ఏ హీరోకి ఆ మ్యూజిక్ కొట్టడం మణిశర్మ స్పెషాలిటీ!
బాక్స్ బద్దలవదా మరి!!
ఆయన బీజీఎం కొట్టినా అంతే.
ఏదో ఒకటి బద్దలవడం గ్యారెంటీ!
ఎమోషనల్‌లో గుండె బద్దల్.
యాక్షన్ సీన్‌లో సీట్లు బద్దల్.
మె-లో-డీ... లో?
బద్దల్ కాదు, మనసు పింజల్ పింజల్.
లేటెస్టుగా ‘సీతమ్మ వాకిట్లో...’ మణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హాళ్లలో ఆహ్లాదాల పూలు పూయించింది!
ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఆయన్ని నిలబెడుతున్నది... ఇదిగో ఈ సంగీతమే.
‘సినిమాలొద్దు, దమ్మిడీ ఆదాయం ఉండదు’ అని తండ్రి ఆపడానికి ప్రయత్నిస్తే...
‘సంగీతం లేకుండా నయాపైసాకి పనికిరాను’
అని మొండిగా ఫీల్డులోకి వచ్చి, స్టార్ కంపోజర్ అయిన మణిశర్మ అదర్‌సైడే
ఈవారం మన ఇంటర్వ్యూ.
మీరు మొదటినుంచీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంటారు. ప్రచారం ఇష్టం ఉండదా? మణిశర్మ: అలా అని కాదు. మనం ఏం మాట్లాడినా ఓ సమయం... సందర్భం ఉండాలి. అందుకే అవసరమైనప్పుడే మాట్లాడ్తా. ఇప్పుడు చెప్పండి... మీకేం కావాలి?
మీ అదర్‌సైడ్ గురించి తెలుసుకోవాలని ఉంది? మణిశర్మ: ఎవ్వరి అదర్‌సైడ్ అయినా తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ మాత్రం గౌరవమైనా మర్యాదైనా ఉంటుంది. నేనేదైనా దాపరికాల్లేకుండా మాట్లాడతా. కొంత మందికి నచ్చొచ్చు. ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా నా పద్ధతి మార్చుకోననుకోండి. చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ కావడానికే ఇన్నేళ్లు పట్టింది. ఇక నా మనస్తత్వాన్ని మార్చుకోవాలంటే కుదరనే కుదరదు.
పుట్టి పెరిగిన మద్రాసు మెరీనా తీరాన్ని వదిలేసి హుస్సేన్ సాగర్ తీరం చేరారు కదా. ఎలా ఉంది ఇక్కడి జీవితం? మణిశర్మ: ఇంకా ఇక్కడి జీవితానికి నేను అలవాటు పడలేదు. కాబట్టి పెద్దగా ఏం చెప్పలేను. మద్రాసు అనేది నా జీవితంలోని అనేక మజిలీలకు కేంద్రస్థానం. అక్కడి లైఫ్ స్టయిల్‌కి నేను బాగా మమేకం అయిపోయాను. తెల్లవారు జామున అయిదు గంటలకే అక్కడ జీవన ప్రయాణం మొదలైపోతుంది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటుంటారు. మా కాంపౌండ్‌లో ఐదు స్టూడియోలు ఉండేవి. 24 గంటలూ పని... పని... పని. డాక్టర్ రోజూ పేషెంట్ వార్డులకు వెళ్లి పర్యవేక్షించినట్టుగా, నేను ఆ అయిదు చోట్లకు వెళ్లి పనిని పర్యవేక్షిస్తుండేవాణ్ణి. ఈ స్టూడియోల మధ్యలో మా ఇల్లు. దాంతో రాత్రింబవళ్లూ ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ మాత్రం మిస్సయ్యేవాణ్ని కాదు. అలా విచిత్రంగా కాలం గడిచిపోయింది. ఈ 14 ఏళ్లలో 150 సినిమాలు చేయగలిగాను. కీబోర్డ్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు కూడా రోజుకి 18 గంటలు పనిచేసేవాడ్ని. అప్పట్లో నిద్రే సరిగ్గా పోయేవాణ్ణి కాదు. అబ్బో... ఇక్కడ పని ఒత్తిడి ఎక్కువైపోయింది, మ్యూజిక్ డెరైక్షన్ చేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చనుకున్నా. ఇక్కడ అంతకన్నా ఎక్కువ బిజీ అయిపోయాను. మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం ఊపిరి పీల్చుకోవడానిక్కూడా తీరిక ఉండేది కాదు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా మే నెలలో రిలీజవుతుండేవి. దాంతో వర్క్ అంతా మార్చి, ఏప్రిల్‌లోనే చేయాల్సి వచ్చేది.
మీ జీవితంలో సంగీతం అనేది లేకుండా ఉంటే మీరెలా ఉండేవారో ఎప్పుడైనా ఊహించారా? మణిశర్మ: కలలో కూడా ఎప్పుడూ అలాంటి ఊహ రాలేదు. చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే పిచ్చి. ఇక నా 18వ ఏట నుంచే సంగీతంతో పూర్తిగా మమేకమైపోయాను. అప్పట్లో రేడియోలో ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట మాత్రమే పాటలు వచ్చేవి. రాత్రి 9 గంటలకు నాన్నగారు పడుకునేవారు. ఆయనకు ఇబ్బంది కలగకుండా చిన్న సౌండ్‌తో రేడియోను చెవి దగ్గర పెట్టుకుని వినేవాణ్ణి. అప్పట్లో టేప్ రికార్డర్ అంటే ఓ లగ్జరీ కింద లెక్క. మా ఇంట్లోకి టేప్‌రికార్డర్ ప్రవేశించాక దొంగ చాటుగా క్యాసెట్లు కొని నాన్నగారు ఇంట్లో లేనప్పుడు వింటుండేవాడ్ని.
దొంగచాటుగా ఎందుకు? మణిశర్మ: మా నాన్నగారికి నేను సంగీతరంగంలోకి రావడం అస్సలు ఇష్టంలేదు. ‘‘నువ్వేదైనా వేరే పని చేస్కో. పాకీ పని చేసినా నాకు సంతోషమే. నెలకు కచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుందని గ్యారంటీ ఉంటుంది. సినిమా ఫీల్డ్‌లో ఆ గ్యారంటీ లేదు. ఇక్కడకు వచ్చి నాలాగా కష్టాలు పడొద్దు’’ అని చెప్పేవారు. ఎందుకంటే ఆయన ఇక్కడ చాలా కష్టాలు పడ్డారు. అయితే నాకు ఇక్కడే రాసిపెట్టి ఉంటే ఇంకేం చేస్తాం!
సంగీతరంగంలోకి రాకుంటే మీరు ఏం అయ్యేవారు? మణిశర్మ: ఏం అయ్యేవాణ్ణీ కాదు. సంగీతం లేకుంటే నేను నయాపైసాకు పనికిరాను. ఆ విషయం నాకు తెలుసు.
సంగీతం కాకుండా అసలు మీకేం వచ్చు? మణిశర్మ: క్రికెట్ బాగా వచ్చు. బ్యాటింగ్ బాగా చేసేవాణ్ని. నిన్న మొన్నటివరకూ కూడా ఆడేవాడ్ని. మా ట్రూప్‌తో కలిసి తెల్లవారు జామునే లేచి ఆడేవాణ్ణి. మా గోలకి చుట్టుపక్కల వాళ్లు కూడా ఇబ్బంది పడేవారు.
ఇంతకూ మీరు ఎంతవరకూ చదువుకున్నారు? మణిశర్మ: ప్లస్ టూ డిస్‌కంటిన్యూ చేశా. కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తూనే చదువులో మంచి మార్కులు తెచ్చుకునేవాణ్ణి. ఓ దశలో ఇక్కడ బిజీ అయిపోయి, ప్లస్ టూతో చదువుకు మంగళం పాడేశా.
ప్రేమలో ఎప్పుడైనా పడ్డారా? మణిశర్మ: సినిమాలు చూడ్డానికే ఖాళీ ఉండేది కాదంటే, ఇక ప్రేమ కూడానా? ఓన్లీ ఐ లవ్ మ్యూజిక్.
యూత్ లైఫ్ మిస్సయ్యానని ఎప్పుడైనా ఫీలయ్యారా? మణిశర్మ: చాలాసార్లు. సినిమాల్లో కొన్ని సీన్లు చూసినప్పుడు అరె... నేను ఇలాంటివి మిస్సయ్యానే అనిపిస్తుంది. కానీ, ఈ సంగీతంతోనే ఆ ఎంజాయ్‌మెంట్ పొందుతున్నాను.
మీరూ, ఏ ఆర్ రెహమాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్సట... మణిశర్మ: ఇద్దరం మ్యుజీషియన్స్‌గా చాలాకాలం కలిసి పనిచేశాం. ఇద్దరికీ ‘ఓయ్ ఓయ్’ అని పిలుచుకునేంత చనువు ఉంది. నేను కీరవాణిగారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేస్తున్నపుడు, నాకెప్పుడైనా కుదరకపోతే నా స్థానంలో రెహమాన్‌ని పంపిస్తుండేవాణ్ణి. ‘ఘరానా మొగుడు’లో ‘పండు పండు’ పాట ఉంది కదా. ఆ పాటకు నా స్థానంలో తను కీబోర్డ్ ప్లే చేశాడు. తనకు మొదటి నుంచీ పనే ప్రపంచం. వేరే ఆలోచనలు ఉండేవి కావు. మేం అప్పుడప్పుడైనా రిలాక్స్ కావడం కోసం అటూ ఇటూ బయటకు వెళ్లేవాళ్లం కానీ, తను మాత్రం కూర్చున్న చోటు నుంచి కదిలేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒక నోట్స్ రాసుకుంటూ కూర్చునేవాడు. నిజంగా వాడు పని రాక్షసుడే.
మిమ్మల్ని కూడా పని రాక్షసుడు అంటారు... మణిశర్మ: వాడితో పోల్చుకుంటే తక్కువే. అసలు మనిషనేవాడు ఎవ్వడూ వాడితో పోల్చుకోకూడదు. ఆ విషయంలో వాడు 100 శాతం అయితే, నేను 60 శాతం అంతే.
రెహమాన్‌తో ఇప్పటికీ మీ సాన్నిహిత్యం కొనసాగుతోందా? మణిశర్మ: ఇద్దరం ఎంత బిజీగా ఉన్నా కూడా మా కమ్యూనికేషన్ చెడిపోలేదు. తను అప్పుడెలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇప్పటికీ ఇద్దరం ఫోన్‌లో టచ్‌లో ఉంటాం. నేను మెసేజ్ పెడితే, ఎక్కడ ఉన్నా రిప్లయ్ ఇస్తాడు. అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాం కూడా. లాస్ట్ ఇయర్ రంజాన్‌కి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. నాకే వెళ్లడం కుదర్లేదు. ఆ మధ్య ఎవరో ఇంటర్‌నెట్‌లో నా పాట ఒకటి ప్రస్తావిస్తూ, దీనికి ఫలానాది ఇన్‌స్పిరేషన్ అని కామెంట్ చేశారట. అది చూసిన రెహమాన్ ‘‘కమర్షియల్ మ్యూజిక్‌లో వెరైటీ చేయడం అంత ఈజీ కాదు. ఓ రకంగా చాలా నరకం. మణి ఎప్పుడూ తన మ్యూజిక్‌లో వెరైటీ చూపించడానికే ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఇలాంటి ఇన్‌స్పిరేషన్లు సహజం’’ అని స్వయంగా కౌంటరిచ్చాడట. ఈ విషయం నాకు వేరే సింగర్ ద్వారా తెలిసింది.
ఇతర సంగీత దర్శకులతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మణిశర్మ: నేను అందరితోనూ రిలేషన్ మెయింటెయిన్ చేస్తాను. కోటి, కీరవాణి, వాసూరావు... ఇలా అందరితోనూ టచ్‌లో ఉంటాను. నేను బయట ఫంక్షన్స్‌లోనూ, మీడియాలోనూ కనబడను కానీ, తెరవెనుక అందరితోనూ రిలేషన్స్ అయితే ఉంటాయి.
మీరు బావుంటారు కదా. ఆర్టిస్టుగా చేయమని ఎవరూ అడగలేదా? మణిశర్మ: చాలామంది అడిగారు. తెలియని పని చేయడం మనకు చేతకాదు. ఈ మధ్య ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా వచ్చి యాక్ట్ చేయొచ్చుగా అనడిగాడు. నాకు వేషాలు వేయడం రాదని చెప్పాను. (నవ్వుతూ) ఈ పరిశ్రమలో వేషాలు వేయడం రాకపోవడం కూడా ఓ సమస్యే.
‘జై చిరంజీవ’ సినిమాలో ఓ పాటలో కనిపించారుగా? మణిశర్మ: లాస్ వెగాస్ రమ్మని ఫ్లయిట్‌లో ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ ఇస్తే ఏదో సరదాగా వెళ్లా. తీరా అక్కడకు వెళ్లాక నాతో యాక్ట్ చేయించారు. వారం రోజులు అక్కడే ఉంచేశారు. చిన్న షాట్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయడం... అమ్మో నా వల్ల కాదు.
మీరెప్పుడూ పాటలు కూడా పాడినట్టు లేదు? మణిశర్మ: నాకు చేతకురాని పనులు చేయనని ముందే చెప్పాను కదా. అయినా బేసికల్‌గా నేను సింగర్‌ని కాదు.
మీరు ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తారు? మణిశర్మ: మొదట్లో మ్యాండలిన్ వాయించేవాణ్ణి. తర్వాత వయొలిన్ నేర్చుకున్నా. కొన్నాళ్లు గిటార్, బేస్ గిటార్ కూడా వాయించా. ఇవన్నీ గిట్టుబాటు కావడం లేదని కాంబో ఆర్గాన్ నేర్చుకున్నా.
ఇన్‌స్ట్రుమెంట్లకు బాగా ఎక్కువ ఖర్చు పెడతారట? మణిశర్మ: నేను ఎక్కడెక్కడి నుంచో ఇన్‌స్ట్రుమెంట్లు కొని తెప్పిస్తుంటాను. ఒక్కోసారి నాకు ఇచ్చిన పారితోషికం కన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంటాను.
చెన్నైలో మీ ఇంటిని, స్టూడియోను బాగా డిజైన్ చేయించుకున్నారట? మణిశర్మ: అవును. అసలు మాలాంటి కాంపౌండ్ చెన్నైలోనే ఎవ్వరికీ ఉండదు. టి.నగర్‌లాంటి రద్దీ ప్లేస్‌లో అంత గ్రీనరీతో ఉండే ఇల్లు ఎక్కడా కనబడదు. థాయ్‌లాండ్‌లో మసాజ్ ప్లేసెస్‌లో ఉండే ఒక రకమైన ఆర్కిటెక్చర్‌తో నా కంపోజింగ్ రూమ్‌ను డిజైన్ చేయించుకున్నా. ఫారిన్ డిజైనర్స్‌తో స్కై లైట్‌తో... సౌండ్ ప్రూఫ్‌తో నా స్టూడియో డిజైన్ చేయించుకున్నా. రెహమాన్ అది చూసి ఇంప్రెస్ అయ్యి ఆ డిజైనర్‌తోనే తన స్టూడియో డిజైన్ చేయించుకున్నాడు. ఇప్పుడు చెన్నైలో ప్రాపర్టీస్ ఏమీ లేవు. హైదరాబాద్‌లో డాలర్ హిల్స్‌లో నాకు నచ్చిన రీతిలో ఇల్లు కట్టుకోవాలి. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నా.
ఒక పాట సష్టికి ఇన్‌స్పిరేషన్ ఎక్కడినుంచీ వస్తుంది? మణిశర్మ: సందర్భాన్ని, సన్నివేశాన్ని మించిన గొప్ప ఇన్‌స్పిరేషన్ ఏముంటుంది? అవి సరిగ్గా కుదరకపోతే ఎంత గొప్ప పాట అయినా మరుగున పడిపోతుందనడానికి తాజా ఉదాహరణ ‘ఖలేజా’లోని ‘సదా శివ సన్యాసి’ పాట. దాని తయారీకి రెండు, మూడు నెలలు పట్టింది. తీరా ఆ పాట ఆ సిట్యుయేషన్‌కి సరిగ్గా సెట్ కాలేకపోయింది. సినిమా ఫ్లాప్ అయితే పాటలు వినబడవు. కానీ, ‘ఖలేజా’ పాటలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి.
హీరోల్లో మీకు క్లోజ్ ఎవరు? మణిశర్మ: మహేశ్‌బాబు బాగా క్లోజ్. మా ఆలోచనలు ఒకరికొకరం పంచుకుంటుంటాం. నేను మహేశ్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని బయట ప్రచారం కూడా ఉంది. అయితే అదేం కాదు. నేను అందరికీ మంచి మ్యూజిక్ ఇచ్చా. ఇస్తా. ఇస్తున్నాను. నా స్పెషాల్టీ ఏమిటంటే ఏ హీరోకైనా వాళ్ల బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇస్తా. ఖుషీ, గుడుంబా శంకర్, బాలు... వాటిలో మ్యూజిక్ వినండి. పవన్‌కల్యాణ్ కోసమే తయారైనట్టుగా ఉంటాయి పాటలు. చిరంజీవిగారు, బాలకష్ణగారు... ఇలా ఏ హీరో అయినా వాళ్ల బాడీ లాంగ్వేజ్‌కి పెర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా మ్యూజిక్ ఇస్తా.
మీరు దాదాపుగా అందరు హీరోలతోనూ చేశారు. ఫలానా హీరోతో పనిచేయలేకపోయాననే ఫీలింగ్ ఏమైనా ఉందా? మణిశర్మ: కమల్‌హాసన్‌తో పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాను. అప్పట్లో ‘ద్రోహి’కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశా. అందులో పాటలుండవు. దానికి ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ దర్శకుడు. ఆ నేపథ్య సంగీతానికి విదేశాల్లో ప్రాచుర్యం లభించింది. ఫస్ట్ డాల్బీ సినిమా అదే.
హిందీలో ఎప్పుడూ ప్రయత్నించలేదా? మణిశర్మ: అక్కడంతా ఓ డిఫరెంట్ బాల్‌గేమ్. నేను అక్కడకు వెళ్తే మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాలి. నేను తెలుగులో ఇన్ని సినిమాలు చేశానన్నది వాళ్లకు అనవసరం కదా. అనుకోకుండా ఈ మధ్య ఓ హిందీ సినిమా చేసే అవకాశమొచ్చింది. నా స్నేహితుడైన హేమంత్ మధుకర్ ‘ముంబై 125 కిలోమీటర్లు’ పేరుతో ఓ సినిమా డెరైక్ట్ చేస్తున్నాడు. పాకిస్తానీ నటి వీణామాలిక్ ముఖ్యతార. దానికి నేనే స్వరకర్తను. అంతేకాదు హేమంత్ మదుకర్‌తో కలిసి నేను కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాను.
తెలుగులో కూడా చిత్ర నిర్మాణం చేస్తారా? మణిశర్మ: అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు నిర్మించాలని ఉంది.
డైరక్షన్ చేసే ఆలోచన ఉందా? మణిశర్మ: అస్సలు లేదు.
రీ రికార్డింగ్‌లో మిమ్మల్ని అధిగమించేవారు ఎవ్వరూ లేరని అంటారు? మణిశర్మ: అలా నేను అనుకోవడం లేదు. కానీ నేను చాలా ఇన్‌వాల్వ్ అయి చేస్తాను. అందుకే అందరూ నా రీరికార్డింగ్ బాగుందని అంటుంటారు.
మీ అబ్బాయి మహతి స్వరసాగర్ హీరోగా వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి? మణిశర్మ: అదేం లేదు. ప్రస్తుతానికి తనకు ఆ ఆసక్తి కూడా లేదు. ప్రస్తుతం కీబోర్డ్ ప్లేయర్‌గా బిజీగా ఉన్నాడు. నా దగ్గర, కీరవాణిగారు, ఇంకొంతమంది దగ్గర పని చేస్తున్నాడు. ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట’ పాటకి నేను కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేశా. ఆ పాటను ‘మగధీర’ కోసం రీమిక్స్ చేసినపుడు మా అబ్బాయి కీబోర్డ్ ప్లే చేశాడు.
మీకంటూ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మణిశర్మ: అస్సలు ఏ లక్ష్యమంటూ లేని మనిషి ఎవరైనా ఉంటే... అది నేనే. నాకెప్పుడూ ఎలాంటి లక్ష్యాలు లేవు. ఎలాంటి లక్ష్యమూ లేకుండానే ఈ స్థాయికి వచ్చానంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నాకు వచ్చిన పనిని అద్భుతంగా ఎలా చేయాలి, ఏ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎక్కడ నుంచీ తీసుకురావాలి, రీ-రికార్డింగ్‌కి ఎవరెవరు సూటబుల్... ఎప్పుడూ ఇదే ఆలోచన నాలో.
పరిశ్రమలో జయాపజయాల ప్రభావం అధికం. సక్సెస్ ఉంటే ఒకలాగా, ఫెయిల్యూర్‌లో ఒకలాగా ఇక్కడ బిహేవ్ చేస్తుంటారు. వీటికి అతీతంగా తామరాకు మీది నీటిబొట్టులాగా మీ మనసుని తీర్చిదిద్దుకున్నారా? లేక అన్నింటికీ ఫీల్ అవుతుంటారా? మణిశర్మ: ‘భగవద్గీత’లో శ్రీకష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు. అలాంటి స్థితప్రజ్ఞతను అలవాటు చేస్తూ మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నతనం నుంచీ అలా పెంచారు. విజయమొస్తే పొంగిపోవడం, అపజయాలకు క్రుంగిపోవడమంటూ ప్రత్యేకంగా లేదు. మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందనేది నేను నమ్మిన సిద్ధాంతం.
మానవ ప్రయత్నం అంటే చేస్తేనేగా అవకాశాలు వచ్చేవి... మణిశర్మ: నేను ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వచ్చినవన్నీ నాకు నేనుగా అడిగినవి కాదు. టైమ్ అంతే. నేనెప్పుడూ విజయం వెనుక తిరిగింది లేదు. సక్సెస్సే నా వెనుక తిరిగింది. అప్పుడు నేను పట్టించుకోలేదు. నాకు సక్సెస్ వచ్చి అయిదేళ్లవుతోంది. ఈ రోజు తెలుస్తోంది దాని విలువ. నేను రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తాను. అది ఓకే. కానీ సినిమా హిట్టు కావాలి కదా. ‘శక్తి’కి నేను తక్కువ చేశానా? ‘తీన్‌మార్’లో తక్కువ చేశానా? ‘ఖలేజా’లో తక్కువ చేశానా? అందులో నీచమైన పాటలు చేశానా చెప్పండి. ఆ సినిమాలు సక్సెస్ కాలేదు అంతే. ఈ ఆలోచనలతోనే నేను ఉక్కిరిబిక్కిరైపోతున్నా. ‘ఖుషీ’ సినిమా టైమ్‌లో నేను చాలా బిజీ. నేను ఆ సినిమా చేయలేనని చెప్పా. అయినా నిర్మాత ఏఎమ్ రత్నం వెంటబడ్డారు. రోజుకి రెండు గంటలు కేటాయిస్తా. మూడు రోజుల్లో పాటలు పూర్తి చేసిస్తానని నిబంధన పెట్టా. అలాగే చేశా. సినిమా సూపర్‌డూపర్ హిట్. అహోరాత్రులు కష్టించి పనిచేసిన ‘మగరాజు’ ఫ్లాప్. దానిని నేనెంత కష్టాపడ్డానో నాకే తెలుసు. అలాగే ‘దేవీపుత్రుడు’ అంతే. దీన్నిబట్టి ఎవరైనా టైమ్‌ని నమ్మాల్సిందే. నీ టైమ్ బాగుంటే, నువ్వడక్కపోయినా వస్తారు. టైమ్ బాగోకపోతే నువ్వెంత చేస్తానన్నా నీ దగ్గరకు రారు. ఆ విషయం నాకు బాగా తెలుసు.
మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా హైదరాబాద్ ఓకేనా? మణిశర్మ: హైదరాబాద్‌లో ఏం లేదండీ. మొత్తం చెన్నై నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. మనకు ఇక్కడ ఇద్దరే కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకరేమో కీరవాణి దగ్గర, ఇంకొకరు నా దగ్గర బిజీ. మరి మిగతా వాళ్ల పరిస్థితి? సరే... మిగతా మ్యుజీషియన్స్ విషయానికొస్తే చాలామందికి పని మీద శ్రద్ధ లేదు. చెన్నైలో అయితే 24 గంటలూ శ్రద్ధగా చేయడానికి సిద్ధంగా ఉండే మ్యుజీషియన్స్ బోలెడుమంది ఉన్నారు. ఇక కోరస్ సింగర్స్ విషయానికొస్తే అదో పెద్ద కథ. అందరూ చాలా బిజీ. ఒక్కొక్కరి కోసం వారం రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొంచెం పేరు రాగానే ఏదో చేసేయాలి, చాలా సంపాదించేయాలనే తాపత్రయం చాలా మందిలో. కెరీర్ కన్నా టీవీ షోస్, యాంకరింగ్స్, ఇతర షోస్‌లలో చాలా బిజీగా ఉంటున్నారు. కేరళలో రోడ్డుకో ఏసుదాస్ అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ అంతమంది లేకపోయినా, ఉన్నంతలో మనకూ మంచి సింగర్స్ ఉన్నారు. హేమచంద్ర, కారుణ్య, శ్రావణ భార్గవి, మాళవిక, చైత్రలాంటి వాళ్లు బాగా పాడుతున్నారు. చెన్నైలో సంగీతానికి సంబంధించి ఏదో ఒక కళ కనిపిస్తూ ఉంటుంది. డిసెంబరు వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా సంగీత సభలే. జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ మచ్చుకు అలాంటిది ఒక్క సభ కూడా జరగదు. ఎవ్వరికీ ఆసక్తి ఉన్నట్టే అనిపించదు.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి స్థాయిలో మళ్లీ ఎవరైనా వస్తారంటారా? మణిశర్మ: లేదు. నాకెవ్వరూ కనిపించడం లేదు. అలాంటివాళ్లు మళ్లీ వస్తారన్న ఆశా లేదు. సింగర్స్ అనే కాదు. కంపోజర్స్ పరిస్థితీ అంతే. కీరవాణిలాగా ఒక తెలుగు పాటను కంపోజ్ చేయడానికి కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఎందుకు? అసలు ఇప్పటి తెలుగు పాటల్లో తెలుగుదనం ఎక్కడైనా ఉందా? అందుకు ఆస్కారం ఉందా? నిజంగా మాతో అలాంటివి ఎవరైనా చేయించుకుంటున్నారా చెప్పండి. గుణశేఖర్, క్రిష్‌లాంటి కొంతమంది దర్శకులు తప్ప పాటల గురించి, విలువల గురించి పట్టించుకునే వారెవ్వరూ లేరు.
గాయనీ గాయకులను తయారు చేసుకుంటున్నట్టుగా, మంచి మ్యుజీషియన్స్‌ను తయారు చేయలేమంటారా? మణిశర్మ: అదీ కష్టమే. నేను ఒకప్పుడు తయారు చేసుకున్న మ్యుజీషియన్సే నాకే దొరకడం లేదు. పరిస్థితి అలా ఉంది మరి. రెండు, మూడు సినిమాలకు పనిచేసేసరికే వాళ్లకు రెక్కలొచ్చేస్తున్నాయి. మేం చాలా ఏళ్లు ఒకే దగ్గర పని చేసేవాళ్లం. నేను కీరవాణిగారి దగ్గర ఆయన తొలి సినిమా దగ్గరనుంచీ ‘అల్లరి ప్రియుడు’ వరకూ ఏకధాటిగా పని చేశా.
భవిష్యత్తులో తెలుగు సినిమా పాట ఎలా ఉంటుందనుకుంటున్నారు? మణిశర్మ: అశ్వనీదత్, ఎమ్మెస్ రాజులాంటి అభిరుచిగల నిర్మాతలు లేకపోతే తెలుగుపాట ఇంకా దారుణమైన స్థితిలో ఉండేది. కొంతమంది నిర్మాతలకు కలకాలం నిలిచే పాటలు అవసరం లేదు. ఏదో ఆ క్షణానికి దడదడలాడించేయండి చాలు అంటారు. ఇలాంటి వాళ్లుంటే, ఇంకా కొత్తగా ఏం చేయగలం చెప్పండి. మంచి ఆలోచనలు కూడా ఇలాంటివారి తొందర వల్ల మొగ్గ దశలోనే రాలిపోతున్నాయి. ఇంకొంతమందైతే అస్సలు కథ కూడా చెప్పరు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, సెకండ్ సాంగ్, ఇంటర్వెల్ ముందరి సాంగ్, ఇంటర్వెల్ తర్వాత సాంగ్, ప్రీ కై ్లమాక్స్ సాంగ్, కై ్లమాక్స్ సాంగ్... ఇలా కొలతలు చెప్పేసి, పాటలు అదిరిపోవాలండీ అని ఓ మాట పడేస్తారు. మనిషి ఎలా ఉంటాడో తెలీయకుండా కొలతలతో బట్టలు కుట్టినట్టుగా మేం పాటలు ఇచ్చేసేయాలి. ఇలాంటి స్థితిలో ఇక మంచి పాటలు ఎక్కడ నుంచీ ఉత్పన్నమవుతాయి. అయినా కూడా మేం మంచి పాటలే ఇవ్వగలుగుతున్నాం. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉండవు. నాకైతే కచ్చితంగా మళ్లీ మంచి రోజులొస్తాయనే ఉంది. నేనుండగానే ఆ వైభవం చూస్తాననే నమ్మకమూ ఉంది. ఏదైనా సరే పరాకాష్టకు అంటూ వెళ్లిపోయాక, మళ్లీ కొత్త ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆ రోజు కోసం అందరం ఎదురు చూడాలి.
సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు. మరి మీరేమంటారు? మణిశర్మ: రాళ్లు కరుగుతాయో లేదో తెలీదు కానీ, రాళ్ల కన్నా గట్టిగా మారిపోయిన మనుషుల మనసులు మాత్రం స్పందిస్తున్నాయి. అంటే సంగీతానికి ఆ శక్తి ఉన్నట్లేగా.
కొంతమందిని నమ్మి మోసపోయా ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటివి నేనస్సలు ఫాలో కాను. వాటితో కూర్చుంటే పని కాదు. ఇప్పుడు చాలామంది సింగర్స్‌తో అదే సమస్య. ‘ఇప్పుడే స్టూడియోలో అడుగుపెట్టాం... ఈ పల్లవి పాడాం...’ అని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పెడుతుంటారు. అదేంటో నాకస్సలు అర్థం కాదు. అసలు పనికన్నా ఈ కొసరు పనే ఎక్కువ డామినేట్ చేసేస్తోంది. తమాషా ఏంటంటే నేనింత వరకూ కంప్యూటర్ మౌసే ముట్టుకోలేదు. రికార్డిస్ట్‌కి ఇలా చేయ్, అలా చేయ్ అనిచెబుతుంటాను కానీ, నేను మాత్రం టచ్ చేయను.
దాదాపుగా మొత్తం దేశాలన్నీ తిరిగేశా. ఇప్పటికి మూడు పాస్‌పోర్ట్ బుక్స్ అయిపోయాయి. మొదట్లో బాలుగారి ఆర్కెస్ట్రాలో ఉంటూ అయిదేళ్లు చాలా దేశాలు వెళ్లా. నేను మొదట వెళ్లిన విదేశం సింగపూర్. మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొనుక్కోవడానికి నా డబ్బులతోనే వెళ్లా. ఐ లవ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్. దేశాలన్నీ తిరుగుతూ ఉంటే అదో హాయి.
రోజుకో సినిమా తప్పక చూస్తా. ఉదయం రికార్డింగ్ థియేటర్‌కి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేస్తా. లంచ్ తర్వాత నా హోమ్ థియేటర్‌కి వెళ్లి సగం సినిమా చూసి ఓ ఇరవై నిమిషాలు కునుకు తీసి లేచాక మిగతా సినిమా చూసి, రికార్డింగ్ థియేటర్‌కెళ్తా. ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలే చూస్తుంటా.
చెన్నైలో ఉండగా బయట థియేటర్లకు వెళ్లడం అస్సలు కుదిరేది కాదు. హైదరాబాద్ వచ్చాక ఫ్యామిలీతో కలిసి సరదాగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం చాలా థ్రిల్‌గా అనిపిస్తోంది.
నేను కోపిష్టిని కాదు. నాదంతా అలా మెరుపులా వచ్చి వెళ్లిపోయే కోపం. ఏదైనా పర్‌ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటాను. ఎవరైనా తప్పు చేస్తే మొదట వార్నింగిస్తా. అది మళ్లీ మళ్లీ రిపీటైతే, నాకే కాదు ఎవ్వరికైనా కోపం వస్తుంది. ఆ తర్వాత మళ్లీ జోక్ చెప్పి వాతావరణాన్ని కూల్ చేసేస్తాను.
మనీ మేనేజ్‌మెంట్‌లో చాలా పూర్. చెన్నైలో బిజీగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కొన్నిచోట్ల పెట్టుబడులు చేసి బాగా నష్టపోయా. హైదరాబాద్‌లో మంచి బూమ్ ఉన్నప్పుడు అప్పులు చేసి మరీ స్థలాలు కొన్నా. కొంతమంది స్నేహితుల్ని నమ్మి కూడా మోసపోయా. నా సక్సెస్ రేట్‌ని చూసి బాగా సంపాదించి ఉంటాననుకుంటారు. నిజమే. కానీ అంత లేదు. ఇంతకాలం డబ్బు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం ఆలోచించాల్సి వస్తోంది.
ప్రస్తుతం మహమ్మద్ రఫీ పాటలు ఎక్కువ వింటున్నా. మా ఆవిడ రఫీకి వీరాభిమాని. మూడు, నాలుగేళ్ల నుంచీ నేను కూడా బాగా వింటున్నా. ఆ పాటలు వింటుంటే ఇంకేమీ వినబుద్దేయడం లేదు. రఫీ కన్నా ముందు మా గురువుగారు ఇళయరాజా మ్యూజిక్ ఎక్కువ వినేవాణ్ణి.
ప్రస్తుతం సంగీత దర్శకుని స్థానం... సంగీత దర్శకుణ్ణి ఓ కింగ్‌లాగా చూసిన కాలాన్ని చూశాను. మా గురువు ఇళయరాజా కోసం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఎంతమంది దర్శక నిర్మాతలు పడిగాపులు కాశారో ఈ కళ్లతో చూశాను. ఆయన ఒక్క క్షణం అపాయింట్‌మెంట్ ఇచ్చినా చాలనుకునేవారు. అంతటి వైభవం, ప్రాభవం చూసిన కళ్లతోనే ఇప్పుడు చాలా దారుణాలు చూడాల్సి వస్తోంది. సంగీత దర్శకునికి ఉన్న హోదాని, గౌరవాన్ని కొత్తగా వచ్చిన కొంతమంది సర్వనాశనం చేసి పారేస్తున్నారు. అవకాశాల కోసం వెంపర్లాటే తప్ప, ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామన్న తపనే కనిపించడం లేదు. పాటను ముక్కలు ముక్కలు చేసి సష్టిస్తున్నారు. పల్లవిని ఒకసారి, బీజియాన్ని ఇంకొకసారి, చరణాల్ని మరొకసారి... ఇలా ముక్కలు ముక్కలుగా పంపిస్తే ఇక ఆ పాట పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలా నేనెప్పుడూ చేయలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా రాత్రింబవళ్లూ పని చేసి అవుట్‌పుట్ ఇచ్చేవాణ్ణి. నేను చేసిన 150 సినిమాల్లో నావల్ల ఒక్క రోజు ఆలస్యమైన సినిమా ఏదీ లేదు. నేనీ రోజు కరాఖండీగా చెబుతున్నా. నాకు డబ్బుతో పాటు మర్యాద కూడా కావాలి. మర్యాద దొరికే చోట ఎలాగైనా పనిచేయడానికి నేను సిద్ధం. ఎప్పటికీ ఈ మర్యాదను మాత్రం వదులుకోలేను.
No comments:
Post a Comment