all

Sunday, December 9, 2012

ఆరోగ్యం కోసం...

 

మనలో చాలా మందిమి ఆరోగ్యవంతమైన శరీరాలతోనే జన్మిస్తాం. కానీ తెలియక అనేక తప్పులు చేసేస్తాం. శరీరం గురించి పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటాం. మన ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పనిచేసేందకు సమయం సరిపడకపోతే నిద్రా సమయాన్ని పనిచేయడానికి వినియోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయంలో ఇలా చేస్తూ ఉంటారు. కనీసం ఎనిమిది గంటలు నిద్రిస్తే ఆరోగ్యానికి మంచిదని పరిశోధనల్లో వెల్లడయ్యింది.
నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతిలో ఉంటుంది. శరీరం లోపలి అవయవాల పని చురుకుదనం తగ్గుతుంది. మెదడు నిద్రావస్థలో ఉంటుంది. గుండె కొట్టుకునే రేటు కూడా నిమిషానికి 72 నుండి 55కి పడిపోతుంది. గాఢ నిద్ర అనంతరం మేల్కొనగానే మనసు, శరీరం చాలా తాజాగా ఉంటాయనేది మనకు అనుభవంలోని విషయమే. నిద్రలేమితో బాధపడేవారికి నిద్ర గొప్పదనం తెలుస్తుంది. నిద్రలోపించినపుడు మనిషికి సులువుగా కోపం వస్తూ ఉంటుంది. శరీరంలో ఆమ్లాల పరిమాణం పెరిగి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
కొంతమంది మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తారు. ఈ కాస్త నిద్ర వారి మెదడులో చురుకుదనాన్ని పెంచుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. అనుదినం 6 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. అంతకు మించిన నిద్ర చాలా ప్రమాదం. ఇది బద్దకాన్ని పెంచుతుంది.
మంచి ఆహారం
మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని కాదు. రుచికరమైనదని కూడా కాదు. మంచి ఆహారం అంటే శరీరానికి మేలు చేసేది. దీనిలో పౌష్టికత బాగా ఉండాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు తగిన నిష్పత్తిలో ఉండాలి. 8 నుండి 10 గ్లాసుల నీరు కూడా తాగాలి.
వయసును బట్టి, ఆడమగా తేడాను బట్టి, చేసే శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి.
ఎవరికి వారు తాము ఎలాంటి సమతులాహారం తీసుకోవాలో తెలుసుకుని భుజిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాల బారిన పడకుండా మన శరీరం కాపాడుతుంది.
ఎక్కువ తినడం వల్ల కూడా శరీరం అనేక విధాలుగా నలిగిపోతుంది. స్థూలకాయం, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎదురవుతాయి.
వ్యాయామం
వ్యాయామం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాయామం అంటే శారీరక, మానసిక వ్యాయామం. 'ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు' ఉండాలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచి ఎటు కావాలంటే అటు వంగేటట్లు చేస్తుంది
క్రమం తప్పని వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. జిమ్‌, ఎరోబిక్స్‌, చురుగ్గా నడవడం, ఈత, షటిల్‌ లేదా ఇంకేవైనా శరీరానికి వ్యాయామాన్నందించే ఆటలు ఆడాలి.
పద్ధతులు పాటించాలి
శరీరాన్ని కాపాడుకునే కొన్ని పద్ధతులను చిన్నతనం నుండే పెద్దలు అలవాటు చేస్తుంటారు. ఇవన్నీ ఆరోగ్యానికి మెట్లు అని గుర్తుంచుకోవాలి. నిద్రపోవడానికి-లేవడానికి సరైన సమయాలు, ఉదయం నిద్రలేవగానే ముఖం, కాళ్లు కడుక్కోవడం బయటినుండి ఇంట్లోకి వచ్చినపుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం, భోజనం ముందు, తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవడం, రోజూ స్నానం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది.
అనేక శారీరక సమస్యలకు కారణం శరీరాన్ని మనం అజాగ్రత్తతో వదిలివేయడమే. శరీరంలో తరచు ఏదైనా రోగం ప్రవేశించి వేధిస్తూ ఉంటే వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలి.
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జవసత్వాలు తగ్గుతాయి. అటువంటిప్పుడు శరీరం గురించి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే శరీరాన్ని మాయిశ్చర్‌ చేయాలి. ఎండలో వెళ్లేటప్పుడు చలువ కళ్ళజోళ్ళు , గొడుగు ఉపయోగించడం మంచిది.
శరీర, ముఖ వర్చస్సు తగ్గకుండా కూడా వ్యాయామాలు చేయాలి. పాదరక్షలు సౌకర్యంగా, తేలికగా ఉండేలా ఎంచుకోవాలి.
సంతోషం సగంబలం
మనిషి ఆందోళన చెందకూడదు. ఆందోళన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఏదైనా సమస్య ఎదురయితే సామాన్యంగా ఆందోళనకు గురి అవుతారు. ఇది సహజమైన ప్రతిచర్య. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలి. సమస్యకు పరిష్కారం వెదుక్కోవాలిగానీ చింతిస్తూ కూర్చోకూడదు.
ఆందోళన మనిషిని అనారోగ్యం పాలు చేస్తుంది. మరిన్ని తప్పులు చేయిస్తుంది. ఇది శరీరంలో హార్మోనులను విడుదల చేయిస్తుంది. తమ శక్తికి మించిన సమస్య అయితే కుటుంబ సభ్యులు, లేదా మిత్రుల సహకారం తీసుకోవడం మంచిది.
చిరునవ్వుతో ఉండడం శరీరానికి ఎంతో అవసరం. చేసే చిన్న చిన్న తప్పులకు విచారించక వాటిని పాఠాలుగా తీసుకుని నవ్వుకోవడం నేర్చుకోవాలి.
ఇతరులకు సహాయం చేయడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. చేతనయినంత ఇతరులకు సహకరించడం, ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువులను, స్నేహితులను ఆప్యాయంగా పలకరించడం, కొత్త వారితో మర్యాదగా మసలడం, ఎదుటివారికి విలువ నిచ్చి మనసుతో మాట్లాడడం వంటివి మీ వ్యక్తిత్వానికి వన్నె తెస్తాయి.
- సి.వి.సర్వేశ్వరశర్మ
ఫోన్‌ నెం: 9866843982

No comments: