all

Tuesday, January 15, 2013

బాబు పెయింట్ తింటున్నాడు...ఏం చేయాలి?

 
పీడియాట్రిక్









మా బాబు వయసు ఏడేళ్లు. కొద్దిరోజుల నుంచి తలుపులపైన పెచ్చుల్లా లేచిన పెయింట్ తింటున్నాడు. క్లాస్‌లో చాక్‌పీసులు కూడా తింటున్నాడని వాడి ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఒంట్లో రక్తం లేక పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మందులు వాడినా బరువు పెరగడం లేదు. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తెలియజేయండి. 
- శ్రీరమ్య, చిత్తూరు 

మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో పైకా అంటారు. అంటే... ఆహారంగా పరిగణించని నాన్-న్యూట్రిటివ్ వస్తువులను పదే పదే తినడం, ఆ అలవాటును దీర్ఘకాలం కొనసాగించడం అన్నమాట. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ప్లాస్టర్, బొగ్గు (చార్‌కోల్), మట్టి, బూడిద, పెయింట్, బలపాలు, చాక్‌పీసులు లాంటివి తింటుంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా రెండేళ్లలోపువారు తమ పరిసరాలను తెలుసుకోవాలనే ఆసక్తితో నాన్-న్యూట్రిటివ్ వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెద్దపిల్లల్లోనూ ఇదే లక్షణం ఉంటే... అలాంటి కండిషన్‌ను తేలికగా తీసుకోకూడదు. ఈ కండిషన్ ఉన్నపిల్లల్లో చాలా సాధారణమైన సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన మానసిక రుగ్మతల వరకు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. 
సాధారణంగా పిల్లల్లో ఈ కండిషన్ ఉన్నప్పుడు దానికి నిర్దిష్టమైన కారణం ఇదేనని చెప్పలేకపోయినప్పటికీ- కుటుంబంలో సంబంధాలు సవ్యంగా లేకపోవడం, పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కొన్ని మానసిక సమస్యలు, ఐరన్‌లోపం, కడుపులో నులిపురుగుల వంటివి ఉండటం... కొన్ని కారణాలుగా పేర్కొనవచ్చు. ఇక కొన్నిప్రాంతాల్లోని తెగల్లో మట్టితినడం అనే సంప్రదాయం కూడా వాళ్ల సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 

ఇలాంటి అలవాటు ఉన్న పిల్లలకు లెడ్ టాక్సిసిటీ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీసే సందర్భాలూ ఏర్పడవచ్చు. ఇలాంటి పిల్లల్లో రక్తహీనత కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం. మీ అబ్బాయికి రక్తహీనత కూడా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కంప్లీట్ బ్లడ్‌పిక్చర్ పరీక్షతో పాటు, రక్తంలో లెడ్‌పాళ్లు ఉన్నాయేమో అని పరీక్ష చేయించడం చాలా ప్రధానం. 

ఇక ఆహారం విషయానికి వస్తే మాంసాహారంలో కాలేయం, కోడిగుడ్లు, కూరగాయల్లో బీన్స్, సోయాబీన్, పప్పుధాన్యాలు, బ్రకోలీ, మస్టర్డ్, పాలకూర, రాగి వంటి వాటిల్లో ఐరన్‌పాళ్లు ఎక్కువ. మీరు మీ అబ్బాయికి పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు కొద్దిగా కొవ్వుపాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. అదేవిధంగా విటమిన్-సి ఎక్కువగా ఉన్న తాజా పండ్లు ఎక్కువగా తినిపించాలి. మీరు ఒకసారి మీ అబ్బాయికికడుపులోని నులిపురుగులు పడిపోవడానికి మందులు వాడటం కూడా అవసరం. మీరు మీ పిల్లల వైద్యనిపుణుణ్ణి సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి.
  

No comments: