all

Tuesday, January 15, 2013

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం


నిత్య సందేశం
సూర్యుడు ఉత్తర దిక్కునకు పయనించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. అయనం అంటే గమనం అని అర్థం. ఇప్పటివరకూ దక్షిణ దిక్కుగా సూర్యుడు నడిచిన కాలం గడిచింది. అంతేకాదు. ఈ కాలం ఉత్ + తర + అయనం అని పెద్దలు శ్రేష్ఠమైన కాలంగా దీన్ని గుర్తించారు. భారతంలో భీష్ముడు యుద్ధంలో దక్షిణాయనంలో నేలకు ఒరిగినా, ఉత్తరాయణ కాలం వచ్చేవరకూ ఉండి ప్రాణాలు వదిలినట్లు భారతం చెబుతోంది. దీనిని బట్టి ఈ ఉత్తరాయణ ప్రాశస్త్యం మరింత చెప్పినట్లు అయ్యింది. అంతేకాదు చాంద్రమానానికీ సౌరమానానికీ సంవత్సర సమన్వయం ఈ మకర సంక్రాంతి వల్ల సిద్ధించడం కూడా మరింత ప్రమాణం కలిగిస్తోంది. అందుకే ఎప్పుడూ మకర సంక్రాంతి జనవరి 14న కానీ, 15 న కాని వస్తుంది.

సౌరమానం ప్రకారం మనకి సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. అనగా సూర్యుడు మేషము, వృషభము మొదలైన 12 రాశులలో ఒక్కొక్క నెల ప్రవేశించడం మూలంగా ఈ సంక్రాంతులు ఏర్పడతాయి. (చంద్రుని వల్ల చైత్రం మొదలైన మాసాలు ఏర్పడి చాంద్రమాన సంవత్సరం సిద్ధిస్తోంది) ఈ పన్నెండు సంక్రాంతుల్లోనూ మొదటిది మేషం ఏడవది తుల. ఈ రెండు మాస సంక్రాంతులూ రాత్రింబవళ్లు సరిసమానంగా ఉండే కాలం. ఈ రెండు సంక్రాంతుల రోజులలోనూ మనం చేసిన పుణ్యపాపాలు లక్షరెట్లు వృద్ధిపొందుతాయి. ఈ సంక్రాంతులకన్నింటికీ నాయకుడు సూర్యుడు. కనుక ఏది ఇచ్చినా సూర్యుడే ఇస్తాడు. నదులకి పన్నెండు రోజులు పుష్కరాలు ఎంత పుణ్యకాలమో కాలానికి ఈ పన్నెండు సంక్రాంతులూ అంతటి మహత్తరమైనవి. అందుకే

సంక్రాంతాయాని దత్తాని, హవ్యకవ్యాని మానవైః
తేషామిష్టాని సర్వాణి దదాత్యర్కః న సంశయః
అంటోంది ఆర్ష వాఙ్మయం. హవ్యం అంటే అగ్నిహోత్రంలో దేవతలకి సమర్పించే హవిస్సు. కవ్యం అంటే పితృదేవతలకి సమర్పించేది. సంక్రాంతినాడు ఎవరు ఏవేవి దానం చేసినా వారికి సూర్యుడు వారివారి అభీష్టాలను నెరవేరుస్తాడు, ఆరోగ్యభాగ్యాలు కలిగిస్తాడు.

చనిపోయిన వారి పేరు మీదుగా ఈ మకర సంక్రాంతినాడు ఏది దానం చేసినా వారికి తప్పక అందుతుందన్నది ప్రముఖమైన విశ్వాసం. అంతే కాదు... ప్రతి ఒక్కరూ ఈ రోజు తలంటుస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. కొత్త పంట బియ్యంతో సూర్యునికి పాయసం వండి నివేదించాలి. ప్రతి ఇంటి ముందూ రంగవల్లికలు తీర్చిదిద్దాలి. బీదవారికీ, రైతులకీ అన్నదానం చేయాలి. ఏ పుణ్యం చేసినా కోటిరెట్లు ఫలం కలుగుతుందన్నది మహర్షులు చెప్పిన సత్యం. పాపమూ అంతే. పక్షులూ, పశువులూ మున్నగు ప్రాణులకి కూడా ఆహారం కల్పించాలి. మన సంప్రదాయం ఎప్పుడూ మన ఆనందాన్ని పదిమందితో కలిపి పంచుకోవాలని చెప్పింది. గంగిరెద్దుని మన ఇంటి ముందుకి తెచ్చి ఆడించమని చెప్పాలి. బసవన్నకి మన పాత వస్త్రాలు ఇచ్చినా మంచిదే. ఏదో ఒక పండు నోటికందించి బసవన్న చిరుగంటల ఆశీస్సులు మనం పొందాలి. అదే ఈ పండుగ పరమార్థం.

- డా. ధూళిపాళ మహాదేవమణి

No comments: