పరిపూర్ణమైన సమాజం
పరిపూర్ణమైన వ్యక్తిత్వం వల్లనే సాధ్యమౌతుంది.
పరిపూర్ణం అంటే -
ఆధ్యాత్మిక చింతన ఉన్నదీ, ఆధిక్య భావన లేనిదీ,
ఇంకా... మనిషిని సాటిమనిషిగా గౌరవించాలన్న స్పృహ కలిగినదీ!
అసలు ఇలాంటి ఒక సమాజాన్ని నిర్మించుకోగలమా?
ఎందుకు నిర్మించుకోలేం? అంటున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్.
యువతను మళ్లించవలసిన మార్గానికి మళ్లిస్తే ... కనీసం
సాంస్కృతిక సారథులుగా, వారథులుగా వారిని తీర్చిదిద్దితే...
వ్యవస్థను అన్నివిధాలా ప్రక్షాళన చెయ్యొచ్చని బోధిస్తున్నారు.
యువజన దినోత్సవం సందర్భంగా...
‘సాక్షి’ ఫ్యామిలీకి సద్గురు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని విశేషాంశాలివి ...
వ్యవస్థను మార్చండి... కానీ ముందుగా మరో వ్యవస్థను తయారుచేయండి..!మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిషువాళ్లు మన దేశానికి వచ్చినప్పుడు పెద్దపెద్ద స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు లేవు. అలాగని నిరక్షరాస్యతా లేదు. రామాయణం, గీత, భారతం అందరూ పారాయణ చేస్తుండేవారు. తక్కినవన్నీ చదవలేకపోయేవారు కాని, ఇవి మాత్రం చదవగలిగేవారు. అయితే క్రమేణా మన దేశం అత్యున్నతమైన మేధావుల్ని, అద్భుతమైన గ ణితశాస్త్రజ్ఞుల్ని, గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుల్ని తయారుచేసింది.
ఇదంతా ఒకెత్తయితే, నా ఉద్దేశంలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిని తయారుచేయడమే విద్య! అంతకుమించిన గొప్ప విద్య మరేం ఉంటుంది? అయితే, ఇప్పుడు ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. మనం గొప్ప విద్యావ్యవస్థను రూపొందించగలుగుతున్నాం కాని, గొప్ప మనుషుల్ని మాత్రం తయారుచేయలేకపోతున్నాం.
ఇక గ్రామీణ భారతదేశంలోని విద్యావకాశాల పరిస్థితి గురించి అయితే మాట్లాడక్కర్లేదు... దయనీయం! అక్కడ యువతకు మౌలికమైన విద్యావకాశాలు లేకపోవడంతోపాటు, విద్యాసంస్థలకు వెళ్లడానికి సరయిన రవాణా సౌకర్యాలు కూడా లేవు. పోనీ అని స్కూల్‌కి వెళ్లినా అక్కడ పాఠాలు చెప్పడానికి టీచర్లు ఉండరు... ఒకవేళ టీచర్లు ఉన్నా అక్కడ ఎటువంటి బోధనా పరికరాలు ఉండవు. అలా, చదువే సరిగా లేకపోతే ఇక భవిష్యత్తు ఏముంటుంది?
వాస్తవానికి విద్య నేర్పడమే మన ప్రధాన కర్తవ్యం. అయితే దాని కంటె ముందు వారికి సరైన పోషకాహారం చాలా అవసరం. గ్రామాలలో నివసించే యువతలో 60 శాతం మందికి పైగా శరీర దారుఢ్యం లేకుండా అస్థిపంజరాల్లా ఉంటున్నారు. శారీరక ఎదుగుదల లేకపోతే మానసిక ఎదుగుదల కూడా సరిగా ఉండదు. అందువల్ల వారు చదువు గురించి పెద్దగా ఆలోచించలేకపోతారు.
గ్రామీణ యువత వంశపారంపర్యంగా వచ్చే వృత్తులలోనే ఉండిపోతారు. ఒక రైతు కొడుకు రైతులాగ, వడ్రంగి కొడుకు వడ్రంగిలాగ చిన్నప్పటినుంచీ అదే నేర్చుకుంటాడు. అది అతనికి చదువుకునే పాఠశాల లాంటిది. అదే అతను నేర్చుకునే విద్యా విధానం. అయితే దాన్ని మనం ఛైల్డ్ లేబర్ అని లేబుల్ చేసి, ఆ వ్యవస్థ తప్పు అని భావించి, దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏం, మనకు మంచి రైతులు అవసరం లేదా? వ్యవసాయం ఉపయోగకరమైన నైపుణ్యం కాదా? అది మన దేశానికి అవసరం లేదా? దానికి అవసరమైన వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి, అది పొలం దగ్గరే తయారుచేయాలి. మనకు కావలసిందల్లా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. సగం రోజు పాఠం చెబితే సరిపోతుంది. మిగతా సగం రోజు ఆ పిల్లలు వాళ్ల తండ్రుల దగ్గర వృత్తివిద్య నేర్చుకోవచ్చు. వాళ్లల్లో కొందరు ముందుముందు తరాల్లో అగ్రికల్చర్ ఎంఎసి చేసి తిరిగి వ్యవసాయంలోకి వెళ్లవచ్చు.
మన దేశంలో 400 మిలియన్లకు పైగా 15 - 18 సంవత్సరాల వయసు గల యువత ఉంది. అయితే, మన యువతకి నైపుణ్యాలు నేర్పించడానికి అవసరమైన సదుపాయం మన దగ్గర లేదు. అది లేకపోతే మన దేశాన్ని మనం చంపుకున్నట్టే. ఇప్పుడు మనకి రెండే దారులున్నాయి. దేశానికి అవసరమైన నైపుణ్యమైనా పెంచుకోవాలి లేదా దేశాన్ని చంపుకోవాలి. నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకు లేదనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. ఇక్కడి సంగతి నాకు సరిగా తెలియదు గాని, తమిళనాడులో మాత్రం విద్యార్థుల్ని 9వ తరగతి వరకు ఫెయిల్ చేయకూడదని గవర్నమెంట్ రూల్ ఉంది. అలాచేస్తే మధ్యలోనే చదువు ఆపేస్తారని వారి భావన! మేము చాలామందిని పరీక్షించి చూశాం. 8, 9 తరగతులకు వచ్చిన పిల్లలు కూడా 4 + 5 అంటే 45 అని రాస్తున్నారు. పేరుకి 9, 10 తరగతులు చదువుతున్నారు కానీ, వాళ్లు ఇంగ్లీషు మాత్రమే కాదు, మాతృభాషలో కూడా ఒక్క వాక్యాన్ని రాయలేరు. ప్యాంటు, షర్టులు వేసుకుని అదే పెద్దఘనకార్యంగా, ఏదో విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు.
ఆ విద్యార్థిని రెండోక్లాస్‌లోనే ఫెయిల్ చేసుంటే, కనీసం తన తండ్రి దగ్గర వృత్తివిద్యను నేర్చుకుని, మంచి రైతేనా అయి ఉండేవాడు. వాళ్లు స్కూళ్లల్లో ఉన్నందువల్ల జరిగే నష్టం ఏంటంటే... వాళ్లకు తిరిగి పొలాలలో పనిచేసే శారీరక దృఢత్వం ఉండట్లేదు. పొలంలో పనిచేయడం ఒక్కరోజులో వచ్చే విద్యకాదు. దానికి ఎన్నో సంత్సరాల కృషి, సాధన ఉండాలి. ఆ పిల్లవాడికి వడ్రంగి పనికాని, నేతపని కాని చేసే నైపుణ్యం గాని, శారీరక దృఢత్వం కాని రెండూ పోతున్నాయి. 14 -15 సంవత్సరాలు వచ్చినా వారికి ఎందులోనూ నైపుణ్యమూ రావట్లేదు. కానీ, దురదృష్టం ఏంటంటే... ఇవన్నీ లేకపోయినా, ఏదో చేసేయగలమన్న అభిజాత్యం మాత్రం వారిలో వృద్ధి పొందుతోంది. ఇలాంటి నిబంధనలు విధించి కోట్లాదిమంది పిల్లలకి మరో మార్గం లేకుండా తయారుచేస్తున్నాం. ఒక జనాకర్షక చట్టం చేసి ఉన్న వ్యవస్థను నాశనం చేస్తున్నాం. ఈ చట్టాలు చేసేవాళ్లెవ్వరూ గ్రామాలకు వెళ్లి ఉండరు.
అందుకే, ఆ వ్యవస్థను మార్చేముందు మనం మరో కొత్తవ్యవస్థను తయారుచేసుకోవాలి. ఏ పని చేయాలనుకున్నా దానికి ముందు నడిచేకాళ్లు ఇవ్వాలి. చట్టాలను ప్రవేశపెట్టే ముందు, వాటివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ముందుగానే ఆలోచన చేసి, ఆ తరవాతే ప్రవేశపెట్టాలి. ఏ ఆలోచనైనా సరే అది ఆకాశంలో ఉండి నేల మీదకు చేరలేకపోతే, అది మంచిదైనప్పటికీ నిరుపయోగమే!
మహిళలను పూజించనక్కర్లేదు... సమానంగా చూస్తే చాలు..!నా ఉద్దేశంలో స్త్రీని పనిగట్టుకుని పూజించనవసరం లేదు... సమానంగా చూస్తే చాలు. కానీ, దురదృష్టవశాత్తూ స్త్రీ ఒక విలాస వస్తువు, వినిమయ వస్తువు అనే ధోరణి ఈ పురుషాధిక్య సమాజంలో ఉంది. మగపిల్లలు శారీరకంగా ఎదుగుతున్న క్రమంలో పారంపర్యంగా సంక్రమించే ఈ ధోరణి వారిపై దుష్ర్పభావం చూపి, స్త్రీని పొందడం తమ హక్కు అనే భావన వారిలో కలిగిస్తుంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను కూడా ఇదే కోణం లోంచి చూడాలి. స్త్రీని ఒక అవయవాల సమాహారంలా కాకుండా వ్యక్తిత్వం ఉన్న సాటి మనిషిగా చూడగల స్పృహను మగపిల్లల్లో కలిగించే సంస్కారయుతమైన పెంపకం బాల్యం నుంచే ఉండాలి. నేరానికి శిక్షలు ఎలాగూ ఉంటాయి. అసలు నేరమే జరగని సమాజాన్ని నిర్మించుకుంటే శిక్షల అవసరం ఏముంటుంది?
ఆధ్యాత్మిక చింతనను గ్రోలండి... మత్తుపదార్థాలను కాదు..!మనం చాలా పనికిరాని పనులు చేస్తున్నాం. ఆల్కహాల్ ప్రకటనలు దేశీయచానళ్లలో వచ్చేందుకు అనుమతిస్తాం... కానీ, తాగితే మంచిది కాదని అదే ప్రకటనలో వేస్తాం! అవి పట్టించుకోరు కానీ, ప్రకటన చూసిన యువకులు మేమెందుకు తాగకూడదని అడుగుతారు. యువత అంటే సమాధానాలను తరచి చూసే తరం. వారి ప్రశ్నకు సమాధానం లేనప్పుడు వారు తాగుతారు. యువత అంటే జీవితాన్ని వెతుకుతున్నవారు. వారింకా జీవితంలో స్థిరపడలేదు. ఇంకా అన్వేషణలోనూ, అనుభవించడానికి కావలసిన మార్గాలలోనూ ఉన్నారు. మనం మన యువత అంతరంగ బలం కోసం, మనోబలం కోసం ఎటువంటి ప్రయత్నమూ చేయట్లేదు, మరో మార్గమూ చూపించట్లేదు. అందుకే, సహజంగానే వారు తాత్కాలిక సుఖసంతోషాలు కలిగించేవాటి కోసం చూస్తున్నారు. ‘సంపాదించు సంపాదించు’ అంటే వారికి అర్థం కాదు. గొప్ప మార్గంలో జీవితాన్ని అనుభవించే పద్ధతిని వారికి మనమే నేర్పించాలి. ఒక ఆధ్యాత్మిక మార్గం చూపించాలి. ఏ మనిషికైనా ఆధ్యాత్మిక బీజం సరిగా ఉంటే ఇంక మిగతావి ఎలా ఉన్నా పరవాలేదు. మనం పిల్లలకి ఆ బీజం నాటగలిగితే ఇంక వేరే చేయాల్సింది లేదు. అప్పుడు వాళ్లు తమ మార్గాన్ని ఎలాగైనా తెలుసుకోగలుగుతారు. వారిని ఎవరూ ఆపలేరు.
ఆధ్యాత్మిక మార్గం అంటే మతపరమైన నీతినియమాలు కావు. వాళ్ల ఆత్మలతో వాళ్లు ఉండగలగడం. వాళ్ల జీవితాన్ని అత్యున్నతమైన స్థాయిలో అనుభవించడం. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరికైనా తాగాల్సిన అవసరం ఏముంటుంది? కానీ, వాళ్లు తాగాలి... మత్తు పదార్థాన్ని కాదు... ఆధ్యాత్మిక చింతనను! అయితే ఒకరోజులో మొత్తం యువతనంతా మార్చడం సాధ్యం కాదు... దానికి సమయం పడుతుంది!
ఆధ్యాత్మిక బీజం వేయలేకపోతే... సాంస్కృతిక బీజాన్నైనా వేయండి..!యువతకు ఆధ్యాత్మిక బీజం వేయలేకపోతే కనీసం సాంస్కృతిక బీజమైనా వేయగలగాలి. అది అత్యుత్తమమైన పరిష్కారం అనను కానీ, ఈ పరిస్థితుల్లో ఇంతకుమించిన ప్రత్యామ్నాయం లేదని మాత్రం చెప్పగలను. కొందరు అనవచ్చు... అలా చేయడం ప్రపంచాన్ని విడగొట్టినట్టు అవుతుందని! అది కొంతవరకు నిజం. ఎందుకంటే, ఎవరికైనా అత్యుత్తమమైన జీవనం అంటే... యూనివర్సల్‌గా ఫీలవ్వడం! అలా కాని పక్షాన సాంస్కృతికంగానైనా ఫీలవ్వాలి. అది ఒక విధమైన సమతుల్యాన్ని ఇస్తుంది. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, విలువలు కొంతవరకైనా పరిరక్షింపబడతాయి. అదే వివేకానందుడు కూడా ప్రయత్నించింది.
పాశ్చాత్య దేశాల్లో... తల్లిదండ్రులకి కూడా స్వేచ్ఛాజీవితం కావాలి. సాయంత్రం పూట పిల్లలను వదిలి మద్యం సేవించి పబ్‌లకి, క్లబ్‌లకి వెళ్తారు. కానీ, మనవాళ్లు అలా కాదు... మన పిల్లల పరీక్షలైతే మనం వాళ్లతో పాటు కూర్చుంటాం. ఇంకెవ్వరూ అలా చేయరు. అందుకే, మీరు చూడండి... ఎక్కడికెళ్లినా మిగతా దేశాల వారితో పోలిస్తే మన వాళ్లు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు. మన భారతీయ విద్యార్థులు కూడా ఎక్కడున్నా, వారి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి పనిచేస్తున్నారు. దానికి ఏకైక కారణం... మనవాళ్లకు ఇంటినుంచి లభించే సహకారం! మనకు తప్పించి ఇంకెవ్వరికీ అలాంటి అనుకూల వాతావరణం లేదు. అయితే, మన యువత దాని ఫలితాన్ని అనుభవిస్తోంది కానీ దాని కోసం పనిచేయడం లేదు. ఈ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మనదేశ కుటుంబ వ్యవస్థ కూడా త్వరలోనే పాశ్చాత్య దేశాల మాదిరి తయారవుతుంది. అలా జరగకుండా చూడడం మన యువత చేతుల్లోనే ఉంది!
కూర్పు: డా.వైజయంతిసద్గురు జగ్గి వాసుదేవ్ ఆధ్యాత్మిక యోగి. ‘ఇషా’ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. అలాగే పలు సామాజిక సేవ, ఆభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటుంది. కర్నాటకలోని మైసూరులో జన్మించిన సద్గురు వాసుదేవ్ ప్రసంగాలు మంత్రముగ్ధులను చేస్తాయి. పర్యావరణ పరిరక్షణకు ఆయన నెలకొల్పిన ‘ప్రాజెక్ట్ గ్రీన్‌హ్యాండ్స్’ కు ప్రతిష్ఠాత్మకమైన ఇందిరాగాంధి పర్యావరణ పురస్కారం లభించింది. కోయంబత్తూరులోని ఆశ్రమ ప్రాంగణంలో ఆయన నెలకొల్పిన ధ్యానలింగ యోగాలయం వేలాది భక్తులకు సాంత్వన చేకూరుస్తోంది.
No comments:
Post a Comment