all

Tuesday, January 15, 2013

భర్తకు ఆమె... తోడు - నీడ(పురాణ స్త్రీలు - ఛాయ)



ఛాయ నడవడిక సూర్యుణ్ణి ఆకట్టుకుంటుంది. తల్లి, భార్య, గృహిణి బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్న తీరుకు మురిసిపోతాడు. తాను ఆస్తమించిన నిశివేళ లోకపాలన వ్యవహారాలను ఛాయకే అప్పగిస్తాడు. 

ఈ భూమ్మీద జన్మించాలని ఆమె ఎన్నడూ కోరుకోలేదు. జన్మిస్తానని భావించనూ లేదు. ప్రచండ పురుషుడు సూర్యభగవానుని జీవితభాగస్వామిగా బతుకు గడపాల్సి వస్తుందని ఊహించనూ లేదు. అంతా కాకతాళీయంగా జరిగింది. అయినప్పటికీ సంసారధర్మాన్ని మీరలేదు ఛాయ. భర్త, పిల్లలు అకారణంగా మెడకు చుట్టుకున్నారన్న వితర్కానికి దిగలేదు. తన జన్మకు కారణమైన సంజ్ఞాదేవిపై ఆగ్రహం చూపించలేదు. దైవవశాత్తూ ఎదురైన ఘటనలన్నింటినీ ధర్మయుక్తంగానే పరిష్కరించుకున్నది ఛాయ.

చండభానుడి తొలిభార్య సంజ్ఞాదేవి. భాస్కరునితో కాపురం నిప్పులతో సహవాసమే. కొలిమిలాంటి పెనిమిటితో యముడు, యమునలను కన్నది. ఇక తాళలేక ఆయనకుదూరంగా జరిగిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను కట్టుదిట్టంగా పథకం రూపొందించింది. తన ఛాయను నిలువెత్తు ప్రతిమగా తీర్చింది. ఆ నీడ బొమ్మ అచ్చం తనలాగే ఉండేలా చూసుకుంది. దానికి ప్రాణం పోసింది. అలా ఛాయాదేవి అయోనిజగా, అసహజంగా జన్మనెత్తింది. ఛాయకు తన వృత్తాంతమంతా చెప్పి సూర్యునితో కాపురానికి పంపింది సంజ్ఞాదేవి. ఈ రహస్యాన్ని అప్పుడే బట్టబయలు కానివ్వవద్దని బతిమాలి, తనదోవన తాను వెళ్లిపోయింది.

ఛాయ పరిస్థితి అగమ్యగోచరమైంది. భగభగమండే భర్తను భరించలేక వెళ్లిపోయిన ఒకానొక భార్య స్థానంలో విధులు నిర్వహించాలి. సంజ్ఞ బిడ్డలిద్దరినీ తన బిడ్డలుగా చూసుకోవాలి. అలా ఆ సంసారాన్ని లాక్కురావాలన్నమాట. ఇదంతా లలాటలిఖితమని మొక్కవోని ధైర్యంతోముందుకు నడిచింది. సంజ్ఞాదేవిస్థానంలో మసలుతూవచ్చింది.

సవిత్రునికి ఇవేమీ తెలియవు. ఛాయతో వైవాహిక జీవితాన్ని పంచుకున్నాడు. వారికి శని, సావర్ణి పుట్టారు. ఒకవైపు స్వంతబిడ్డలు, మరోవైపు సంజ్ఞ పిల్లలు యముడు, యమునల పెంపకం ఛాయమీదనే పడ్డాయి. తరతమ భేదాల్లేకుండా నలుగురు బిడ్డలనూ సాకుతూ వచ్చింది. సంజ్ఞాదేవికి ఇచ్చిన మాట ప్రకారం తను ఛాయ అనే సంగతిని ఆదిత్యునికి తెలియనివ్వకుండా గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది. ఇంటిని నడపగల ఇల్లాలు ప్రపంచాన్నీ నడిపించగలదన్న నమ్మకంతో ఉంటాడు సూర్యుడు.

ఇలాంటి వేళ అనుకోని అవాంతరం వచ్చిపడుతుంది. సంజ్ఞాసుతుడు యముడు ఛాయపై ద్వేషం పెంచుకుంటాడు. ఆమె తనను తక్కువగా చూస్తోందని జనకునికి విన్నవిస్తాడు. సూర్యుడు ఈ పిల్లాడి మాటలను పట్టించుకోడు. కోపోద్రిక్తుడైన యముడు ఛాయను పాదంతో తన్నబోతాడు. మాతృబంధానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తాడు. వెనువెంటనే ఆతని కాలు ఊడి కింద పడుతుంది. యముని ధర్మాధర్మాలనూ విచారించగల ధర్మమూర్తిగా ఛాయ ఆ సమయాన లోకపూజిత అవుతుంది. సూర్యుడు కుమారరత్నాన్ని ఊరడించి సమస్యకు పరిష్కారంగా పాదం శిధిలమయ్యాక కొత్తది పుట్టుకువస్తుందని భరోసాఇస్తాడు.

అప్పుడు ఛాయాదేవి నిజానిజాలను వెల్లడిస్తుంది. ఏ విషయాన్నయినా ఎప్పుడు గోప్యంగా ఉంచాలో, మరెప్పుడు బహిర్గతం చేయాలో తెలిసిన ప్రాప్తకాలజ్ఞత ఆమెకే సొంతం. ఛాయాదేవి అసలు కథ తెలుసుకున్న భాస్కరుడు తెప్పరిల్లుతాడు. ఆమెకు కృతజ్ఞతలు చెబుతాడు. సంజ్ఞాదేవి కోసం వెతుకులాడి ఆమెను తిరిగి తనదానిగా చేసుకుంటాడు. సంజ్ఞాపుత్రుడు యముడు ఛాయమ్మ ఔదార్యాన్ని, సహృదయాన్ని అర్థం చేసుకుంటాడు. ఫలితంగా ఒకానొక గొప్ప అధికారాన్ని ఆమెకు కట్టబెడతాడు. ప్రాణికోటి నిదురించేవేళ ఛాయ కనబడదు. పరుండిన వారిని వెన్నంటి నీడ నిలువలేదు. ఆ సమయంలో ప్రాణుల పాపకర్మలను స్వయంగా తనకు తెలియజేసే మహదవకాశాన్ని ఛాయకు కల్పిస్తాడు. సకల ప్రాణుల కర్మఫలాలను నిర్ణయించే శనిదేవుని తల్లిగా, భావి మనువుగా ఎందరో పెద్దలు గణన చేసిన సావర్ణి మాతృదేవతగా ఛాయ వినుతికెక్కుతుంది.

- డా. చింతకింది శ్రీనివాసరావు

No comments: