all

Monday, December 17, 2012

అడుగు వేస్తే ఆలోచించకు.............(నిత్య సందేశం)

 
 
మన బుద్ధే మన కర్మల్ని నడిపిస్తుంది... అంటారు పెద్దలు. ఏది మంచో? ఏది చెడో? తెలిసిన బుద్ధి వల్ల మన వ్యవహారం సఫలం అవుతుందన్నది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో మనం అనుభవించవలసిన కర్మలు మన బుద్ధిని నడిపిస్తాయంటారు వేదాంతులు. ఇది కూడా అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే మనం ఎంతటి మంచి ముహూర్తాలు పెట్టించి సశాస్త్రీయంగా పెళ్లిళ్లు జరిపించినా అందులో కొన్ని విఫలం అవుతూనే ఉంటాయి. ఒకే ముహూర్తానికి పెళ్లి అయిన ఒక జంట సకల భోగాలూ అనుభవిస్తూ ఉంటే, మరో జంట అష్టకష్టాలూ పడటం చూస్తూనే ఉంటాం. ఏమిటి కారణం? అని ఆలోచిస్తే అటు బుద్ధికీ, ఇటు కర్మకీ రెండింటికీ ప్రాధాన్యం కనబడుతోంది ఈ లోకంలో. అయితే మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రశ్న. కనిపించని కర్మఫలం కంటే బుద్ధికే మొదటిస్థానం ఇవ్వాలంటోంది సంప్రదాయం.

బుద్ధ్యాచరణమాధత్స్వ! మా శంకయ గతే పదే
బాగా ఆలోచించి మాత్రమే అడుగు వెయ్యి. అడుగు పడిందా ఇంక ఆలోచించకు. ఆత్మవిశ్వాసంతో ముందుకి నడుస్తూనే ఉండు... అని అర్థం. నీ ధైర్యం వల్ల ఒకసారి ఎదుటివారికి అధైర్యం కలిగి నీ పని సానుకూలం అవుతుంది కూడా. ఆలోచించకుండా అడుగువేస్తే మాత్రం అడుగడుగునా ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. ఆలోచన కూడా చాలా దూరంగా ఆలోచించాలి.

ఒక పక్షి జంట ఒక చెట్టుపై నివసిస్తోంది. అవి ఎప్పుడు పిల్లల్ని పెడుతున్నా ఆ క్రింద పుట్టలో ఉన్న పాము తినేస్తూ ఉంది. ఇంక పాముని చంపితే తప్ప లాభం లేదనుకొని చిన్నచిన్న ఎండు చేపల్ని తెచ్చి, పాముకి శత్రువైన ముంగిస పుట్ట నుండి పాము పుట్టవరకూ వేసుకొంటూ వచ్చాయి. తాము ప్రొద్దుటే ఆహారానికి వెళ్లాయి. ముంగిస ఆ చేప పిల్లల్ని భక్షిస్తూ వచ్చి పుట్టలో పాముని చంపి చెట్టుపై గూడులో ఉన్న పక్షి పిల్లల్ని కూడా భక్షించి వెళ్లింది. ముంగిస కూడా తమ పిల్లల్ని భక్షిస్తుందేమోనన్న దూరాలోచన చెయ్యక నష్టపోయాయి పక్షులు. భారతంలో ఉత్తరుడు ఏమీ ఆలోచన లేకుండా కౌరవులతో యుద్ధానికి బయలుదేరాడు. అడుగువేస్తే ఇంక ఆలోచించకూడదని అర్జునుడు ఒంటరిగానైనా భీష్మాది యోధులతో యుద్ధం చేసి గోవుల్ని విడిపించాడు. మోహనాస్త్రమనే మంచి ఉపాయంతో ఎవ్వర్నీ చంపకుండానే విజయం సాధించి ఘనుడయ్యాడు. కిరాత వేషంలో వచ్చిన శివుని చేతిలో తన దగ్గర ఉన్న బాణాలన్నీ కోల్పోయినా ధైర్యం విడువకుండా గాండీవంతోనే మోదడానికి సిద్ధపడ్డాడు తప్ప వెనుకంజ వెయ్యలేదు. ఫలితంగా పాశుపతాస్త్రాన్ని పొందగలిగాడు.

నేటి సమాజంలో ప్రతిఒక్కరూ దీన్ని గుర్తించాలి. ఎంత కష్టమైన ఫలితమైనా ఎందుకు సాధింపలే మనే పట్టుదల ఉండాలి. విజ్ఞాన శాస్త్రవేత్తలు నిజంగా మహర్షుల వంటివారు. వారు సాధించిన శాస్త్రపురోగతికి వారి పట్టుదలే కారణం. ఫలితంగా మనం అనేక సౌకర్యాలు అనుభవించగలుగుతున్నాం. ధైర్యవంతుణ్ని సంపదలు అనుగ్రహిస్తాయి అన్నది పరమ సత్యం.

No comments: