all

Tuesday, January 15, 2013

భోగి ఎంతో భాగ్యం!


‘‘ఇంద, ఈ పొంగలి తిని, హాయిగా ఆడుకో బుజ్జీ, ఇవ్వాళ్టికి ఇదే మీకు టిఫిన్... అన్నట్టు బాబిగాడేడే, పొద్దుటినుంచి కనపడలేదు’’ మనవరాలు సుష్మ చేతికి ఘుమఘుమలాడే పొంగలి వేసిన బాదం ఆకు ఇస్తూ అడిగింది అనసూయమ్మ.

‘‘తమ్ముడు పొద్దున్నే పక్కఅపార్ట్‌మెంట్‌లోని వాళ్లంతా కలిసి భోగిమంటలు వేస్తుంటే అక్కడికెళ్లాడు నానమ్మా’’ అని చెబుతుండగానే బాబిగాడు హడావిడిగా లోపలికొచ్చి ఏదో పనున్నట్టు నేరుగా స్టోర్‌రూమ్ తలుపు తీసి అందులో పడేసిన కర్రముక్కలు, విరిగిపోయిన పడక్కుర్చీ బద్దీలు, ఇంకా పనికిరాని వస్తువులు కొన్ని తీసి ఓ పాత సంచిలో వేసుకుని గిరుక్కున బయటికొచ్చి, వచ్చినంత వేగంగా తుర్రున వెళ్లిపోయాడు.

బాబిగాడి చేష్టలన్నింటినీ గమనిస్తున్న నానమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. అది చూసిన సుష్మ ‘‘నానమ్మా! భోగిమంటలంటే ఏంటి? అవి ఎందుకు వేస్తారు? పొద్దున్నే ఈ పొంగలి ఏమిటి? సాయంత్రం తమ్ముడికి బోగిపళ్లు పోస్తానంటున్నావు... ఇదంతా ఏమిటసలు?’’ అనడిగింది. అనసూయమ్మ మనవరాలిని దగ్గరకు తీసుకుని ప్రేమగా బుగ్గలు పుణికి ‘‘నా తల్లే! చాలా మంచి ప్రశ్నే వేశావు... ఇంగ్లీషు చదువుల మూలంగా ఈ కాలం పిల్లలకు ఇటువంటి విషయాలు తెలియకుండా పోతున్నాయి. మీ బోటివాళ్లు ఆసక్తిగా అడగాలే కాని, నా లాంటివాళ్లు ఓపిగ్గా చెబుతారు’’ అంటూ మనవరాలితో ఉత్సాహంగా తనకు తెలిసిన విషయాలను చెప్పసాగింది విశ్రాంత తెలుగు పండితురాలు అనసూయమ్మ.

ప్రస్తుత కాలంలో మనం పాటిస్తున్న ఆచారాలు, చేసుకుంటున్న పండుగలు, అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు, కుటుంబ కట్టుబాట్లు నేటివిధంగా రూపొందడానికి ఆధారం సౌరకుటుంబమే. ఒకవిధంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వంలో జరిగే అన్ని ప్రధాన సంఘటనలకు సూర్యచంద్ర గమనాలు, నక్షత్ర రాశుల కదలికలే మూలం. ఉదాహరణకు సూర్యుడు నెలకు ఒక నక్షత్రరాశిలో సంచరిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. దానినే ‘సంక్రమణం’ అంటారు. అలాగే చంద్రుడు పున్నమినాడు చరించే నక్షత్రాన్ని బట్టే మాసాలకు పేర్లు వచ్చాయి. ఉదాహరణకు పున్నమి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న మాసానికి పుష్యమాసమని, మఖానక్షత్రంలో ఉంటే మాఘమాసమనీ అంటారు. అదేవిధంగా సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించటమే మకర సంక్రమణం. అదే మహాపర్వదినం. నీకు తెలుసుకదా, తెలుగువారు అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకార మే జరుపుకుంటారు. అయితే ఒక్క సంక్రాంతి పండుగను మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం మొదటినుంచి వస్తున్న ఆనవాయితీ.

తెలుగువారికి సంక్రాంతి పెద్దపండుగ. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు. అందుకే కదా, మీకు స్కూళ్లకు అన్నేసి రోజులు సెలవులిచ్చేది! సరే, ఇందాక భోగిమంటల గురించి అడిగావు కదూ, ఆ విషయానికే వస్తున్నాను...అసలు ‘భోగి’ అన్న పేరులోనే భోగభాగ్యాలు ఉట్టిపడుతుంటాయి కదూ! అటు కుర్రకారు, ఇటు నడికారు, వారిని ఉత్సాహపరుస్తూ మాబోటి మూడుకాళ్ల వాళ్లు కలిసి చేసే సందడే భోగిమంటలు. పనికిరాని, వాడకంలో లేని పాతవస్తువులన్నింటినీ మంటలలో వేయడం ఈ పండుగ సంప్రదాయం. ఒకవిధంగా చెప్పాలంటే మనలోని పాత ఆలోచనలను, పాతదనాన్ని మంటలలో వేసి తగులబెట్టెయ్యడమే ఈ భోగిమంటల ఉద్దేశ్యాలలో ఒకటి. కలిగిన వాళ్లు కొత్తబట్టలు వేసుకోవడం భోగితోనే మొదలవుతుంది. మహాభక్తురాలైన గోదాదేవి శ్రీ రంగనాథుని పాణిగ్రహణం చేసింది భోగినాడే! ఇందుకు గుర్తుగా శ్రీవైష్ణవులు భోగినాడు అంగరంగవైభవంగా గోదారంగనాథుల కల్యాణం చేస్తుంటారు.

సంక్రాంతి మూడురోజుల పండుగ. మొదటిరోజు భోగి. రెండవరోజు సంక్రాంతి, మూడవరోజు కనుమ. భోగినాడు పాత కలప, కొయ్య వస్తువులు, విరిగిన చెక్కసామగ్రి, పిడకలు తదితరాలను వేసి భోగిమంటలు వేయడం ఆచారం. కొన్ని చోట్ల ఊరు ఊరంతా కలసి ఒకేచోట పెద్దఎత్తున భోగిమంటలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భోగినాడు వేసే మంటల వల్ల వాతావరణంలోని క్రిమికీటకాలు, రానున్న కాలంలో సంభవించబోయే అరిష్టాలు నశిస్తాయంటారు. భోగిమంటలు వేసిన తర్వాత మాడుకు నువ్వులనూనె అంటుకుని కుంకుడురసంతో రుద్దుకుని వేడినీటితో తలస్నానం చేయాలి.

తర్వాత పిడకల దాలి మీద ఎర్రగా కాచిన పాలు, కొత్తబియ్యం, బెల్లం కలిపి పులగం లేదా పొంగలి వండి, సూర్యునికి, ఇంద్రునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరించాలి’’ అదే ఇందాక నేను పెట్టింది. అంటూ వివరించింది అనసూమయ్మ. నానమ్మ చెప్పినట్లుగా సాయంత్రం ‘మా తమ్ముడికి భోగిపళ్లు పోస్తున్నాం, మా ఇంటికి తప్పకుండా రండి’ అంటూ కుంకుమ భరిణ పట్టుకుని చుట్టుపక్కల తెలిసిన వాళ్లందరి ఇళ్లకీ వెళ్లి బొట్టుపెట్టి చెప్పి వచ్చింది సుష్మ. ఇంతలో సాయంత్రం రానే వచ్చింది. కొత్తబట్టలు తొడుక్కున్న బాబిగాడిని కుర్చీలో కూర్చోబెట్టి, బొట్టుపెట్టి, హారతి ఇచ్చింది నానమ్మ. రేగుపళ్లు, చిల్లర పైసలు, చెరుకుముక్కలు, బంతిపూల రెక్కలు కలిపి తమ్ముడి తలచుట్టూ తిప్పి మూడుసార్లు వాడి తలపై పోసింది అమ్మ. పేరంటానికి వచ్చిన వాళ్లందరూ కూడా అలానే చేశారు.

అందరి కాళ్లకూ పసుపు పూయటం, నుదుట కుంకుమ బొట్టుపెట్టి, అరిశ, సెనగలు, పండ్లు, తమలపాకులు పెట్టిన కవర్ చేతికిస్తున్న సుష్మ తన తలమీదినుంచి జారిన రేగుపండ్లను ఒక్కొక్కటి ఏరి నోట్లో వేసుకుని చప్పరిస్తున్న బాబిగాణ్ని వారించబోతున్న సుష్మను అమ్మ వచ్చి‘‘సుష్మా! లే! ఏమిటలా కూర్చునే నిద్రపోతున్నావ్?’’ అని ఒక్క కుదుపు కుదపడంతో మెలకువ వచ్చేసింది. నానమ్మ చెప్పినదంతా ఆసక్తిగా వింటూనే తను కలకనింది కాబోలుననుకుంటూ సిగ్గుపడి లేచింది సుష్మ. తను కలలో చూసినట్లుగా సాయంత్రం పేరంటానికి కొత్తబట్టలు కట్టుకుని ముస్తాబు మొదలుపెట్టింది. 

No comments: