ఇళ్ళ దగ్గర, స్కూళ్లలోను పిల్లల్ని దండించిన వాళ్ళని జైళ్ళకి పంపే చట్టాన్ని ఇటీవల అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం చేసిన వైనాన్ని ‘హలో అమెరికా’లో నిన్న మనం తెలుసుకున్నాం. కాగా, బడిలో క్రమశిక్షణ పేరిట చిన్నారుల్ని కొట్టి, బాధించే ‘కార్పొరల్ పనిష్మెంట్’ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ఇంకా అమలులో ఉండడం అమెరికాను మానవ నాగరికతకు శిఖరంగా అభివర్ణించే వారికి మింగుడుపడని విషయమే!
ఒక్లహామా, జార్జియా, టెక్సాస్, అలబామా, టెన్నిసీ, లూజియానా, అర్కాన్సా, మిసిసిపి లాంటి రాష్ట్రాలలో ఇది క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా ఎక్కువచోట్ల ఇంకా అమలులోనే ఉంది. అమెరికా దక్షిణాది రాష్ట్రాలలోనే కాక ఉత్తరాదిన కూడా కొన్నిచోట్ల ఇది కొనసాగుతుండడం వల్ల ఆయా రాష్ట్రాలలో సకుటుంబంగా కొంతకాలం ఉండడానికి వెళ్ళే నాన్-ఇమిగ్రెంట్లు తమ పిల్లల్ని చేర్పించే స్కూల్ హాండ్ బుక్ నుంచి సమగ్రంగా వివరాలు తెలుసుకోవాలి.
ఇండియా నుంచి విదేశాలకు ఉద్యోగం సద్యోగం కోసం పిల్లాపాపలతో వెళ్ళే పిల్లల్ని అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకునేవాళ్ళు; పిల్లలు ఎంత విసికించినా తమ జీవితకాలంలో వాళ్ళ ఒంటి మీద ఒక్క దెబ్బ అయినా వెయ్యనివాళ్ళే ఎక్కువ. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తమ పిల్లల్ని అక్కడ స్కూళ్ళలో నిబంధనల ప్రకారం ‘స్పాంకింగ్’ చేస్తే (వెనక్కి తిప్పి దెబ్బలు వేస్తే) తట్టుకోవడం అటువంటివారికి చాలా కష్టం.
అమెరికా అనేక వైవిధ్యాల దేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఇండియా ప్రత్యేకత అయితే ‘వైవిధ్యంతోనే ఐక్యత’ అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రత్యేకత. అక్కడ కేంద్రం కొన్ని కీలకరంగాల మీద మాత్రమే అజమాయిషీ చేస్తుంది. మిగతా విషయాలలో రాష్ట్రాలదే స్వయం నిర్ణయాధికారం. యు.ఎస్.లో రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాల వల్లనే అక్కడ కార్పొరల్ పనిష్మెంట్ పైన దేశవ్యాప్తంగా ఒకేరకమైన చట్టాలు లేవు. పిల్లల్ని చక్కదిద్దే మిషమీద మొగ్గల్లాంటి ఆ చిన్నారుల్ని పృష్టభాగంలో ఇన్ని దెబ్బలు అని లెక్కపెట్టి ఒక చెక్కబద్దతో కొట్టే ‘స్పాంకింగ్’ ఇంకా అక్కడ కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతుండగానే బాలల మీద చెయ్యి చేసుకునే వాళ్లని జైళ్ళలో వేసే చట్టాల్ని మరికొన్ని రాష్ట్రాలు చెయ్యడంలోని ‘అమెరికన్ వైవిధ్యాన్ని’ అక్కడికి చేరుకునే నాన్- ఇమిగ్రెంట్లు అందరూ గమనించాలి.
పిల్లల్ని స్కూళ్ళలో కొరతవేసే ‘కార్పొరల్ పనిష్మెంట్’ని అమెరికాలో మొదటిసారిగా ఒక రాష్ట్రం (న్యూజెర్సీ) 1867 రద్దు చేసిన తర్వాత ఇంకొక రాష్ట్రం (మసాచుసెట్స్) దానిని నిషేధించడానికి మళ్ళీ 104 ఏళ్ళు పట్టింది. (1971). తిరిగి మరొక రాష్ట్రం (న్యూ మెక్సికో) ఈసారి 40 సంవత్సరాలలోనే (2011) అలాంటి చర్య తీసుకుంది. అటుపిమ్మట ఒక ఏడాదిలోనే (2012 సెప్టెంబరు) డెలావేర్ రాష్ట్రం ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ దిశగా దేశంలోనే తొలి చట్టాన్ని తెచ్చింది. ఈ ముఖ్యమైన అంశం మీద అమెరికాలో ధోరణులు మారడం ఊపందుకున్న దనడానికి ఈ టైమ్ లైన్ ఒక సూచన.
ఇలా ఉండగా, మాట వినని పిల్లల్ని అదుపులో పెట్టడానికి వాళ్ళని అప్పుడప్పుడు కొట్టడం తమ సంస్కృతిలో భాగంగా, సాంఘికంగా ఆమోదించిన చర్యగా ఉన్న దేశాల నుంచి అమెరికా వెళ్లి అక్కడ ఉంటున్న కొందరు విదేశీయులు యు.ఎస్. చట్టాలలో పిల్లలకు ఉన్న రక్షణ వల్ల పిల్లల్ని కొట్టడం మాట అటుంచి, గొంతెత్తి వారిని గట్టిగా ఒక్క మాట కూడా అనలేని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల తమ పిల్లలు ఇంటిలోని పెద్దలను గౌరవించకపోవడం, తమ కుటుంబ సంప్రదాయాలను విస్మరించి పెడదారిన పడడం జరుగుతోందని వారు వాపోతున్నారు.
వెన్నెల మీద మోజుతో చంద్రుడి మీదికి వెళితే అక్కడ చంద్రుడు చేతికి అందినా ప్రాణావసరమైన ఆక్సిజన్ మాత్రం దొరకనట్టయింది వీరి పరిస్థితి! చట్టాలు కఠినంగా అమలు జరగని దేశాల నుంచి వెళ్ళినవారు అమెరికాలో ఇలా ఎక్కువగా ఉక్కిరిబిక్కిరవుతుంటారు.
అలాంటి వారిలో ఒక తండ్రి ఆవేదనని, కన్న కూతురిని సరిదిద్దడానికి ఆమె మీద చెయ్యి చేసుకుని జైలు పాలైన ఒక నిస్సహాయుడి హృదయఘోష
రేపటి ఫ్యామిలీలో....
ప్రతిరోజూ అమెరికా చదువుల / వీసాల సమాచారం
No comments:
Post a Comment