందులేదంటారు కదా... మరి డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకోవడం ఎందుకు?... వంటి అనేక సందేహాలను నివృత్తి చేసుకుని, వైరల్ జ్వరాల పట్ల అవగాహన పెంచుకునేందుకే ఈ కథనం.
మనిషిలోని అత్యంత సూక్ష్మమైన అంశం ‘కణం’. జీవకణాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే అందులో జీవపదార్థం... డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ అనే కణాంశాలను కలిగి ఉంటుంది. నిజానికి మనిషికి జబ్బును తెచ్చిపెట్టే సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి. ఏకకణ జీవులైన ప్రోటోజోవాలు, అత్యంత సూక్ష్మమైన జీవులైన బ్యాక్టీరియాలు, హెల్మెంథిస్ పరాన్నజీవులు... ఇలా ఎన్నో జీవులు కణాల మధ్యకు లేదా కణాల్లోకే చేరి జబ్బులు తెచ్చిపెడతాయి. కానీ వైరస్ అన్నది జీవం అని చెప్పడం కంటే జీవాంశం అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఇది కణంలోకి చేరడం కంటే... మానవకణంలోని డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలోని ఒక భాగంగా మారిపోతుంది. అంటే మన జీవకణంలోనికీ ఆ జీవపదార్థమూ ఇమిడిపోతుంది. ఒకరకంగా అది మన శరీరంలోని ఒక అంతర్భాగం అయిపోతుందన్నమాట. అలా అయిపోయాక వాటి ప్రతికూల ప్రభావంతో జ్వరం వస్తుంది. అలా మన శరీరాంతర్భాగం అయిపోయిన విధంగా ఉంటుంది కాబట్టే వైరల్ జ్వరాలు అంత తీవ్రతను కలిగి ఉంటాయన్నమాట. వైరల్ జ్వరాలను అవి వచ్చే తీరును బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. గాలి ద్వారా మనిషి నుంచి మనిషికి వ్యాపించేవి. వీటిని ఏరోజాల్స్ అంటారు. ఉదాహరణకు గాలి (ఏరోజాల్) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజా వైరస్, కాక్సి వైరస్ మొదలైనవి. ఇక ఏదైనా వాహకం ద్వారా వ్యాపించేవీ ఉన్నాయి. ఉదాహరణకు దోమలు, టిక్స్, కీటకాల (మైట్స్) తో చాలారకాల వైరస్‌లు వ్యాపిస్తాయి. ఈ తరహా వ్యాప్తి చెందేవాటి ద్వారా వచ్చే వైరల్ జ్వరాల్లో మన దేశంలో దోమల ద్వారా వ్యాపించేవే ఎక్కువ. ఉదాహరణకు టైగర్ మస్కిటో ద్వారా వచ్చే డెంగ్యూ వైరస్. విదేశాల్లో దోమల కంటే టిక్స్ లేదా కీటకాల ద్వారా ఎక్కువగా వైరల్ జ్వరాలు వస్తుంటాయి. హాని పెద్దగా ఉండని మానవ వైరస్ వైరస్‌ల వర్గీకరణను మరో రకంగానూ చేయవచ్చు. అనాదిగా కేవలం మానవుల్లోనే పెరిగే కొన్ని వైరస్‌లు ఉన్నాయి. ఉదాహరణకు మనకు జలుబును తెచ్చిపెట్టే కామన్ కోల్డ్ వైరస్. ఇది కేవలం మనుషుల్లోనే మనుగడ సాగిస్తుంది. ఇలా మనుషుల్లోనే మనుగడ సాధించే వాటిని ‘మానవ వైరస్’ (హ్యూమన్ వైరస్) అంటారు. వీటి వల్ల మనుషులకు పెద్దగా హాని ఉండదు. మందులు వాడినా, వాడకున్నా అవి తమ ప్రభావాన్ని కొద్దిరోజులు చూపి ఆ తర్వాత తగ్గిపోతాయి. అందుకే వీటిని సెల్ఫ్ లిమిటింగ్ వైరస్‌లు అని పేర్కొనవచ్చు. ఈ తరహా వైరస్‌లు ఒకసారి వచ్చాక మళ్లీ అదే వస్తే ఈలోపు మన శరీరం దాని పట్ల నిరోధక వ్యవస్థను పెంపొందించుకుని ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రభావం ఉండదు. అయితే వైరస్‌ల జన్యుస్వరూపం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది కొద్దిగా మారాక... అదే వైరస్ మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తే దానికి విరుగుడుగా రోగనిరోధకతను సాధించేవరకు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. అందుకే కొద్దికొద్దిగా జన్యుస్వరూపం మారిన జలుబు వైరస్ మనలోకి ప్రవేశిస్తే దానికి ఇమ్యూనిటీ సాధించే వరకు దాని ప్రభావం జలుబు రూపంలో మళ్లీ మనకు కనిపిస్తుందన్నమాట. అందుకే మనకు జలుబు వచ్చిదంటే అర్థం... అదే వైరస్ కొద్దిగా స్వరూపం మారిన తర్వాత మనలోకి ప్రవేశించిందన్నమాట. మరి... కొన్ని వైరస్‌లు ఎందుకంత తీవ్రంగా ఉంటాయి? మనిషిలోనే మనుగడ సాగించేవాటిలాగే... కొన్ని వైరస్‌లు జంతువుల్లోనూ మనుగడ సాగిస్తుంటాయి. ఇలా జంతువుల్లో మనగలిగే వైరస్‌లను యానిమల్ వైరస్ అంటారు. ఈ యానిమల్ వైరస్‌లూ, మనలో ఉండే హ్యూమన్ వైరస్‌లూ... ఈ రెండింటి జన్యుపదార్థం కలగలసి కొత్త జన్యు పదార్థంగా రూపొందింది (మ్యూటేట్ అయ్యింది) అనుకుందాం. అలాంటి జన్యుపదార్ధ స్వరూపమైన వైరస్ మన శరీరానికి చాలా కొత్తగా ఉంటుంది. దాంతో తీవ్రతా ఎక్కువే. అందుకే దానికి ఇమ్యూనిటీ సాధించేవరకు దాని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా రూపొందిన కొన్ని మనపై చాలా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపాయి. వాటిలో కొన్ని... హ్యూమన్ వైరస్ అయిన ఇన్‌ఫ్లుయెంజాతో పక్షుల్లో ఉండే వైరస్ (యానిమల్ వైరస్) కలిసిపోయి 2004 ప్రాంతాల్లో ‘బర్డ్ ఫ్లూ’ రూపంలో విజృంభించి తన ప్రభావం చూపింది. హ్యూమన్ వైరస్ అయిన ఇన్‌ఫ్లుయెంజాతో జంతువుల్లో (పందిలో) ఉండే యానిమల్ వైరస్ కలిసి 2009 ప్రాంతాల్లో ‘స్వైన్‌ఫ్లూ’ (హెచ్1ఎన్1) గా బెంబేలెత్తించింది. ఇప్పుడు తాజాగా (2013లో) హ్యూమన్ వైరస్‌తో కోళ్లలో ఉండే మరో వైరస్ కలగలిసి కొత్తవైరస్‌గా రూపొంది ప్రస్తుతం చైనాలో తన ప్రభావాన్ని చూపుతోంది. వేసవిలో వైరస్ మనుగడ ఒకింత కష్టం కాబట్టి, పైగా మిగతా ప్రపంచంతో పోల్చితే, చైనాతో మన జనసంబంధాలు అంత విస్తృతంగా లేవు కాబట్టి ప్రస్తుతం దాని ప్రభావం మన వద్ద అసలు లేదు. కానీ... ప్రపంచమే ఒక చిన్న ఊరుగా మారిపోయిన ఈరోజుల్లో వచ్చే సీజన్ నాటికి దాని ప్రభావాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. అంత తేలిక కాదు... ఒకరి శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే అందరిలోనూ జ్వరంగాని, జబ్బుగాని, లక్షణాలు గాని కనిపించవు. కొందరిలోనైతే ఒక్కోసారి ఒక వైరస్ వ్యాపించాక... దాని లక్షణాలు బయటపడకముందే దాని తాలూకు యాంటీబాడీస్ అభివృద్ధి చెంది, ఆ వైరస్‌కు ఇమ్యూనిటీ పొందుతారు. అప్పుడు అక్కడి ప్రాంత వాసులందరిలోనూ సదరు వైరస్ వ్యాపించి ఉండినా (ఎండెమిక్‌గా మారి ఉన్నా) దాని ప్రభావమే కనిపించకపోవచ్చు. ఇక వైరస్ వ్యాపించిన వారందరిలోనూ లక్షణాలు కనిపించక ఒక్కోసారి కేవలం 10 శాతం నుంచి 20 శాతం మందిలోనే జ్వరలక్షణాలు బయటపడతాయి. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. వైరల్ జ్వరాల లక్షణాలు... అన్ని వైరల్ జ్వరాల లక్షణాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. అవి... తీవ్రమైన జ్వరం వణుకు తలనొప్పి ఒళ్లునొప్పులు... ఇవన్నీ ఒకటిరెండు రోజుల్లో తగ్గుతాయి. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే 3 - 4 రోజులపాటు కొనసాగుతున్నాయంటే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే అది ఎక్కువగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆయాసం రావచ్చు. ఊపిరితిత్తులతో పాటు వైరస్ ఒక్కోసారి మూత్రపిండాలు, కాలేయాన్ని సైతం ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు వైరస్‌ను శరీరంలోకి ప్రవేశపెట్టడానికి అనువైన రిసెప్టర్స్ (వైరస్‌ను తనలోకి ఇముడ్చుకోగలిగే కణం) ఉండాలి. అలాగే ఆ వైరస్ కణంలోకి ప్రవేశించడానికి వీలుగానూ, సులభంగానూ ఉండే పరిస్థితులుండాలి. అందుకే గిరిజన ప్రాంతాల్లో వ్యాపించే యెల్లో ఫీవర్ వంటి వైరస్ జ్వరాలు వచ్చినవారందరికీ వాస్తవంగా రావాల్సిన మెదడువాపు (మెనింజైటిస్) అనే కండిషన్ రాదు. కేవలం 10 శాతం మందిలోనే వస్తుంది. అది కూడా ‘టాల్‌ఫోర్ రిసెప్టార్’ అనే దానిలో ఉన్న లోపం ఉన్నవారిలోనే ఈ వైరస్ మెదడులోకి ప్రవేశించడం చాలా సులభం కావడం వల్ల వారిలో ఇలా మెదడువాపు (మెనింజైటిస్) వస్తుందన్నమాట. పైన పేర్కొన్న అంశం ఒక రకంగా వైరస్ ప్రవేశానికి దోహదం చేస్తే... ఇక కొందరిలో డయాబెటిస్, క్యాన్సర్ వంటి జబ్బులు ఉండటం, మరీ చిన్న పిల్లల్లోనూ, మరీ పెద్దవారు, వయసు పైబడ్డవారిలోనూ వ్యాధినిరోధకశక్తి తక్కువ ఉండటం అన్నది కూడా వైరస్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అప్పుడు వైరస్ తీవ్రత ఆ సదరు వ్యక్తుల్లో తీవ్రంగా కనిపిస్తుంది. వైరస్‌లలో మ్యూటేషన్లు, మనుషుల్లో వ్యాధి తీవ్రత... వైరస్‌లలో జన్యుమార్పిడి ప్రక్రియను మ్యూటేషన్స్ అంటారు. ఈ మ్యూటేషన్స్ రెండు రకాలు. మొదటిది... డ్రిఫ్ట్. దీనివల్ల జన్యుపదార్థంలోని జీవాంశాలు కాస్త అటు, ఇటుగా మారతాయి. ఉదాహరణకు ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లోని అవే అంశాలు కాస్త అటుఇటుగా మార్పిడి చెందడం వల్లనే మనకు ఎప్పుడూ వచ్చే జలుబైనా సరే... అది వచ్చిన తర్వాత దానికి ఇమ్యూనిటీ వచ్చేవరకూ ఇబ్బందిపెడుతూనే ఉంటుంది. ఇక రెండోరకం మ్యూటేషన్‌ను షిఫ్ట్ అంటారు. అంటే అటు హ్యూమన్ వైరస్, ఇటు యానిమల్ వైరస్‌లోని జీవాంశాలు ఒకదానితో మరొకటి కలగలసిపోవడం వల్ల జరిగే జన్యు ఉత్పరివర్తనం అన్నమాట. ఇలా జరగడం ద్వారా రూపొందిన వైరస్ తీవ్రత చాలా ఎక్కువ. యాంటీబయాటిక్స్ వైరస్‌పై ఎందుకు పనిచేయవు...? మనకు ఏదైనా బ్యాక్టీరియా కారణంగా జ్వరం వచ్చిందనుకోండి. అది కణాల మధ్యనో లేదా కణంలోనో ఒక జీవంలా తన సొంత ఉనికిని కలిగి ఉంటుంది. బయాటిక్ అంటే జీవపదార్థం. యాంటీ అంటే వ్యతిరేకం అని అర్థం. యాంటీబయాటిక్ అంటే జీవపదార్థానికి వ్యతిరేకమైనదని అర్థం. అందుకే సొంత ఉనికి గల ఆ బ్యాక్టీరియాను ఈ యాంటీబయాటిక్ తుదముట్టిస్తుంది. దాంతో మనకు బ్యాక్టీరియా వల్ల కలిగిన పీడ విరగడ అవుతుంది. కానీ వైరస్ అలా కాదు. అది మన జీవకణంలోకి ప్రవేశించాక మన జీవకణాంశాల్లోని అంతర్భాగంగా ఉంటుంది. కాబట్టి మన కణం కానిదానిపై ప్రభావం చూపే యాంటీబయాటిక్... మన కణంలోని అంతర్భాగమైపోయిన వైరస్‌ను ఏమీ చేయలేదు. అందుకే వైరస్‌ల మీద యాంటీబయాటిక్ ప్రభావం చూపదన్నమాట. మరి డాక్టర్‌ను కలిసి మందులు ఎందుకు తీసుకోవాలి? అయితే వైరల్ జ్వరం వచ్చినప్పుడు దాంతోపాటు కలిగే కొన్ని లక్షణాలు రోగికి ఎక్కువగా బాధపెడుతుంటాయి కాబట్టి వాటిని ఉపశమింపజేయడానికి, లక్షణాలకు చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్‌మెంట్) చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వైరస్ లక్షణాలు 24 నుంచి 96 గంటల పాటు కొనసాగితే రోగికి ఆ తర్వాతి కాంప్లికేషన్లను తగ్గించి, మామూలుస్థితికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని సందర్భాల్లో వైరల్ జ్వరాల అనంతరం రోగనిరోధకశక్తి తగ్గి ఉండటంతో పాటు, రోగి బలహీనంగా ఉండటంతో చాలా తేలిగ్గా ‘సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్’ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రెండోసారి వచ్చే జ్వరం బ్యాక్టీరియల్ జ్వరం కాబట్టి అప్పుడు దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం అవసరం. నిర్వహణ: యాసీన్ |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, May 14, 2013
ఒళ్లంతా గరం-వైరల్ జ్వరం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment