all

Sunday, May 12, 2013

ఆరోగ్య సౌభాగ్యాల 'తులసి'

 

తులసి కలియుగ కల్పవృక్షం! ఆ చెట్టు ఉపయోగపడే విధానం వల్లే మనం అలా భావించవచ్చు. అమ్మలేని పిల్లలు, తులసమ్మ లేని ఇల్లు ఉండదని తెలిసిందే. సూర్యుడిని ఏ విధంగా ప్రత్యక్షదైవంగా భావన చేస్తామో అదే విధంగా నేలపై ఉన్న తులసిమొక్కను కూడా భావించవచ్చు. సర్వరోగనివారిణిగా భావించే తులసిని ఔషధంగానే కాకుండా పవిత్రమైన పూజాదళంగా కూడా ఉపయోగిస్తున్నాం. ప్రతి ఇంట తులసి, వేప ఉన్నట్లయితే రోగం ఆమడదూరం పారిపోతుందని, యమకింకరులు ఆ ఇంటివైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించరని పెద్దలు చెబుతారు.

తులసి మన దేశంలో కృష్ణతులసి, లక్ష్మీతులసి, రామతులసి, నేలతులసి, వనతులసి, మరువక తులసి, రుద్రజడ తులసి, అడవి తులసి అని ఎనిమిదిరకాలుగా లభ్యమవుతున్నట్లు పండితులు చెబుతారు. కాని ప్రపంచవ్యాప్తంగా 180 రకాలకు పైగా లభ్యం అవుతున్నాయట! తులసిని ‘ఆసిమం సాక్టం’ అని లాటిన్‌లోను, ‘బాసిల్’ అని ఆంగ్లంలోను అంటారు. తులసిలో ‘దైమాత్’ అనే రసాయనం ఉన్నందువల్ల సువాసన వెదజల్లుతుంది.

పార్థివదేహాన్ని తులసివనంలో ఉంచితే శరీరం చెడువాసన రాదని, శరీరంలో మార్పు తొందరగా రాదని శాస్త్రం చెబుతోంది. అందుకే కాబోలు అంత్యేష్టిలో తులసిని తప్పక ఉపయోగిస్తారు. తులసిలో ఉండే రసాయన పదార్థం గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి చెడు ప్రభావాన్ని అరికడుతుంది. తులసికి... గాలిని పరిశుభ్రం చేసి, వ్యాధులను అరికట్టే గుణం ఉందని పరిశోధనలో తేలింది.

తులసికి ‘నిలువెత్తు బంగారం’ అనిపేరు. అంటే వేళ్ల దగ్గర నుంచి కొమ్మలు, ఆకులు, పూవులు అన్నీ మనకు ఉపయోగం. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. పాణవాయువును విడుదల చేస్తుంది. అనారోగ్యం దరిచేరనీయదు. తులసిమాల స్పర్శతో శరీరం ఉత్తేజితమై, దీని నుండి వచ్చే సువాసనకు బడలిక తగ్గుతుందని చెబుతారు. తులసి ఇంట్లో ఉంటే ఆరోగ్యం చెంత ఉన్నట్లే!

- ఉషా అన్నపూర్ణ
 

No comments: