all

Tuesday, December 11, 2012

చారులత ఓ ఛాలెంజ్

 

 
దక్షిణాది భాషలలో కథానాయికల వరుసలో ప్రియమణి గూర్చి పరిచయం చేయవలసిన అవసరంలేదు. పరుత్తివీరన్ వంటి తొలినాళ్ళ చిత్రాలతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆమె ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలలో కూడా
తన సత్తా నిరూపించుకున్నారు. ప్రస్తుతం కన్నడ చిత్రాలలో నటిస్తున్న ఆమె చారులత చిత్రంతో తెలుగులో మళ్లీ కనిపించబోతున్నారు.
అవిభక్త కవలల పాత్రను తొలిసారి తెరపై ఆమె సవాల్‌గా తీసుకుని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఇంటర్వ్యూ.
* సయామీ కవలల పాత్ర ఎలా వుంది?
- మన భారతదేశంలోనే ఇటువంటి కథతో ఇంతవరకూ చిత్రం నిర్మించలేదు. తొలిసారిగా అటువంటి అవకాశం నాకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నా, ఓ రకంగా ఇది ఛాలెంజ్! దర్శకుడు సహకారంతో ఈ పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను.
* రెండు పాత్రలలో ఏ పాత్ర నచ్చింది?
- ఒకే స్క్రీన్‌పై ఇద్దరు ప్రియమణులను ప్రేక్షకులు చూస్తారు. ఒక పాత్ర పాజిటివ్ థింకింగ్‌తో వుంటే, మరో పాత్ర దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రెండు పాత్రలు నాకిష్టమైనవే!
* రెండు పాత్రలు ఎలా చేశారు?
- నా డూప్‌గా నటించిన దీపికకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలి. ఏ ఎమోషన్ అయినా సరే ఆమె నాకు సహకరించి ఉండకపోతే రెండు పాత్రలలో నా నటన పండేది కాదు. ఇద్దరం ఎంతో అవగాహనతో ఈ పాత్రల్లో జీవించాం. అయితే దీపిక కనపడకపోయినా ఆమె కష్టం మాత్రం కనిపిస్తుంది.
* సయామీ కవలల జీవితాన్ని ఎలా ఆవిష్కరించారు?
- ఇద్దరి శరీర భాగాలు కలిసి ఉండడంతో వారి సమస్యలు వేరుగా ఉంటాయి. వాళ్లు అందరిలా బ్రతకవచ్చన్న ఓ విషయాన్ని దర్శకుడు చాలా చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. వారి జీవితంలో ఓ అబ్బాయి ప్రేమించానంటూ ప్రవేశిస్తే వారి మనోభావాలు ఎలా ఉంటాయి? వారి భావోద్వేగాలను ఒకే స్క్రీన్‌పే పండించడం అనేది ఓ రకంగా సవాల్ లాంటిదే. అది చిత్రం చూసి మీరే చెప్పాలి.
* చిత్రానికి ఎలోన్ ప్రేరణా?
- అలాంటిదేం లేదు. జస్ట్ ఓ ఆలోచన తీసుకుని మన కథలా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు.
* ప్రేమకథేనా?
- ప్రేమకథతోపాటు క్లాసికల్ వైలెన్స్ కూడా చిత్రంలో ఉంటుంది.
* సూర్య ‘మ్యాట్రన్’ ఇదే కథ కదా?
- కవలల కథ అయినా కానీ అందులో ఉన్న ఐడియా వేరు. ఇందులో ఉన్న కథ సరికొత్తగా ఉంటుంది.
* మళ్లీ జాతీయ అవార్డుకోసమా?
- అవార్డు ఆశించి ఆనాడు పరుత్తివీరన్‌లో నటించలేదు. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన కూడా లేదు. వచ్చింది అంటే మొదట వచ్చినదానికి మరో బోనస్ వచ్చిందనుకుంటా అంతే.
* తెలుగులో చేయడంలేదూ?
- ప్రస్తుతం తెలుగులో ఏ చిత్రంలో చేయడంలేదు. కథలు వింటున్నాను. నచ్చిన కథ దొరికితే తప్పక నటిస్తాను.
* ప్రయోగాలు చేయడం ఇష్టమా?
- అందరికీ నచ్చే విధంగా ప్రయోగాలు చేస్తే
ఆ సినిమాలు విజయం పొందుతాయన్న నమ్మకం నాకుంది. అందుకే సరికొత్తగా ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. ప్రస్తుతం చేస్తున్న సయామీ కవలల కథ ప్రయోగమే కదా!
* కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయినట్లు లేదా?
- తెలుగులో నటించకపోయినా కన్నడ, మలయాళ చిత్రాలలో బిజీగా ఉండడంతో అటువంటి భావం ఏనాడూ రాలేదు. చారులత చిత్రంతో మళ్లీ తప్పక తెలుగులో బిజీ అవుతానన్న నమ్మకం వుంది.

No comments: