పట్టుబట్టి పూర్తి చేయించా:‘‘మాకు ముగ్గురు ఆడపిల్లలు. హిమబిందు, నాగసుష్మ, హరిప్రియ. పెద్దమ్మాయి అమెరికాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది. క్రమశిక్షణగల ఉద్యోగిగా ఆమె అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. రెండవ అమ్మాయికి, మూడవ అమ్మాయికి డిగ్రీ చదివేటప్పుడే పెళ్లి చేశాం. మూడవ అమ్మాయి పెళ్లయిన తర్వాత బి.ఎఫ్.ఎ.చేసింది. రెండవ అమ్మాయిని ఇటీవలే నేను పంతం పట్టి మరీ డిగ్రీ పూర్తి చేయించాను.
తనని స్క్రిప్ట్ రైటింగ్‌లో నా సహాయకురాలిగా చేసుకోవాలని, నా రచనా వారసత్వం తనకి అప్పగించాలని నా కోరిక. మా ఆవిడకు మాత్రం మా ముగ్గురు పిల్లలకూ తలా వంద నవరుల బంగారం, ఒక ఇల్లు, ఐదెకరాల పొలం ఏర్పాటు చేయాలని ఉంది. ‘సరే నీ ఇష్టం’ అన్నాను. ఆమె తాను అనుకున్నట్టుగా వాళ్లకి అవి సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది... అంటూ గోపాలకృష్ణ సాలోచనగా భార్యవైపు చూశారు.
పెళ్లి నిరాడంబరంగా...: ‘‘మా పిల్లలు ముగ్గురివీ కమ్యూనిస్టు పెళ్లిళ్లే. ముగ్గురివీ నిరాడంబరంగా జరిపించాం. ఆ తర్వాత వాళ్లు చదువుకున్నారు. ఒక అమ్మాయి మాత్రం పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో వారి పెంపకం బాధ్యతలలో పడి డిగ్రీ పూర్తి చేయలేక పోయింది. ఆమె చేత ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయించాలనే పట్టుదలతో ఇటీవలే స్వయంగా కోచింగ్ ఇచ్చి మరీ డిగ్రీ సర్టిఫికెట్ వచ్చేలా చూశాను’’ అని ఆనందంతో చెప్పారు గోపాలకృష్ణ.
పనిపాటలు నేర్పించా: ‘‘మా పిల్లలకు చిన్నప్పటినుంచి పనిపాటలు నేర్పాను, మా బంధుమిత్రులలోనూ, మావారి స్నేహితులలోనూ వంటలు బాగా చేస్తానని నాకెలాగైతే మంచి పేరుందో అలాగే మా పిల్లలకు కూడా అన్ని పదార్థాలూ రుచికరంగా వండుతారని పేరొచ్చేలా చేశాను’’ అని తల్లిగా బాధ్యతల్లో తానేమీ తక్కువ చేయలేదన్నట్టు చెప్పారు విజయలక్ష్మి. అచ్చతెలుగు ఆడపడచులా, సామాన్య గృహిణిగా కనిపించే ఆమె సెన్సార్ బోర్డ్ సభ్యురాలని, ఒక ప్రచురణ సంస్థ బాధ్యతలు చూస్తున్నారనీ తెలిస్తే ఆశ్చర్యపోతాం.
‘‘మా వారు రోజంతా సినిమాలతో బిజీగా ఉండేవారు. ఒక్కోసారి ఉదయాన్నే వె ళ్తే అర్ధరాత్రెప్పుడో ఇంటికి చేరేవారు. పిల్లలకి కాలక్షేపం కోసం టీచర్‌నే ఇంటికి పిలిపించి వాళ్లకి డ్రాయింగ్, మ్యూజిక్ లాంటివి నేర్పించేదాన్ని. దాంతో వాళ్లకి ఫైన్‌ఆర్ట్స్ మీద ఆసక్తి ఏర్పడి డిగ్రీలో అదే గ్రూప్ తీసుకున్నారు’’ అని చెప్పారు విజయలక్ష్మి. ‘‘నేను చిన్నప్పటినుంచి నాస్తికవాదిని.
అయితే మా పెద్దమ్మాయి వైవాహిక జీవితం దెబ్బతింది. దాంతో నేను చాలా బాధపడి, ఎందుకిలా అయిందా అని ఆలోచిస్తుంటే, మా ఆవిడ తెలిసిన వాళ్లెవరికో అమ్మాయి జాతకం చూపించింది. ఆశ్చర్యం! అంతవరకు ఆమె జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటీ జ్యోతిషులు చెప్పినట్లుగానే జరిగింది. అప్పటినుంచి నాకు జ్యోతిషం మీద గురి ఏర్పడింది. అంతేకాదు, దేవుడి మీద నమ్మకం కూడా ఏర్పడింది. ఇప్పుడు మా పిల్లలూ మంచి భక్తిపరులు. పూజాపురస్కారాలు బాగా చేస్తున్నారు. అన్నదానాలు చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో ఉంటున్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలనే పాటిస్తుంటే మేము వారికిచ్చిన తర్ఫీదు వృథాపోలేదని సంతృప్తిగా అనిపిస్తుంది.’’ అంటూ తాను ఆస్తికుడిగా మారిన వైనాన్ని వివరించారు గోపాలకృష్ణ.
ఉన్నదానిలో సర్దుకోవడం నేర్పాం: ‘‘చిన్నప్పటి నుంచి మా పిల్లలకు పొదుపు చేయడం, ఉన్నదానిలో సర్దుకోవడం నేర్పాను. ఎవరి మీదా ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునేలా అలవాటు చేశాను’’ అని విజయలక్ష్మి చెబుతుంటే ‘‘వాళ్ల అమ్మ మాట విని మా పిల్లలు ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ ఇంటికి కావలసిన సరుకులు వాళ్లే స్వయంగా తెచ్చుకుంటున్నారు. కానీ ఈమె మాత్రం ఆ బాధ్యత నా మీదే పెట్టింది’’ అన్నారు గోపాలకృష్ణ నవ్వుతూ.
చీకటిపడేలోగా ఇల్లు చేరాల్సిందే...‘‘ఇప్పటికీ మా పిల్లలు ఒంటరిగా దూరప్రయాణాలు చేసేందుకు ఇష్టపడను. ఇంటినుంచి బయటికి వెళ్లిన వాళ్లు క్షేమంగా తిరిగి వచ్చేంతవరకు ఫోన్ చేస్తూనే ఉంటాను. అంతేకాదు, అమెరికాలో ఉంటున్న మా మనవరాలిని కూడా చీకటి పడేలోగా ఇంటికి వచ్చేలా చూసుకోమని మా అమ్మాయికి చెబుతుంటాను’’ అని చెప్పిన విజయలక్ష్మిలో సెన్సార్‌బోర్డ్ సభ్యురాలికి బదులు ఓ సాధారణ గృహిణి, కన్నతల్లి కనపడ్డారు.
ఓ కంట కనిపెడుతుండాలి: ‘‘తల్లిదండ్రులు ముందునుంచీ ఆడపిల్లల వస్త్రధారణ మీద, నడవడిక మీద శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? వంటివిపట్టించుకోకపోతే మాత్రం వారి జీవితాలు ప్రమాదంలో పడబోతున్నాయని తెలిసీ చూస్తూ ఊరుకున్నట్లే. వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగని పూర్తిగా వదిలేయకూడదు’’ అన్నారు ఈ దంపతులు ముక్తకంఠంతో.
ఆడపిల్లల తల్లిదండ్రులుగా తోటివారికి ఎటువంటి జాగ్రత్తలు చెబుతారు అని అడిగినప్పుడు - ‘‘ఆడపిల్లల్ని ధైర్యవంతులుగా పెంచాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఏదైనా ఒక విషయంలో వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంటే, ఏదైనా చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే మనమే చొరవచూపి ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. వారు చెబుతున్నది శ్రద్ధగా వినాలి. సహనంతో పరిష్కారం చూపాలి’’ అని గోపాలకృష్ణ దంపతులు చెప్పారు. ఆలోచిస్తే వాళ్లు చెప్పినది ప్రతి తల్లీ, తండ్రీ ఆచరించాల్సినవేననిపించింది.
- డి.వి.ఆర్. భాస్కర్
No comments:
Post a Comment