all

Tuesday, December 11, 2012

ఏడిహెచ్‌డి చురుకు కాదది చురుక్కు!!

 
ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరించే శక్తి పిల్లల్లో ఎక్కువ. ఆ శక్తి లోపించడానికి కారణమయ్యే రుగ్మతలు ప్రస్తుతం చిన్నారుల్లో ఎక్కువయ్యాయి. ఈ పరిణామం చిన్నారులకే కాదు... ఆ తల్లిదండ్రులకూ, స్కూళ్లలోని టీచర్లకూ భారమవుతోంది. ఇలాంటి చిన్నారుల తల్లిదండ్రులు తమ దినచర్యలన్నీ వదిలేసి రోజంతా పిల్లలతోనే గడపాల్సిన స్థితి. దాంతో పిల్లాడితో పాటు తల్లిదండ్రులపైనా తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. నార్వేలో జరిగిన ఘటన ఇలాంటి కండిషన్ ఉన్న పిల్లాడికి సంబంధించినదే. మిగతా పిల్లలకు, ఇంటిపనులకు కేటాయించాల్సిన సమయాన్ని ఒకే పిల్లాడికి వెచ్చించాల్సి ఉంటుంది. దృష్టి కేంద్రీకరణ లోపాల కారణంగా కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి రుగ్మతల్లో ప్రధానమైన ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్’ పై అవగాహన కోసం ఈ కథనం.


కొందరు పిల్లల్లో ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరించే శక్తియుక్తులు ఉండవు. ఇలాంటి పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ లోపాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి... మతిమరపు ఆజ్ఞలను సరిగా స్వీకరించలేకపోవడం నిర్ణీత వ్యవధిలోపు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం స్పెల్లింగ్స్ చక్కగా చెప్పలేక సిల్లీ తప్పులు చేయడం క్లాస్‌రూ మ్‌లో జరుగుతున్న అంశంపై నుంచి త్వరగా దృష్టి మరల్చడం ఎక్కువగా మాట్లాడుతుండటం పగటికలలు కనడం ఇంట్లోంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయడం.

ఇక కొందరిలో దృష్టికేంద్రీకరణ లోపాల తో పాటు అతిచురుకుదనం ఉంటే అలాంటి పిల్లలను ఏడీహెచ్‌డీ సమస్య ఉన్న పిల్లలుగా పరిగణించవచ్చు.

ఏడీహెచ్‌డీ వ్యాప్తి, విస్తృతి...

ప్రస్తుతం దీన్ని మానసిక వైద్యశాస్త్రంలోని ఒక రుగ్మతగా పరిగణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 శాతం పిల్లల్లో ఇది కనిపిస్తోంది. స్కూలుకెళ్లే వారిలో 2 నుంచి 16 శాతం పిల్లల్లో ఇది ఉంటోంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా ఎంచుతున్నారు. పిల్లలుగా ఉన్నప్పుడు బయటపడ్డ ఈ రుగ్మత 30 నుంచి 50 శాతం మందిలో యుక్తవయసుకు వచ్చాక కూడా కొనసాగుతోంది. ఏడీహెచ్‌డీలో సైతం అనేక రకాలున్నాయి. బాల్యంలోని ఏడీహెచ్‌డీ లక్షణాలు యుక్తవయసు వచ్చాక కూడా ఎంతమందిలో ఇలా కొనసాగుతాయనే అంశం... బాల్యంలోని వారి ఏడీహెచ్‌డీ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

ఏడీహెచ్‌డీకి కారణాలు:

ఈ రుగ్మతకు కారణాలు ఇప్పటికీ ఇదమిత్థంగా తెలియదు. అయినప్పటికీ జన్యుపరమైన, వాతావరణపరమైన, ఆహారపరమైన, సామాజిక, భౌతిక అంశాలు కొన్ని ఈ రుగ్మతకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

జన్యుపరమైనవి: వీటిని పెట్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. ఇలాంటి పిల్లల మెదడులో లోపమైన ట్రాన్స్‌పోర్టర్స్ తక్కువస్థాయిలో జరుగుతుందని గుర్తిస్తారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశాలు జన్యుపరంగా చాలా ఎక్కువ.

వాతావరణపరంగా: ఆల్కహాల్, పొగాకుల వాడకం ఉన్న వాతావరణ నేపథ్యంలో పెరిగే పిల్లల్లో ఈ తరహా రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు వాతావరణంలో సీసం (లెడ్) కాలుష్యం ఎక్కువగా ఉండేచోట ఉన్న పిల్లల్లోనూ ఇది ఎక్కువే. గర్భంలో ఉన్నప్పుడు తల్లి సమస్యలు ఎదుర్కోవడం లేదా నెలలు నిండకముందే పుట్టడం వంటి కేసుల్లోనూ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ప్రసవ సమయంలో తలకు గాయం అయినవారు ఏడీహెచ్‌డీకి గురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా టీవీ చూసే పిల్లలు, ఇంటర్‌నెట్, వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి పిల్లలు చదువులపై, లక్ష్యసాధనపై మనసు లగ్నం చేయలేక త్వరగా తమ దృష్టిని వేరే అంశాల వైపునకు మళ్లిస్తారు.

ఆహారం:స్వాభావిక ఆహారంపై పెరగకుండా, కృత్రిమరంగులు వేసే ఆహారం, దీర్ఘకాలం నిల్వ ఉంచేలా ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారం తినే పిల్లలకు చక్కెర ఎక్కువగా విడుదలయ్యే ‘హై గ్లైసీమిక్ ఇండెక్స్’ ఉన్న ఆహారం అంటే స్వీట్లు, చాక్లెట్లు తినే పిల్లలకు జంక్‌ఫుడ్, ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం తినే పిల్లలకు... ఈ రుగ్మత వచ్చే అవకాశాలు ఎక్కువ.

సామాజిక అంశాలు: తగినంత విద్య లేని, కుటుంబ బాంధవ్యాలు సక్రమంగా లేని, తగినంత శ్రద్ధ చూపని, సమస్యాత్మక కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లల్లో ఈ రుగ్మత ఎక్కువ. ఇటీవల చేసిన పరిశోధనల ప్రకారం... కుటుంబంలో శ్రద్ధ తీసుకునేవారు, మంచి తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మలతో మంచి సంబంధాలున్న పిల్లల్లో స్వయంసంయమనం ఎక్కువని తెలిసింది. ఇలా చాలామంది కుటుంబ సభ్యులుండే నేపథ్యంలోని పిల్లలు బాంధవ్యాల చిక్కదనాన్ని తెలుసుకుని అందరితో చక్కగా మసలడం అలవాటైతే ఏడీహెచ్‌డీ తీవ్రత తగ్గుతుందని తెలుస్తోంది.

ఏడీహెచ్‌డీకి, ఆటిజమ్‌కు తేడా...

ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు, ఆటిజమ్ అనే తరహా రుగ్మత ఉన్న చిన్నారులు... ఈ రెండు కండిషన్స్ ఉన్న వారిలోనూ పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. ఏడీహెచ్‌డీ ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు తరచూ చెప్పే మాట ఏమిటంటే ‘మా పిల్లవాడు చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా అంశాన్ని వేగంగా నేర్చుకుంటాడు. అయితే స్కూల్లో చెప్పిన అంశాలను మాత్రం వాడు గుర్తుంచుకోవడం లేదు’ అని అంటుంటారు. వీళ్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇది జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య కాదు. స్కూలు లాంటి సమూహాల్లో వ్యవహరించే చోట ఒక అంశంపై నిర్దిష్టంగా దృష్టిని కేంద్రీకరించలేకపోవడంతో స్కూల్లో ఏడీహెచ్‌డీ పిల్లలకు ఈ సమస్య వస్తుంటుంది. అదే ఇంట్లోనైతే సమూహం గొడవ లేకుండా పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య నేరుగా (ఒన్ టు ఒన్) సంబంధం ఉంటుంది. కాబట్టి ఇంట్లో నేర్చుకునే అంశాల్లో అలాంటి సమస్య రాదు.

ఇక ఆటిజమ్ ఉన్న పిల్లల్లోనూ అతిచురుకుదనం ఉన్నప్పటికీ వారి చురుకుదనం నిర్దిష్టంగా ఒక లక్ష్యం లేకుండా ఉంటుంది. ఆటిజమ్ ఉన్న పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. నేరుగా కళ్లలో కళ్లు కలిపి మాట్లాడలేరు. పైగా వారికి మాట్లాడటంలో సమస్యలు (స్పీచ్ ప్రాబ్లమ్స్) ఉంటాయి. తమ చుట్టూ ఉన్న మనుష్యులూ, వాళ్ల వ్యవహారాలపై ఎలాంటి ఆసక్తీ ఉండదు.

ఏడీహెచ్‌డీ, ఆటిజమ్ లలో తేడా:

ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఆటిజమ్ కూడా ఉంటుందన్న అపోహ ఒకటి ఉంది. కొందరి విషయంలో ఇది వాస్తవమే అయినా అది ఎల్లప్పుడూ నిజం కాదు. ఏడీహెచ్‌డీ ఉన్న ప్రతి పిల్లవాడికీ ఆటిజమ్ ఉండదు. అయితే అలా ఉందేమోనని ఒకసారి వైద్యనిపుణుల చేత పరీక్షింపజేసి, ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్యలకు తగిన చికిత్స చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్లో మెరుగుదలకూ అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అంటే...
ఇది పిల్లల వికాసంలో కనిపించే లోపంతో కూడిన రుగ్మత. ఇందులో పిల్లలకు ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరణలో లోపంతో పాటు, ప్రమాదకరంగా పరిణమించే అతిచురుకుదనం ఉంటుంది. ఈ రెండు లక్షణాల్లో ఒక్కోసారీ ఒక్కొక్కటీ బయటపడుతుంటుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఏడేళ్ల వయసు తర్వాతే బయటపడతాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో దీని లక్షణాలు ఇంకా ముందే అంటే... నాలుగేళ్లకే కనిపిస్తున్నాయి. ఇది ఇంత త్వరగా ఎందుకు కనిపిస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

సరిదిద్దడం (మేనేజ్‌మెంట్) ఎలా...
ఈ రుగ్మత ఉన్న పిల్లలను సరిదిద్దడం అన్నది ఇటు ఇంట్లో, అటు స్కూల్లో జరగాల్సిన ప్రక్రియ. జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్, ధ్యానం వంటి వాటి ద్వారా ఏడీహెచ్‌డీని చక్కదిద్దవచ్చు.

ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తించే తీరు పిల్లల్లో ఎంతో మార్పు తీసుకుని వస్తుంది. ఈ పిల్లల పట్ల కఠినవైఖరితో ప్రవర్తించినా, వారిని శిక్షించినా... వారిలో తక్షణం కొంత మెరుగుదల ఉన్నట్లు కనిపించినా దీర్ఘకాలిక ఫలితాలు తక్కువ. శాశ్వత మెరుగుదల కోసం ఓపిక, సంయమనం, పిల్లల పట్ల శ్రద్ధ చాలా అవసరం.

మెరుగుదలకు మార్గాలు...
శారీరక వ్యాయామం: రోజూ కనీస 30 నిమిషాలు వ్యాయామంలో పాల్గొనేలా చూడటం.

కథలు చెప్పడం: పిల్లల మనసులకు హత్తుకునేలా నీతికథలు చెప్పి, ఆ కథల్లోంచి సందేహాలను అడిగి, వాటిని ఓపిగ్గా నివృత్తి చేయడం.

దైనందిన అంశాలను అడిగి తెలుసుకోవడం: పిల్లల దైనందిన కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో జరిగేలా టైమ్‌టేబుల్ రూపొందించి, ఆ రోజు చేసిన తప్పుడుపనుల వల్ల కలిగే అనర్థాలు వివరించి, మర్నాడు తప్పులు జరగకుండా చూడటం, పిల్లల్లోని మంచి విషయాలను మెచ్చుకుంటూ అవి పెంపొందించుకునేలా ప్రోత్సహించడం. దుష్టప్రవర్తనకు, దుశ్చేష్టలకు అవకాశం లేకుండా బిజీగా ఉంచడం. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు తగినంత శ్రద్ధ తీసుకోవడం.

మందులు: ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో స్టిమ్యులెంట్స్, నాన్‌స్టిమ్యులెంట్స్‌లను ఉపయోగిస్తారు. ఈ తరహా మందులను ఆరేళ్లకు పైబడిన వారిలో ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ మందులతో పాటు ఫిష్ ఆయిల్, ప్రోబయోటిక్ తరహా సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

No comments: