all

Sunday, May 12, 2013

నేను‘దేవి’లా కాదు! (టీవీక్షణం)

 



‘మొగలిరేకులు’లో లిఖిత మాయమై కరుణ ప్రత్యక్షమవగానే అందరూ చాలా నిరుత్సాహపడ్డారు. కానీ అది కొద్దిసేపే. కళ్లతో భావాలను పలికిస్తూ, కరుణ అద్భుతంగా నటిస్తుంటే లిఖితను మర్చిపోవడానికి ప్రేక్షకులకు పెద్దగా సమయం పట్టలేదు. ‘దేవి’ పాత్రకు ప్రాణం పోస్తోన్న కరుణ మనసులోని మాటలివి...

‘దేవి’ పాత్రకి రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా బాగుంది. ఒక సీరియల్‌లోని పాత్రకి ఇంత క్రేజ్ ఉంటుందా అనిపిస్తోంది నాకు. ఎక్కడికెళ్లినా కరుణ అనడం మానేసి దేవీ, దేవీ అని పిలుస్తున్నారంతా.

ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది?
‘పసుపు-కుంకుమ’ టీమ్‌తో కలిసి ‘భలే చాన్సులే’ ప్రోగ్రామ్‌కి వెళ్లాను.. మంజు మేడమ్ నన్ను అక్కడ చూశారట. ఆ తర్వాత ఓరోజు నా ఫ్రెండ్ అంజు అస్రానీని కలవడానికి ‘అగ్నిపూలు’ షూటింగు జరుగుతున్న చోటికి వెళ్లాను. అప్పుడు మంజు మేడమ్ ‘దేవిగా చేస్తావా’ అని అడిగారు. ‘పసుపు కుంకుమ చేస్తున్నాను, నెలంతా డేట్స్ ఇవ్వలేను, పదిహేను రోజులైతే చేయగలను’ అని చెప్పాను. ఆవిడ ఓకే అనడంతో ‘దేవి’నైపోయాను. తర్వాత డేట్స్ కుదరకపోవడంతో ‘పసుపు-కుంకుమ’ మానేశాను.

అంతకుముందు ‘మొగలిరేకులు’ చూశారా?
లేదు. మామూలుగానే నేనెక్కువ టీవీ చూడను. ఇక సీరియల్స్ చూసే అలవాటే లేదు.
మరి ‘దేవి’ని ఎలా ఓన్ చేసుకున్నారు?
మొదట టెన్షన్ పడ్డాను. నెట్‌లో ఎపిసోడ్స్ అన్నీ చూడటం మొదలుపెట్టాను. ఆ పాత్రను ‘లిఖిత’ ఎలా చేసిందో అబ్జర్వ్ చేశాను. మెల్లమెల్లగా ఓన్ చేసుకున్నాను. ఇంకోటేంటంటే, నేను స్వతహాగా దేవి అంత సెలైంట్ కాదు. బాగా టాకెటివ్. కానీ దేవి మౌనంగా ఉంటుంది. కళ్లతోటే ఎక్కువ మాట్లాడుతుంది. ఎక్కడా పోలికే లేదు. దాంతో కాస్త కష్టపడ్డాననే చెప్పాలి.

అసలు మీరు నటన వైపు ఎలా వచ్చారు?
నా చిన్నప్పుడు బాలభవన్‌కి సమ్మర్‌క్యాంపు కోసం వెళ్లాను. అప్పుడు ‘ఆహా’ సినిమాలో ఓ చిన్న బిట్ కోసం చైల్డ్ ఆర్టిస్టు కావాలంటూ కో ఆర్డినేటర్స్ వచ్చారు. నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, మాస్, మంత్ర, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, శంకర్‌దాదా ఎంబీబీఎస్... ఇలా అవకాశాలు బాగానే వచ్చాయి.

మరి సీరియల్స్...?
సీరియల్స్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘యువ’ సీరియల్ కోసం అడిగినప్పుడు... ఎప్పుడూ ఏడవాలి, నావల్ల కాదన్నాను. కానీ ఫన్ ఉంటుందని చెప్పడంతో ఒప్పుకున్నాను.
ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఇబ్బందులుంటాయంటారు. నిజమేనా?

మనమెలా ఉంటామన్నదాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. మనం నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటే అందరూ మనతో బాగానే ఉంటారు. యాటిట్యూడ్ చూపిస్తే వాళ్లూ అలానే చేస్తారు. అంతేతప్ప ఈ ఫీల్డ్‌లోనే ఇబ్బందులు ఉన్నాయని, ఇక్కడేవో పాలిటిక్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటాయని అనుకోవడం కరెక్ట్ కాదు.

మీరు వివాహిత కదా! కెరీర్‌ని ఇంటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
మావారు భరత్ భూషణ్ యాడ్ ఫిల్మ్ మేకర్. నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. షూటింగ్‌కొస్తే బాబు ఎలా ఉన్నాడో అన్న టెన్షన్ ఉండదు నాకు. ఎందుకో మా అత్తమ్మో, ఆడపడుచో వాడిని చూసుకుంటారు. అలాంటి ఫ్యామిలీ ఉండగా ఇక కష్టం ఏముంటుంది!

ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
ఏమీ లేవు. నటన నాకు ప్యాషన్ కాదు. నాకు కెరీర్ కంటే ఫ్యామిలీ ముఖ్యం. అనుకోకుండా నటినయ్యాను. కెరీర్ బాగుంది కాబట్టి కొన్నాళ్లు పని చేస్తాను. తర్వాత మావాళ్లను చూసుకుంటూ హ్యాపీగా ఇంట్లో ఉండిపోతాను.
- మీరా
 

నాన్‌స్టిక్‌ పాత్రలు ఎలా వాడాలి?తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

ఈరోజుల్లో ఇత్తడి, రాగి పాత్రలు వాడకం బాగా తగ్గిపోయింది.వాటిని వాడే సమయంలో శుభ్రపరచు కొనేందుకు కొంత కష్టపడాల్సి వచ్చేది.

మారుతున్న కాలంతోపాటు స్త్రీలకు వంటింటి సదుపాయాలు పెరగడంతో కాస్త పని విషయంలో కూడా కొంత ఉపశమనం దొరికినట్టయింది.

వంటింటి సామాగ్రిలో వంట పాత్రలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఈ పాత్ర లను శుభ్రపరిచే విధానం సులభతరం చేయడంకోసం క్లీనింగ్‌పౌడర్లు, సబ్బులు మార్కెట్లోకి వచ్చాయి. కానీ అంతకంటె సులభ పద్ధతిలో పాత్రలను క్లీన్‌చెయ్యడం, సులభంగా వంటను చేసుకొవడంకోసం నాన్‌స్టిక్‌ పాత్రలను మార్కెట్లోకి విడుదల చేసారు. ఇవి వచ్చికూడా చాలాకాలం అయింది. కానీ వీటిని వాడే విధానం చాలా మందికి నేటికీ తెలియదు. పద్ధతి ప్రకారం వీటిని వాడకపోతే అవి త్వరగా పాడయి, ఉపయోగం లేకుండా పోతాయి.

how use non stick cookware

అందుకే వీటిని వాడే విధానాలను కొన్నింటిని తెలుసుకోవడం మంచిది....

1. మొదటిసారి నాన్‌స్టిక్‌ పాత్రలు వాడేందుకు ముందు వాటిపై అతికించిన స్టిక్కర్‌ పాత్రను కొద్దిగా వేడి చేస్తే సులభంగా ఊడివస్తుంది. ఆ తర్వాత కొద్దిగా వేడినీటితో శుభ్రంచేసి ఆరబెట్టాలి. చిన్న చెంచాడు నూనెను వేసి మెత్తని బట్టతో పాత్ర అన్నివైపులకూ రాయాలి.

2. నాన్‌స్టిక్‌ పాత్రలను ఎప్పుడూ సన్నని సెగపైనే ఉంచాలి. ఎక్కువ మంట పెట్టడం వల్ల వీటి పాలిష్‌ త్వరగా పోతుంది.

3. ఈ పాత్రల్లో వండే పదార్థాలను కలిపేందుకు ఎప్పుడూ ప్లాస్టిక్‌ లేదా చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. ఇనుము, స్టీల్‌, ఇత్తడి, సిల్వర్‌ వంటి గరిటెలను, అట్లకాడలను వాడకూడదు.

4. వీటిని శుభ్రపరిచేందుకు ధృఢంగా ఉండే పీచును, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి రేపర్‌లను వాడకూడదు. ఎక్కువ ఘాటుగా ఉండే క్లీనింగ్‌ పౌడర్‌లను కూడా ఉపయోగించకూడదు. అంతేకాదు బాగా మెరుపు రావడంకోసమని ఎక్కువసమయం రుద్దడం, తోమడం చేయకూడదు. వీటిని ఎప్పుడూ ఏదైనా మెత్తని పీచుతోగాని, బ్రష్‌తో వేడినీళ్ళు, లేదా లిక్విడ్‌ సోప్‌లతో శుభ్రం చేయాలి.

5. ఒక వేళ పాత్రకు ఏవైనా పదార్థాలు అతుక్కొని ఉంటే వాటిని చాకు, చెమ్చా వంటి వాటితో పెల్లగించడానికి చూడకూడదు. పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత మెల్లగా రుద్దికడిగితే అతుకున్న పదార్థం వదిలిపోతుంది.

6. నాన్‌స్టిక్‌ పాత్రలను వంటింటి గట్లపైన, అల్మారాల్లో భద్రపరచకుండా, ఎప్పుడూ సామాన్లు భద్రపరిచే స్టాండుల్లోనే పెట్టడం మంచిది. ఇలా చేయడంవల్ల వస్తువు పైభాగంలో ఉండే పెయింటింగ్‌ ఎక్కువకాలం పోకుండా ఉంటుంది.

7. నాన్‌స్టిక్‌ పాత్రలు ఎక్కువకాలం కొత్తవిగానే కనిపించేందుకు, వాటిని వాడిన తర్వాత శుభ్రంచేసి, మెత్తని పొడి బట్టతో తుడిచి, కొద్దిగా నూనెను రాసి భద్రపరుస్తుండాలి.

 

ఇంట్లో పెంచుకొనే గులాబీ మొక్కలంటే ఎందుకంత మక్కువ..!?





ప్రపంచాన్ని పరిమళభరితం, ఆనందమయం చేసే అంశాల్లో పూలది తిరుగులేని స్థానం. అందులో గులాబీ చోటు మరింత పదిలం. అందుకే దానిని పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా మరియు మధ్య ప్రాక్ దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.

గులాబీ పండ్లు వాటిలోసి విటమిన్ కొరకు జామ్, జెల్లీ, మరియు మర్మలాడ్, మరియు టీ తయారు చేయడంలో వాడబడుతున్నాయి. వాటిని దంచి వడగట్టి గులాబీ పండ్ల రసాన్ని తయారు చేస్తారు.గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడతారు
గులాబీ మొక్క పెంచడమంటే పసికందును సాకినంత మెలకువగా ఉండాలి. పసిపాపలా పెంచుకున్న ఆ మొక్కకు పూవు తొడిగి నవ్వులు రువ్వుతూ అందరినీ పలకరిస్తే ఆ ఆనందం వర్ణించగలమా? మనచేతుల్లో విరబూసిన ఆ అందాన్ని తనివితీరా చూసుకుని మురిసిపోతాం.

growing roses as indoor houseplants

ఇంతటి ఆనందాన్ని పంచే ఆ మొక్క మనింట్లో కూడా పెంచితే బాగుంటుందని అందరికీ అని పిస్తుంది. కానీ అది బతికి బట్టకట్టి పూలు పూసే వరకూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ప్రయత్నాన్ని విరమించుకుంటారు. నేలపైన, తొట్లలోనూ ఈ మొక్కను ఒక పద్ధతి ప్రకారం పెంచితే మీ పెరటి అందం ఇనుమడిస్తుంది.

గులాబి మొక్క ఎలా నాటాలి?

పెరట్లో మొక్కలు వేయడానికి సరైన ప్రదేశాన్ని చూసుకోవాలి, కుండీల్లోనైనా పెంచుకోవచ్చు. గులాబీ మొక్క నాటేందుకు ఒకటిన్నర అడుగు లోతు, వెడల్పు ఉన్న గొయ్యి తవ్వాలి. ఇలా తీసిన గొయ్యి ఒక నెలపాటు వదిలేస్తే తరువాత మొక్కకు పురుగు పట్టకుండా ఉంటాయి. తరువాత గొయ్యిని మట్టితోనింపాలి, దానికీ లెక్కలున్నాయి.
ఎర్రమట్టి, మాన్యూర్‌ (ఎరువు), ఇసుక తీసు కోవాలి. వీటిని వరుసగా 1:1:0.5 నిష్పత్తిలో తీసు కోవాలి.

ఈ మిశ్రమాన్ని గొయ్యిలో వేసి గులాబీలో ఏ రకం కావాలంటే వాటిని తీసుకొని నాటుకోవాలి.

జాగ్రత్తలు:

1. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలంలో గులాబీ మొక్కకు ఆయా రుతువుల్ని బట్టి జాగ్రత్తలు తీసు కోవాలి. ఎండాకాలంలో గులాబీమొక్కలు ఎండలో ఉండకూడదు. నీడపట్టున ఉండాలి. అందుకు పైన షేడ్‌ వెయ్యాలి.
ఇంట్లో అయితే మొక్కల కుండీలు నీడలో ఉంచాలి.

2. వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ కాకుండా చూసుకోవాలి. అందుకోసం మొదళ్లలో మట్టి పోగులా చేసి ఉంచితే నీరు జారి పోతుంది. శీతాకాలంలో ఎలా ఉన్నా పరవాలేదు. మరి నీరుపోసే విషయంలో వేసవికాలంలో ప్రతిరోజూ తగినంత నీరు పోయాలి. వర్షాలు పడితే నీరు పోయనక్కర్లేదు.
శీతాకాలంలో రెండురోజులకోసారి నీరుపోయాలి.

3. గులాబీల సీజన్‌ నవంబర్‌ నెల నుంచి జనవరి వరకూ. మొక్కని ఆగస్టులో నాటితే సీజన్‌కి అందు కుంటుంది. 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.

ఏకాంతం కోసం... కుండీల కర్టెన్,,,,,,-ఇంటిరియం

 

 
నగరాలు, పట్టణాలలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ప్రైవసీ (ఏకాంతం) తగ్గుతోంది. అడ్డుగా గోడను నిర్మించుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ ఆ అడ్డు గోడను గోడలా కాకుండా విలక్షణం గా తయారుచేశారు హైదరాబాద్ దోమల్‌గూడలో ఉంటున్న వసుధ. మొక్కల పెంపకం అంటే ఆమెకు ప్రాణం.

ఇంటిని తీర్చిదిద్దడమంటే మరీ ఇష్టం. అందువల్లే ప్రైవసీ గోడ నిర్మాణం విషయమై ఆమె ఆర్కిటెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు వచ్చిన ఆలోచనకు ఆచరణ రూపమే ఈ ఫొటోలో కనిపిస్తున్న డ్రిప్ ఇరిగేషన్‌వాల్. అయితే దీనిని ఎలా నిర్మించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...

‘‘మాకు కావాలనుకున్న ఎత్తు లో ముందుగా స్టీల్ గ్రిడ్ వేశాం. అది పూలకుండీలను జాగ్రత్తగా పట్టి ఉంచుతుంది. దానికి అనువుగా పూలకుండీలు ఏర్పాటుచేశాం. తరవాత వాటికి నీరు అందచేయడానికి అనువుగా కింద సంప్ కట్టించాం. మొక్కలను... కుండీల సైజుకి అనుగుణంగా, పెరిగే విధానాన్ని అనుసరించి, చూడటానికి అందంగా ఉండేవాటిని ఎంచుకున్నాం. చిన్న స్విచ్ వేయగానే ప్రతి కుండీలోకి నీరు చేరేలా ఏర్పాటు చేసుకున్నాం.

స్ట్రక్చర్, నీటిపారుదల, కుండీ లు, మొక్కలు... వీటన్నిటికీ కలిపి సుమారు రెండున్నర లక్షల దాకా ఖర్చు అయింది. ఇటువంటి స్ట్రక్చర్ ఏర్పాటుచేసుకోవడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ జరగడమే కాకుండా ప్రైవసీ కూడా లభిస్తుంది’’ అని చెప్పారు వసుధ.

ఫోటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎండుటాకులను తీసేయాలి మట్టిని గుల్లబరుస్తుండాలి

మొక్కలకు పురుగులు, చీడ పట్టకుండా మందులు చల్లాలి

ఎప్పటికప్పుడు మంచి ఆకృతిలో ఉండేలా కట్ చేయాలి నాచు పట్టకుండా చూసుకోవాలి.
 

బంధించేది మనసే... విడిపించేదీ మనసే..దైవాలజీ

 

 
శ్రీరామకృష్ణ పరమహంస మహాయోగి. ఆయన తనను చూడవచ్చే భక్తులకు, శిష్యులకు కథల రూపంలో ఎన్నో మంచి విషయాలను చెప్పేవారు. వాటిల్లో ఈనాటికీ మనకు అత్యంత ముఖ్యమైనవి, ఉపయోగకరమైనవి ఎన్నో ఉన్నాయి.

ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద నడిచి వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా!’’ అని లోపలకి వెళ్లి కూర్చుని వినసాగాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగిచూసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు. కాని ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, అక్కడి వారి ప్రవర్తన అతడికి విరక్తి కలిగించాయి. ‘ఛీ! ఎంత సిగ్గుచేటు! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేం చేస్తున్నాను?’ అని పశ్చాత్తాపపడ్డాడు.

ఇక రెండవవాడు... భాగవతం వింటూ విసుగు చెందాడు. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. వీడి వాగుడు వింటూ ఇక్కడ కూర్చున్నాను. అక్కడ నా మిత్రుడు కులాసాగా కాలం గడుపుతూ, ఆనందం అనుభవిస్తూ ఉండి ఉంటాడు’ అని వాపోయాడు.

కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు. యమభటులు వచ్చి, భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుపోయారు. విష్ణుదూతలు వచ్చి వ్యభిచారగృహానికి వెళ్లినవాడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోయారు!’’

ఈ కథను ప్రియనాథముఖర్జీ అనే వ్యక్తికి రామకృష్ణ గురుదేవులు చెప్పారు. ప్రియనాథ ముఖర్జీ ఇంజినీరు. కొంత ధనాన్ని నిల్వ చేసుకుని చిన్నతనంలోనే ఉద్యోగాన్ని విరమించాడు. అతడికి కలకత్తాలోను, గ్రామప్రాంతంలోనూ ఇళ్లు ఉన్నాయి. తాను సంసారంలో బందీనైపోయానని చెబుతూ తన నిరుత్సాహాన్ని గురుదేవునికి వ్యక్తపరిచాడు.

అప్పుడు రామకృష్ణులు అతడికి ఈ కథ చెప్పి, ‘అన్నింటికీ ప్రధానమైనది మనస్సు. బంధించేది మన స్సే, విముక్తి కలిగించేదీ మనస్సే! బంధింపబడేది మనస్సే, విముక్తి పొందేదీ మనస్సే! భగవంతుడు మానవునిలో చూసేది అతడి మనస్సులోని భావాన్ని, పవిత్రతను మాత్రమే గాని, అతడు ఏమి చేశాడా? ఎక్కడ ఉన్నాడా? అనే విషయాన్ని పట్టించుకోడు’ అని కూడా చెప్పారు.

ఒకరోజు రామకృష్ణులవారు తమ గదిలో ఉన్నారు. మహేంద్రనాథ గుప్త అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. గురుదేవులు మాటిమాటికీ గోడకు తగిలించి ఉన్న పటాలవైపు చూస్తున్నారు.

శ్రీరామకృష్ణులకు ఎడమవైపున సరస్వతిపటం, దాని పక్కన గౌరాంగ సత్యాంగదులు సంకీర్తన చేస్తున్న పటం, ఎదురుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళికామాత పటాలు, కుడివైపున రాజరాజేశ్వరీదేవి పటం, వెనుకవైపు మునిగిపోతున్న పీటర్‌ను లేవనెత్తుతున్న జీసస్ పటం ఉన్నాయి. ఉన్నట్టుండి గురుదేవులు మహేంద్రనాథ గుప్తాతో ‘‘చూడు! సాధువులు, సన్యాసులు, సజ్జనుల చిత్రపటాలను ఇంట్లో తగిలించి ఉండటం మంచిది. నిద్రలేవగానే ఇతరుల ముఖం చూడకుండా, ముందుగా వారి ముఖాన్నే చూడటం శ్రేయస్సును కలిగిస్తుంది.

రజోగుణ స్వభావులైనవారు తమ ఇళ్లల్లో తమకు ఇష్టులైన రకరకాల వారి పటాలు తగిలించుకుంటారు. ఎటువంటివారి సాంగత్యం చేస్తే అటువంటివారి గుణాలు మనకు కలుగుతాయి. అందుకే ఇంటిలో మనం ఎటువంటి చిత్రపటాలను రోజూ చూస్తూ ఉంటామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటివల్ల కూడా సాంగత్యదోషం అంటుతుంది!’’ అని చెప్పారు.

ఆధునికయుగంలో మనం ఇళ్లలో ఉంచుకుంటున్న రకరకాల దృశ్యశ్రవణ యంత్రాలు, వాటిద్వారా మనకు లభించే హీనమైన సాంగత్యం, అది మనకు కలిగించే అత్యంత అపాయకరమైన అనర్థాలను గురించి గురుదేవులు దాదాపు నూటయాభై ఏళ్ల క్రితమే మనల్ని హెచ్చరించటం వారి దూరదృష్టికి నిదర్శనం.
 

బుద్ధుడిని చూస్తూ నిద్రలోకి...ఇంటిరియం

 

 
కంటి నిండా నిద్ర పోవడం... చాలా మందికి ఒక కల. బిజీ లైఫ్‌స్టయిల్‌లో నూటికి తొంబై మందికి సాధ్యం కాని వరం. ప్రశాంతత కొరవడితే నిద్ర దూరమవుతుంది. నిద్ర దూరమైతే చికాకులు మొదలవుతాయి. ఆ ప్రభావం పని నైపుణ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకదానికి మరొకటి ఇంటర్‌లింక్‌గా సాగే సమస్యల వలయం ఇదంతా.

‘అందమైన ఇల్లు కట్టుకోవడం సాధ్యమైంది కానీ ప్రశాంతంగా నిద్రపోవడం అసాధ్యంగా మారుతోంది’ అని ఆవేదన చెందేవాళ్లకి తథాగతుడి రూపమే సమాధానం. బుద్ధుని ప్రశాంత వదనం చూస్తే పగలంతా ఎదురైన చికాకులన్నీ తొలగిపోతాయి. తెలియని ఆధ్యాత్మిక భావంతో మనసు నిండిపోతుంది. ధ్యానమూర్తి రూపాన్ని చూస్తూ మనసు ప్రశాంతతను ఆస్వాదిస్తుంటే మనిషి నిద్రలోకి జారిపోతాడు. అందుకు దోహదం చేసేవే బుద్ధుని వాల్ హ్యాంగింగ్స్. ఇక్కడ కనిపించే వాల్ హ్యాంగింగ్‌లో చిన్న లైట్ ఉంది. బుద్ధుని పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తి రూపం ఉంది. మనకు కనిపించే ఆ వెలుతురు పెయింటింగే, కానీ దాని లోపల చిన్న బల్బు అమర్చారు. అలాగే చాలా రూపాలున్న పెయింటింగ్‌లో బుద్ధుని ముఖంపై తిలకం స్థానంలో బల్బు ఉంది.

రాత్రి గదిలో లైట్లు ఆపేసి దీనిని ఆన్ చేస్తే మిణుకు మిణుకుమంటూ బెడ్‌ల్యాంప్‌గా చిరుకాంతులీనుతుంది. బెడ్‌రూమ్‌లో ల్యాంప్‌షేడ్‌కి ప్రత్యేకంగా స్థలం కేటాయించడం సాధ్యం కానప్పుడు గోడకు బెడ్‌ల్యాంప్ అమర్చుకుంటాం. అదేదో ఇలా... వాల్ హ్యాంగింగ్‌లో ఉంటే పగలంతా మంచి పెయింటింగ్‌గా గది అందాన్ని పెంచుతుంది, రాత్రి బెడ్‌ల్యాంప్‌గా పనిచేస్తుంది. బుద్ధుని రూపం అలసిన మనసుకు సాంత్వననిస్తుంది. పైగా నిద్రలేచిన వెంటనే మొదటగా బుద్ధుడిని చూస్తుంటే మనిషి ఏ రోజుకారోజు తనను తాను సంస్కరించుకుంటూ ఉంటాడు. మనసులో క్రోధం, సహోద్యోగుల మీద ఆవేశకావేశాల వంటివి పెరగకుండా ఉంటాయి. కాబట్టి మానవసంబంధాలు మెరుగుపడుతుంటాయని బౌద్ధాన్ని ఆచరించేవారి విశ్వాసం.
 

మా అడ్రస్సే అంజన!!

 

అప్పట్లో కాకినాడ గోపిని...
ఇప్పుడు అంజనాసౌమ్య నాన్నని... అంటున్నారు చింతలపూడి గోపాలకృష్ణ.
‘పాటలు పాడే అమ్మాయి ఇల్లు’ గా మా ఇంటి అడ్రస్ మారింది అంటారు సుమతి.
పెళ్లయిన ఏడేళ్లకు పుట్టిన ఈ పాపాయి ఇంట్లో అందరికీ అపురూపమే...
‘పాట...’ అనే మాట పూర్తికాకముందే‘నే పాడుతా’ అంటుంది ఈ అమ్మాయి.
ఇదంతా ప్రోత్సాహమేనా! అంటే...కాదు... వారసత్వం అంటారీ పేరెంట్స్.
పొత్తిళ్లలో పాపాయిని గాయనిగా తీర్చిదిద్దిన ఈ దంపతుల అనుభవాలే
ఈ వారం పేరెంట్రీ!


అంజనను గాయనిని చేయాలన్న ఆలోచన మీ ఇద్దరిలో ఎవరిది?

సుమతి: ఎవరిదీ కాదు, తనదే. టీవీలో చూసిన పాటలను పాడేది. మ్యూజిక్ కూడా నోటితోనే పలికించేది. అప్పటికి తన పేరు పలకడం కూడా సరిగా రాదు, ఊహ తెలియక ముందే ఇలా ఉండడంతో పాపకు సంగీతం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. వాళ్ల మేనత్త జానకి... వీణ, ఓకల్ డిప్లమో కోర్సు చేసింది. అంజన మీద జెనెటిక్స్ ప్రభావం ఉందనిపించేది. మా చిన్నతాత పల్లవి నరసింహనాయుడు సంగీతవిద్వాంసులు, ఆయనకది సహజంగా అబ్బిన కళ. విద్యల నరసింహనాయుడు కాస్తా పల్లవి నరసింహనాయుడుగా వ్యవహారంలోకి వచ్చారు. తాతగారి మేనమామ తిరుపతి నారాయణస్వామి నాయుడు కృతులు రాసి పాడేవారు. ఆ వారసత్వం మా తరంలో డిస్‌కంటిన్యూ అయింది. చిత్తూరు జిల్లా నాగులాపురం నుంచి తాతగారు, నాన్నగారు బట్టల వ్యాపారంతో తిరుపతి, చెన్నై వెళ్లడం, మేము ప్రొఫెషనల్ కోర్సుల వైపు దృష్టి పెట్టడంతో సంగీతం రవళికి అంతరాయం కలిగింది. ఈ తరంలో అమ్మాయికి అబ్బింది. తన పేరు పద్మాంజలి సౌమ్య. సినిమాల్లో పాటలతో అంజనాసౌమ్య అయింది.

గోపాలకృష్ణ: మా ఆవిడ జెనెటిక్స్‌లో పీజీ చేయడంతో సౌమ్య సంగీతానికి ఈజీగా రూట్స్ పట్టుకుంది. పాపకు చిన్నప్పటి నుంచి టీవీలో కనిపించే సింగర్స్‌లాగ పాడాలని ఉండేది. సౌమ్య చిన్నప్పుడు కోల్‌కతాలో ఉండేవాళ్లం. ఒకసారి ప్లాస్టిక్ మైక్ కొనిపించుకుంది. ఆ మైక్ తెచ్చి ఇంటర్వ్యూ చేయమనేది. టీవీలో అందరూ చూస్తున్నారు నాన్నా, బాగా అడుగు అనేది. తను సమాధానం చెప్పగలిగిన ప్రశ్నలనే అడుగుతూ షో పండించేవాడిని.

సౌమ్య సంగీతసాధన ఏ వయసులో మొదలైంది?

సుమతి: సిక్త్స్‌క్లాస్ నుంచి శాస్త్రీయంగా నేర్చుకుంది. ఎంబిఏ చేస్తూ కరస్పాండెన్స్‌లో కర్నాటక సంగీతంలో డిప్లమో చేసింది. తనకు హిందూస్తానీ సంగీతం నేర్చుకోవాలని కోరిక. ప్రముఖ హిందూస్తానీ గాయకులు రామ్మూర్తిగారు చెన్నైలో ఉంటారు. కాకినాడ నుంచి చెన్నై వెళ్లి మాట్లాడాం. వీకెండ్స్‌లో తీసుకెళ్లి నేర్పిద్దాం అనుకున్నాం. అప్పుడు సౌమ్య బిటెక్ ఫైనల్ ఇయర్. ల్యాబ్ వీకెండ్‌లోనే ఉండేది. అలా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాట పాడమడంటే నిద్రలో నుంచి లేచయినా పాడుతుంది. అంత ఇష్టం సంగీతం అంటే.

గోపాలకృష్ణ: ఇష్టమైన పనిలో ఎంత కష్టం ఉన్నా అది కష్టంగా అనిపించదు అంటారు చూడండి. అలాగే ఉండేది. ఒక్కోసారి ముప్పావు గంటలో పూర్తి కావల్సిన రికార్డింగ్‌కి నాలుగైదు గంటలవుతుంది. ఇంత కష్టపడుతోంది పిల్ల అని బాధేసేది, సౌమ్య మాత్రం లోపలికి వెళ్లేటప్పుడు ఎంత సౌమ్యంగా ఉండేదో అంతే సౌమ్యంగా బయటకు వచ్చేది. తనకు సంగీతం తప్ప ఇంకేదీ పట్టదు. అమ్మాయిలకు సహజంగా ఆభరణాల మీద ఇష్టం ఉంటుంది. పైగా సౌమ్య అన్నప్రాశన రోజు బంగారం పట్టుకుంది. కానీ ఆభరణాల మీద వ్యామోహం పెరగలేదు. అన్నింటికంటే ఆశ్చర్యం ఎక్కడంటే... పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత ఒకసారి మాటల్లో అక్కడ మీది ఏ కారు అని అడిగితే ‘ఏమో నాన్నా! నేనంత గమనించలేదు’ అన్నది. ఆ కారులో తిరుగుతూ అక్కడి తెలుగు పిల్లలను సమీకరించి అన్నమయ్య కీర్తనలు నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ అదే కారో పట్టించుకోలేదు.

తొలి సంపాదన అనుభవం ఎలా ఉంది?

సుమతి: అప్పుడు సౌమ్య నైన్త్‌క్లాస్. కాకినాడలో ప్రోగ్రామ్ ఇచ్చింది. రెమ్యునరేషన్ అందుకోవడం తప్పులా ఫీలయింది. ‘అనాథలకు, బ్లైండ్ పీపుల్‌కి సహాయం చేయాలని ఉంటుంది. అది మా నాన్న డబ్బుతో చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు నా డబ్బుతో చేస్తాను’ అని చెప్పింది. అన్నట్లుగానే పుట్టినరోజు నాడు అంధపిల్లలుండే అనాథశరణాయంలో గడిపింది. తర్వాత అన్ని పుట్టినరోజులూ అంతే. తనకు ఇలాంటి భావాలున్నాయని మాకూ అప్పుడే తెలిసింది.

గోపాలకృష్ణ: ప్రతి విషయానికీ సెన్సిటివ్‌గా స్పందిస్తుంది. మొదటిసారి మెమెంటోగా మినియేచర్ కప్పు ఇచ్చిన నారం పరమేశ్‌కి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందనేది ఆయన హఠాన్మరణంతో తెలిసింది. చాలా బాధపడింది. మరీ ఇంత సెన్సిటివ్‌గా ఉంటే ఎలా అని నచ్చచెబుతూ వచ్చాం. ఇప్పటికీ తనకు అనుబంధాలు పెంచుకోవడమే తెలుసు, తుంచుకోవడం తెలియదు.

తన కల గురించి చెప్పేదా?

సుమతి: బీటెక్ చదివేటప్పుడు కాలేజ్‌కి కాకినాడ నుంచి 30 కి.మీ.లు బస్సులో వెళ్లేది. బస్సులో పాటలు పెట్టేవాళ్లు. ఆ పాటలు వింటున్నప్పుడు ‘ఏదో ఒక రోజు నా పాటలను కూడా ఇలా అందరూ వినాలి’ అనుకునేది.

గోపాలకృష్ణ: సౌమ్య కోరుకున్న రోజు బిటెక్ ఫైనలియర్‌లో వచ్చింది. ఫైనలియర్‌లో ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కోటి గారి నుంచి పిలుపు వచ్చింది. ‘క్లాస్‌మేట్స్’ కోసం ట్రాక్ పాడించి ఫైనల్ చేశారు. ఫస్టియర్‌లో ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి ఇంకా పరిణతి రాలేదని వాయిదా వేశారు.

ప్రొఫెషన్‌లో రాణిస్తుందన్న నమ్మకం, అత్యంత సంతోషం ఎప్పుడు?

సుమతి: తనకు సంగీతం ఇష్టం, నేర్పించాం, తీసుకెళ్లమన్న చోటికి తీసుకెళ్తున్నాం. కానీ ఇంత కాంపిటీషన్‌లో ఎంత వరకు తీసుకురాగలం అని సందేహంగా ఉండేది. మాటీవీ సూపర్ సింగర్స్‌లో రకరకాల పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పుడు నమ్మకం కలిగింది. అన్నింటికంటే పెద్ద సంతోషం మా సూపర్ సింగర్స్ 7, క్వార్టర్ ఫైనల్స్‌లో సౌమ్య పాటకు చంద్రబోస్ గారిచ్చిన కాంప్లిమెంట్‌కి కళ్లు చెమర్చాయి.

గోపాలకృష్ణ: నాకు అలాంటి సంతోషాలు మూడున్నాయి. కాకినాడలో సౌమ్య హోర్డింగ్ ఈ గోడంత పెద్దది(వాళ్లింటి హాల్ గోడను చూపిస్తూ) పెట్టారు. ఎవరో చెబితే చూడడానికి వెళ్లాను. మాటలు లేకుండా అలా నిలబడి పోయాను. మరొకటి సూపర్ సింగర్స్ 4 విన్నర్ కావడం, మూడవది కోటిగారు ‘ఎంత గొప్పగా పాడిందో తెలుసా’ అని ప్రశంసించడం.

అసైన్‌మెంట్ ఒప్పుకోవడం, రెమ్యునరేషన్ విషయాలను ఎవరు చూస్తారు?

గోపాలకృష్ణ: సౌమ్యకి చెప్పిన జీవిత సూక్తి ఒక్కటే. నీ మనసు ఏది చెబితే అది చెయ్ అని. పాట అంటే నిద్రలో లేచే అమ్మాయిని ఈ పాటలే పాడు, ఇంత రెమ్యునరేషన్ అయితేనే పాడు అని పరిధి విధించడం తప్పు కదా?

సుమతి: రెమ్యునరేషన్ ఎంత అనే మాట సౌమ్య నోటి వెంట ఇప్పటి వరకు రాలేదు. కవర్ తెచ్చి దేవుడి ముందు పెడుతుంది. తర్వాత కొంత మొత్తం దేవుడి హుండీలో వేస్తుంది. ఈ విషయంలో మా జోక్యం, చర్చలు లేవు.

వివాహం నిర్ణయం ఎలా జరిగింది?

సుమతి, గోపాలకృష్ణ: వరుడి ఎంపిక నుంచి పెళ్లిచీరలు కొనడం వరకు మేము ముగ్గురం కలిసే చేశాం. పెళ్లి కుదిరిన తర్వాత కెరీర్ పుంజుకోసాగింది. పెళ్లి ముహూర్తం కొంత నిడివితో పెట్టుకుంటే బావుంటుందేమో అనుకున్నాం. అప్పుడు చాలా సింపుల్‌గా ‘ఎప్పటికైనా చేసుకోవలసిందేగా, మన అభిప్రాయాలతో కలిసే వాళ్లు అయినప్పుడు వాయిదా వేయడం దేనికి’ అన్నది. అన్నట్లుగానే పెళ్లయిన తర్వాత కూడా గాయనిగా కొనసాగడానికి ఏ ఇబ్బందులూ లేకుండా హాయిగా ఉంది సౌమ్య జీవితం.

బిడ్డ గొప్ప గాయని కావాలని సాధన చేయించే అమ్మానాన్నలుంటారు. పాటలు పాడతానంటే పాడించి విని మురిసిపోయే వాళ్లుంటారు. కూతురు సంగీతాన్ని ఇష్టపడుతుందని తెలిసి ఆమెకోసం ఆ సంగీతం చుట్టూ తమ జీవితాలను మలుచుకున్న అమ్మానాన్నలు వీళ్లు. తిరుమల వేంకటేశ్వరస్వామి, పద్మావతీదేవికి భక్తితో అంజలి ఘటిస్తూ అదే పేరును బిడ్డకు నామకరణం చేసుకున్న సుమతి... ఇదంతా ఆ దేవుని మహిమే అంటున్నారు.

-వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

అమ్మ... నాన్న... ఒక్క అమ్మాయి!

సుమతి: ముగ్గురం ఒకరి ఎదురుగా ఒకరం ఉండడమే మాకు ఆనందమయమైన క్షణాలు. సౌమ్య ఒక ఇంటర్య్వూలో... ఉదయం అమ్మ, నాన్నలతో కలిసి కాఫీ తాగే క్షణాలు తనకు ఇష్టం అని చెప్పింది. కాఫీ టైమ్‌కి సౌమ్య నిద్ర లేవకపోతే కాఫీ తాగి మళ్లీ పడుకుందువుగాని ఇకలెమ్మని లేపేసేదాన్ని.

గోపాలకృష్ణ: సౌమ్యకు ఫ్రెండ్స్ తక్కువ. నలుగురితో ఇంటరాక్ట్ అవుతుంటే రకరకాల అభిప్రాయాలు, భావాలు తెలుస్తాయి కదా అంటే, మీరున్నారుగా అనేది. ప్రాక్టికల్ జోక్స్‌తో ఆశ్చర్యపరిచేది, మొదటిసారి జపాన్ వెళ్లినప్పుడు ‘జపాన్ ఎలా ఉంది’ అని అడిగితే ‘చీకటిగా ఉంది నాన్నా’ అన్నది. తను అక్కడ దిగింది అర్ధరాత్రి సమయంలో. అలాగే ఒకసారి వాళ్లమ్మ పుస్తకం చదువుతూ కళ్లద్దాలు తీయకుండానే నిద్రపోయింది. అమ్మేంటి కళ్లజోడు తియ్యలేదు అంటే... ‘కలలు సరిగా కనిపించడం లేదేమో నాన్నా’ అన్నది.
 

టీనేజర్స్ గదులు ఇలా ఉండాలి...ఇంటిరియం

 

 
టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందువల్ల వారి అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా గది ఏ రంగులో ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి.

రంగులను క్రియేటివ్‌గా వేస్తే బావుంటుంది. బాక్‌గ్రౌండ్ అంతా ఒకే కలర్‌లో ఉండనవసరం లేదు. గ్రే, గ్రీన్, బ్లూ కలర్స్‌లో బాగా లైట్‌గా ఉండే షేడ్‌ని ఎంచుకుంటే బావుంటుంది. ఆ రంగులవల్ల గోడలు ప్లెజంట్‌గా అనిపిస్తాయి. టీనేజర్ బాగా ఆడుతూ పాడుతూ కులాసాగా ఉండే వ్యక్తి అయితే, సన్నీ ఎల్లో, గ్రాస్ గ్రీన్ రంగులు బావుంటాయి. అవి వారి మనస్తత్వానికి అనువుగా ఉండటం వల్ల వారు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతేకాకుండా జీవితాన్ని కొత్తకోణంలోకి మలుపు తిప్పుకోగ లుగుతారు.

టీనేజర్స్ గదిలో ఉండే మంచం కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అలాగే ఆ గదిలో వార్డ్‌రోబ్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక వార్డ్‌రోబ్‌కి అద్దం బిగించితే మంచిది. తెలుపు, మెరైన్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, గ్రే రంగులైతే ఫర్నిచర్‌కి కూడా సూట్ అవుతాయి. షెల్వ్స్‌కి ఉండే స్టాండ్‌లు లేతరంగులలో, మంచి ఆకృతిలో ఉంటే, పుస్తకాలు ఉంచడానికి అనువుగా ఉంటాయి. అలాగే చదువుకి సంబంధించినవాటిని ఉంచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కంప్యూటర్ తప్పనిసరి కనుక, అనువుగా ఉండేలా అమర్చుకోవాలి.

మూయడానికి అనువుగా ఉంటే డ్రా ఉన్న టేబుల్స్, కొన్ని ఓపెన్‌గా ఉన్న టేబుల్స్ ఉంటే బొమ్మలను షోగా అమర్చుకోగలుగుతారు. ఒకవేళ టీనేజర్లు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నవారైతే వాటికి సంబంధించిన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ఉదాహరణకి బెడ్‌కి వెనకాల ఉండే గోడకు వాల్ పేపర్‌ని బాస్కెట్‌బాల్ లేదా ఫుట్‌బాల్ థీమ్‌తో ఉన్నది అమర్చుకుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది.