all

Monday, January 28, 2013

బంగారు పళ్లానికైనా...

 
నిత్య సందేశం
ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలపైనే నడుస్తుంది. ఉన్నది ఒక్కటే ‘సత్’ పదార్థం అయినా ‘అసత్తు’ కూడా కలిస్తేనే లోకవ్యవహారం జరుగుతుంది. చీకటివెలుగులు, మంచిచెడులు, స్త్రీపురుషులు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు ఇవన్నీ ద్వంద్వాలు. ఒకదానివల్ల మరొక దానికి గుర్తింపు వస్తే, మరొకదాని వల్ల అసలు దానికి స్థిరత్వం ఉంటుంది. బంగారంలో రాగి కలిస్తేనే దృఢత్వం. చెడ్డవారివల్లే మంచివారికి పేరు ప్రఖ్యాతులు. రావణాసురుడు వల్లే రాముని చరితం అంత గొప్పదయ్యింది. ఎంత బంగారు పళ్లెం చేయించుకున్నా దానికి ఇనుపరేకు వంటివి రక్షణగా ఉండాలి కదా! చుట్టూ ముళ్లకంచె పాతి రక్షించడం వల్లే పంట క్షేమంగా బయటకు వస్తుంది. అటువంటప్పుడు రక్షించినవాటిని అసహ్యంగా చూడటం న్యాయం కాదు కదా! అందుకే ఈ సృష్టిలో మంచిచెడులను సమానంగా చూడగలిగినవారిని మహాత్ములన్నారు. అందరూ ఒక్కటిగా కనిపిస్తేనే ఈ లోకంలో అసలైన సత్యం. అలా ఐక్యంగా ఉంటేనే పరమశ్రేయస్సు అంటోంది శాస్త్రం...

సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకై రపి
తుషేణాపి పరిత్యక్తా న ప్రరోహంతి తండులాః
మనకంటే తక్కువ స్థాయి వారైనా వారితో కలిసి ఉంటేనే శ్రేయస్సు. వడ్లగింజను బియ్యపుగింజగా మార్చి అన్నం వండుకుంటాం. ఆ పొట్టు వల్లే బియ్యపుగింజ రక్షింపబడుతోంది. అది తీసేస్తే బియ్యపుగింజకి సంతానయోగ్యత లేదు. జీవితాన్ని రక్షిస్తూ వాని తొక్కలు వాటిని ఎంత కంటికి రెప్పగా చూసుకొంటున్నాయో కదా! దాని పొట్టు ఎంత కష్టం అనుభవిస్తుందో కదా!

మన భారతదేశంలో మనం హాయిగా బ్రతుకుతున్నామంటే అందుకు కారణం సైన్యం అప్రమత్తంగా ఉండి రక్షించడమే కదా! కానీ మనం ఒక్కసారి కూడా వారిని స్మరించుకోం. మనం ఇంట్లో కూర్చుని హాయిగా ఆరగించే పదార్థాలు చెమటోడ్చి పండించిన రైతు వల్ల లభిస్తున్నాయన్నది పచ్చి నిజం కదా! ప్రజల వల్లే కదా ప్రభుత్వాలు జీవిస్తున్నాయి. కార్మికుల వల్లనే కర్మాగారాలు నడుస్తున్నాయి. కష్టజీవుల్ని మనతో సమంగా చూడగలగడం మానవత్వం. మనం వారిని పోషిస్తున్నామనే గర్వం తలకెక్కితే అశాంతి తప్పదు.

దుర్యోధనుడు పాండవుల్ని మాయాజూదంలో ఓడించి అడవికి పంపాడు. అక్కడితో ఆగక ఘోషయాత్రతో వారిని శిక్షించబోయాడు. తిరిగి ఆ పాండవుల వల్లే బతికి బట్టకట్టాడు. దైవం దుర్యోధనుడికి ఆ విధంగా ఒక అవకాశం ఇచ్చింది. కానీ దుర్యోధనుడు మాత్రం... అది పాండవుల బాధ్యత, వారు ఇప్పుడు తన దాసులు కనుక తనను రక్షించక ఏంచేస్తారు? అనుకున్నాడు. బంగారుపళ్లానికి గోడలాంటి ఆసరా అవసరమే కానీ దుర్యోధనుడికి శకుని ఆసరాగా కనిపించాడు. పాలు, నీళ్లు కలిసే ఉంటాయి. కాచినపాలు పొంగబోతూ ఉంటే మళ్లీ నీళ్లు చల్లితేనే కొంచెంసేపు ఆగుతాయి. పాలకి తెలుసు తమ పరమమిత్రుడు ‘నీరే’ అని. మనమంతా పాలవంటి మనస్సులు కలిగేవారం కావాలి. అదే అమృతమార్గం అంటే.

- డా. ధూళిపాళ మహాదేవమణి

No comments: