డాక్టర్‌ని అడగండి
నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న బొడిపె వంటిది బయటకు వచ్చి మలరంధ్రం వద్ద దురద పెట్టినట్లుగా ఉంటోంది. నా సమస్యకు మందులు సూచించండి.
- ఎన్. రవి, శ్రీకాకుళం మలద్వారం నుంచి ఇలా బఠాణీ గింజ రూపంలో బయటికి వచ్చే ఆకృతిని ‘మొలలు’ అంటారు. మల ద్వారం వద్ద రక్తప్రసరణ పెరిగి, అక్కడి రక్తనాళాలు ఉబ్బడంతో ఈ విధంగా ఒక గింజ ఆకృతిలో బయటకు వస్తుంటాయి. ఈ ఆకృతి క్రమంగా పెరుగుతూ, రక్తాన్ని స్రవిస్తూ బాధిస్తుంటుంది. వీటినే ఇంగ్లిష్‌లో ‘పైల్స్’ అని, వైద్యపరిభాషలో హిమరాయిడ్స్ అని వ్యవహరిస్తుంటారు. మొలలు లక్షణాలు: సాధారణంగా మొలలు చిన్నగా ఉన్నప్పుడు మలవిసర్జనకు వెళ్లినప్పుడు మాత్రమే కాస్తంత సూదితో గుచ్చినట్లుగా అనిపించడం తప్ప అంతగా లక్షణాలను కనబరచవు. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది కూడా. అయితే మొలల తీవ్రత పెరుగుతున్నకొద్దీ... నొప్పి, మంట, రక్తస్రావం, మలద్వారం వద్ద దురద, మ్యూకస్ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్నవారికి డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మొలల తీవ్రతను బట్టి వాటిని డిగ్రీలుగా విభజిస్తారు. మొలలకు కారణాలు : మలబద్దకం ఉన్నవారు మలవిసర్జన సమయంలో ముక్కటం వల్ల అక్కడి రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి, అవి ఉబ్బడం వల్ల పైల్స్ రావచ్చు. గర్భవతుల్లో కడుపు పెరుగుతూ దాని భారంతో మలద్వారం వద్ద రక్తప్రసరణ పెరిగి ఇవి ఏర్పడవచ్చు. బిడ్డ పుట్టే సమయంలో కలిగే ఒత్తిడి కారణంగా కూడా పైల్స్ రావచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల ఇవి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ చరిత్రలో ఇవి ఉన్నట్లయితే... ఆ కుటుంబ సభ్యుల్లోనూ వంశపారంపర్యంగా పైల్స్ కనిపించే అవకాశాలు ఎక్కువ. నివారణ... మొలల వల్ల లక్షణాలు అంతగా బాధించని ప్రాథమిక స్థితి నుంచే మేల్కొని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాటిని సమర్థంగా నివారించవచ్చు. దీనివల్ల బాధాకరమైన పరిస్థితులను తప్పించుకోవచ్చు. మలబద్దకం లేకుండా చూసుకుంటూ విసర్జన సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. మలబద్దకం లేకుండా ఉండటం కోసం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, పొట్టుతో ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు నీళ్లు పుష్కలంగా తాగాలి. మలబద్దకానికి ఆస్కారం ఇచ్చే పచ్చళ్లు, మసాలాలు, వేపుళ్లు, కారం, బేకరీ ఐటమ్స్ అయిన పిజ్జా, బర్గర్లనుంచి దూరంగా ఉండాలి. చాలాసేపు కూర్చుని చేయాల్సిన వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి పదినిమిషాలు తిరిగి మళ్లీ కూర్చోవాలి. హోమియో మందులు: సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే అది బాధాకరంగా ఉండటంతో పాటు బిడియానికి దారితీయవచ్చు. అయితే హోమియోలో ఆ పరిస్థితి రాకుండానే సమర్థమైన చికిత్స చేయడానికి అవకాశం ఉంది. హోమియోలో నైట్రిక్ యాసిడ్, నక్స్‌వామికా, ఆస్కులస్, సల్ఫర్, ఇగ్నీషియా, రటానియా, బెల్లడోనా, పల్సటిల్లా, లాకెసిస్, కాల్కేరియా, లైకోపోడియం, బెరైటాకార్బ్, మ్యురాటిక్ యాసిడ్ వంటి మందులను వ్యక్తిగత లక్షణాలను బట్టి వాడాల్సి ఉంటుంది. ఇక మీ విషయంలో మీకు పైల్స్ వల్ల రక్తస్రావం అవుతోంది కాబట్టి నైట్రిక్ యాసిడ్‌ను 200 పొటెన్సీలో వారానికి ఒక డోసు వేసుకుంటూ రెండు నెలల పాటు వాడండి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే మీ సమీపంలో ఉన్న హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి.
డాక్టర్ రాజశేఖర్, ష్యూర్‌కేర్ హోమియోపతి
|
No comments:
Post a Comment