all

Friday, July 5, 2013

రాబిన్ లీ... చైనా కుబేరుడి కథ! (విజయం)

 
     
అందరి కడుపు నింపడమే కష్టమైతే ఇక చదువెక్కడ? కానీ చిన్నప్పటి నుంచి లీకి చదువంటే ఇష్టం. చురుకైన కుర్రాడు కూడా. తల్లి కూడా అతన్ని పెద్ద చదువులు చదివించాలని అనుకునేది. చిన్నప్పుడే అతనికీ విషయం నూరిపోసింది. మన బతుకులు మారాలంటే చదువొక్కటే మార్గమని చెప్పింది. అసలే చదువంటే పడిచచ్చే లీకి అమ్మ మాటలు బాగా వంటబట్టాయి. కష్టపడి చదివాడు. ప్రతిభా వంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అమెరికాలో గూగుల్.. ఆస్ట్రేలియాకు వెళ్తే గూగుల్.. ఆఫ్రికాలోనూ గూగులే.. ఇండియాకు వచ్చినా గూగులే. మరి చైనాలో...? అక్కడ మాత్రం గూగుల్ కాదు.. ప్రపంచాన్నంతా జయించిన గూగుల్.. చైనాలో మాత్రం ‘బైదు’కు తలవంచింది. అక్కడ ‘బైదు’నే నెంబర్‌వన్ సెర్చ్ ఇంజిన్. చైనాలో 80 శాతం మార్కెట్ కలిగిన ఈ సెర్చ్ ఇంజిన్ కు అధిపతి రాబిన్ లీ. ఇప్పుడితనే చైనాలో అత్యంత ధనవంతుడు. అలాగని అతను పుట్టుకతో కుబేరుడు కాడు. ఓ పేద కుటుంబంలో పుట్టాడు. తిండికి, చదువుకు కష్టపడిన ఆ కుర్రాడు.. కుబేరుడిగా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం రండి!

రాబిన్ లీ తల్లిదండ్రులు ఓ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేసేవాళ్లు. ఐదుగురు సంతానంలో ఒకడు లీ. మిగతా నలుగురూ అమ్మాయిలే. అందరి కడుపు నింపడమే కష్టమైతే ఇక చదువెక్కడ? కానీ చిన్నప్పటి నుంచి లీకి చదువంటే ఇష్టం. చురుకైన కుర్రాడు కూడా. తల్లి కూడా అతన్ని పెద్ద చదువులు చదివించాలని అనుకునేది. చిన్నప్పుడే అతనికీ విషయం నూరిపోసింది. మన బతుకులు మారాలంటే చదువొక్కటే మార్గమని చెప్పింది. అసలే చదువంటే పడిచచ్చే లీకి అమ్మ మాటలు బాగా వంటబట్టాయి. పట్టుదలతో చదివాడు. స్కూల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడే అతని మనసు ఓ వస్తువుపైకి మళ్లింది. అదే కంప్యూటర్. స్కూల్లో ఎక్కువ సమయం దానిపైనే గడిపాడు. అనేక విషయాలు నేర్చుకున్నాడు. స్కూలు చదువు పూర్తయ్యాక చైనా ఉన్నత విద్య ప్రవేశ పరీక్ష రాసిన రాబిన్.. అన్ని పరీక్షల్లోనూ టాపర్‌గా నిలిచాడు. తర్వాత పెకింగ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ డిగ్రీలో చేరాడు. ఈ చదువులన్నిటికీ డబ్బెక్కడిదనేగా... చైనాలో చదువులు మనంత ఖరీదు కాదు లెండి.

దాదాపు ఉచితమే. డిగ్రీ నుంచి అతని జీవితం మలుపు తిరిగింది. తన గమనం, గమ్యం ఐటీనే అని నిర్ణయించుకున్న లీ.. తర్వాత స్కాలర్‌షిప్‌పై అమెరికా వెళ్లి ఓ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ డాక్టరల్ డిగ్రీ సంపాదించాడు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు. డౌజోన్స్‌లో ఉద్యోగం దొరికింది. అక్కడ చేరిన కొన్నాళ్లకే వాల్ స్ట్రీట్ జర్నల్ ఆన్ లైన్ ఎడిషన్‌కు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసి అందరి మన్ననలందుకున్నాడు. అది రాబిన్ లీ ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఆ ఉత్సాహంలో మరో రెండేళ్లకే రాంక్‌డెక్స్ అనే సెర్చ్ ఇంజిన్‌కు తోడ్పాటునందించే సైట్ స్కోరింగ్ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశాడు. దీనికి యూఎస్ పేటెంట్ కూడా లభించింది. ఆ తర్వాత లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక తాను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని అతనికి అర్థమైపోయింది. ఉద్యోగం మానేసి సొంతంగా సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. అలా మొదలైందే ‘బైదు’. తాను పేటెంట్ సాధించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బైదు సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేసిన లీ.. మరో మిత్రుడితో కలిసి సంస్థను నెలకొల్పాడు.

2000లో ఆరంభమైన బైదు కొన్నేళ్లలోనే చైనాలో అద్భుత విజయం సాధించింది. సెర్చ్ ఇంజిన్ అంటే గూగులేనని మనమనుకున్నట్లు చైనా అంతటా ‘బైదు’నే కనిపించడం ఆరంభమైంది. అది చైనాలో ఫేమస్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రపంచంలోని వెబ్‌సైట్లలో దానిది ఐదో స్థానం. చైనాలో అదే నెంబర్‌వన్. రోజుకు 25 కోట్ల మంది ఈ సెర్చ్ ఇంజిన్‌ను వినియోగిస్తారని అంచనా. 20 వేల మందికి పైగా ఉపాధినిస్తున్న బైదు వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చైనాలో బైదు.కామ్ మార్కెట్ వాటా 62 శాతం. బైదు.కామ్ సీఈఓగా ఉన్న రాబిన్ లీ సంపద తాజా లెక్కల ప్రకారం 10.2 బిలియన్ యూఎస్ డాలర్లు. ఇటీవల ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించిన ఫోర్బ్స్.. రాబిన్ లీ చైనాలో అత్యంత ధనవంతుడిగా గుర్తించింది. అతని వయసు ప్రస్తుతం 44 ఏళ్లే. సాధారణంగా ఈ ధనవంతుల జాబితాలో ఉన్న వారిలో సింహభాగం వారసత్వంగా వ్యాపారాలు నడుపుతున్న వారే. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టి, కేవలం తన సామర్థ్యాన్ని నమ్ముకుని, భవిష్యత్తును ముందే ఊహించి, వినూత్నమైన ఆలోచనతో వ్యాపారవేత్తగా మారిన రాబిన్ లీకి వారెవ్వరూ సాటిరారు. ఎందుకంటే అతనిది స్వంత సామ్రాజ్యం. లీ నాయకత్వాన్ని మెచ్చుకున్న అవార్డులు రాస్తే ఈ పేజీ సరిపోదు.
- ప్రకాష్ చిమ్మల

No comments: