all

Tuesday, May 14, 2013

బంగారు చందమామ !

ఓడలు సొంతంగా గల ఒక ధనిక వర్తకుడికి ఏడుగురు కొడుకులు, ఒక కూతురు ఉండేవారు.కొడుకులందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి.తండ్రికి వర్తక వ్యాపారాల్లో కొడుకులు సాయపడేవారు. వర్తకుడు, భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతురితో సహా ఒకే ఇంట్లో సంతోషంగా నివసించేవారు. వర్తకుడి కూతురు తాపోయీ అందరికన్నా చిన్నది కావడంతో ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆమె పట్ల ప్రేమానురాగాలు కనబరచేవారు. ముఖ్యంగా తండ్రి ఆమె కోరిన కోర్కెలు తీరుస్తూ,ఎంతో వాత్సల్యం కనబరచేవాడు.

ఒకనాడు తాపోయీ బొమ్మరిల్లు కట్టుకుని,మట్టిపిడతలతో వండుతూ ఆడుకుంటున్నది.అప్పుడు అటు కేసి వచ్చిన ఒక ముసలిది దాన్ని చూసి నవ్వుతూ, "ఏం పాపా? నువ్వు కావాలంటే మీ నాన్న నీకు బంగారు చందమామను తెచ్చి ఇవ్వగలడు కదా! ఈ మట్టి పిడతలతో ఆడుకుంటున్నావేంటి? సిగ్గుగా లేదా?" అంటూ వెళ్ళిపోయింది.

ఆ మాట వినగానే తాపోయీ ఆటలాడ్డంమాని,బొమ్మలనూ పిడతలనూ అక్కడే వదిలి,ఇంట్లోపలికి వెళ్ళి మౌనంగా ఒక చోట కూర్చుని ముసలిది అన్న మాటల గురించి ఆలోచించ సాగింది: నేను మట్టి బొమ్మలతో ఆడుకుంటే తప్పేమిటి?నేను బంగారు చందమామనే అడిగాననుకుందాం.నాన్న తప్పక తెస్తాడు.దాంతో నేనేం చేసుకుంటాను? దాన్ని గురించి నా స్నేహితులతో గొప్పగా చెప్పుకుంటాను.వాళ్ళు దాన్ని చూసి సంతోషపడతారు.లేదా అసూయపడతారు.అంతే కదా?

తాపోయీ విచారంగా ఉండడం చూసి ఇంట్లోని వదినెలు కారణం అడిగారు.అయినా తాపోయీ బదులేమీ చెప్పకుండా మౌనంగా లేచి వెళ్ళిపోయింది. అయితే, చిన్న వదినె నీలేంది ఆమె వెనకగా వెళ్ళి,ఆమెతో పాటు నేలపై కూర్చుని, ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని, "తాపోయీ, నాతో మాట్లాడవా? నీ సమస్య ఏమిటో నాతో చెప్పు.నేను దాన్ని పరిష్కరించడానికి మార్గం చెబుతాను," అన్నది అప్యాయంగా.

తాపోయీ మెల్లగా తలపైకెత్తి వదినె కేసి చూస్తూ, "నేను మట్టి బొమ్మలతో ఆడుకుంటూంటే ఒక ముసలవ్వ నన్ను ఎగతాళి చేసింది.నేను కావాలంటే మా నాన్న నాకు బంగారు చందమామను తెచ్చివ్వగలడట.నిజంగానా బాబీ.నాకు అది ఒకటి కావాలి," అన్నది మెల్లగా.

"అదన్న మాట నీ సమస్య! నేనీ సంగతి మీ అమ్మకు చెబుతాను. ఆమె మీ నాన్నకు చెబుతుంది.తప్పకుండా ఆయన నీకు బంగారు చందమామ తేగలడు.విచారించకు.ఇప్పుడేమో నీ దగ్గరున్న బొమ్మలతో హాయిగా ఆడుకో," అంటూ నీలేంది ఆమెను గదినుంచి వెలుపలికి నడిపించింది.

వర్తకుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆయన భార్య, తాపోయీ కోరికను మెల్లగా విన్నవించింది.వర్తకుడు చిన్నగా నవ్వి, "విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు,తాపోయీని నావద్దకు పంపించు. ఎంత పెద్ద బంగారు చందమామ కావాలో అడిగి తెలుసుకుంటాను," అన్నాడు.

ఆ తరవాత ఆయన భోజనం ముగించి,పడుకోబోతూండగా, "నాన్నా,నన్ను పిలిచారా?" అంటూ తాపోయీ గదిలోకి అడుగు పెట్టింది.

"రా తల్లీ,రా.బంగారు చందమామ కావాలన్నావట కదా? ఎంత పెద్దది కావాలి?భోజనం పళ్ళెం అంత ఉంటే చాలా?" అంటూ వర్తకుడు కూతురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు.

తాపోయీ మరేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వసాగింది. "నువ్వు దాంతో ఆడుకోవాలి.అంతే కదా! అది ఎంత పెద్దదిగా ఉండాలో నాకు తెలుసు.త్వరలోనే చేయిస్తాను.నువ్వు వెళ్ళి బువ్వ తిను.మంచి పాపవు కదూ," అంటూ తండ్రి కూతుర్ని ఆప్యాయంగా కౌగిలించుకుని ముద్దిచ్చాడు.

వర్తకుడు స్వర్ణకారుణ్ణి పిలిపించి బంగారు చందమామను తయారు చేయమని చెప్పాడు.అతడు వెంటనే ఆ పనికి పూనుకున్నాడు.అయితే,దురదృష్టవశాత్తు,అది తయారు కావడానికి ముందే హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన వర్తకుడు మరణించాడు. అది తయారై,స్వర్ణకారుడు తీసుకువచ్చి ఇచ్చే సరికి తాపోయీ తల్లి కూడా చనిపోయింది.తాపోయీ విషాదానికి అంతులేకుండా పోయింది.తను బంగారు చందమామ కోరడం వల్లే,తన తల్లిదండ్రులు తనకు దూరమయ్యారో ఏమోనని ఆమె బాధపడసాగింది.


కొన్నాళ్ళు గడిచాయి.వర్తకుడి కొడుకులు ఓడలో సరుకులు నింపి, వ్యాపారం కోసం దూరప్రాంతాలకు పయనమయ్యారు.బయలుదేరడానికి ఒక రోజు ముందు తమ భార్యలను పిలిచి,చెల్లెను జాగ్రత్తగా,ఆప్యాయంగా చూసుకోమని మరీ మరీ చెప్పారు. "ఆమె అనాధ అన్న సంగతి గుర్తుంచుకోండి," అన్నారు.

ఆ మాటకు భార్యలందరూ ముక్తకంఠంతో, "ఆమె అనాధ ఎలా అవుతుంది? ఆమె అవసరాలు తీరుస్తూ,ప్రేమగా చూసుకోవడానికి మేము ఉన్నాం కదా! ఆమె క్షేమం గురించి మీకు ఎలాంటి విచారమూ వద్దు.నిశ్చింతగా వెళ్ళి,వ్యాపారం చేసుకుని రండి," అన్నారు.

మరునాడు ఏడుగురు తోడుకోడళ్ళు,తాపోయీ,బంధుమిత్రులు సముద్రతీరం వరకు వెళ్ళి వర్తకుడి కుమారులకు పూలమాలలు వేసి, నుదుట తిలకం దిద్ది సాగనంపారు.ఓడ కనుచూపు దూరం దాటేంత వరకు అక్కడే నిలబడి,సజల నయనాలతో వెనుదిరిగారు.తాపోయీ చాలా సేపటి వరకు కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది.

కొన్ని రోజుల వరకు వదినెలు ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు.తల్లితండ్రులు లేని లోపంగాని,అన్నయ్యలు ఇంటి పట్టున లేని కొరత గాని ఆమెకు కనిపించలేదు.అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు.

ఒకనాడు ఇంటి గుమ్మంలో ఎవరో బిక్షం అడగడం పెద్ద కోడలికి వినిపించింది.ఆమె అన్నం తీసుకుని గుమ్మంలోకి వచ్చే సరికి "పిడికెడు మెతుకుల కోసం నేను ఎంత సేపని అరుస్తున్నాను తల్లీ?ఎవరూ నా మాట పట్టించుకున్నట్టు లేదే!ఇంట్లో అంతమంది ఉన్నారు కదా.ఏం చేస్తున్నారు మరి," అన్నది అక్కడ నిలబడ్డ ఒక ముసలిది నిష్ఠూరంగా.

"మా చిన్న ఆడపడుచు అవసరాలు సమకూర్చడానికే మాకు సరిపోతోంది. అందుకే రావడానికి ఆలస్యమయింది," అన్నది పెద్ద కోడలు క్షమాపణలు చెబుతున్నట్టు.

"ఎవరూ,ఆ చిన్నపిల్లా?బావుంది.మీరందరూ ఆ బుడతను సంతోషపరచడానికి ఇంతపాటు పడుతున్నారా?మీరెంత చేసినా,అన్నయ్యలు రాగానే ఆ పిల్ల మీ మీద చాడీలు చెప్పదన్న నమ్మకం ఏమిటి?వృథాగా శ్రమపడకుండా జాగ్రత్త పడండి," అంటూ కోడలిని మరింత దగ్గరికి పిలిచి, "నా మాట విని ఆ పిల్లను గొర్రెలు మేపడానికి అడవికి పంపండి.అక్కడ ఏ తోడేలుకో ఆహారమైపోతుంది.లేదా పాము కాటుకు గుటుక్కుమంటుంది.పీడవిరగడై పోతుంది.మీ భర్తలు వస్తే,అనారోగ్యానికి గురై చచ్చిపోయిందని చెప్పవచ్చు," అని రహస్యంగా చెప్పి వెళ్ళింది.
గొర్రెపిల్ల తప్పి పోయిందనడంతో, పెద్ద కోడలికి పట్టరాని కోపం వచ్చింది. మండుతూన్న కొరివి కట్టను తీసుకుని తాపోయీని కొట్ట బోయింది.హడలిపోయిన తాపోయీ,ఏడుస్తూ ఇల్లు వదిలి అడవి కేసి పరిగెత్తింది.ఎటు చూసినా కారు చీకటి. "తల్లీ,మంగళాదేవీ! నీవే నాకు దిక్కు.ఈ బాధలు ఇక భరించలేను.మా అన్నయ్యలను త్వరగా రప్పించు," అంటూ దీనంగా విలపించ సాగింది.

అదృష్టవశాత్తు, అడవిని ఆనుకుని ఉన్న సముద్రంలో అదే సమయంలో తాపోయీ అన్నలు ఏడుగురూ ఓడలో తిరిగి వస్తున్నారు.వారికి ఆడకూతురి దీనాలాపన వినిపించింది.గాఢాంధకారం అలుముకున్న అపరాత్రి వేళ,అడవిలో రోదిస్తున్నది ఎవరా అని అశ్చర్యపోయారు.ఇద్దరు అన్నదమ్ములు ఓడ నుంచి దిగి ఏడుపు వినిపిస్తూన్న దిశకేసి వెళ్ళారు.అక్కడ ఏడుస్తున్నది తమ చెల్లెలు అని గ్రహించి, "తాపోయీ ఇక్కడికెలా వచ్చావు తల్లీ?" అని అడిగారు దిగ్భ్రాంతితో.

తాపోయీ తన దయనీయ స్థితిని వివరించింది.వాళ్ళు ఆమెను ఓడలోకి తీసుకువెళ్ళారు.అక్కడున్న ఐదుగురు అన్నలు కూడా ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.నీలేంది తప్ప తక్కిన తమ భార్యలు తాపోయీ పట్ల కర్కశంగా నడుచుకున్న తీరు గ్రహించి బాధపడ్డారు.వాళ్ళకు సరైన గుణపాఠం నేర్పాలని నిర్ణయించారు.

ఓడ వస్తూన్న వార్త అందగానే,మరునాడు తెల్లవారుతూండగా,ఏడుగురు తోడుకోడళ్ళూ భర్తలకు స్వాగతం చెప్పడానికి సముద్ర తీరానికి చేరారు.తాపోయీ గురించి భర్తలకు ఏం చెప్పాలో పెద్ద కోడలు మిగతా వారికి మొదటే నేర్పింది. అయితే, పట్టు బట్టలతో ఒంటి నిండా నగలతో అన్నయ్యలతో పాటు తాపోయీ ఓడ నుంచి వెలుపలికి రావడం చూసి దిగ్భ్రాంతి చెందారు.భర్తల కోపం చూసి ఒక్క మాట మాట్లాడలేకపోయారు.ఇల్లు చేరగానే, అన్నదమ్ములు తెచ్చిన కానుకలన్నిటినీ నీలేందికి ఇచ్చారు.తాపోయీ పట్ల నిర్దయగా ప్రవర్తించినందుకు తక్కినవారిని కఠినంగా శిక్షించారు.ఆ తరవాత అన్నయ్యలు తాపోయీని యువరాణిలా చూసుకున్నారు.

దాదాపు ఐదు శతాబ్దాల క్రితం తాపోయీ జీవించినట్టు చెప్పుకుంటారు.ఈనాడు కూడా ఒరియా అమ్మాయిలు మంగళాదేవి ఆశీస్సులు పొందడానికి ఒక్కపొద్దులుండి పూజలు జరుపుతూ 'తాపోయీ పండుగ' జరుపుకుంటారు.

-chandamama stories

No comments: