all

Thursday, January 24, 2013

గర్వభంగం(kids story)

 
విక్రమనగరి సంస్థానంలో వీరభద్రుడనే కవి ఉండేవాడు. అతను మంచి పండితుడే గానీ గర్విష్టి కావడంతో ఇతర కవులను జయించి, వాళ్లను అవహేళన చేస్తుండేవాడు.
వీరభద్ర కవి దెబ్బకు ఇతర కవులంతా భయపడి పోయి అతను ఎక్కడ కనిపిస్తాడో, ఎక్కడ తమను ఎగతాళి చేస్తాడోనని నక్కి నక్కి ఉండేవాళ్లు.

వీరభద్ర కవి దేశాటనం ప్రారంభించాడు. అనేక రాజ్యాలను సందర్శించి అక్కడ మహారాజులచే పాద పూజలు చేయించుకుని, అంతులేని సంపదలు ఆర్జించడం ప్రారంభించాడు. కవిత్వంతో తనను ఓడించలేని పండితులను కారాగారాల్లో బంధించమని, హింసించమని రాజులను ఆజ్ఞాపించసాగాడు. రాను రాను కవి రాచరికాలు పెరిగిపోయాయి.

ఇలా ఉండగా వీరభద్ర కవి గర్వం గురించి విన్న జయసింహుడు అనే యువకుడు తమ రాజ్యాన్ని పాలిస్తున్న రాజేంద్రవర్మ వద్దకెళ్లి‘‘రాజా! వీరభద్రుణ్ణి కవితాగోష్ఠికి పిలిపించండి. అతని పొగరణుస్తాను’’ అని చెప్పాడు. జయసింహుని తెలివితేటలగురించి తెలిసిన రాజేంద్రవర్మ వీరభద్రుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించాడు.

వీరభద్రుడు తనకు పన్నెండు భాషలు వచ్చునని, తన మాతృభాష ఏదో కనిపెట్టాలని, ఒకవేళ కనిపెట్టలేకపోతే రాజు తన రాజ్యాన్ని తనకు ధారాదత్తం చేసి, ఆస్థాన కవులతో సహా రాజ్యం వదిలి వెళ్లిపోవాలని షరతు విధించాడు. జయసింహుడు వచ్చి వినయంగా ‘‘కవివరేణ్యా! ఇవ్వాల్టికి చీకటి పడిపోయింది. తమరు విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకోండి. కవితాగోష్ఠి రేపు కొనసాగించవచ్చు’’ అనడంతో వీరభద్రుడు మందిరానికి వెళ్లి నిద్రపోయాడు.

అర్ధరాత్రివేళ జయసింహుడు మారువేషంలో పెద్ద దుడ్డు కర్రతో వీరభద్రుని చావగొట్టసాగాడు. దాంతో వీరభద్రుడు ‘‘చచ్చాను దేవుడోయ్’’ అంటూ ఏడవసాగాడు. దాంతో జయసింహుడు ‘‘ఇదే నీ మాతృభాష - తక్షణం వెళ్లిపో’’ అనగానే వీరభద్రుడు పారిపోయాడు.
నీతి: ప్రతిభ ఉండవచ్చు కానీ గర్వం పనికిరాదు.

No comments: