all

Monday, March 18, 2013

జోడు అనర్థాలు

డయాబెటిస్ - హైబీపీ
క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర పాళ్లను పరీక్షింప చేసుకోవడం, బీపీ చెకప్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటే కిడ్నీలను కాపాడుకోవడం సులభం.

మన దేశంలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి సంఖ్య 20 లక్షలకు పైచిలుకేనని ఒక అంచనా. దీనికి తోడు ప్రతి ఏటా ఈ జాబితాకు రెండు లక్షల మంది అదనంగా తోడవుతున్నారు. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధానంగా దోహదపడే రెండు ప్రధానమైన సమస్యల్లో మొదటిది చక్కెర వ్యాధి. రెండోది హైబీపీ. ఈ రెండింటినీ నియంత్రణలో ఉంచుకుంటే మనిషి జీవితాన్ని తప్పకుండా కాపాడుకోవడమేగాక... ఆయుర్దాయాన్నీ పొడిగించుకోవచ్చు. ఆరోగ్యకరమైన సాధారణ జీవితం గడపవచ్చు.

ఆ రెండిటితో కిడ్నీకి అనర్థాలెన్నో...

నూరుమంది కిడ్నీ బాధితులను తీసుకుంటే అందులో 40 శాతం మంది మధుమేహం, మరో 30 శాతం మంది హైబీపీలను నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల తమకు తెలియకుండానే తమ కిడ్నీలు తామే దెబ్బతినేలా చూసుకున్నవారవుతారు. అందుకే ఈ రెండు సమస్యలను నియంత్రణలో ఉంచుకోగలిగితే కిడ్నీలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా సులభం. అందుకే మూత్రపిండాలను సంరక్షిచుకోవడం అంటే... మొదట అదుపులో ఉండాల్సినవి... మధుమేహం, హైబీపీ అని గుర్తుంచుకోవాలి.

చిన్నతనంలోనే వచ్చే (టైప్-1) మధుమేహ బాధితుల్లో 10-30 శాతం మంది, పెద్దయ్యాక వచ్చే (టైప్-2) మధుమేహ బాధితుల్లో 40 శాతం మంది కిడ్నీ జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉందంటే అటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలతో పాటు, కిడ్నీలు పాడయ్యే అవకాశాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

ఇక ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వృత్తులు వంటివి మన రక్తపోటు (హైబీపీ) సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో హైబీపీ కారణంగా దెబ్బతినే ప్రధాన అవయవాల్లో కిడ్నీ ప్రధానమైనది. అందుకే ఈ రెండూ ఉన్నాయంటే మూత్రపిండాలను సురక్షితంగా ఉంచుకోవడం చాలా కీలకం అనే విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు.

ఆ రెండూ ఉంటే కిడ్నీలపై అంత శ్రద్ధ ఎందుకు..?

ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి విఫలం కావడం ఆరంభమైందంటే అది పూర్తిగా నార్మల్‌కు రావడం చాలా కష్టం. అదేగాని పూర్తిగా విఫలమైతే ఇక నిత్యం కృత్రిమంగానే రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఇది కుటుంబాలపై ఎంతో ఆర్థిక భారాన్ని మోపుతుంది.

ఎంత లేదన్నా ప్రతి నెల ఐదారువేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన మూత్రపిండానికి చికిత్స తీసుకుంటూ ఉన్నా అది పూర్తిగా సమర్థంగా మారదు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. పోనీ... దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలన్నా కిడ్నీ దాతలు దొరకడం కష్టం. ఆపరేషనే పెద్ద ప్రయత్నం అనుకుంటే... ఇక ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ చాలా ఎక్కువగా ఖర్చవుతుంది.

మూత్రపిండాల వ్యాధి ఉన్నవారి కుటుంబానికి అటు డయాలసిస్ కోసం, ఇటు మందుల కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు అవుతుంటుంది. సరే... ఖర్చును ఎలాగోలా భరిద్దామనే అనుకున్నా మందులతో ఇతర సమస్యలు, దుష్ర్పభావాలు, ఇబ్బందులు కలుగుతాయి. వీటన్నింటి సంయుక్త ఫలితంగా జీవనప్రమాణాలు, ఆయుర్దాయం తగ్గవచ్చు. అందుకే కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, అది అవసరం కూడా.

- నిర్వహణ : యాసీన్
 

No comments: