శ్రీరామచంద్రుని శక్తిని శంకించినవారెవరూ లోకంలో లేరు. తన అన్న వాలిని సంహరించే శక్తి రామునికి లేదేమోనని సుగ్రీవుడు మాత్రం శంకించాడు. వాలి ముందు రాముని శక్తి చాలకపోతే ఆ తరువాత తనను బ్రతుకనివ్వడు వాలి. అలాగని రామునికి ఆ విషయాన్ని చెప్పనూ లేడు. ఏకాంతంగా లక్ష్మణునితో తన అనుమానాన్ని బయటపెట్టాడు. లక్ష్మణుడు చిరునవ్వు నవ్వి, ‘‘మా అన్నగారు ఏం చేస్తే నీకు నమ్మకం కలుగుతుందో చెప్పు’’ అన్నాడు. ‘‘మా అన్న వాలి బాణాన్ని లాగి వదిలితే, చాలా బలంగా ఉన్న ఆ మద్ది చెట్లనుండి ఈ చివరనుండి ఆవలికి వచ్చేసేది ఆ బాణం. రాముడు అట్లాగ చేయగలడా? అలాగే దుందుభిని చంపి ఆ కళేబరాన్ని విసిరికొడితే ఆమడదూరాన్ని పడింది. ఆ శరీరం ఇంకా ఇక్కడే ఉంది. రాముడు అలా చేయగలడా?’’ అని అడిగాడు.
సుగ్రీవుని అనుమానాన్ని అన్నగారి చెవిలో వేశాడు లక్ష్మణుడు. వెంటనే రాముడు దుందుభి శరీరాన్ని ఎడమకాలి బొటనవ్రేలితో తన్నాడు. అది ఎగిరి పది ఆమడల దూరాన పడింది. ‘‘ఇప్పుడు నమ్మకమేనా నా శక్తి మీద?’’ అని అడిగాడు రాముడు. అయినా సుగ్రీవుని కన్నులలో కాంతి కనిపించలేదు. ‘‘ఆనాడు దుందుభి పచ్చి శరీరాన్ని మా అన్న ఆమడ దూరానికి విసిరాడు. ఈనాడు ఎండిపోయిన శరీరాన్ని తన్నిపారేశారు మీరు. అందువల్ల వాలికంటె మీరు ఎక్కువ బలవంతులని ఎలా నమ్మాలి? అదుగో ఆ మద్దిచెట్లు ఆనాడు ఎలా ఉన్నాయో ఈనాడూ అలాగే, అంతకంటె చేవదేరి ఉన్నాయి. వాలి బాణాన్ని లాగి వదిలితే ఏడు మద్దిచెట్లలోకి దూసుకుపోయేది. మీరు కూడా అలా చేస్తే మీ బలాన్ని నేను నమ్ముతాను’’ అన్నాడు సుగ్రీవుడు.
వెంటనే రాముడు ధనుర్బాణాలు తీసుకొని, నారి బిగించి, ఒక బాణాన్ని వింటికి సంధించి, చెవి దాకా లాగి, ఒక్కసారిగా ఆ బాణాన్ని వదిలాడు. ఆ బాణం మహావేగంతో ఒక్కొక్క మద్దిచెట్టును భేదించేసరికి ఆ చెట్లు మొత్తం నేలకూలిపోయాయి. ఆ బాణం అక్కడి నుండి భూమిలోకి ప్రవేశించి, కొంత నేల చీల్చి, ఆ తరువాత తిరిగి రాముని అమ్ముల పొదిలో దూరిపోయింది. సుగ్రీవుడు సాష్టాంగపడి ‘‘మహానుభావా! ఇంక నీ శక్తికి తిరుగులేదు. నా శత్రువు ఈ క్షణంలో మరణించినట్లే’’ అని తన నమ్మకాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
నిజానికి రాముడెక్కడ? సుగ్రీవుడెక్కడ? ‘అతగాడా నన్ను పరీక్షించేది’ అని రాముడు అనుకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. తానేమిటో సుగ్రీవునికి తెలీదు. తన బలాన్ని ప్రత్యక్షంగా చూడనూలేదు. పోనీ ఎవరైనా చెప్పగా విననూ లేదు. ఎలా నమ్మాలి? వాలి పేరు చెపితేనే వణికిపోతున్నాడు సుగ్రీవుడు. కాబట్టి అతనికి ధైర్యం చెప్పడమే కాదు వాలిని చంపగల శక్తి తనకుందని నిరూపించుకోవాలి. అవసరం మనదైనపుడు మనకంటె చిన్నవారి ఆదేశాలను కూడా మనం మన్నించాల్సి వస్తుంది. కొత్తచోటికి వెళ్ళినపుడు, మన గురించి తెలియనివారు మనను తక్కువగా అంచనా వేస్తే, మనం బాధపడరాదు. మనమేమిటో తెలియచెయ్యాలి కాని, మాటల ద్వారా అనువుకానిచోట అధికులమని అహంకరించరాదన్నది ఈ ఇతివృత్తం మనకు తెలియజేస్తున్న నిత్యసందేశం.
- డా.కడిమిళ్ల వరప్రసాద్
No comments:
Post a Comment