all

Tuesday, December 11, 2012

భక్తుణ్ణి భగవంతునిగా మార్చే మాసం!--నిత్య సందేశం

 
 
గీతలో కృష్ణుడు తానే మార్గశిర మాసం అని చెప్పాడు. అయితే కార్తికం మాట ఏమిటి? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన మాసం. భక్తుణ్ని భగవంతునిగా మార్చే మాసం. అంటే కార్తికంలో భక్తుని హృదయంలో నివాసం ఉండి, మార్గశిరం వచ్చేసరికి వారు చేసిన సాధనను బట్టి తనవారిగా మార్చుకొంటాడట స్వామి. కృత్తికానక్షత్రంలో పున్నమి ఏర్పడుతుంది కనుక దీన్ని కార్తికం అంటారు.ఈ మాసంలో మనం తప్పకుండా చెయ్యవలసినవాటిని ఇలా వివరించారు...

సర్వేషామేవ సేవ్యాని కార్తికే వనభోజనమ్
బిల్వం స్నానం చ దీపం చ శ్రద్ధయా శివకేశవౌ॥

వనభోజనం, మారేడు దళాలతో పూజ, దీపారాధన, హరిహరుల్ని సేవించడం, నదీస్నానం...ఈ ఐదు చాలా ముఖ్యం. మారేడులోని ఔషధగుణాలు... కుష్ఠు, క్షయ మున్నగు రోగాల్ని ఛేదిస్తాయి. (బిల: ఛేదనేః బిల్వం. కనుక దీనిని బిల్వం అన్నారు), దేహానికి రోగనిరోధకశక్తి పెంచుతాయి, వాతావరణ కాలుష్యాన్ని హరిస్తాయి, సూర్యుని అతి నీలలోహిత కిరణాన్ని అడ్డుకొంటాయి, అత్యంత ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే లక్షపత్రిపూజ అయిన మర్నాడు గుడితలుపులు తీసిన వెంటనే స్వామిని దర్శించాలన్నారు. గుండె నిండుగా ఊపిరి పీల్చాలి. రాత్రంతా గుడిలో మాగి ఉన్న మారేడు పత్రి వాసన ప్రొద్దుటే చాలాసేపు పీలిస్తే ప్రతిప్రాణికీ చాలా శక్తినిస్తుంది.

ఒకసారి తల్లులందరూ కలసి కుమారస్వామికి క్షీరసారాన్ని ప్రసాదించారట. చైతన్యం కవోష్ణంగా ఉంటుంది. ప్రతిప్రాణి దేహంలోనూ ఉష్ణశక్తిలేకపోతే జీవనం లేదు. ఈ గోరువెచ్చని ఉష్ణశక్తి లేకపోతే జీవనం లేదు. ఆ గోరువెచ్చని ఉష్ణశక్తి కార్తికంలో నదీనదాల్లో ఉంటుంది. అందుకే నదీస్నానం తప్పనిసరి అన్నారు. కుమారస్వామికి క్షీరాన్ని ఇచ్చిన ఆ తల్లుల గుంపునే కృత్తికా నక్షత్రంగా వర్ణిస్తారు. కృత్తిక అంటే విశ్వాసాన్ని, మాతృచైతన్యాన్ని ప్రసాదించే నక్షత్రరాశి.

వనంలో సమూహంగా భోజనం చెయ్యడం కార్తికంలో చాలా ముఖ్యం. అయితే ఆ వనంలో మారేడు చెట్టు తప్పక ఉండాలి. వంటలు కూడా అక్కడే చేయాలి. మూతలు తీసి కాస్తసేపు ఉంచాలి. ఆ ఉద్యానవనంలో ఉన్న అన్ని వృక్షాల గాలులూ ఆ వంటలకి సోకాలి. మనం కూడా పీల్చాలి. మామిడి, వేప, తులసి, జమ్మి, అనేక పూలమొక్కలూ మనం భుజించే వనంలో ఉండేలా చూసుకోవాలి. మనం తినగా మిగిలింది అనేక ప్రాణులకి ఆహారం కూడా అవుతుంది. ఈ వనభోజనం ఒక విధంగా వన విహారం. ఈ కార్తికంలో ఆవునేతితో దీపం పెట్టడం తప్పనిసరి. ఆవునెయ్యి వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. వాతావరణ కాలుష్యం తొలగి కంటికి మంచి శక్తి వస్తుంది.

శివకేశవులనిద్దరినీ భేదం లేకుండా ఈ నెలలో పూజించాలి. అందుకే పైశ్లోకంలో ఇద్దరినీ ఒక్కరిగానే చెప్పబడ్డారు. మనకు ఏదో కావాలనీ, నేను కనుక ఇంత బాగా చేస్తున్నాననీ, పక్కవాళ్లు ఏమీ చెయ్యడం లేదనీ... భావన చెయ్యకూడదు. అహంకారం, ఆర్భాటం పనికిరావు. హృదయం పెట్టి చేసేది ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరు అహితాన్ని నాశనం చేసేవారైతే (రుద్ర) మరొకరు మంచిని పోషించేవారు. ఆ పని ఎవరు ఈ సమాజానికి చేస్తున్నా వారు హరిహరుల వంటివారే.
- డా. ధూళిపాళ మహాదేవమణి

No comments: