all

Sunday, May 12, 2013

మా అడ్రస్సే అంజన!!

 

అప్పట్లో కాకినాడ గోపిని...
ఇప్పుడు అంజనాసౌమ్య నాన్నని... అంటున్నారు చింతలపూడి గోపాలకృష్ణ.
‘పాటలు పాడే అమ్మాయి ఇల్లు’ గా మా ఇంటి అడ్రస్ మారింది అంటారు సుమతి.
పెళ్లయిన ఏడేళ్లకు పుట్టిన ఈ పాపాయి ఇంట్లో అందరికీ అపురూపమే...
‘పాట...’ అనే మాట పూర్తికాకముందే‘నే పాడుతా’ అంటుంది ఈ అమ్మాయి.
ఇదంతా ప్రోత్సాహమేనా! అంటే...కాదు... వారసత్వం అంటారీ పేరెంట్స్.
పొత్తిళ్లలో పాపాయిని గాయనిగా తీర్చిదిద్దిన ఈ దంపతుల అనుభవాలే
ఈ వారం పేరెంట్రీ!


అంజనను గాయనిని చేయాలన్న ఆలోచన మీ ఇద్దరిలో ఎవరిది?

సుమతి: ఎవరిదీ కాదు, తనదే. టీవీలో చూసిన పాటలను పాడేది. మ్యూజిక్ కూడా నోటితోనే పలికించేది. అప్పటికి తన పేరు పలకడం కూడా సరిగా రాదు, ఊహ తెలియక ముందే ఇలా ఉండడంతో పాపకు సంగీతం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. వాళ్ల మేనత్త జానకి... వీణ, ఓకల్ డిప్లమో కోర్సు చేసింది. అంజన మీద జెనెటిక్స్ ప్రభావం ఉందనిపించేది. మా చిన్నతాత పల్లవి నరసింహనాయుడు సంగీతవిద్వాంసులు, ఆయనకది సహజంగా అబ్బిన కళ. విద్యల నరసింహనాయుడు కాస్తా పల్లవి నరసింహనాయుడుగా వ్యవహారంలోకి వచ్చారు. తాతగారి మేనమామ తిరుపతి నారాయణస్వామి నాయుడు కృతులు రాసి పాడేవారు. ఆ వారసత్వం మా తరంలో డిస్‌కంటిన్యూ అయింది. చిత్తూరు జిల్లా నాగులాపురం నుంచి తాతగారు, నాన్నగారు బట్టల వ్యాపారంతో తిరుపతి, చెన్నై వెళ్లడం, మేము ప్రొఫెషనల్ కోర్సుల వైపు దృష్టి పెట్టడంతో సంగీతం రవళికి అంతరాయం కలిగింది. ఈ తరంలో అమ్మాయికి అబ్బింది. తన పేరు పద్మాంజలి సౌమ్య. సినిమాల్లో పాటలతో అంజనాసౌమ్య అయింది.

గోపాలకృష్ణ: మా ఆవిడ జెనెటిక్స్‌లో పీజీ చేయడంతో సౌమ్య సంగీతానికి ఈజీగా రూట్స్ పట్టుకుంది. పాపకు చిన్నప్పటి నుంచి టీవీలో కనిపించే సింగర్స్‌లాగ పాడాలని ఉండేది. సౌమ్య చిన్నప్పుడు కోల్‌కతాలో ఉండేవాళ్లం. ఒకసారి ప్లాస్టిక్ మైక్ కొనిపించుకుంది. ఆ మైక్ తెచ్చి ఇంటర్వ్యూ చేయమనేది. టీవీలో అందరూ చూస్తున్నారు నాన్నా, బాగా అడుగు అనేది. తను సమాధానం చెప్పగలిగిన ప్రశ్నలనే అడుగుతూ షో పండించేవాడిని.

సౌమ్య సంగీతసాధన ఏ వయసులో మొదలైంది?

సుమతి: సిక్త్స్‌క్లాస్ నుంచి శాస్త్రీయంగా నేర్చుకుంది. ఎంబిఏ చేస్తూ కరస్పాండెన్స్‌లో కర్నాటక సంగీతంలో డిప్లమో చేసింది. తనకు హిందూస్తానీ సంగీతం నేర్చుకోవాలని కోరిక. ప్రముఖ హిందూస్తానీ గాయకులు రామ్మూర్తిగారు చెన్నైలో ఉంటారు. కాకినాడ నుంచి చెన్నై వెళ్లి మాట్లాడాం. వీకెండ్స్‌లో తీసుకెళ్లి నేర్పిద్దాం అనుకున్నాం. అప్పుడు సౌమ్య బిటెక్ ఫైనల్ ఇయర్. ల్యాబ్ వీకెండ్‌లోనే ఉండేది. అలా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాట పాడమడంటే నిద్రలో నుంచి లేచయినా పాడుతుంది. అంత ఇష్టం సంగీతం అంటే.

గోపాలకృష్ణ: ఇష్టమైన పనిలో ఎంత కష్టం ఉన్నా అది కష్టంగా అనిపించదు అంటారు చూడండి. అలాగే ఉండేది. ఒక్కోసారి ముప్పావు గంటలో పూర్తి కావల్సిన రికార్డింగ్‌కి నాలుగైదు గంటలవుతుంది. ఇంత కష్టపడుతోంది పిల్ల అని బాధేసేది, సౌమ్య మాత్రం లోపలికి వెళ్లేటప్పుడు ఎంత సౌమ్యంగా ఉండేదో అంతే సౌమ్యంగా బయటకు వచ్చేది. తనకు సంగీతం తప్ప ఇంకేదీ పట్టదు. అమ్మాయిలకు సహజంగా ఆభరణాల మీద ఇష్టం ఉంటుంది. పైగా సౌమ్య అన్నప్రాశన రోజు బంగారం పట్టుకుంది. కానీ ఆభరణాల మీద వ్యామోహం పెరగలేదు. అన్నింటికంటే ఆశ్చర్యం ఎక్కడంటే... పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత ఒకసారి మాటల్లో అక్కడ మీది ఏ కారు అని అడిగితే ‘ఏమో నాన్నా! నేనంత గమనించలేదు’ అన్నది. ఆ కారులో తిరుగుతూ అక్కడి తెలుగు పిల్లలను సమీకరించి అన్నమయ్య కీర్తనలు నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ అదే కారో పట్టించుకోలేదు.

తొలి సంపాదన అనుభవం ఎలా ఉంది?

సుమతి: అప్పుడు సౌమ్య నైన్త్‌క్లాస్. కాకినాడలో ప్రోగ్రామ్ ఇచ్చింది. రెమ్యునరేషన్ అందుకోవడం తప్పులా ఫీలయింది. ‘అనాథలకు, బ్లైండ్ పీపుల్‌కి సహాయం చేయాలని ఉంటుంది. అది మా నాన్న డబ్బుతో చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు నా డబ్బుతో చేస్తాను’ అని చెప్పింది. అన్నట్లుగానే పుట్టినరోజు నాడు అంధపిల్లలుండే అనాథశరణాయంలో గడిపింది. తర్వాత అన్ని పుట్టినరోజులూ అంతే. తనకు ఇలాంటి భావాలున్నాయని మాకూ అప్పుడే తెలిసింది.

గోపాలకృష్ణ: ప్రతి విషయానికీ సెన్సిటివ్‌గా స్పందిస్తుంది. మొదటిసారి మెమెంటోగా మినియేచర్ కప్పు ఇచ్చిన నారం పరమేశ్‌కి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందనేది ఆయన హఠాన్మరణంతో తెలిసింది. చాలా బాధపడింది. మరీ ఇంత సెన్సిటివ్‌గా ఉంటే ఎలా అని నచ్చచెబుతూ వచ్చాం. ఇప్పటికీ తనకు అనుబంధాలు పెంచుకోవడమే తెలుసు, తుంచుకోవడం తెలియదు.

తన కల గురించి చెప్పేదా?

సుమతి: బీటెక్ చదివేటప్పుడు కాలేజ్‌కి కాకినాడ నుంచి 30 కి.మీ.లు బస్సులో వెళ్లేది. బస్సులో పాటలు పెట్టేవాళ్లు. ఆ పాటలు వింటున్నప్పుడు ‘ఏదో ఒక రోజు నా పాటలను కూడా ఇలా అందరూ వినాలి’ అనుకునేది.

గోపాలకృష్ణ: సౌమ్య కోరుకున్న రోజు బిటెక్ ఫైనలియర్‌లో వచ్చింది. ఫైనలియర్‌లో ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కోటి గారి నుంచి పిలుపు వచ్చింది. ‘క్లాస్‌మేట్స్’ కోసం ట్రాక్ పాడించి ఫైనల్ చేశారు. ఫస్టియర్‌లో ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి ఇంకా పరిణతి రాలేదని వాయిదా వేశారు.

ప్రొఫెషన్‌లో రాణిస్తుందన్న నమ్మకం, అత్యంత సంతోషం ఎప్పుడు?

సుమతి: తనకు సంగీతం ఇష్టం, నేర్పించాం, తీసుకెళ్లమన్న చోటికి తీసుకెళ్తున్నాం. కానీ ఇంత కాంపిటీషన్‌లో ఎంత వరకు తీసుకురాగలం అని సందేహంగా ఉండేది. మాటీవీ సూపర్ సింగర్స్‌లో రకరకాల పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పుడు నమ్మకం కలిగింది. అన్నింటికంటే పెద్ద సంతోషం మా సూపర్ సింగర్స్ 7, క్వార్టర్ ఫైనల్స్‌లో సౌమ్య పాటకు చంద్రబోస్ గారిచ్చిన కాంప్లిమెంట్‌కి కళ్లు చెమర్చాయి.

గోపాలకృష్ణ: నాకు అలాంటి సంతోషాలు మూడున్నాయి. కాకినాడలో సౌమ్య హోర్డింగ్ ఈ గోడంత పెద్దది(వాళ్లింటి హాల్ గోడను చూపిస్తూ) పెట్టారు. ఎవరో చెబితే చూడడానికి వెళ్లాను. మాటలు లేకుండా అలా నిలబడి పోయాను. మరొకటి సూపర్ సింగర్స్ 4 విన్నర్ కావడం, మూడవది కోటిగారు ‘ఎంత గొప్పగా పాడిందో తెలుసా’ అని ప్రశంసించడం.

అసైన్‌మెంట్ ఒప్పుకోవడం, రెమ్యునరేషన్ విషయాలను ఎవరు చూస్తారు?

గోపాలకృష్ణ: సౌమ్యకి చెప్పిన జీవిత సూక్తి ఒక్కటే. నీ మనసు ఏది చెబితే అది చెయ్ అని. పాట అంటే నిద్రలో లేచే అమ్మాయిని ఈ పాటలే పాడు, ఇంత రెమ్యునరేషన్ అయితేనే పాడు అని పరిధి విధించడం తప్పు కదా?

సుమతి: రెమ్యునరేషన్ ఎంత అనే మాట సౌమ్య నోటి వెంట ఇప్పటి వరకు రాలేదు. కవర్ తెచ్చి దేవుడి ముందు పెడుతుంది. తర్వాత కొంత మొత్తం దేవుడి హుండీలో వేస్తుంది. ఈ విషయంలో మా జోక్యం, చర్చలు లేవు.

వివాహం నిర్ణయం ఎలా జరిగింది?

సుమతి, గోపాలకృష్ణ: వరుడి ఎంపిక నుంచి పెళ్లిచీరలు కొనడం వరకు మేము ముగ్గురం కలిసే చేశాం. పెళ్లి కుదిరిన తర్వాత కెరీర్ పుంజుకోసాగింది. పెళ్లి ముహూర్తం కొంత నిడివితో పెట్టుకుంటే బావుంటుందేమో అనుకున్నాం. అప్పుడు చాలా సింపుల్‌గా ‘ఎప్పటికైనా చేసుకోవలసిందేగా, మన అభిప్రాయాలతో కలిసే వాళ్లు అయినప్పుడు వాయిదా వేయడం దేనికి’ అన్నది. అన్నట్లుగానే పెళ్లయిన తర్వాత కూడా గాయనిగా కొనసాగడానికి ఏ ఇబ్బందులూ లేకుండా హాయిగా ఉంది సౌమ్య జీవితం.

బిడ్డ గొప్ప గాయని కావాలని సాధన చేయించే అమ్మానాన్నలుంటారు. పాటలు పాడతానంటే పాడించి విని మురిసిపోయే వాళ్లుంటారు. కూతురు సంగీతాన్ని ఇష్టపడుతుందని తెలిసి ఆమెకోసం ఆ సంగీతం చుట్టూ తమ జీవితాలను మలుచుకున్న అమ్మానాన్నలు వీళ్లు. తిరుమల వేంకటేశ్వరస్వామి, పద్మావతీదేవికి భక్తితో అంజలి ఘటిస్తూ అదే పేరును బిడ్డకు నామకరణం చేసుకున్న సుమతి... ఇదంతా ఆ దేవుని మహిమే అంటున్నారు.

-వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

అమ్మ... నాన్న... ఒక్క అమ్మాయి!

సుమతి: ముగ్గురం ఒకరి ఎదురుగా ఒకరం ఉండడమే మాకు ఆనందమయమైన క్షణాలు. సౌమ్య ఒక ఇంటర్య్వూలో... ఉదయం అమ్మ, నాన్నలతో కలిసి కాఫీ తాగే క్షణాలు తనకు ఇష్టం అని చెప్పింది. కాఫీ టైమ్‌కి సౌమ్య నిద్ర లేవకపోతే కాఫీ తాగి మళ్లీ పడుకుందువుగాని ఇకలెమ్మని లేపేసేదాన్ని.

గోపాలకృష్ణ: సౌమ్యకు ఫ్రెండ్స్ తక్కువ. నలుగురితో ఇంటరాక్ట్ అవుతుంటే రకరకాల అభిప్రాయాలు, భావాలు తెలుస్తాయి కదా అంటే, మీరున్నారుగా అనేది. ప్రాక్టికల్ జోక్స్‌తో ఆశ్చర్యపరిచేది, మొదటిసారి జపాన్ వెళ్లినప్పుడు ‘జపాన్ ఎలా ఉంది’ అని అడిగితే ‘చీకటిగా ఉంది నాన్నా’ అన్నది. తను అక్కడ దిగింది అర్ధరాత్రి సమయంలో. అలాగే ఒకసారి వాళ్లమ్మ పుస్తకం చదువుతూ కళ్లద్దాలు తీయకుండానే నిద్రపోయింది. అమ్మేంటి కళ్లజోడు తియ్యలేదు అంటే... ‘కలలు సరిగా కనిపించడం లేదేమో నాన్నా’ అన్నది.
 

No comments: