all

Thursday, January 24, 2013

వసంతపంచమి

 
(జనవరి 28న)
సకల విద్యాస్వరూపిణి, సమస్త వాఙ్మయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తకధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు వేదవేదాంగవేత్త అవుతాడు, పరమ మూర్ఖుడు కూడా మహావిద్వాంసుడుగా మారిపోతాడు. అందుకు మహాకవి కాళిదాసే మంచి ఉదాహరణ. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకం కోల్పోయి మతిహీనుడై సర్వం పోగొట్టుకుంటాడు. అభ్యసించే విద్య, చేసే వృత్తి, చేపట్టిన పని... ఇలా ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సంపాదించాలంటే కృషి, పట్టుదలతోపాటు సరస్వతీదేవి అనుగ్రహమూ అవసరం. అందుకే ఆ చల్లని తల్లి కరుణ కోసం తహతహలాడనివారుండరు.

ఆమె ప్రాదుర్భవించిన పరమ పవిత్రమైన మాఘపంచమి పర్వదినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెకు తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రాలతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి.

సరస్వతి అంటే కేవలం చదువు మాత్రమే కాదు. సంస్కారం, విచక్షణాజ్ఞానం, వినయం, వివేకం, లోకజ్ఞానం, వృత్తి నైపుణ్యం కూడా సరస్వతే! చదువులు నేర్పే గురువులందరూ ఆ తల్లికి ప్రతిరూపాలే! కాబట్టి శారదాదేవి జన్మదినాన ఆమెను పూజించడంతో పాటు వేదపండితులు, గురువులు, విద్యావంతులు, వృత్తి నిపుణులు, సంగీత, నృత్య కళాకారులు... మనకు విద్య గరిపిన గురువుని, వివేకజ్ఞానాన్ని ఇచ్చినవారిని మనకు చేతనైనంతలో సత్కరించడం, చేతకాకపోతే చేతులెత్తి నమస్కరించడం సంస్కారం.

No comments: