all

Friday, July 5, 2013

కుంకుమపువ్వుతో బిడ్డ రంగు మారుతుందా?

 
     
గైనిక్ కౌన్సెలింగ్
నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు కలిపి ఇస్తోంది. దీనివల్ల బిడ్డ రంగు తేటగా మారుతుందని, పండంటి ఎర్రటి బిడ్డ పుడతాడని అంటోంది. ఇది నిజమేనా? గర్భవతులు కుంకుమపువ్వు తీసుకోవచ్చా?
- సుశ్మిత, బెంగళూరు


మంచి రంగులో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. కాంప్లెక్షన్ మాట పక్కన పెడితే... ఒక మూలికగా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే దీనితో పోషకపరమైన ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం.

కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది.

ఇక మీ అమ్మమ్మగారు చెప్పినట్లుగా ఇది కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. బిడ్డ ఒంటిరంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ణయిస్తాయి. తార్కికంగా ఆలోచించి చూస్తే... పాలు సంపూర్ణాహారం. గర్భవతులకు చాలా మేలు చేస్తాయి. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి ఇష్టపడరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. బహుశా బిడ్డ రంగు కోసం కుంకుమపువ్వు అనే సంప్రదాయం ఇందువల్లనే పుట్టిందనిపిస్తోంది. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి.

ఇక కుంకుమపువ్వును గర్భవతులు వాడే విషయంలో ఒక్కటి గుర్తుంచుకోవాలి. దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకుని పిసరంతే వాడాలి.

చివరగా... ఆ మాటకొస్తే... నేను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు పాలకు కుంకుమపువ్వు కలిపి నాకు ఇచ్చేవారు.
  

No comments: