చాలామందికి రావు గోపాలరావు ఒక విలక్షణ నటుడిగానే తెలుసు. కానీ ఆయన ఒక విశిష్ట వ్యక్తి కూడా అని చాలామందికి తెలియదు. ఆయన భార్య కమలకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి. ఒకరినొకరు పరస్పరం ఇష్టపడి, ప్రేమించుకున్న తీరు, జీవితకాలంలో భార్యని ఎప్పుడూ ఏకవచనంతో సంబోధించని ఆయన వ్యక్తిత్వం, అవకాశం ఉన్నా పిల్లల కోసం ఏమీ చేసుకోని నిస్వార్థగుణం లాంటి ఉదాహరణలతో ఆయన ఔన్నత్యం గురించి ఆమె గుర్తుచేసుకున్న కొన్ని జ్ఞాపకాలు...గ్రామ్‌ఫోన్‌లో ‘కీర్తిశేషులు’ నాటకం నడుస్తోంది. ‘మురారి’ పాత్ర ధరించిన నటుడు ఏకధాటిగా డైలాగులు చెప్పుకుంటూ పోతున్నాడు. గంభీరమైన స్వరం! భాష మీద ఎవరికోగానీ చిక్కని పట్టు! పదాలు పలకడంలో స్పష్టత! ఓహ్... వింటుంటే ఒళ్లు పులకరించిపోతోంది.
కాసేపటికి నాటకం ముగిసింది. అంతవరకూ తన్మయత్వంలో ఉన్న నేను ఈ లోకంలోకి వచ్చి, అక్కడున్న వారిని అడిగాను... ‘ఆ మురారి పాత్ర వేసిన మహానుభావుడు ఎవరు’ అని. వాళ్లు ఎదురుగా నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూపించారు... ఆయనే అని. తెల్లని దుస్తులు, చక్కని రూపం, ముఖంలో తేజస్సు... చాలా హుందాగా ఉన్నాడాయన. అదే మొదటిసారి... ఒక మగవాడి చూసి ‘ఆహా, ఎంత బాగున్నాడు’ అనుకోవడం. అలా తొలి చూపులోనే నా మనసులోకి అడుగుపెట్టారు రావు గోపాలరావు.
అప్పట్లో నేను హరికథా గానాలతో బిజీగా ఉండేదాన్ని. ఓసారి పిఠాపురంలో హరికథ చెప్పడానికి వెళ్లాను. ఆ రోజు గోపాలరావు గారి శిష్యుడొకరు నా హరికథ విన్నారు. వెంటనే వాళ్ల నాటక అసోసియేషన్‌కు రమ్మంటూ ఆహ్వానించారు. ఆ ఆహ్వానం వెనుక పెద్ద కారణమే ఉంది. రావుగారు పురాణాల్ని నమ్మేవారు కాదు. ఎప్పుడో ఎవరో రాసిన ఈ పురాణాలనే పట్టుకుని వేళ్లాడటం కరెక్ట్ కాదని, వాటన్నిటినీ కుప్పపోసి తగులబెడితేనే గతంలో బతక్కుండా ముందుకు పోగలమనీ అనేవారట. నేను నా హరికథలో పురాణాలను కాల మాన పరిస్థితులకు అనుసంధానించి చెప్పేదాన్ని. నా శైలి నచ్చిన ఆ శిష్యుడు నా హరికథను రావుగారికి వినిపించాలనుకున్నాడు. అయితే ఆయనను తీసుకురావడం కుదరక సన్మానం చేస్తామంటూ నన్నే వాళ్ల అకాడెమీకి ఆహ్వానించారు. అప్పుడే జరిగింది పైన చెప్పిన సంఘటన.
ఆ తర్వాత కొన్నాళ్లకి ఆయన నా హరికథను వినడం జరిగింది. అంతే... పురాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. నేను హరికథను మలిచిన తీరును చాలా మెచ్చుకున్నారు. పురాణాలను వ్యతిరేకించడం మానేశారు. మెల్లగా మా పరిచయం స్నేహంగా మారింది. నిజానికి నేను గడప దాటానంటే, అది హరికథ చెప్పడానికే. ఆడపిల్లగా నాకు చాలా నియమాలు, హద్దులు ఉండేవి. దాంతో పురుషులెవరితోనూ పరిచయాలు లేవు. మొదటిసారి నా మనసును రంజింపజేసిన వ్యక్తి గోపాలరావుగారే. నా హరికథ ఎక్కడున్నా వచ్చేవారు. నాకోసం రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. ఆధునిక సాహిత్యం గురించి వివరించేవారు. ఆయనెప్పుడూ అనేవారు... ఆధునిక సాహిత్యాన్ని మీ హరికథలకు జోడించండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది అని. ఇలా రెండేళ్లు గడిచాయి.
ఓసారి రాజమండ్రిలోని లలిత కళానికేతన్ వాళ్లు ఉత్సవాలకు ఆహ్వానిస్తే వెళ్లాను. రావుగారు కూడా వచ్చారు. అక్కడ ఆయన మిత్రులు పదిహేను మంది వరకూ ఉన్నారు. వాళ్లన్నారు... ‘మీ ఇద్దరూ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లు. ఒకరికొకరు సరితూగుతారు. మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు’ అని. అప్పటికే ఎంతో కాలంగా పెళ్లి చేసుకోమంటూ పోరుతున్నా ఆయన ఒప్పుకోవట్లేదట. నన్ను చూసిన తర్వాత, ఆయనకు నేనైతే బాగుంటుందని అనుకుని, నాతో మాట్లాడాలని నిశ్చయించుకున్నారట. కాదనడానికి నా దగ్గర కారణాల్లేవు. అందుకే సరే అన్నారు. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయలేదు వాళ్లు. పసుపుతాడు తెచ్చి అక్కడికక్కడే నా మెడలో తాళి కట్టించేశారు. అదృష్టం కొద్దీ... ఇరుపక్షాల వారూ మా పెళ్లిని అంగీకరించారు.
మాటలకు అందని మనిషి...రావుగారితో నా జీవితం బాగుంటుందని ముందే అనుకున్నాను. కానీ నేను ఆశించినదానికంటే వందరెట్లు అద్భుతంగా ఉంది.
రావుగారి వ్యక్తిత్వాన్ని మాటల్లో చెప్పాలనుకోవడం సాహసమే. సంఘానికి, సమాజానికి ఏమీ చేయని జీవితం వ్యర్థం అనుకుని, పదకొండో యేటే ఇల్లు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి ఆయన. నాయకులంతా కష్టపడి స్వాతంత్య్రాన్ని తెచ్చారు, కానీ ఆ స్వాతంత్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎవరికీ రావట్లేదు అని ఆవేదన చెందేవారు. తన భావాలను వ్యక్తపరచడానికి నాటకమే సరియైన సాధనమని భావించారు. మూఢాచారాలను, అంధ విశ్వాసాలను తూర్పారబడుతూ నాటకాలు రచించారు, దర్శకత్వం వహించారు, నటించారు. ఎన్నో చోట్ల నాటక అకాడెమీలను స్థాపించారు. ఆయనకు వెయ్యిమందికి పైగా శిష్యులుండేవారు. వాళ్లందరినీ తన సొంత మనుషుల్లా చూసేవారు.
సినిమాల్లోకి కూడా ఇష్టపడి రాలేదాయన. నటుడు ఎస్వీ రంగారావు, దర్శకుడు రామినీడు గార్లకు సన్మానం చేయాలని సంకల్పించారు. ఆ రోజున కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శిస్తే, గోపాలరావుగారి ప్రతిభను చూసి ముగ్ధులైపోయారు వాళ్లు. తర్వాత రామినీడు గారి నుంచి కబురు వచ్చింది. దానికి కారణం ఎస్వీఆర్. ‘భక్తపోతన’లో ఆయనది శ్రీనాథుడి పాత్ర. శృంగార నైషధాన్ని రాజుకి అంకితమివ్వాలి. ‘ఎవరు పడితే వాడి కాళ్లకు నేను దణ్నం పెట్టను, వాడు పోయి... ఎస్వీఆర్ నా కాళ్లకు దణ్నం పెట్టాడని ఊరంతా చాటింపు వేస్తాడు, గోపాలరావు అర్హుడు కాబట్టి, ఆయన్ను తీసుకురండి’ అన్నారట. అయితే ఈయనకు దర్శకత్వం మీద మక్కువ తప్ప నటన మీద ఆసక్తి లేదు. కానీ ఎస్వీఆర్ మీద అభిమానం కొద్దీ సరే అన్నారు. కాలం గడిచేకొద్దీ నటుడిగా ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయారు.
చాలామంది అడుగుతుంటారు... ‘ఆయన విలన్‌గా చేస్తుంటే మీకేమీ అనిపించలేదా’ అని. ఎందుకు అనిపిస్తుంది! నేను కూడా కళాకారిణినే కాబట్టి కళను కళగా చూశాను తప్ప వ్యక్తిగతంగా తీసుకోలేదు. కాకపోతే, హీరో ఆయన్ని కొట్టడం, తరిమి తరిమి చంపడం లాంటి వాటిని చూడలేక కళ్లు మూసేసుకునేదాన్ని.
విలన్ కాదు హీరోభయంకరమైన విలన్‌గా ఎన్నో సినిమాల్లో చేశారు రావుగారు. కానీ నిజ జీవితంలో ఆయన విలన్ కాదు... హీరో. అందరినీ ప్రేమించడమే ఆయనకు తెలుసు. ఏరోజూ తన నోటితో ఫలానావాడు చెడ్డవాడు అని చెప్పడం నేను వినలేదు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి మరెవరి గురించైనా చెడుగా చెప్పినా పట్టించుకునేవారు కాదు. అంతేకాదు... ఆయన చెయ్యి చాలా పెద్దది. ఇంటికి ఎవరొచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. వంద మందికి పైగా వంట చేసి పెట్టిన రోజులున్నాయి. ఇక సినిమా వాళ్లయితే ఎవరో ఒకళ్లు ఇంటికి వస్తూనే ఉండేవారు. అల్లు రామలింగయ్యగారి తోటి, వారి కుటుంబంతోటి మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
రామలింగయ్యగారికైతే ఈయనంటే ఎంతో అభిమానం. రైలులో పొరపాటున వేర్వేరు బోగీల్లో సీట్లు ఇస్తే టీసీతో పోట్లాడి మరీ వీరున్న బోగీలోకి మారిపోయేవారు. మా ఇంటి భోజనం అంటే కూడా అందరికీ ఇష్టం. అందుకే అందరికీ సరిపడా పంపేదాన్ని. రావుగారికైతే చేపల పులుసు, గోంగూర-రొయ్యల కూర చాలా ఇష్టం. నేనేమో బ్రాహ్మిణ్‌ని. అయినా ఆయన కోసం అన్నీ వండటం నేర్చుకున్నాను. బాగా వండుతున్నాననేవారు. ఏది వండినా ఇష్టంగా తినేవారు. చుట్టూ ఉన్నవాళ్లందరితో తినిపించేవారు. తను ఒక ముద్ద తింటే, చుట్టుపక్కల వాళ్లకి పది ముద్దలు పెట్టడం ఆయన నైజం. రాజకీయాల్లోకి వచ్చింది కూడా అందరికీ చేతనైనంత పెట్టాలనే. దానికోసం సినిమాలను కూడా వదిలేసుకున్నారు.
పదవులు, సంపద ఏవీ ఆయన్ను మార్చలేక పోయాయి. ఎంపీ అయినా రావుగారు రావుగారే. ఏ రోజూ ప్రభుత్వ సొమ్మును ఆశించలేదు. ఫోన్ కనెక్షన్ దగ్గర్నుంచి ఫ్లయిట్ టిక్కెట్ వరకూ అంతా సొంత ఖర్చే. ప్రభుత్వం ఏదైనా సౌకర్యాన్ని కల్పిస్తే తన బదులు పేదవాళ్లకి ఇవ్వమనేవారు. రామారావుగారు చాలాసార్లు అన్నారు... ‘మీకు పిల్లలున్నారు, ఏదైనా అవసరమైతే అడగండి’ అని. ‘నాకెందుకండీ... పేదవాళ్లకి ఇవ్వండి’ అనేవారీయన. ఆ మాట అందరూ అనలేరు... గోపాలరావుగారి లాంటి ఏ కొందరో తప్ప!
ఎవరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది...అన్నేళ్ల కాపురంలో భార్యని ‘నువ్వు’ అనని గొప్ప సంస్కారి ఆయన. ‘కుమార్జీ...’ అని పిలిచేవారు తప్ప ఏకవచనం ఉపయోగించేవారు కాదు. స్త్రీకి గౌరవం ఇవ్వాల్సిందే అనేవారు. ఏ ఆడపిల్లకైనా తన కళ్లముందు కష్టం కలిగితే సహించేవారు కాదు. ఎవరైనా అమ్మాయిల్ని కామెంట్ చేస్తే చితక్కొట్టేసేవారు. అంత గొప్ప వ్యక్తికి భార్య కావడం కంటే అదృష్టం ఏముంటుంది!
పిల్లలంటే కూడా ప్రాణం. ఎంత అర్ధరాత్రి వచ్చినా, వాళ్ల పక్కన కూర్చుని వాళ్ల ఒళ్లంతా నిమిరేవారు. పిల్లల్ని ఏనాడూ కోప్పడటం చూడలేదు నేను. పొద్దున్నే కూర్చోబెట్టి తెలుగు పేపర్ చదివి వినిపించమనేవారు. ‘మాతృభాష తల్లితో సమానం. దాన్ని మర్చిపోతే తల్లికి ద్రోహం చేసినట్టే’ అని చెప్పేవారు. పిల్లల్ని ఏదేదో చేయాలని తపించేవారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఆ దురదృష్టకరమైన రోజు అంత త్వరగా వస్తుందని ఊహించలేదు.
చాలా చెడ్డ రోజది...షూటింగుల కారణంగా టైముకి తిండి, నిద్ర ఉండేవి కాదు. ఇక పాలిటిక్స్‌లోకి వచ్చాక మరీ దారుణం. ఎప్పుడూ సేవ సేవ అంటూ వెళ్లిపోయేవారు. షుగర్ మందులు కూడా వేసుకునేవారు కాదు. దాంతో ఆరోగ్యం బాగా చెడిపోయింది. షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కిడ్నీలు దెబ్బతిన్నాయి. దానికి తోడు ధూమపానం ఒకటి. రాయిలా ఉండే మనిషి ఆరు నెలల్లోనే క్షీణించిపోయారు.
ఓరోజు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. సాయంత్రం ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించాం. రాత్రి ఎప్పటికో నిద్రపోయారు. ఉదయం ఐదవుతుండగా ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. కదిపినా కదల్లేదు. డాక్టర్లు వచ్చి ఏదేదో చేశారు. కానీ ఆయనను మాత్రం కాపాడలేకపోయారు.
ఆ రోజే నాలో సగభాగం చచ్చుబడినట్టయిపోయింది. అంతకు కొన్ని రోజుల ముందు పిల్లల్ని పిలిచి- ‘కుమార్జీని ఏ రోజూ ఇంట్లో సరుకులున్నాయా, డబ్బులున్నాయా అని అడగలేదు. వందమంది వచ్చినా వండిపెట్టేవారు. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చుపెడుతున్నారు అని కూడా కనుక్కోలేదు. ఎలా నెట్టుకొచ్చారో ఏమో. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. చివరి రోజుల్లో కూడా ఆయన నాగురించే మథన పడ్డారు. ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నేనిప్పుడు ప్రతిక్షణం మథన పడుతున్నాను. ఈ ప్రపంచానికి ఆయన లేకపోవచ్చు. కానీ నా భర్తగా, ఓ మంచి స్నేహితుడిగా ఆయన ఇప్పటికీ నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు!
సంభాషణ: సమీర నేలపూడిఇంటికి ఎవరొచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. లేదంటే ఊరుకునేవారు కాదు. డబ్బు మీద వ్యామోహం లేదాయనకి. ఎంత డబ్బుందని లెక్క చూసుకునేవారు కాదు. పదిమందికి భోజనం పెడితే పుణ్యం వస్తుంది, ఇలాంటి మంచి పనులు చేయడానికి దేవుడే దారి చూపిస్తాడు అనేవారు.ముత్యాలముగ్గు కంటే ఆయన గొప్పగా నటించిన సినిమా ఒకటుంది. అదే... ఇంటిదొంగ. విలన్‌గా క్రౌర్యాని ప్రదర్శించే ఆయన... కంటనీరు పెట్టించారా సినిమాతో. ఆయనకు నూటికి నూరు మార్కులు వేయాల్సొస్తే నేను ఆ సినిమాకే వేస్తాను.
No comments:
Post a Comment