all

Tuesday, December 11, 2012

యూత్‌ మెయిల్‌



ఇటీవల దినపత్రికలో రెండు వార్తలు చూశాను. యువతకు సంబంధించిన వార్తలవి. చాలా బాధ కలిగింది. విలాసాలకు అలవాటుపడి, చెడుమార్గంపట్టి జైలుపాలైన యువకులు ఉదంతాలవి.
ఐదుగురు కుర్రాళ్లు. అందరూ బీటెక్‌ చదివేవాళ్లే. ఎక్కడి నుంచో వచ్చి అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆ కుర్రాళ్లు ఉంటున్న ప్రైవేట్‌ హాస్టల్‌లో చాలా మంది బీటెక్‌ విద్యార్థులున్నారు. విద్యార్థులు తాము ఉపయోగించే లాప్‌టాప్స్‌ అవసరం లేనపుడు గదుల్లో పెట్టి తరగతులకు వెళతారు. ఆ మధ్య వరుసగా మూడు నాలుగు పర్యాయాలు గదుల్లోని లాప్‌టాప్‌లు చోరీ అయ్యాయి. విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా పెట్టారు. లాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నవారు దొరికారు. ఎవరో కాదు...ఆ గదుల్లో ఉంటున్న తోటి విద్యార్థులే లాప్‌టాప్స్‌ దొంగిలించారు. పోలీసులు ఈ విషయం చెప్పగానే అందరూ షాక్‌కు గురయ్యారు. 'బుద్ధిగా చదువుకోకుండా ఇలా దొంగతనాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది' అని పోలీసులు అడిగితే ఆ విద్యార్థులు చెప్పింది ఒకటే...సినిమాలకెళ్లడానికి, షికార్లు తిరగడానికి, ఖరీదైన సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు కొనుక్కోవడానికే తాము ఈ దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు.
ఇలాంటి ఉదంతమే మరొకటి...ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. పట్టుబడినవారంతా బాగా చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు. బీటెక్‌ విద్యార్థుల్లాగే...వీరూ విలాసాలకు అలవాటుపడి, డబ్బు సంపాదించడం కోసం ద్విచక్ర వాహనాల దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు.
ఈ రెండు ఉదంతాలు చెబుతున్నది ఒక్కటే...చదువుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిన వయసులో విలాసాలకు అలవాటుపడుతున్నారు. వ్యసనాలకు లోనవుతున్నారు. యువతలో పెరుగుతున్న వస్తు వ్యామోహాన్నీ ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేకించి ఖరీదైన సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాల కోసం వెంపర్లాడుతున్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసలువుతున్నారు. ఇదే సమయంలో ఎంతో బాధ్యతగా ఉంటూ, కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్న యువతా ఉన్నారు. ఇలాంటివారు అలాంటివారికి కనువిప్పు కావాలి.
- వి.అశోక్‌ కుమార్‌, మదనపల్లె

No comments: